‘ఉంగరాల చేత్తో మొడితే గానీ..’ అన్నట్టే ఉంది, ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వ వైఖరి. తాజాగా సుప్రీంకోర్టు కూడా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. హైకోర్టు ఆదేశాలలో తాము కలగచేసుకోవలసిన అవసరం లేదని కూడా తేల్చి చెప్పేసింది. పనిలో పనిగా ఎన్నికల నిర్వహణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేసిన ఉద్యోగ సంఘాలను కూడా తప్పు పట్టింది. వ్యాక్సినేషనా? ఎన్నికలా? ఏది జరపాలి అంటూ పోలీసులు ప్రశ్నించడం కూడా అత్యున్నత న్యాయస్థానానికి ఆగ్రహమే తెప్పించింది. అంటే తాము వ్యాక్సినేషన్‌ ఆపమని అంటామని ప్రభుత్వం ఉద్దేశమా అని కూడా గట్టిగా మోతాదు ఇచ్చింది. ఆంధప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల రగడ ఎటు దారితీస్తుందోనని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడింది. రాజ్యాంగ, రాజకీయ వ్యవస్థల మధ్య గీత చెరిగిపోయిన వైనం ఒకింత ఆందోళనకు గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంఘర్షణ పట్ల విచారం వ్యక్తం చేసింది. ఒక విధంగా.. ఈ పరిణామం మొత్తం పాలకులు, రాజకీయ నాయకులు మాత్రమేకాదు విజ్ఞత, వివేచన గల ప్రజలు సైతం సిగ్గుతో తలదించుకోవలసిన సందర్భం. రాష్ట్రంలో సాగుతున్న అరాచక రాజకీయాలకు, అరాచక పాలనకు ఇది అద్దంపడుతోంది. ఒక్క విషయం, ఒక్క వివాదం అని కాదు, ప్రతి విషయమూ ఒక వివాదంగానే పరిపాలన సాగుతోంది. చివరకు, అధికార పార్టీ న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదించే స్థాయికి పరిస్థితి దిగజారిపోయింది.

రాష్ట్ర ప్రజల్లోనే కాదు, ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం ఆంధప్రదేశ్‌ అం‌టే చులకనభావన ఏర్పడే స్థాయికి పరిస్థితి దిగజారింది. అలాగే మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రభుత్వ యంత్రాంగాన్ని, రాజకీయ పార్టీలను, చివరకు మీడియాను కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అదేవిధంగా న్యాయస్థానాలు వివిధ కేసులకు సంబంధించిన విచారణల సందర్భంగా లేదా తీర్పులలో ఘాటైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. చురకలు అంటిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో గట్టిగా వాతలు కూడా పెట్టాయి. అంతకుమించిన హెచ్చరికలు చేశాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు సమన్లు జారీచేసి కోర్టుకు పిలిపించి మరీ మందలించిన సందర్భాలున్నాయి. పంచాయతీ ఎన్నికల గురించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ వివాదం దీనికి పరాకాష్టే.

నిజానికి, రాష్ట్ర విభజన నాటి నుంచి నేటివరకు ఆంధప్రదేశ్‌లో ఒక విధంగా అరాచక పాలనే జరుగుతోంది. అది గత చంద్రబాబు పాలనే అయినా, ప్రస్తుత జగన్మోహన్‌రెడ్డి పాలనే అయినా.. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విషయంలో మాత్రం పెద్దగా తేడాలేదు. అలాగే, మితిమీరిన అహంకారాన్ని ప్రదర్శించడంలో, వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో కూడా రెండు ప్రభుత్వాలు, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదు.

అయితే, రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయ్యిందన్నట్లుగా పరిస్థితి మరింతగా దిగజారిపో తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న పంచాయతీ ఎన్నికల రాజకీయం అరాచకం అంచులను దాటి మరో మెట్టు పైకి ఎక్కిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ వ్యవస్థలేకాదు రాజ్యాంగ వ్యవస్థల పతనం కూడా మునుపు కంటే మరింత వేగంగా సాగుతోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అంతేకాదు, ఈ పరిణామాలు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇంతకీ సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త మలుపు తీసుకోబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల రగడ వెనుక ఉన్న వాస్తవం వేరు. రెండు ప్రాంతీయ, కుటుంబ పార్టీల నాయకుల రాజకీయ ఆధిపత్య, అహంకారాల మధ్య సాగుతున్న సంఘర్షణ గానే ఈ పరిణామాలను చూడవలసి ఉంటుంది. అలాగే, తెరమీద సీఎస్‌ అధిత్యానాథ్‌, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌, ‌మరికొందరు ప్రభుత్వ అధికారులు కనిపించినా అసలు వివాదం అధికారులకు సంబంధించినది కాదు, వారిలో పరకాయ ప్రవేశంచేసిన రాజకీయ నాయకులు ఆడిస్తున్న నాటకంలో వీరు తెలిసో తెలియకో, లేక ఇంకేదో ఆశించో పాత్రధారులుగా మారారన్న అనుమానాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఒకవిధంగా చూస్తే, అధికారులు అడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారన్న సానుభూతి కూడా కొందరిలో వ్యక్తమవుతోంది. అయితే అది అర్ధసత్యమే. రాజకీయ నాయకులకంటే, అధికారులకే రాజ్యాంగ మర్మాలు ఎక్కువగా తెలుసన్నది అందరికీ తెలిసిందే. కాబట్టి అధికారులు తెలియక తప్పు చేస్తున్నారని అనుకోలేం.

కరోనా కారణంగా గత మార్చిలో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికల వివాదం ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ), ప్రభుత్వం మధ్య ఎన్నికల రాజకీయాలను మించిన స్థాయిలో పరస్పర మాటల యుద్ధం జరుగింది. ఒకవిధంగా చూస్తే రెండు రాజ్యాంగ వ్యవస్థల (ప్రభుత్వం, ఎన్నికల సంఘం) మధ్య అవాంఛనీయ వాతావరణం నెలకొంది. యుద్ధమే జరుగుతోందని అనుకునేలా వాతవరణం పూర్తిగా వేడెక్కింది. ఇంచుమించుగా పది నెలలకుపైగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అత్యంత జుగుప్సాకరంగా సాగుతూ వస్తున్న వివాదం ఇప్పుడు మరో మలుపు తీసుకుంది. రాజ్యాంగానికి విధేయంగా పనిచేయవలసిన వ్యవస్థలు.. రాజకీయ అరాచకశక్తుల అహాన్ని సంతృప్తిపరిచేందుకు విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల అంశం కోర్టు వరకు వెళ్లడమే అక్షేపణీయం. అలాంటిది, ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కోర్టు తీర్పులను ఉల్లంఘించేంతగా ప్రభువును మించిన ప్రభుభక్తిని ప్రదర్శిస్తున్నాయన్న వాదనలు, విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని సుప్రీంకోర్టు చూస్తూ ఊరుకుంటుందని అనుకోలేం. ఊరుకోలేదు కూడా.

ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉభయ పక్షాల వాదనలు విన్న రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌ఈసీతో సహకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా వాక్సినేషన్‌ ‌కార్యక్రమం కారణంగా ఎన్నికలను నిర్వహించడం సాధ్యంకాదన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం కొట్టివేసింది. ‘కరోనా వాక్సినేషన్‌ ‌కార్యక్రమం, గ్రామ పంచాయతీ ఎన్నికలు రెండూ ముఖ్యమే. సమన్వయంతో రెండింటినీ విజయవంతం చేయండి’ అని ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. అయినా రాజకీయ అధికారం ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది కాబట్టి, ఈలోగా రాష్ట్ర ఎన్నికల సంఘంతో సహకరించేది లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకుల వరకు అందరూ ఒకటే వాదన వినిపించారు. కరోనా టీకా కార్యక్రమం సాకుగా చూపుతూ ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేశారు. ఇప్పుడు అందరికీ కలిపి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్‌ ‌చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ ‌నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గతంలో ఫిబ్రవరి 5 నుంచి నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ షెడ్యూలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్‌ ‌విడుదల చేసిన క్షణం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పనిచేయవలసి ఉంటుంది. కానీ, ఎన్నికల సంఘంతో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విభేదించింది. ఉద్యోగ సంఘాలతో పాటుగా జిల్లా కల్లెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు సహాయ నిరాకరణను ప్రకటించారు. ఎన్నికల పక్రియలో భాగంగా రమేష్‌కుమార్‌ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కల్లెక్టర్లు సహా అధికారులు ఎవరూ హాజరు కాలేదు. ఒకవిధంగా చూస్తే ఇది చాలా ప్రమాదకర ధోరణి. అధికార పార్టీకి, ప్రభుత్వానికి మధ్య ఉండవలసిన సన్నని గీత చెరిగిపోయిందో, చెరిపేశారో అర్థంకాని రీతిలో వ్యవహారం నడిచింది. ‘ఎమర్జెన్సీ’ కాలం నాటి పరిస్థితులను గుర్తుకుతెచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగం సాగిలపడుతోందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

ప్రభుత్వ యంత్రాంగం, ఉద్యోగ సంఘాలు ప్రభుభక్తిని ప్రదర్శించడం కొత్త విషయం కాదు. గతంలోనూ వివిధ ప్రభుత్వాలలో ఉన్నత పదవులను నిర్వహించిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఇతర ఉన్నతాధి కారులు, ఉద్యోగ సంఘాల నాయకులు సర్వీసులో చేసిన ‘సేవ’లకు పదవీవిరమణ అనంతరం వివిధ రూపాల్లో ప్రయోజనం పొందారు. నజరానాలు అందుకున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీఎన్జీవో నాయకుడు అశోక్‌బాబు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
ఆయన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సేవలో తరించడమే కాదు, తెలుగుదేశం పార్టీ పొలిటికల్‌ అజెండాను కూడా నెత్తికెత్తుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాల మేరకు అశోక్‌బాబు బీజేపీకి వ్యతిరకంగా ప్రచారం కూడా చేశారు. అందుకు ప్రతిఫలంగా ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన వెంటనే ఎమ్మెల్సీ పదవిని కానుకగా పొందారు. ఒక్క అశోక్‌బాబు అనే కాదు, ఇంకా చాలా మంది ఉద్యోగ సంఘాల నాయకులు, చివరకు జర్నలిస్ట్ ‌సంఘాల నాయకులు కూడా ఉడతా భక్తిగా చేసిన సేవలకు ప్రతిఫలాలను అందుకున్నారు. రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తిన అధికారులు ఉన్నా.. ఇలా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను కూడా పెడచెవిన పెట్టిన సందర్భం గతంలో బహుశా లేదేమో. అందుకే, ఈ పరిస్థితి ఎటు దారి తీస్తుందోనన్న సందేహాలకు ఆస్కారం ఏర్పడింది.

–  రాజనాల బాలకృష్ణ :  ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram