పర్యావరణ కార్యకలాపాలను నిర్వహించడం ఒక ప్యాషన్‌గా తయారయింది. దానికి కారణం  మూల్లోకి వెళ్లి సమస్యను చూడలేకపోవడమే. పర్యావరణాన్ని చెడగొట్టడం వలన ఇక్కడ, అక్కడ అని కాకుండా యావత్‌ ‌ప్రపంచం సమస్యలను ఎదుర్కొంటున్నది. వేడిమి విపరీతంగా పెరిగి, గ్లోబల్‌ ‌వార్మింగ్‌తో ప్రకృతి తన నియమాలని వదిలివేస్తున్నది. ఎక్కడెక్కడయితే చల్లదనంతో కూడిన స్థలాలు ఉండేవో, ఇప్పుడక్కడ వేడిమి పెరిగిపోతోంది. ఇప్పుడిది ఓ విపత్కర స్థితిగా మారింది. దీని నివారణకి ఏమేమి అవసరమో అవన్నీ చేయాలి. ఇదంతా స్వాభావికం, సహజం. ఒకవేళ మనం విషాన్ని అమృతంగా మార్చాల్సి వస్తే సంక్షోభ భయంతో ప్రతిక్రియలోకి రావటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మూలాల్లోకి వెళ్లి పరికించినప్పుడు అసలు ఈ సంక్లిష్ట స్థితి ఎందువల్ల ఇలా మన ఎదుట నిలబడి ఉందనే కారణాలు తెలియనంతకాలం సరైన సమాధానం కూడా దొరకదు.


ప్రకృతిమాత అందరి ఆవశ్యకతలను నెరవేరే లాగా చేస్తుంది, నెరవేర్చుతూనే ఉంటుంది. లోభత్వాన్ని తృప్తి పరచటం దానికి సాధ్యం కాదు. ఈ లోభ, స్వార్థ, మాత్సర్యాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? ప్రతి విషయాన్ని దాని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించే గుణం ఎక్కడ నుంచి వచ్చింది? మన సాధారణ ఆచరణలో ఏదయితే ఉపయుక్తమైనదో అది విలువయినది అవుతున్నది. ఉపయోగం విషయానికొస్తే అధిక ధర కలిగినదయితే ఆ వస్తువుని మనం భద్రంగా దాచుకుంటాం. అదే సమయంలో సహజంగా దొరికే వస్తువు, చవగ్గా ఉండేది లేదా యోగ్యత లేనిదయితే దాన్ని పారవేస్తాం. మన నిత్యాచరణ నియమం, ఇది మాది, మీది, అందరిదీ. ఎంచేతంటే ఇంట్లో ఓ పెద్దావిడ ఉంది, జబ్బు పడి, దగ్గుతూ ఉంటుంది. మందుల ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఔచిత్యపరంగా ఆలోచిస్తే ఇలాంటి పెద్దల పరిస్థితి ఎలా ఉంటుంది? సంపాదించే ఓ యువతి సుందరంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చక్కటి భోజనాన్ని తయారు చేసి అందరినీ ఆరోగ్యంగా ఉంచుతోంది. అలాటి మరో అమ్మని తీసుకురండి, ఇలా రోగం పాలయి విపరీతమయిన ఖర్చు పెట్టిస్తున్న అమ్మని వదిలేద్దామని భారత్‌లో ఎవరో ఒకరన్నారనుకోండి. అందుకు జనాలు, ‘నువ్వు రాక్షసుడివా ఏమి’టని అడుగుతారు. ఏమన్నా కానీండి, ఔచిత్య రహితంగా చూసినప్పటికీ ఆవిడ మనది. మనం సంఘంలో ప్రతిజ్ఞ చేసేప్పుడు ధర్మం, సంస్కృతి, సమాజ సంరక్షణతో పాటు రాష్ట్ర (దేశ) సర్వాంగీణ ఉన్నతి అని అంటాం కదా! ఎందుకంటే అది పవిత్రమైనది. దానికి ‘మన’ అనే పదాన్ని చేర్చి ‘మన’ పవిత్ర హిందూధర్మం, హిందూ సంస్కృతి, హిందూ సమాజ సంరక్షణతో పాటుగా హిందూ రాష్ట్ర సర్వాంగీణ ఉన్నతి కోసం అని ప్రతిజ్ఞ చేస్తాం. అది పవిత్రమైనది, మనకు తెలుసు దాని పవిత్రత. ఆ పవిత్రతని ఇతరులకు ఇవ్వటంలో కూడా మన ధర్మం, సంస్కృతి, సమాజం సమర్థమైనది. అయితే అందులోనూ లోపాలున్నాయి. ఆ లోపాలని కూడా తొలగిద్దాం.

ఇవాళ సర్వత్రా అభివృద్ధిని కాంక్షించే వారిలో, పర్యావరణ సంరక్షణ కాంక్షించే వారిలో పరస్పర వ్యతిరేకత కనిపిస్తుంది. అభివృద్ధి అనేది జరిగితే పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని పర్యావరణ సంరక్షణ కోరుకుంటున్న వారు భావిస్తున్నారు. అదేవిధంగా అభివృద్ధిని సాధించా లంటే పర్యావరణం గూర్చి ఆలోచించరాదని అభివృద్ధి కాముకులు భావిస్తున్నారు. స్పష్టంగా చెప్పాలంటే ఇద్దరి ఆలోచనా విధానం తప్పే! మరి మన భారత్‌ ‌దృష్టికోణం ఏమిటి? భారత్‌ ఏ ‌విషయాన్నీ, ఏ ఒక్కరినీ విడదీసి చూసే దేశం కాదు. సంపూర్ణ అస్తిత్వ ఏకత్వపు స్పష్టి సిద్ధాంతాలపై భారత జీవనం నిలబడి ఉంది. అందుకే ఎన్ని భూకంపాలొచ్చినా, తుపానులు -పెను తుపానులు వచ్చినా తట్టుకొని యుగాల నుండి చెక్కు చెదరక భారత్‌ ‌దృఢంగా నిలబడి ఉంది. నిలబడే ఉంటుంది. అంతేకాదు ప్రపంచ జీవనాన్ని కూడా దృఢపరుస్తుంది. ప్రధానంగా మనం భావించేదొక్కటే- సమస్త అస్తిత్వం ఒక్కటేనని, చూసేందుకు వివిధ రకాలుగా కనిపిస్తుంది. ఇది కేవలం భిన్నత్వంలో ఏకత్వం లాంటి మాట కాదు. ఏకత్వమే వివిధాలుగా మారింది, ఇది ఏకత్వపు వివిధాలే మరి. కానీ మనిషి అనే వాడు పర్యావర ణంతో విడిపోయి మరొక అకాంశగా మారాడు. పర్యావరణంపై విజయాన్ని సాధించి, యజమానిగా మారాలనుకుంటున్నాడు. ఇది సరికాదు. మనిషి, పర్యావరణం వేర్వేరు కాదు. ఇద్దరిలోనూ పంచభూతాలున్నాయి. సమస్త సృష్టి పంచభూతాత్మ కమయం. పంచ మహా భూతాల పంచీకరణ పక్రియతో జడ- చేతనాల్లాంటివి ఉత్పన్నమయినాయి. బయట నాకు చెట్టు కనిపిస్తోంది, జలం కనిపిస్తోంది, పర్యావరణం అవుపిస్తోంది, పశు పక్ష్యాదులు కనబడుతున్నాయి. ఇవాళ్టి భాషలో మనం దేన్నయితే బయో డైవర్సిటీ అని చెబుతున్నామో అది కూడా కనిపిస్తోంది. జడ-చేతనాలు, సృష్టిలోని చరాచరాలు నేనే అయి ఉన్నాను. అవన్నీ నావే. ఆ నావన్నీ మనవే. అందుకే దాన్ని జయించాలనుకోవట్లేదు. దాని సంరక్షణలోనే నా రక్షణా ఉంది. దాని అభివృద్ధిలోనే నా అభివృద్ధి ఉంది.

 పర్యావరణం, అభివృద్ధి ఒకదానికొకటి వ్యతిరేకం కాదు. ఈ విధంగా ఆలోచిస్తే రెంటినీ కలిపి అడుగు ముందుకేస్తే సమాధానం దొరుకుతుంది. ఇలాంటి ఆలోచన విధానం మనం కలిగి ఉన్నాం. ఈ ఆలోచనని విస్మరించే ముందు మనం మనకు తెలిసిన చరిత్రని పరికిద్దాం. ఇప్పటి దాకా కలియుగపు 5121 సంవత్సరాలు గడిచిపోయాయి, దీనికి ముందు మూడు యుగాల కాలం పూర్తయింది. కానీ నేటి ప్రపంచం, అందులోనూ చెలామణిలో ఉన్న వ్యవస్థ మాత్రం చరిత్రని నమ్ముతోంది. అది ఏమంత పెద్దది కాదు. 5000 సంవత్సరాల చరిత్రని నమ్ముతోంది. ఆ చరిత్రలో నిరాఘాటంగా ప్రపంచంలో మనమే అన్ని విషయాల్లోనూ అగ్రేసరులమన్న సంగతి విదితమే. టెక్నాలజీలో మనమే అగ్రస్థానంలో ఉన్నాం. వైభవంలోనూ మనదే అగ్రస్థానం. వాణిజ్యం, వ్యవసాయంతో సహా అన్ని రంగాలలో కూడా మనమే ప్రథమ స్థానంలో ఉండే వాళ్లం. ఇది నమోదైన వెయ్యేళ్ల చరిత్ర ఇది. అలా మనం ఉన్నప్పుడు కూడా మన దగ్గర ఎలాంటి పర్యావరణ సమస్యా ఉత్పన్నం కాలేదు.

మన దగ్గర రమారమి 6000 సంవత్సరాల నుండి వ్యవసాయం సాగుతోంది. ఈ విషయం ఆధునిక పురాతత్త్వ శాస్త్రం కూడా చెబుతోంది, మన గ్రంథాల విషయం నేను చెప్పట్లేదు. అవి ఇంకా ప్రాచీన కాలపు విషయాలని చెబుతాయి. రాను రాను వ్యవసాయం పేరిట భూమిని నాశనం చేశారు. అంతకు ముందయితే ఎలాటి సమస్యలు లేవు. మన ఈ భూమి అందరికీ సంతృప్తికరంగా, కడుపు నిండా అన్నం తినిపించేది. మనం యావత్‌ ‌ప్రపంచానికి ఆహారధాన్యాలని ఎగుమతి చేసే వాళ్లం. రసాయనిక ఎరువుల సేద్య యుగంలో కూడా మనం కొంతమేర ప్రయత్నించాం. కానీ మన దగ్గర నిల్వ ఉంచేందుకు తగినంత స్థలం ఉండేది కాదు. ఆ మేరకు ఆహారధాన్యాలుండేవి. 6000 సంవత్సరాల పాటు సేద్యం చేసిన తర్వాత మన భూమి పరిస్థితి ఇలా ఉంది. సంప్రదాయానుసారం మనం చేసే సేద్యం శాస్త్ర సంబంధమైనది. ప్రపంచంలోని యూరోప్‌, ఆ‌ఫ్రికా దేశాలలో 400-600 సంవత్సరాల పాటు వ్యవసాయం చేశారు. అక్కడి భూమి తీవ్రంగా దెబ్బతింది. ఎన్ని మాటలయినా చెప్పవచ్చు కానీ మమత్వం అనేది మన అనుభూతి కాక మరేమవు  తుంది? పర్యావరణ దృష్టికి సంబంధించినంత వరకు మన మొదటిమాట ఏమిటంటే మనం పర్యావరణ అంగాలం, సృష్టి అవయవాలం. మనం సృష్టికి యజ మానులం కాదు, అంగాంగీ భావనలతో సృష్టి విషయమై ఆలోచించాలి. మరోమాట ఏమిటంటే సృష్టి వికాసం (అభివృద్ధి)తోనే మన వికాసం కూడా అవుతుంది. మన వికాసంతో పాటే సృష్టి వికాసం కూడా కావాలి.

ఇప్పుడు జ్ఞానప్రాప్తి పొందేందుకు మార్గాలను వెతికేస్థాయికి విజ్ఞానం చేరింది. మన ప్రాచీన భారతీయులు, మహర్షులు ఏ తంత్రాలనయితే సాధించి ఉపయోగించారో, వాటిని ఉపయోగిం చేందుకు వీళ్లు (విజ్ఞానులు) మార్గాన్వేషణలో పడ్డారు. అందువల్లే యోగ వాసిష్ఠం, పతంజలి యోగశాస్త్రం లాంటి గ్రంథాల అధ్యయనాలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కొనసాగుతున్నాయి. మన దగ్గర ఓ పద్ధతి ఉంది. అందుకే ఇవాళ్టి పర్యావరణ సమస్యకు జవాబివ్వాలంటే మనం మన పద్ధతిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసంపూర్ణ దృష్టికోణం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైంది. పర్యావరణం, మేము వేర్వేరు, ప్రకృతి నుండి సాధ్యమైనంత ఎక్కువగా లాక్కోవాలి, పీడించాలి లేదా దాన్ని బలవంతంగా స్వాధీన పరచుకోవాలి, మనిషిలో నేను అందరి కన్నా గొప్పవాడిని అనే అహంకార పూరితమయిన ఆలోచనా విధానం కొనసాగుతుండటం మూలాన ఇలాంటి స్థితి నెలకొంది. ఈ ధోరణి తప్పు.

తప్పుడు విధానాల మూలకేంద్రాన్ని వేర్లతో సహా పెకిలించి పారేయాలి. ఈ కార్యక్రమాన్ని సంఘ స్వయంసేవకులు చాలా కాలం క్రితమే మొదలుబెట్టేశారు. ఇది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పర్యావరణ స్థితిగతుల అమలు తీరు. స్వయంసేవకులు కేవలం పర్యావరణ ఆలోచనలని, ఆచరణని నిర్వహించాలి. చిన్న చిన్న పనులతో ఆరంభించి అలవాటుగా మార్చే స్థితి క్రమం ఇది. అందుకే మొదటి కార్యక్రమంగా నీటిని పొదుపు చేయడం, ప్లాస్టిక్‌ ‌వాడకుండా ఉండటం, చెట్లు నాటడం-సంరక్షించడం వంటివి చేయాలి. ఈ పని చేస్తూ చేస్తూ పొతే అదే అలవాటుగా మారుతుంది. చెడిన అలవాటు మెరుగవుతుంది. సమాజ స్వభావం మారటంతో విధానకర్తల జ్ఞానం ఏపాటిదయినా సమాజమే నిర్దేశిస్తుంది. తప్పుడు విధానాలని ఆసరా చేసుకునే విధానకర్తలను ఇష్టారాజ్యంగా వ్యవహరించే అవకాశం సమాజమీయదు. ఇలాంటి స్వచ్ఛమైన భారతీయ దృష్టికోణాన్ని తీసికున్నప్పుడే మనగలుగుతాం. పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుందని భారతీయులమైన మనం స్పష్టంగా చెబుతుంటాం. అందుకే మనల్ని మనం మార్చు కుందాం. ప్రపంచమూ తనంతట తానే మారి పోతుంది. స్వచ్ఛమైన భారతీయ ఆలోచన దృష్టి కోణాన్ని తీసికొని సమాజ ఆచరణను మార్చాలి. ఎందుకంటే అది శాస్త్ర బద్ధమయినది, అనుభవ సిద్ధమైనది. కరోనా సమయంలో పర్యావరణాన్ని కలుషితం చేసేవన్నీ ఈ మాటలతో మటుమాయమై పోయాయి. కేవలం వారం రోజుల్లో వచ్చిన మార్పుని మనం ప్రత్యక్షంగా చూశాం. అనుభవసిద్ధ, చరిత్రబద్ధ, తర్కబద్ధ, విజ్ఞాన నిష్ట, మన పరంపరతో సంపూర్ణంగా మిళితమైన ఆలోచన విధానాన్ని తీసికొని దానికి అనుగుణంగా మన ఆచరణలోకి తీసికొస్తే ఆచరణలో వచ్చిన దోషాలను తొలగించి యోగ్యమైన ఆచరణ స్థాపనను సాధించడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ద్వారా పర్యావరణ విభాగం ఏర్పడింది. కరోనా పీడ ఒక సమయంలో తొలగినప్పటికీ మళ్లీ వ్యాపిస్తోంది. కేవలం ఫ్యాషనబుల్‌ ‌విషయమనుకుంటే పని కాదు, విషయం పట్ల సరైన దృష్టి, విషయానికి సంబంధించి సరైన అలవాటు ఉండాలి. భారత దేశం మొదటగా సుజల, సుఫల, మలయజ, శీతలం కావాలి. ప్రపంచాన్ని కూడా ఆ విధంగా చేయాలి.

పంచ మహా భూతాలతో తాదాత్మ్యం చెందుతూ మనం మన జీవనాన్ని కొనసాగిస్తూనే ఉన్నతిని సాధించాలి, సృష్టిని కూడా సమృద్ధి పరచాలి. ఇలాంటి వాతావరణాన్ని త్వరలోనే మనం పర్యావరణ సంరక్షణ కార్యకలాపాల కారణంగా చూడగలుగు తామనే కాంక్షను వ్యక్తం చేస్తున్నాను. శుభాకాంక్షలు చెబుతున్నాను.

(పర్యావరణ సమితి మహా కుంభ్‌, ‌హరిద్వార్‌ – ‌పర్యావరణ సంరక్షణ విభాగం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోహన్‌ ‌భాగవత్‌ ‘‌భారతీయ పరంపరలో పర్యావరణం’ అనే అంశంపై ప్రసంగించారు. ఆనాటి మోహన్‌జీ ప్రసంగానికి వ్యాసరూపం.)

అనువాదం : విద్యారణ్య కామ్లేకర్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram