– క్రాంతిదేవ్‌ ‌మిత్ర

కరోనా మహమ్మారి మన దేశంలోకి ప్రవేశించి ఏడాది పూర్తవుతోంది. వ్యాక్సిన్‌ అం‌దుబాటులోకి రావడంతో కొవిడ్‌ 19 ‌వ్యాప్తికి ఇక అడ్డుకట్ట పడ్డట్లే అని ఆనంద పడ్డా, కొత్తగా కేసుల సంఖ్య మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు కరోనా కొత్త రూపం సంతరించుకోవడం ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ ‌బలహీనపడ్డప్పటికీ కేసుల సంఖ్య పెరగడానికి ప్రజల్లో నిర్లక్ష్యం పెరగడం మరో కారణమని చెప్పక తప్పదు. టీకా తీసుకోవడంతో పాటు మాస్కులు ధరిండం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత శుభ్రత మరికొంత కాలం కొనసాగాల్సిన అవసరం కచ్చితంగా కనిపిస్తోంది. కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యం చూపిస్తే ముప్పు తప్పదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 2020 చేదు అనుభవాలను పంచినా, 2021లో కరోనా మహమ్మారి అంతమవుతుందని భావించారు. చాలా తక్కువ సమయంలో పరిశోధనలు ఫలించి టీకాలు అందుబాటులోకి రావడం ఇందుకు కారణం. అయితే ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. బ్రిటన్‌, ‌దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌ ‌తదితర దేశాల్లో కరోనా కొత్త రూపాన్ని సంతరించుకొని విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు భారత్‌తో సహా ప్రపంచ ప్రజానీకాన్ని మరోసారి ఆందోళనలోకి నెట్టేశాయి.

దేశవ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా కొత్త వేరియంట్‌ ‌కేసులు వెలుగుచూడటం భయాందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. ఓవైపు దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగవంతంగా సాగుతున్న సమయంలోనే చాపకింద నీరులా కొత్త వేరియంట్లు దూసుకువస్తున్నాయి. కొత్త రకం స్ట్రెయిన్‌ ‌వల్లే కరోనా పాజిటివ్‌ ‌కేసులు వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరోసారి ఆందోళన చెందుతున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, ‌కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌ ‌రాష్ట్రాల్లో వైరస్‌ ‌తీవ్రత పెరుగుతుండటం కలవరపెడుతోంది. రోజువారీ కేసుల్లో ఈ రాష్ట్రాల వాటా 87.25 శాతంగా ఉండటం కాస్త ఆందోళన కల్గించే అంశం. ఇందులో మహారాష్ట్ర, కేరళ అగ్రస్థానంలో ఉన్నాయి.

మనదేశంలో N440K, N484K వైరస్‌ ‌కొత్త రకాలను గత ఏడాదే మార్చి, జూలైలోనే గుర్తించారు. అయితే తమ రాష్ట్రంలో తాజా విజృంభణకు ఈ రెండు రకాలు కారణమని చెప్పలేమని మహారాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ రెండు రకాలు భారత్‌లో మాత్రమే కనిపించలేదని, ఇతర దేశాల్లో కూడా వాటిని గుర్తించినట్లు ఐసీఎంఆర్‌ ‌వెల్లడించింది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌, అసోంలో దాని ఆనవాలు కనిపించినట్లు చెప్పింది. అయితే ప్రస్తుత పరిస్థితిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు కూడా తెలిపింది. కొత్తరకం కరోనాను కట్టడి చేసేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు.

గత ఏడాది కొవిడ్‌ ‌సృష్టించిన విలయం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మరోసారి కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏమిటన్నది అంతు పట్టడంలేదు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా మళ్లీ విజృంభించడంతో మరోసారి ఆంక్షలు విధించక తప్పలేదు. మహారాష్ట్ర, గుజరాత్‌ ‌రాష్ట్రాల్లోని పలు నగరాలలో లాక్‌డౌన్‌ ‌విధించారు. కొన్ని నగరాల్లో రాత్రి వేళ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలతో గల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. అక్కడి నుంచే వారికి కచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. కేరళలో కేసులు ఎక్కువగా నమోదవడంలో ఆ రాష్ట్రంతో కర్ణాటక తన సరిహద్దులను మూసేసింది.

మనదేశంలో తాజా విజృంభణకు కొత్త రకాలు N440K, N484K కారణం కాకపోవచ్చని నిపుణులు అంటున్నారు. సూపర్‌ ‌స్ప్రెడర్‌ ఈవెంట్లే ఈ వ్యాప్తికి కారణమని అభిప్రాయపడుతున్నారు. కరోనా వైరస్‌ ‌కొత్త రకాల వల్లే మహారాష్ట్రలో మహమ్మారి మరోసారి విజృంభిస్తుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవంటోంది. బెంగళూరులోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మెంటల్‌ ‌హెల్త్ అం‌డ్‌ ‌న్యూరో సైన్సెస్‌ (‌నిమ్‌హాన్స్) ‌సూపర్‌ ‌స్ప్రెడర్‌ ఈవెంట్లు ఈ సమూహ వ్యాప్తికి దారితీస్తున్నాయని, బాధితులను గుర్తించేందుకు టెస్టింగ్‌, ‌ట్రాకింగ్‌, ‌ట్రేసింగ్‌ ‌విధానాలను తగినమేర అమలు చేయకపోవడం ఈ కేసుల పెరుగుదలకు దోహదం చేస్తోందని చెబు తున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే కొత్త రకాలు ఆధిపత్యం చెలాయిస్తాయి. రోగనిరోధక శక్తిని దెబ్బతీసి, తమ పునరుత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపర్చుకుంటాయి. కరోనాకు సంబంధించి వెలుగుచూసిన బ్రిటన్‌, ‌దక్షిణాఫ్రికా రకాలు ఆ కోవకు చెందనవేనని భావిస్తున్నారు.

కరోనా వైరస్‌ ఎం‌తగా సర్క్యులేట్‌ అయితే అంతగా పరివర్తన చెందుతుందని నిపుణులు అంటున్నారు. ఏ తరహా వైరస్‌లో అయినా ఉత్పరివర్తన సహజమేనని తెలిసిన విషయమే. ఒక్కోసారి అవి వైరస్‌ ‌పనితీరుపై అంతగా ప్రభావం చూపవు. ఆ మార్పులు వైరస్‌ను బలహీనం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉత్పరివర్తనాన్ని కట్టడి చేయాలంటే మాస్కులు ధరించడం, భౌతిక దూరం, పరిశుభ్రత ప్రమాణాలు పాటించాల్సిందేని స్పష్టం చేస్తున్నారు.

మార్చి 01, 2021 నాటికి దేశ వ్యాప్తంగా 1,69,786 క్రియాశీలక కేసులు ఉన్నాయి. మన దేశంలో ఇప్పటివరకూ 1,11,23,619 మంది కొవిడ్‌ ‌బారిన పడితే 1,07,96,558 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 1,57,275 మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచవ్యాప్త గణాంకాల ప్రకారం కరోనా కేసుల సంఖ్యలో మన దేశం రెండో స్థానంలో ఉండగా మరణాల సంఖ్యలో నాలుగో స్థానంలో ఉంది. మన దేశ జనాభా రీత్యా ఈ గణాంకాలు పెద్దగా కనిపిస్తూ కాస్త భయపెడుతున్నా, కరోనా అదుపులో భారత్‌ ‌చాలావరకూ విజయం సాధించిందని చెప్పకతప్పదు. మరణాల సంఖ్య 1.42 శాతానికి పరిమితం కావడం, కోలుకున్నవారి శాతం 97.10కి చేరడం ఇందుకు నిదర్శనం.

కరోనా విజృంభణ నేపథ్యంలో దేశంలో కొవిడ్‌ ‌కట్టడి నిబంధనలు వచ్చే నెల 31 వరకు కొనసాగనున్నాయి. కరోనా విజృంభణ రెండో దశ ప్రారంభమైన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మార్చి 31వరకూ అన్ని చోట్లా నిఘా ఉంచడంతో పాటు కట్టడి చర్యలు కొనసాగించాలని పేర్కొంటూ కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. క్రియాశీలక కేసులు భారీగా తగ్గినప్పటికీ మహమ్మారి కబంధ హస్తాల నుంచి పూర్తిగా బయట పడటానికి ఇంకా నిఘా, జాగ్రత్తలు, నియంత్రణలు అవసరం అని తెలిపింది. వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

మార్చి చివరికి యాక్టివ్‌ ‌కేసుల్లో తగ్గుదల

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నా మార్చి చివరినాటికి ఈ యాక్టివ్‌ ‌కేసుల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని కరోనా వైరస్‌ ‌తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్‌ ‌సూపర్‌మోడల్‌ ‌కమిటీ అంచనా వేసింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధకత దేశ ప్రజల్లో ఎక్కువ మందిలో ఉన్నట్లు సిరోలాజికల్‌ ‌సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌ ‌వల్ల కరోనా వైరస్‌ ‌నుంచి దీర్ఘకాలిక రక్షణ కలుగుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది.

ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, భారత్‌లో కరోనా వైరస్‌ ‌గతేడాది సెప్టెంబర్‌లోనే గరిష్ఠ తీవ్రతను చవిచూసిందని, అప్పటినుంచి కేసుల్లో తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది. ఇవన్నీ తొలిదశ ముగింపు వరకు గణాంకాలు మాత్రమేనని, ఇప్పటికే పలుచోట్ల రెండోదశ వ్యాప్తి ప్రారంభమవుతోన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఇటలీ, బ్రిటన్‌, అమెరికా దేశాల్లో జరిగినట్లు ఇక్కడ నిర్లక్ష్యం చేయవద్దని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కేవలం ఒక్క భారత్‌లో వైరస్‌ ‌వ్యాప్తిని తగ్గిస్తే సరిపోదని, ప్రపంచ వ్యాప్తంగా వైరస్‌ ‌వ్యాప్తిని కట్టడిచేస్తేనే ఇది అదుపులోకి వస్తుందని పేర్కొంది. భారత్‌లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ ‌పంపిణీ వేగవంతం చేయగా, దేశ అవసరాలతో పాటే ఇతర దేశాలకు భారత్‌ ‌వ్యాక్సిన్‌ ‌సరఫరా చేయడం ఆహ్వానించదగ్గ విషయమని నేషనల్‌ ‌సూపర్‌మోడల్‌ ‌కమిటీ అభిప్రాయపడింది.

దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్‌ ‌భారీ స్థాయిలో కొనసాగుతోంది. తొలి విడతలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ ‌వర్కర్లకు టీకాలను ఇచ్చారు. వయోజనుల కోసం రెండో విడత వ్యాక్సినేషన్‌ ‌తాజాగా ప్రారంభమైంది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కొవిడ్‌ ‌టీకా తొలి డోసు తీసుకున్నారు. ప్రతిఒక్కరు వ్యాక్సిన్‌ ‌తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు టీకా పంపిణీ కోసం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ‘కొ-విన్‌-2.0’ ‌పోర్టల్‌ను అందు బాటులోకి తెచ్చింది. 60ఏళ్లు పైబడిన వాళ్లు టీకా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. టీకా తీసుకోవాలనుకునే వారు www.cowin.gov.in లేదా ఆరోగ్యసేతు యాప్‌ ‌ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. లేదంటే సమీప వ్యాక్సిన్‌ ‌కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ ‌చేసుకునే వీలుంది.

భారత్‌ ‌పోరాటం ప్రపంచానికే ప్రేరణ: మోదీ

కరోనా వైరస్‌పై భారత్‌ ‌చేస్తున్న పోరాటం ప్రపంచ దేశాలకు ప్రేరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మహమ్మారి ప్రవేశించిన సందర్భంలో ఇతర దేశాలు భారత్‌లో పరిస్థితిపై ఆందోళన చెందాయని గుర్తు చేశారు. కానీ, ఈ రోజు కరోనా మహమ్మారిపై భారత్‌ ‌చేసిన పోరాటం యావత్‌ ‌ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ప్రపంచ శ్రేయస్సును కాంక్షిస్తూ భారత్‌ ‌మానవతా దృక్పథంతో ముందుకు సాగుతోందన్నారు ప్రధాని మోదీ. కరోనా కట్టడి కోసం వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. కరోనాపై పోరాడుతున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌ ‌తీసుకుని దేశాన్ని కరోనా రహితంగా చేయాలని పిలుపునిచ్చారు.

వైరస్‌ ‌రకాలను ముందే పసిగట్టొచ్చు!

ప్రస్తుతం ఏ రకమైన కరోనా వైరస్‌ ‌విస్తృతంగా వ్యాపిస్తోంది? భవిష్యత్తులో వైరస్‌లు ఎలా మార్పు చెందనున్నాయి? అన్న విషయాలను ముందుగా అంచనా వేసే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఢిల్లీలోని ‘సీఎస్‌ఐఆర్‌-ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌జినోమిక్స్ అం‌డ్‌ ఇం‌టిగ్రేటివ్‌ ‌బయాలజీ’ ఈ పరిశోధన చేసింది. యాంటీబాడీలకు చిక్కకుండా తప్పించుకుని తిరిగే వైరస్‌లను గుర్తించేందుకు, తద్వారా మరింత సమర్థమైన వ్యాక్సిన్ల తయారీకి తమ పరిశోధన దోహదపడగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా స్పైక్‌ ‌ప్రొటీన్‌కు సంబంధించి 3,11,795 రకాల జన్యు క్రమాలను, ప్రొటీన్‌లోని అమైనో ఆమ్లాల్లో జరిగే ఉత్పరివర్తనాలను వారు మదింపు వేశారు. పలు రకాల కరోనా వైరస్‌ ‌ప్రొటీన్లలోని అమైనో ఆమ్లాణువుల శ్రేణులను విశ్లేషించారు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram