దేశమంతటా ‘జైశ్రీరామ్‌’ ‌నినాదం మారుమోగిపోతూ ఉంటే, ‘ఉత్తరాంధ్ర అయోధ్య’ రామతీర్థంలో వెలసిన రాముడికి ఇదేమి దుస్థితి అంటూ ఆంధప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వంటి పదవిలో ఉండి మతమార్పిడులకు పాల్పడతారా? అని కూడా తీవ్రమైన ఆరోపణను చేశారు. మీరు (వైఎస్‌ఆర్‌సీపీ పాలకులు) హిందూ ద్రోహులుగా తయారవుతున్నారని అంతకంటే తీవ్రమైన ఆరోపణ చేశారు.

జనవరి రెండో తేదీన ఆయన విజయనగరం జిల్లా రామతీర్థం వెళ్లారు. కొండమీద ఆలయానికి తాళం (ఘటన జరిగిన ఆలయం) వేసి ఉంది. కింద జరిగిన బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి ఆవేశపూరితంగానే ప్రసంగించారు. హిందూత్వం గురించి ఆయన నోటి నుంచి ఊహించని చాలా వాస్తవాలు ఉరికిపడ్డాయి. పై ప్రశ్న చంద్రబాబు ఆంధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికే నేరుగా సంధించారు. అలిపిరిలో జరిగిన బాంబులదాడి నుంచి నేను బతికి బయటపడ్డానంటే అందుకు తిరుమల వేంక టేశ్వరుడే కారణమని, ఆయననే తనను రక్షించాడనీ ఇన్నాళ్లకైనా చెప్పుకున్నారు కాబట్టి ఒక హిందువుగా ఆయనకు ఆ ప్రశ్న వేసే హక్కు ఉంది. కానీ ఆయన ఆ ప్రశ్న వేసిన మరుక్షణమే దశాబ్దాలుగా హిందువుల ఆరాధనా స్థలాల మీద దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నవారికి కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తడం సహజం.

వాటిని అలా ఉంచితే, కొన్ని చక్కని వాస్తవాలు నేరుగా విపక్ష నేత నోటి నుంచి రావడం వల్ల వాటికి జాతీయ ప్రాముఖ్యం రావడం సంతోష దాయకం. 19 మాసాల వైఎస్‌ఆర్‌సీపీ పాలనలో 127 హిందువుల దేవాలయాలు (ఆంధప్రదేశ్‌లో) అపవిత్రం కావడం, ధ్వంసం కావడం జరిగిందని చంద్రబాబు బయటపెట్టారు. గడచిన డిసెంబర్‌ 29‌వ తేదీ వేకువన విజయనగరం జిల్లాలోని పురాతన పుణ్యక్షేత్రం రామతీర్థంలోని ఆలయంలో శ్రీరాముడి శిరస్సు నరికి అక్కడి కోనేరులో పడేసిన అత్యంత దురదృష్టకర దుర్ఘటన జరిగింది. అది జరిగిన మూడో రోజున రాజమహేంద్రవరంలోని శ్రీరామనగర్‌లోని వినాయక ఆలయంలో ప్రతిష్టించిన సుబ్రహ్మణేశ్వరుని చేతులు నరికిన ఘటన చోటు చేసుకుంది. తరువాత పాడేరులోని గిరిజనుల అమ్మవారి పాదాలు నరికేశారు. వీటిని చంద్రబాబు గుర్తు చేయడం హర్షించదగినదే. తరువాత వరసగా శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల, కాణిపాకం (క్వారంటైన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేయడం), కర్నూలు జిల్లాలో పూజారులను పట్టుకు కొట్టడం వంటి విషయాలను మాజీ ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఒకచోట వినాయకుని ప్రతిమను మరీ ఘోరంగా మలమూత్రాలతో అవమానపరచడం గురించి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలకు వెళ్లే దేవస్థానం బస్సు టిక్కెట్ల వెనుక జెరూసలెం యాత్ర చేయమంటూ ప్రచారం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. ఒక పవిత్ర నది దగ్గర అన్యమత ప్రార్ధనలు జరుగుతున్నాయని ఆరోపించారు. అంతర్వేది నరసన్న, సింహాద్రి అప్పన్న ఆలయాలకు జరిగిన అన్యాయాల గురించి కూడా గుర్తు చేశారు.

ఈ సందర్భంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డికి తిరుమల ఏడుకొండల గురించి చేసిన హెచ్చరికను కూడా బయటపెట్టారాయన. తిరుమల స్వామివారి జోలికి పోవద్దు, అది ప్రమాదమని మా పెద్దలు చెబుతారు. తిరుమల శ్రీవారికి అపచారం చేస్తే ఈ జన్మలోనే ఫలితం అనుభవిస్తారని ప్రతీతి. కాబట్టి ఏడు కొండలను ఐదు కొండలు చేయాలని అనుకోవద్దని తాను వైఎస్‌కు హితువు చెప్పానని ఆయన గుర్తు చేశారు. తరువాత ఏం జరిగిందో ఊహించుకునే అవకాశం శ్రోతలకు వదిలిపెట్టారు. అలాగే జగన్మోహన్‌రెడ్డి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ డిక్లరేషన్‌ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వరు అని అడిగితే ముఖ్యమంత్రి కాబట్టి అని ఆయన ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే ముఖ్యమంత్రి అయి ఉండి రావణుడి తలను నరికిన రామచంద్రుడి తలను నరికితే నువ్వేం చేస్తున్నావని ఆయన నిలదీశారు. నీవొక నరరూప రాక్షసుడవని కూడా అన్నారు. నిజానికి ఇలాంటి తీవ్ర పదజాలంతోనే చంద్రబాబు ఉపన్యాసం సాగింది.

జగన్మోహన్‌రెడ్డి తాను బైబిల్‌ ‌నిత్యం చదువుతానని చెబుతారనీ, రాత్రి ఆ గ్రంథం కొద్దిగా అయినా చదవకుండా పడుకోనని కూడా చెప్పుకున్నారనీ, మరి అలాంటి నమ్మకం మాకు ఉండదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఆయన సిలువ వేసుకుంటారు. అది ఆయన విశ్వాసం. కానీ అలాంటి విశ్వాసాలు ఇతర మతస్తులకు కూడా ఉంటాయన్న కనీస అవగాహన ఆయనకు ఉండాలని చంద్రబాబు హితవు చెప్పారు.

తన పార్టీ శ్రేణులకే అయినా, ఆయన ఆ సభ నుంచి ఇచ్చిన పిలుపు గురించి కూడా చెప్పుకోవాలి. 19 మాసాలలో హిందూ ప్రార్ధనామందిరాల మీద జరిగిన 127 దాడుల ఘటనల మీద సీబీఐ దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. మిమ్మల్ని కాపాడే దేవుడిని మీరు కాపాడుకోవలసిందేనని చెప్పారాయన. ఇంకొక దుర్ఘటన ఇలాంటిది జరిగితే ఖబడ్దార్‌ అని చెప్పండి అని కూడా అన్నారు. మనని కాపాడే మన దైవాన్ని మనమే కాపాడుకుందాం అన్నారాయన. ఆయన సరికొత్తగా తన ఉపన్యాసం ముగించారు. జైహింద్‌, ‌జైశ్రీరామ్‌ అం‌టూ ఉపన్యాసం ముగిసింది.

చంద్రబాబు ఉపన్యాసం విన్న రామభక్తులకు వచ్చే ప్రశ్నల గురించి… బీజేపీని వదులుకుని తాను తప్పు చేసిన సంగతిని వెల్లడించడానికి చంద్రబాబు ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారా? ఆయన హయాంలో కూల్చివేసిన ఆలయాల సంగతేమిటి? పాపం చేసినవారే ఆలయాలకు వెళతారంటూ చంద్రబాబు అనలేదా అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు గుర్తుచేసిన ప్రశ్న సంగతేమిటి? మోదీకి దగ్గర కావడానికే అయోధ్య రాముడి గురించీ, హిందూత్వం గురించి ఆయన అంత గట్టిగా మాట్లాడి ఉంటారా? వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా మూటకట్టుకున్న హిందుత్వ వ్యతిరేకతతో ఏర్పడుతున్న వాతావరణం బీజేపీకి అనుకూలించకుండా జాగ్రత్త పడుతున్నారా?

ఏమైనా ఆంధప్రదేశ్‌ ‌రాజకీయాలలో ఆరితేరిన వారు కాబట్టి, జగన్‌ ‌వంటి నాయకుడి అంతరంగాన్ని బాగానే గ్రహించారు చంద్రబాబు. హిందువుల మనసులు 127వ పర్యాయం గాయపడేదాకా ఆయన ఎందుకు వేచి ఉన్నారు? ఒకవేళ నోరు విప్పినా లాంఛనంగానే ఎందుకు ఖండించారు? మీరు హిందూద్రోహులు అని చంద్రబాబు మెజారిటీ ప్రజల తరఫున మాట్లాడడాన్ని స్వాగతించవలసిందే. ప్రధానంగా హిందువుల ఓట్లతోనే ఈ దేశంలో 90 శాతం నాయకులు చట్టసభలకు వెళ్లగలరు. హిందువుల ఓట్లు మాత్రమే వారిని అధికారంలో నిలబెట్టగలవు. అలాంటిది హిందువుల గురించి కనీసం సమయం వచ్చినప్పుడైనా, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్న సమయంలో అయినా నోరు విప్పాలన్న ధోరణి ఆరంభమైతే దేశానికి అదింకా మేలు.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE