కేసీఆర్‌ ‌తనయుడు, రాజకీయ వారసుడు కేటీఆర్‌ ‌తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారన్న వార్త మరోసారి చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పలుమార్లు కేసీఆర్‌.. ‌తన కుమారుడు కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగిస్తున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రచారం గురించి ఎవరూ స్పందించలేదు. సీఎం మార్పు కూడా జరగలేదు. ఇప్పుడు మరోసారి గడిచిన వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా స్వపక్షంతో పాటు, విపక్షాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. గులాబీ నేతలంతా క్రమంగా కోరస్‌ ‌కట్టి మరీ ఇదే పాట పడుతున్న పరిస్థితి.

గతంలో ఇలాగే ప్రచారం జరిగిన సమయంలో ఓ సభలో కేసీఆరే స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఈ అంశంపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించారు. తన ఆరోగ్యానికి ఢోకాలేదని, మరో ఐదేళ్ల పాటు కూడా తానే సీఎంగా కొనసాగుతానని ధీమా వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ట్రసమితి వ్యవస్థాపకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమారుడైన కేటీఆర్‌.. ‌తొలినుంచీ షాడో (తెరవెనుక) సీఎం మాదిరిగా తనదైన ముద్రను వేస్తున్నారు. ఇటు ప్రజా ప్రతినిధుల దగ్గర, అటు అధికారుల దగ్గర ప్రత్యేక ప్రాభవాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటికే ఆయనకు పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌హోదాను కట్టబెట్టారు కేసీఆర్‌. అం‌టే, పార్టీలో అయినా, ప్రభుత్వంలో అయినా కేటీఆరే నెంబర్‌ ‌టూ అన్న సంకేతాలను పరోక్షంగా ఎప్పుడో పంపించేశారు.

తెలంగాణలో రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్‌ ‌దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ‘అంతా తానై..’ అన్నట్లుగా పాలన సాగిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ దూకుడు మరింత పెరిగింది. సమీక్షలు, సమావేశాలు, సుడిగాలి పర్యటనలు పెరిగిపోయాయి. కేసీఆర్‌ ‌సహజంగానే కనీసం ప్రగతిభవన్‌ ‌దాటి బయటకు రాని పరిస్థితుల్లో కేటీఆర్‌ ఆ అధికారాన్ని, మర్యాదలను పొందుతున్నారని సొంత పార్టీలోనే విస్తృతంగా చర్చ సాగుతోంది. ఒక రకంగా చూస్తే కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే ముందు ఆ పదవి అలవాటయ్యేందుకు ఇలా చేస్తున్నారని కూడా అనిపించింది.

ఈ దఫా కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారనే బాంబు మొదటగా పేల్చింది వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. ‌కేటీఆర్‌కు సీఎం కావాల్సిన అన్ని అర్హతలూ ఉన్నాయని, ఇప్పటికే ఆయన సీఎం బాధ్యతలన్నీ చూసుకుంటున్నారని, అలాంటి తరుణంలో కేటీఆర్‌ ఆ ‌పోస్టుకు సమర్థుడని చెప్పుకొచ్చారు. సీఎం అందుబాటులో లేని సమయంలో కేటీఆరే పరోక్షంగా ఆ పాత్ర పోషిస్తున్నారని కూడా చెప్పారు. అంతేకాదు, అతి కొద్దిరోజుల్లోనే సీఎం మార్పు ఉంటుందని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఈటల ప్రకటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం పతాక శీర్షికలకు ఎక్కింది.

ఈటల రాజేందర్‌ ‌లీకిచ్చిన తర్వాత వరుసబెట్టి కేటీఆర్‌ ‌సీఎం పదవికి అర్హుడేనన్న వారి సంఖ్య పెరుగుతోంది. కేటీఆర్‌ ‌సీఎం కావాల్సిందేనని ఒకరకంగా డిమాండ్‌ ‌స్వరం వినిపిస్తున్నారు కూడా. మంత్రుల నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్తల దాకా ఒక క్రమపద్ధతిలో ఈ ప్రచారం సాగిస్తున్నారు. ఈటల తర్వాత మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ‌కొప్పుల ఈశ్వర్‌, ‌డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు, ఎమ్మెల్యేలు షకీల్‌, ‌బాజిరెడ్డి గోవర్ధన్‌, ‌రసమయి బాలకిషన్‌, ‌దాస్యం వినయ్‌భాస్కర్‌, ‌మెతుకు ఆనంద్‌.. ఇలా ఒక్కొక్కరుగా వరుసగా కేటీఆర్‌ ‌సీఎం కావాలన్న ఆకాంక్షను బాహాటంగా వెల్లడిస్తున్నారు.

డిప్యూటీ స్పీకర్‌ ‌పద్మారావు ఏకంగా కేటీఆర్‌ ‌సభావేదిక మీద ఉండగానే కాబోయే సీఎం కేటీఆర్‌ అని సంబోధిస్తూ ప్రసంగం మొదలెట్టారు. రసమయి బాలకిషన్‌ ‌త్వరలో సిరిసిల్ల సీఎం జిల్లా కాబోతుందని వ్యాఖ్యానించారు. అంటే, సిరిసిల్ల నుంచి కేటీఆర్‌ ‌ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ పరోక్షంగా కేటీఆర్‌ ‌సీఎం అవుతున్నారన్న వ్యాఖ్యలు చేశారు. ఇలా రోజురోజుకూ కేటీఆర్‌ ‌సీఎం కావాలంటూ ప్రకటనలు చేస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగిపోతోంది.

కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి కావాలంటూ మాట్లాడాల్సిందిగా తమకు ఎవరూ సూచనలు ఇవ్వలేదని కూడా ఆయా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం పదవికి కేటీఆర్‌ అన్నివిధాలా సమర్థుడని కితాబు ఇస్తున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలు కేటీఆర్‌ ఆధ్వర్యంలోనే జరగాలని కోరుకుంటున్నా మంటున్నారు. ఎవరేం చెప్పినా పైనుంచి వెళ్లిన సూచనల ప్రకారమే ప్రచారం సాగుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో సీనియర్లు, ప్రజాప్రతినిధులు సీఎంగా కేటీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం ఎప్పుడు ఉండవచ్చుననే విషయంపై చర్చించుకుంటున్నారు. అధిష్టానం ముఖ్యుల నుంచి తమకు ఉన్న సమాచారం మేరకు దీనికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చునని అంటున్నారు.

వచ్చే నెలలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం ఖాయమనే మాట కూడా వినిపిస్తోంది. మంత్రివర్గంలోనూ భారీగా మార్పులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. దీంతో కొందరు సీనియర్‌ ‌మంత్రులు కూడా కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ వ్యాఖ్యానిస్తూ ముందస్తుగానే వారి స్థానాలను పదిలం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశాన్ని లేవనెత్తుతున్న వాళ్లందరూ కేటీఆర్‌ ‌దృష్టిలో పడేందుకే తాపత్రయ పడుతున్నారని, మంత్రులేమో తమ స్థానాలు పదిలం చేసుకునేందుకు, ఎమ్మెల్యేలు మంత్రి పదవులకు ప్రమోషన్‌ ‌కొట్టేందుకు ఈ కోరస్‌ ‌పాడుతున్నారని అర్థమవుతోంది.
కేసీఆర్‌ ‌కాళేశ్వరం పర్యటన లోగుట్టు?
ఇటీవల కేసీఆర్‌ ‌కాళేశ్వరం పర్యటన నిగూడార్థం కూడా ఇదేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇన్నాళ్లుగా ఏం జరుగుతున్నా.. ప్రగతిభవన్‌ ‌నుంచి బయటకు రాని కేసీఆర్‌.. ఒక్కసారిగా కాళేశ్వరం అధికారిక పర్యటనను ఖరారు చేసుకోవడం, సతీసమేతంగా శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడం, ప్రత్యేక పూజలు నిర్వహించడం, అలాగే, మేడిగడ్డ రిజర్వాయర్‌ ‌వద్దకు వెళ్లి.. అక్కడ కూడా సతీసమేతంగా గంగమ్మ తల్లికి పూజలు చేయడం, పసుపు, కుంకుమలు, మొక్కులు సమర్పించడం ప్రజలందరూ గమనించారు. కేటీఆర్‌ ‌సీఎం కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారని, కేటీఆర్‌ ‌సీఎం పీఠాన్ని అధిష్టించే సమయంలో విఘ్నాలేవీ ఎదురుకాకుండా చూడాలని వేడుకు నేందుకే కేసీఆర్‌ ‌కాళేశ్వరం వెళ్లారని సన్నిహితులు చెబుతున్నారు.

మంత్రుల పదవులు పదిలమేనా?

కేటీఆర్‌ ‌నిజంగానే ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తే మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారన్న విషయంలో ఇప్పటినుంచే అంచనాలు మొదలయ్యాయి. కేసీఆర్‌ ‌కుమార్తె కవితకు బెర్త్ ‌ఖాయమనేది స్పష్టమవుతోంది. అలాగే, ఈసారి కీలక శాఖలు ఎవరికి దక్కుతాయి? అనే చర్చ అధికార పార్టీలో జోరుగా సాగుతోంది. కేసీఆర్‌ ‌తొలి ప్రభుత్వంలో ఉన్నట్టుగా కేటీఆర్‌ ‌కేబినెట్‌లో కూడా డిప్యూటీ సీఎం పదవి ఉంటుందని చెప్తున్నారు. కొందరు సిట్టింగ్‌ ‌మంత్రులను కొన సాగించాలని స్వయంగా కేసీఆర్‌ ‌సిఫార్సు చేస్తారని, మిగతా మంత్రుల ఎంపికను కేటీఆర్‌ ఇష్టానికి వదిలేస్తారని అంటున్నారు. ప్రస్తుత మంత్రులందరికీ కేటీఆర్‌ ‌కేబినెట్‌లో చోటు దక్కకపోవచ్చని చెప్తున్నారు. ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వారిని పక్కన పెడతారని, ఆ స్థానంలో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులను కేటీఆర్‌ ‌కేబినెట్‌లోకి తీసుకుంటారని భావిస్తున్నారు.

కేటీఆర్‌ ‌సీఎం బాధ్యతలు స్వీకరిస్తే ఇప్పుడున్న మంత్రివర్గం రద్దవుతుంది. దీంతో మార్పులు చేర్పులు తప్పనిసరవుతాయి. రాష్ట్ర కేబినెట్‌లో సీఎంతో పాటు 17 మందిని మంత్రులుగా నియమించుకునే అవకాశం ఉంటుంది. హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌, ‌కవితకు చోటు ఖరారైతే, మిగిలిన 14 స్థానాల్లో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై టీఆర్‌ఎస్‌లో పలు రకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఒక ఎస్సీ, ఒక ఎస్టీకి, ఒక ముస్లింకు కేటీఆర్‌ ‌మంత్రివర్గంలో అవకాశం ఖాయమని చెబుతున్నారు. ప్రధానంగా కేటీఆర్‌ ‌కోటరీగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కవచ్చని లీడర్లు చెబుతున్నారు.

– సుజాత గోపగోని, 6302164068 సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE