(ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం)

తెలుగుభాష మృతభాషల అంచున ఉందని యునెస్కో (2002) హెచ్చరించింది. మన మాతృభాషకు ఆ ముప్పు ఎదురైతే ఆ పాపం ఎవరిది? భాష మనుగడ దెబ్బతీసే అనాలోచిత నిర్ణయాలు చేసే ప్రభుత్వాలదా? తల్లి భాష ఉనికి దెబ్బ తింటున్నా ఉపేక్షాభావంతో ఉన్న మనందరిదీనా?

‘పరభాషా వ్యామోహంతో అమ్మభాషను నిర్లక్ష్యం చేయడం క్షమించరానిది. అమ్మభాషను పరిరక్షించుకోవడం సామాజిక అవసరం. దేశ క్షేమానికి భాషా క్షేమమే పునాది’ అని వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి చెప్పేవారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిన్న మొన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం కూడా మాతృభాషకే పట్టం కట్టడం కనిపిస్తుంది. అది వాస్తవిక దృక్పథమనిపించుకుంటుంది. ప్రపంచంలో చాలా జాతులు లేదా ప్రాంతాలు వారి లేదా వాటి మాతృభాషతోనే గుర్తింపు పొందుతూ ఉంటాయి. తెలుగువారు మొదలుకొని, ఇటాలియన్లు, జర్మన్లు, ఆంగ్లేయులు, రష్యన్లు, చైనీయులు ఇలా ఎన్నో. మాతృభాషలో విద్యాబోధన అంటే పసివారి మెదడుకు సహజమైన పోషణకు వీలు కల్పించడమే.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి ఉద్విగ్న భరితమైన నేపథ్యం ఉంది. బంగ్లాదేశ్‌ ఒకప్పుడు పాకిస్తాన్‌లో అంతర్భాగం. బంగ్లా ప్రజలు తమ బెంగాలీ భాషను గుర్తించమని కోరుతూ నేటి బంగ్లాదేశ్‌ ‌రాజధాని ఢాకాలో విశ్వవిద్యాలయాల విద్యార్థులు, వైద్య విద్యార్థులు వేల సంఖ్యలో ఫిబ్రవరి 21, 1952న ప్రదర్శన నిర్వహించారు. కానీ పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం వారి విన్నపాన్ని తిరస్కరించ డమే కాకుండా, కాల్పులు జరిపింది. ఆ దారుణ మారణకాండలో ఆరుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అమ్మభాష కోసం జరిగిన బలిదానా లివి. బంగ్లాదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆ సంఘటనను దృష్టిలో పెట్టుకొని, వారు చేసిన అభ్యర్థన మేరకు 1999 నవంబర్‌లో యునెస్కో ఫిబ్రవరి 22వ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటిం చింది. యునెస్కో ప్రకటనను అనుసరించి ఫిబ్రవరి 21, 2000 సంవత్సరం నుంచి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుగుతున్నాయి. ఇది 21వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం.

కొన్ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలకు యునెస్కో కొన్ని ప్రాధాన్యతలను నిర్దేశించింది. 2008ని అంతర్జాతీయ మాతృభాషా సంవత్సరంగా ప్రకటించింది. ఆ సంవత్సరమంతా మాతృభాషా ప్రాధాన్యాలకు సంబంధించిన వేడుకలు జరిగాయి. 2012 సంవత్సరాన్ని మాతృభాషలో విద్యాబోధన ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిన సంవత్సరంగా ప్రకటించింది. 2019 సంవత్సరాన్ని దేశీయ భాషల అంతర్జాతీయ భాషా సంవత్సరంగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశీయ భాషలపై చర్చ, అవగాహన కల్పించటం, అంతర్జాతీయ పరిధిలో భాషల అవసరం మేరకు సహకారం అందించాలని తీర్మానించింది. దేశీయ భాషల నుండి విజ్ఞానాత్మక సృజనను ప్రోత్సహించి సాధారణ భాషా స్థాయికి దేశీయ భాషలను తీసుకొని రావాలని నిర్దేశించింది. గత రెండు దశాబ్దాలుగా భాషల రోదసిలో ప్రతి పదమూ ‘ఒక మెరిసే నక్షత్రం’ అనే నినాదంతో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలను నిర్వహిస్తు న్నారు. ఎన్ని మాతృభాషా దినోత్సవాలు (ఆగష్టు 29, గిడుగు జయంతి) ఎన్ని అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాలు నిర్వహించినా తెలుగు భాష ఉనికి మాత్రం ప్రమాదంలో పడటం శోచనీయం.

మధురమధురమైన మాతృభాష తెలుగు ఒకప్పుడు ప్రవాసాంధ్రులతో కలిపి దాదాపు 18 కోట్లమంది వ్యవహర్తలతో జాతీయ స్థాయిలో రెండో స్థానంలో ప్రపంచ స్థాయిలో 15వ స్థానంలో ఉండేది. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రెండో స్థానంలో బెంగాలీ భాష, మూడోస్థానంలో మరాఠీ భాష, నాల్గో స్థానంలో తెలుగు భాష ఉన్నాయి. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’గా శ్రీనాథుడు శ్రీ కృష్ణదేవరాయల వంటి మహాకవులు కీర్తించారు.

‘ఆంధ్రత్వమ్‌ ఆం‌ధ్ర భాషాంచనాల్పస్యంతపః ఫలమ్‌’ (ఆం‌ధ్రుడిగా జన్మించడం, ఆంధ్రభాష మాతృభాష కావడం గొప్ప తపఃఫలం) అని సంస్కృత పండితుడు అప్పయ్య దీక్షితులు ప్రశంసించారు.

‘శబ్ద సంపదలోనూ, శబ్ద సౌష్టవంలోనూ, భావ వ్యక్తీకరణలోనూ, శ్రావ్యత •లోనూ తెలుగుకు తక్కిన భాషలు సాటిరావు’ అని ఎ.డి.క్యాంప్‌బెల్‌ అనే పాశ్చాత్యుడు 1816లో తెలుగు వ్యాకరణ గ్రంథం పీఠికలో ప్రశంసించాడు. మరో పాశ్చాత్య పండితుడు హెన్రీ మోరీస్‌ (1890) ‘‌నిరక్షర కుక్షి మాట్లాడినా తెలుగు శ్రవణానందకరంగా ఉంటుంది. తెలుగు ద్రావిడ భాషలన్నింటిలో మధురాతి మధురమైంది. ఒకనాటికి జాతీయ భాష కాగల్గిన అర్హత తెలుగు భాషకు ఉందని’ మరో తెలుగు వ్యాకరణ గ్రంథ పీఠికలో వ్యాఖ్యానించాడు. ప్రసిద్ధ తమిళకవి సుబ్రహ్మణ్యభారతి ‘వెన్నెల్లో పడవ ప్రయాణం చేస్తూ అపుడే వికసించిన మల్లెపూలను ఆఘ్రాణిస్తే కలిగే అనుభూతి తెలుగుభాష వింటున్నప్పుడు కలుగు తుందని’, ‘సుందర్‌ ‌తెలుగుంగు’ అని అభివర్ణించాడు. దేశ, విదేశీ ప్రముఖుల మన్ననలందుకున్న మధురమైన మన మాతృభాష నిరాదరణకు గురికావడం శోచనీయం.

మృతభాషల అంచన మాతృభాష

యునెస్కో గణాంకాల ప్రకారం ఏ భాషా వ్యవహర్తలు వారి జనాభాలో 30 శాతానికి తక్కువగా ఉంటే ఆ భాషను మృతభాషగా పరిగణిస్తారు. యునెస్కో గణాంకాల మేరకు ఇప్పటికే ప్రపంచంలో ఉన్న ఆరువేల భాషల్లో మూడువేల భాషలు మృతభాషలైనట్లు నిర్ధారించారు. తెలుగుభాష మృతభాషల అంచున ఉందని యునెస్కో (2002) హెచ్చరించింది. మన మాతృభాషకు ఆ ముప్పు ఎదురైతే ఆ పాపం ఎవరిది? భాష మనుగడ దెబ్బతీసే అనాలోచిత నిర్ణయాలు చేసే ప్రభుత్వాలదా? తల్లి భాష ఉనికి దెబ్బ తింటున్నా ఉపేక్షాభావంతో ఉన్న మనందరిదీనా? భాషా దినోత్సవాలు, ప్రపంచ తెలుగు మహాసభలు జరిపినంత మాత్రాన మాతృభాషా పరిరక్షణ జరుగదు. ప్రభుత్వాలు భాషాభిమానుల భాగస్వాములను చేసి చిత్తశుద్ధితో కృషి చేయాలి.

మాతృభాషకు ప్రధాన అవరోధాలుగా గాంధీజీ రెండు కారణాలను పేర్కొన్నారు. పుడుతూనే పిల్లలు ఇంగ్లీషులో ఏడవాలని కోరుకొనే మమ్మీడాడి సంస్కృతిలో తల్లిదండ్రుల అత్యాశ మొదటి కారణం. తెలుగులో బలమైన భావ వ్యక్తీకరణ (జు••వమీ•ఱఙవ శీఎఎబఅఱమీ••ఱశీఅ) సాధ్యం కాదనే అపోహ. ఆంగ్ల మాధ్యమంలో చదవకుంటే తప్ప ఉద్యోగాలు రావనే కార్పోరేట్‌ ‌విద్యాసంస్థల ప్రచారాన్ని నమ్మి అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్న స్థితి రెండో కారణం.

మాతృభాషలో కాకుండా పరభాషలో చదివే విద్యార్థులు ఎక్కువమంది ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని నమ్ముతున్నానన్న మహాత్ముడి అభిప్రాయం అక్షర సత్యం. నేటి సమాజంలో తల్లిదండ్రుల బలవంతంమీద అయిష్టంగా ఆంగ్లమాధ్యమంలో ఉన్నత విద్యను అభ్యసించే కొందరు ఆత్మహత్యలు చేసుకోవటం బాధాకరమైన విషయం. ‘పరాయి చదువు పిల్లల జన్మహక్కును హరిస్తుంది. విదేశీ బోధనాభాష అంటే పసికందుల నెత్తిన వారి మేధా శక్తిని చంపే బండ నెత్తడమే. అది వారి పురోభివృద్ధిని నిరోధించి స్వగృహం నుండి వేరు పరుస్తుంది. ఇలాంటి విషయాలను ప్రథమ శ్రేణికి చెందిన జాతీయ వినాశకాలుగా నేను పరిగణిస్తాను’ అని విదేశీ ఆంగ్లమాధ్యమాన్ని గాంధీజీ తీవ్రంగా నిరసించాడు. విద్యావిధానం ఇలా కొనసాగితే జాతీయశక్తి సంపదలు నీరసించి జాతి నశించిపోతుందన్నారు. దేశీయుల్ని దేశానికి పనికిరాకుండా చేసే విద్య దేనికి? అని గాంధీజీ ఆవేదనతో ప్రశ్నించాడు (యంగ్‌ ఇం‌డియా 05-07-1928). మాతృభాష జీవశక్తిని అందిస్తుందనీ, ఆత్మికశక్తి, మనో వికాసాలను విద్యార్థులకు కలిగించి తమంతట తాము ఉన్నత పౌరులుగా ఎదిగేలా చేసే విద్య మాతృభాషలోనే సాధ్యమని మహాత్ముడు స్పష్టంగా చెప్పారు. సామాజిక, సాంస్కృతిక సమాచార మార్పిడి, సామాజిక బంధాలు ఏర్పడటం, సామాజిక అభివృద్ధి వంటి అంశాలు అమ్మ భాషతో ముడివడి ఉంటాయని అమ్మ భాష ఆవశ్యకతను గాంధీజీ వివరించారు. విశ్వకవి రవీంద్రనాథ్‌ ‌టాగూర్‌ ‌మాతృభాషలో విద్యాబోధన ప్రాధాన్యాన్ని మహాత్ముడి అభిప్రాయాన్ని సమర్థిస్తూ పరభాష ద్వారా బోధన అంటే ‘సోపానాలు లేని సౌధం వంటి’దన్నారు. కొమర్రాజు లక్ష్మణరావు ‘మాతృభాష తల్లి పాల వంటిది. పరభాష దాది పాలువంటిది’ అని మహాత్ముడి మార్గాన్ని సమర్థించారు.

రాష్ట్ర ప్రభుత్వాలు మాతృభాషను పరిరక్షించేం దుకు కొన్ని సూచనలు పాటించాలి.

తమిళ, కన్నడ రాష్ట్రాలవారు మాతృభాషా మాధ్యమాల్లో చదువుకున్న పట్టభద్రులకు 5 నుంచి 20 శాతంవరకు ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ‌కల్పించి ఉపాధి కల్పిస్తున్నారు. పరిపాలన తెలుగులో సాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు తెలుగు మాధ్యమంలో పట్టభద్రులైనవారికి ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ ‌కొంత శాతం కల్పించి ప్రాధాన్యం ఇవ్వడం మాతృభాష ప్రోత్సాహానికి దోహదం చేస్తుంది. 1970 ప్రాంతాల్లో తెలుగు మాధ్యమంలో ఇంటర్మీడియట్‌, ‌డిగ్రీ ప్రవేశ పెట్టినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి పి.వి.నరసింహా రావు అవిభక్త ఆంధప్రదేశ్‌లో తెలుగు మాధ్యమంలో డిగ్రీ చదివినవారికి ఉద్యోగాల్లో 5శాతం ప్రాధాన్యాన్ని ఇవ్వాలని తీర్మానించి కొన్నాళ్లు అమలు జరిగిన తర్వాత న్యాయస్థానాలు అడ్డుకోవటంతో ఆగిపోయింది. మన రాష్ట్ర ప్రభుత్వాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాల విధానాన్ని అనుసరించి ఉద్యోగాల్లో ప్రాధాన్యాన్ని కల్పించాలి. ప్రాథమిక విద్యను విధిగా మాతృభాషలో కొనసాగించాలి.

తెలుగులో మాట్లాడిన విద్యార్థులను శిక్షించే ఆంగ్ల మాధ్యమ పాఠశాలల యాజమన్యాల గుర్తింపును రద్దు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ఐచ్ఛికంగా ప్రవేశపెట్టాలి. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సర్వీస్‌ ‌కమీషన్‌ ‌గ్రూపు ×, ×× పరీక్షల్లో ఐచ్చిక పాఠ్యాంశంగా తెలుగుభాషా సాహిత్యాల పేపరును గతంలో మాదిరి ఏర్పాటు చేయాలి. గతంలో ఎందరో తెలుగు పేపరును ఎన్నిక చేసుకున్నవారు ఉన్నత ఉద్యోగాల్లో రాణించి గొప్పగా సేవ చేయగలిగారు. ఐచ్ఛిక పాఠ్యాంశాన్ని రద్దు చేయడం తెలుగు భాషకు అశనిపాతం. కనీసం సర్వీస్‌ ‌కమిషన్‌లో తెలుగుభాషా సాహిత్యాల సామర్థ్యాన్ని పరీక్షించే పేపరును కనీస అర్హత మార్కులు పొందే విధంగా నియంత్రించాలి.

ప్రస్తుతం ఆంధప్రదేశ్‌ ‌గ్రామ సచివాలయాల ఉద్యోగాల్లో తెలుగుభాషాంశాలను కనీసం 20 మార్కులకు పెంచాలి.

కార్పొరేట్‌ ‌కళాశాలల్లో నిర్బంధ సంస్కృత పాఠ్యాంశ బోధన తెలుగు భాష ఉనికిని దెబ్బతీస్తున్న ప్రధాన కారణం. దేవనాగర లిపిలో వ్రాయగలిగిన విద్యార్థులకే సంస్కృతాన్ని పాఠ్యాంశంగా ఇవ్వాలి. ఇతర విద్యార్థులు విధిగా తెలుగు పాఠ్యాంశాన్ని చదివే ఏర్పాటు చేయాలి.

ప్రాచీన హోదా కేంద్రం ద్వారా తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయాలి.

పాలనాభాషగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగుభాష అమలును రాష్ట్ర అధికార భాషా సంఘంవారు ప్రత్యేక శ్రద్ధతో జిల్లా సంఘాలను నియమించి పాలనా భాష విధిగా అమలు జరిగేటట్లు పర్యవేక్షించాలి.

బోధనా భాషగా, పాలనా భాషగా తెలుగు అమలు జరిగితే మాతృభాష మృతభాష కాకుండా అమృత భాషగా విలసిల్లుతుంది. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాల ఆశయం నెరవేరుతుంది.

– డా।। పి.వి.సుబ్బారావు 9849177594,

 రిటైర్డ్ ‌ప్రొఫెసర్‌ & ‌తెలుగు శాఖాధిపతి, సి.ఆర్‌. ‌కళాశాల, గుంటూరు.

About Author

By editor

Twitter
YOUTUBE