కరోనా విషయంలో మరికొన్ని రోజులు తప్పక జాగ్రత్తలు పాటించాల్సిందేనని, టీకాతోనే అంతా అయిపోలేదని చెబుతున్నారు ఆరోగ్యభారతి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ‌రమేష్‌ ‌గౌతమ్‌.  ‌దేశంలోని పేదలందరికీ వైద్య సహాయాన్ని అందించడంతోపాటు, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడమే ఆరోగ్యభారతి లక్ష్యమని కూడా ఆయన అన్నారు. డాక్టర్‌ ‌రమేష్‌ ‌గౌతమ్‌తో జాగృతి జరిపిన ముఖాముఖీ పూర్తి వివరాలు పాఠకుల కోసం…


కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్యభారతి ఎటువంటి సేవాకార్యక్రమాలు నిర్వహించింది?

సేవాభారతి ఎంపిక చేసిన 294 జిల్లాల్లో (దేశవ్యాప్తంగా) ఆరోగ్యభారతి అందించిన సేవాకార్యక్రమాల వివరాలు: 1,05,401 కుటుంబాలకు నిత్యావసరాలు, 7,19,267 మందికి ఆహార పొట్లాల పంపిణీ. 1,24,173 మాస్కుల వితరణ. 67,774 శానిటైజర్ల పంపిణీ. 22,278 అవగాహన కేంద్రాల ద్వారా ప్రజల్లో కరోనా పట్ల అవగాహన కల్పించాం. ఈ కార్యక్రమాల్లో 7069 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1,96,225 వలస కార్మికులు లబ్ధి పొందారు. యోగా క్యాంపులు (ఆన్‌లైన్‌) 132, ‌లబ్ధిదారులు- 60,13,591. ధనసహాయం (పిఎమ్‌ ‌కేర్స్)- ‌రూ. 5,87,500. రక్తదానం- 881 యూనిట్లు. సంస్థ ఆధ్వర్యంలో 1231 మంది కరోనా యోధులకు సన్మానాలు చేశాం. ఆరోగ్య భారతి ‘స్వాస్థ్య గ్రామ యోజన’ పథకం ద్వారా ఆరోగ్య మిత్ర వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి సుదూర ప్రాంతవాసులకు సేవలందించాం. రెండు వేల గ్రామాలు, గిరిజన ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరింపజేశాం.

కొవిడ్‌కు టీకానే శాశ్వత పరిష్కారమా?

కొవిడ్‌కు తక్కువ కాలంలోనే టీకా రావడం సంతోషకరమే. అయితే దీంతోనే అంతా అయిపోలేదు. కరోనా ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. స్వీయరక్షణ చర్యలే శ్రీరామ రక్ష. భౌతికదూరం, మాస్క్‌ధారణ తప్పనిసరిగా పాటించాలి. నిర్లక్ష్యంగా ఉంటే ముప్పు తప్పదు.

కరోనాను అరికట్టే విషయంలో ఆయుర్వేదం, హోమియో వైద్యం పాత్ర ఏమిటి?

చాలా చోట్ల ఆయుర్వేదం, హోమియో మందులతో కరోనా నివారణలో సత్ఫలితాలు సాధించారు. భారతదేశంలో ఐదువేల సంవత్సరాలకు పూర్వమే ఆయుర్వేద వైద్యం ఉంది. అంతుచిక్కని రోగాలెన్నిటినో ఆయుర్వేదం నయం చేయగలదు. కరోనా బారిన పడినవాళ్లు చాలా మంది ఆయుర్వేదం ద్వారానే దానిని ఎదుర్కోగలిగారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కొవిడ్‌కు పంచగవ్య చికిత్స చేస్తున్నారు. అమెరికాలో కూడా పంచగవ్యపై పరిశోధనలు జరుగుతున్నాయి.

దేశంలో వైద్యరంగ అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి మీరిచ్చే సలహా?

ఇటీవల వెలువడిన ఒక నివేదిక ప్రకారం దేశంలో మూడు శాతం జనాభా వైద్యసౌకర్యాల లేమితో దుర్భర జీవితాన్ని అనుభవిసున్నది. అటువంటి వారికి ఆరోగ్యభారతి, ఆరోగ్యమిత్ర యోజన ద్వారా స్థానిక వాలంటీర్లతో ప్రాథమిక చికిత్స అందజేస్తున్నాం. కేంద్ర ఆరోగ్యశాఖ వారికి కూడా ‘ఖేర్‌పుట్‌ ‌వైద్యం’ తరహాలో శిక్షణ ఇవ్వమని కోరాం. ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ ‌కూడా మా సలహాలను స్వాగతిస్తున్నారు. జాతీయ వైద్య పాలసీ అమలులో మేమూ సహకరిస్తున్నాం. ఆరోగభారతి ఆధ్వర్యంలో 2014 ఆగష్టులో బెంగళూరులో వైద్య నిపుణుల కార్యశాలను నిర్వహించాం. ఇందులో హర్షవర్ధన్‌ ‌పాల్గొన్నారు. 45 మంది వైద్య నిపుణులు కూడా పాల్గొన్నారు. నేషనల్‌ ‌హెల్త్ ‌పాలసీ డ్రాఫ్ట్‌లో మా సంస్థ ప్రతిపాదించిన సలహాలను 2017లో పరిగణనలోకి తీసుకోవడం ముదావహం.

వంటిల్లే వైద్యశాల అని మన పూర్వికులు చెబుతారు కదా, ఇది ఎంతవరకు నిజం?

ఇది ముమ్మాటికీ నిజం. కరోనా వేళ వంటిల్లుని మించిన వైద్యశాల మరొకటి కనిపించలేదు. అనేకమంది ఇళ్లలో తయారుచేసిన కషాయం ద్వారానే కరోనాను జయించారు. వంటింట్లో ఉండే తులసి, పారిజాత, ఉసిరి, అశ్వగంధ, శతావరి వంటివి ఎన్నో రోగాలకు చక్కగా పనిచేస్తాయి. అల్లం, పసుపు, వెల్లుల్లి, లవంగం, మిరియాలు మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా పనిచేస్తాయి.

చిన్నారుల ఆరోగ్య సంరక్షణ విషయంలో ఆరోగ్యభారతి పాత్ర ఏమిటి?

మనదేశంలో అనేకమంది చిన్నారులు ఇప్పటికీ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడుపదులు దాటినా ఇంకా 50 శాతం మంది పిల్లలకు పౌష్టికాహారం అందడంలేదు, ఇది శోచనీయం. ఈ విషయంపై ఆరోగ్యభారతి మరింత శ్రద్ధ పెట్టింది. పేద, మధ్యతరగతి చిన్నారు లందరికీ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది.

దీర్ఘకాలిక రోగాల నివారణ విషయంలో మీ సంస్థ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నది?

ఆధునిక జీవనశైలి కారణంగా ఊబకాయం, షుగర్‌, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక రోగాలు ఎక్కువవుతున్నాయి. వీటిపై అవగాహనకు మైసూర్‌లో 2013లో ఓ సదస్సు నిర్వహించాం. 2016-17లో స్టాప్‌ ‌డయాబెటిక్‌ ‌మూవ్‌మెంట్‌ను ప్రారంభించాం. ఆ దిశగా ముందుకెళుతున్నాం.

అవయవదానం విషయంలో ఆరోగ్యభారతి ప్రోత్సహం ఎలా ఉంది?

అవయవ, దేహ (మరణానంతరం) దానాన్ని ఆరోగ్యభారతి ప్రోత్సహిస్తుంది. ఈ విషయంలో సక్షమ్‌ ‌సంస్థ చాలా కృషి చేస్తున్నది. భారతరత్న నానాజీ దేశ్‌ముఖ్‌ ‌తన దేహాన్ని దానమిచ్చి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. అదే స్ఫూర్తితో అనేకమంది ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రచారక్‌లు, ఇతరులు అవయవ, దేహ దానం చేసేందుకు ప్రతిజ్ఞలు చేశారు, చేస్తున్నారు.

హెల్త్ ‌టూరిజాన్ని మీరు స్వాగతిస్తారా?

కేరళ ఈ విషయంలో ముందుంది. మిగతా రాష్ట్రాలు కూడా హెల్త్ ‌టూరిజాన్ని ప్రోత్సహించాలి.

సేవాభారతి ఆధ్యర్యంలో ఎటువంటి వైంద్యసేవలందిస్తున్నారు?

రాష్ట్రీయ సేవాభారతి ఆధ్వర్యంలో ఔరంగబాద్‌లోని డా।। హెడ్గేవార్‌ ఆసుపత్రిలో, నాసిక్‌లోని శ్రీ గురూజీ గుణాలయ్‌, ‌లాతూర్‌లోని శ్రీ వివేకానంద ఆసుపత్రిలో అనేక రకాల వైద్యసేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆరోగ్యభారతి ముందున్న లక్ష్యం ఏమిటి?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 85 శాతం జిల్లాల్లో పేదరోగులకు ఆరోగ్య భారతి ద్వారా వైద్య సహాయం అందిస్తున్నాం. రానున్న కాలంలో దీనిని మరింత విస్తరిస్తాం. పేదలందరికీ ఉచిత వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం.

– దండు కృష్ణవర్మ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram