– సుజాత గోపగోని, 6302164068

జై శ్రీరామ్‌.. అం‌టే శ్రీరాముడిని స్తుతించడం. రాముని పరమ భక్తుడు హనుమంతుడు నిరంతరం స్మరించే పదం. హనుమంతుడికి రాముడే సర్వస్వం. రాముడే లోకం. కానీ, తెలంగాణ రాష్ట్రసమితి ఇప్పుడు కొత్తగా హనుమంతుడి నినాదాన్ని ఎత్తుకుంది. జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌ అం‌టోంది. అత్యంత పకడ్బందీగా, సమయం చూసి, పక్కా ప్రణాళికతో టీఆర్‌ఎస్‌ ఈ ‌కొత్త ప్రచారం మొదలుపెట్టింది. బీజేపీ జై శ్రీరామ్‌ అం‌టున్నందున హిందూ భక్తులను ఆకట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు ముల్లును ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని పాటిస్తోంది. జై హనుమాన్‌ ‌నినాదాన్ని పఠిస్తోంది.

గులాబీపార్టీ ఇలా అకస్మాత్తుగా హిందువుల ఆదరణ కోసం తాపత్రయపడటం వెనక బలమైన కారణాలున్నాయి. ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించే ఆలోచన ఉంది. ఎన్నికల్లో తాకుతున్న వరుస దెబ్బలను నివారించుకోవాల్సిన ఆవశక్యకత ఉంది. పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి ముఖ్యంగా హిందూ, తటస్థ ఓటర్లను ఆకట్టుకోవాల్సిన వ్యూహం ఉంది.

సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి నెమ్మది నెమ్మదిగా టీఆర్‌ఎస్‌ ‌గ్రాఫ్‌ ‌తగ్గుతూ వస్తోంది. జనంలో ఆదరణ అథః పాతాళానికి చేరుకుంటోంది. దానికి ఉదాహరణలే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఒక రకంగా టీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి చావుతప్పి కన్నులొట్టపోయిన మాదిరిగా తయారయింది. ఆ వెంటనే ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకొచ్చాయి. రేపో, మాపో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక జరగబోతోంది. ఈ తరుణంలో పడిపోయిన టీఆర్‌ఎస్‌ ‌గ్రాఫ్‌ను తిరిగి పైకి తీసుకుపోయేందుకు అధిష్టానం ఏమేం చేయాలో అంతర్గతంగా ఆలోచనలు చేస్తోంది. అందులో భాగమే జై హనుమాన్‌ ‌నినాదం. హనుమాన్‌ ‌చాలీసా పారాయణం.

టీఆర్‌ఎస్‌కు ఈ దుస్థితి ఎదురుకావడానికి ప్రధాన కారణం కేసీఆర్‌ ‌నియంతృత్వ ఆలోచనలు, చర్యలు, బహిరంగ సభల్లో అదుపు తప్పే మాటలు అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా కరీం నగర్‌లో బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్‌ ‌తమకు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీని టార్గెట్‌ ‌చేస్తూ ‘హిందూగాళ్లు – బొందూగాళ్లు’ అంటూ మాట తూలారు. తానే అతిపెద్ద హిందువునని స్వయం ప్రకటన చేసుకున్నారు. కానీ, ఆ విమర్శ గురి తప్పింది. బీజేపీని కాకుండా నిజమైన హిందువు లను బలంగా తాకింది. ఆ పరిణామం టీఆర్‌ఎస్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. కేసీఆర్‌ అసలు స్వరూపం ఇదే అన్న ఒక భావన ప్రజలందరిలోనూ వచ్చింది. ఫలితంగా కరీంనగర్‌ ‌స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అంతేకాదు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.

హిందువుల పార్టీగా గుర్తింపుపడ్డ బీజేపీని సమయం వచ్చినప్పుడల్లా విమర్శించడం, ఆ పార్టీ నేతల పట్ల చులకనగా మాట్లాడటం చేసే కేసీఆర్‌ ‌హిందూ వ్యతిరేక పార్టీ, ముస్లిం పార్టీ అయిన ఆల్‌ ఇం‌డియా మజ్లిస్‌ ఎ ఇత్తెహాదుల్‌ ‌ముస్లిమీన్‌ – ఎంఐఎం‌తో అతిదగ్గరి సంబంధాలు కొనసాగిస్తారు. అనేక సందర్భాల్లో బహిరంగం గానే ఎంఐఎంను ఆకాశానికెత్తారు కూడా. అయితే, గతంలో జనం ఎవరూ ఇలాంటి చర్యలను అంతగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ, ఎప్పుడైతే కరీంనగర్‌లో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కేసీఆర్‌ ‌వ్యాఖ్యలు చేశారో అప్పటినుంచి టీఆర్‌ఎస్‌ ‌మీద ప్రజలు దృష్టి పెట్టారు. కేసీఆర్‌ ‌ప్రసంగాలు, వ్యవహారశైలి, స్నేహాలను నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు.

ఈ కారణంగానే, మొన్నటి జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌బహిరంగ విమర్శలు చేసుకున్నాయి. సీఎం అనే గౌరవం కూడా లేకుండా ఎంఐఎం నేతలు కేసీఆర్‌పై విపరీత విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు, కేసీఆర్‌ ‌కూడా ఎంఐఎంతో తమకు సంబంధం లేదని, ఆ పార్టీ తమకు దోస్తీ కాదని చెప్పుకొచ్చారు. ఎంఐఎం పట్ల టీఆర్‌ఎస్‌ ‌బాహాటంగా ఇలా ప్రకటించడం దాదాపు ఇదే తొలిసారి. ఇలా ప్రకటించడం వెనుక కరీంనగర్‌లో తగిలిన దెబ్బే ప్రధాన కారణం. ఒక్క పాతబస్తీ గురించి ఆలోచిస్తే, మిగిలిన నగరంలో కోలుకునే పరిస్థితి ఉండదను కున్న టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఆ పార్టీని ప్రత్యర్థి పార్టీగా నెమరేసుకుంది. మొట్ట మొదటిసారి హైదరాబాద్‌ ‌పాతబస్తీలోని పలు డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను పోటీలో నిలబెట్టారు. అయితే, ఆ ప్రాంతంలో అవసరమైన స్థాయిలో ఎన్నికల ప్రచారం గానీ, అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహాలు రచించడం గానీ చేయలేదు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలమంది టీఆర్‌ఎస్‌ ‌నాయకులు, కార్యకర్తలను హైదరాబాద్‌కు రప్పించి ప్రచారం సాగించిన టీఆర్‌ఎస్‌ ఓల్డ్‌సిటీలో మాత్రం నామమాత్రపు ప్రచారంతో సరిపెట్టుకుంది. దీనికి ఎంఐఎం తనవంతు రిటర్న్ ‌గిఫ్ట్ ఇచ్చింది. మేయర్‌ ఎన్నిక సందర్భంగా తాము బరిలో ఉంటామని చివరిదాకా ప్రకటించిన ఎంఐఎం, తీరా సమావేశ మందిరంలో ఓటు వేసే సమయంలో మాత్రం టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే, దీన్ని కూడా ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకెళ్లడంలో సఫలమయ్యింది. ఈ పరిణామం మరోసారి టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారింది.

మరోవైపు భారతీయ జనతాపార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ టీఆర్‌ఎస్‌ ‌వైఖరిని ఎండగడు తున్నాయి. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏమాత్రం అవకాశం దొరికినా టీఆర్‌ఎస్‌ ‌హిందూ వ్యతిరేక పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో కలిగేలా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. హిందువుల గురించి నిజాయితీగా, నిస్వార్థంగా ఆలోచించే పార్టీ బీజేపీ మాత్రమే అన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు.

అయోధ్య రామాలయం నిర్మాణం నేపథ్యంలో బీజేపీ శ్రేణులు, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ ‌వంటి పరివార సంస్థలు దాదాపు ఇంటింటినీ పలకరించాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ‌తరపున విరాళాలు సేకరించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మాత్రమే హిందువుల పార్టీ కాదని జనంలో అభిప్రాయం కలిగించేందుకు టీఆర్‌ఎస్‌ ‌వర్గాలు చాలా ప్రయత్నాలు చేశాయి. అందులో భాగంగానే, మంత్రుల నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు కూడా రామజన్మభూమి కోసం విరాళాలు అందజేశారు.

అయితే, ఇదే సమయంలో కొందరు టీఆర్‌ఎస్‌ ‌నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన విమర్శలు మళ్లీ వివాదానికి ఆజ్యం పోశాయి. అయోధ్య రాముడి గుడికి విరాళాలు ఎందుకు ఇవ్వాలని ఒకరు, మీరే కాదు మేము కూడా విరాళాలు సేకరిస్తామని మరొకరు, అసలు రాముడి గుడికి విరాళాలు ఇవ్వొద్దని మరొకరు ఇలా.. నోరు జారారు. తర్వాత నాలుక్కరుచుకొని సరిదిద్దుకున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ పరిణామా లతో టీఆర్‌ఎస్‌ ‌పట్ల ప్రజల్లో ఇప్పటికే నెలకొన్న విముఖత మరింత పెరిగింది. కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ‌నేతల మాటలకు, చేతలకు పొంతన ఉండదన్న అభిప్రాయం బలపడింది. ఫలితంగా క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా హిందూ ఓటుబ్యాంకు ఏకపక్షంగా బీజేపీ వైపునకు మళ్లుతోంది. ఈ పరిణామాలను అంచనా వేసుకున్న టీఆర్‌ఎస్‌ ‌పక్కా వ్యూహంతోనే ‘జై హనుమాన్‌’ ‌నినాదాన్ని ఎత్తుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రాముడిని కీర్తిస్తే హనుమంతుడిని పూజించి నట్లే. హనుమంతుడిని పూజిస్తే శ్రీరాముడిని కీర్తించినట్లే. ఎందుకంటే ఇద్దరిదీ అంతలా అవినాభావ సంబంధమని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. కానీ, టీఆర్‌ఎస్‌ ‌మాత్రం రామాంజనేయ భేదాన్ని సృష్టించింది. జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌ ‌నినాదాన్ని ఎత్తుకుంటోంది. స్వయంగా కేసీఆర్‌ ‌కూతురు ఎమ్మెల్సీ కవితతో ఈ ప్రచారం ప్రారంభించ బోతోంది. అందులో భాగంగానే ప్రకటన వచ్చేసింది. హనుమాన్‌ ‌చాలీసా పారాయణం పేరుతో బీజేపీ ఓటుబ్యాంక్‌కు గండికొట్టే వ్యూహాన్ని టీఆర్‌ఎస్‌ అమలుచేస్తోంది.

ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత హనుమాన్‌ ‌జయంతి సందర్భంగా 41 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ ‌చాలీసా పారాయణం చేపట్టాలని నిర్ణయించామ న్నారు. దీనికోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నా యని చెప్పారు. ఈ ప్రకటన ఉమ్మడి కరీంనగర్‌ ‌జిల్లాలో మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిల్చింది. ఆ ప్రకటనకు ఓ కవరింగ్‌ ‌కూడా ఇచ్చారు. ఇటీవలి తన కాశీ యాత్రలో సంకట హనుమాన్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన సందర్భంగా అక్కడి పూజారుల ద్వారా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాశస్త్యం గురించి తెలుసుకున్నాననీ, వారి సూచనల మేరకే హనుమాన్‌ ‌చాలీసా పారాయణం చేయాలని నిర్ణయించుకున్నాననీ చెప్పారు. కానీ, కవిత హనుమాన్‌ ‌చాలీసా పారాయణం ప్రకటన వెనుక గట్టి రాజకీయ వ్యూహమే ఉందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున జరుగుతోంది. ఉగాది నాడు రాజకీయ పంచాంగం మాదిరిగా కవిత హనుమాన్‌ ‌చాలీసా కూడా రాజకీయ పారాయణమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జాగృతి సంస్థ పేరిట క్రియాశీల పాత్ర నిర్వహించడంతో పాటు మాజీ ఎంపీగా, ఎమ్మెల్సీగా కేసీఆర్‌ ‌కూతురు కల్వకుంట్ల కవిత రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. జాగృతి సంస్థకు కర్త, కర్మ, క్రియ కవిత. పైగా కవిత చేసే ప్రకటనలు టీఆర్‌ఎస్‌ అధినేత, ఆమె తండ్రి కేసీఆర్‌ ‌కనుసన్నల్లోనే వెలువడుతాయన్న అభిప్రాయం ఉంది. అంటే, ఇప్పుడు హనుమాన్‌ ‌చాలీసా పారాయణం కూడా కేసీఆర్‌ ‌వ్యూహంలో భాగమే అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం నిధి సేకరణలో భాగంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ ‌పరివార సంస్థలన్నీ ఊరూ వాడా ఇంటింటికీ వెళ్లడంతో జైశ్రీరామ్‌ ‌నినాదం అంతటా మారుమోగింది. ప్రజలు పెద్దసంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో తాము హిందువులకు, హిందుత్వానికి ఏమాత్రం వ్యతిరేకం కాదని, తాము కూడా హిందూధర్మాన్ని పటిష్టం చేస్తున్నామని ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకే టీఆర్‌ఎస్‌ ఈ ‌కొత్త నినాదం అందుకుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

– వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram