మొండెం నుంచి వేరు చేసిన శిరస్సు భాగాన్ని రెండు చేతులతో పట్టుకుని విషణ్ణ వదనంతో వస్తున్న ఆలయ పూజారినీ, ఆ వెనకే ఆవేదనతో, ఆగ్రహావేశాలతో ఊగిపోతూ అనుసరించిన రామభక్తులనీ ఆరోజు చూస్తే తెలుగువారందరికీ దుఃఖం పెల్లుబికింది. ఆ శిరస్సు శ్రీరామచంద్రుని విగ్రహం నుంచి వేరుచేసినది. మరి బాధ కాదా! ఆవేదన వెల్లువెత్తదా? ఆవేశం రాదా? ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే కలకలం సృష్టిస్తున్న శ్రీరామతీర్థం దుర్ఘటనలోని ఒక ఘట్టం అది. ఆంధప్రదేశ్‌లో హిందూ దేవాలయాల మీద యథేచ్ఛగా సాగిన 128 దాడులలో 125వ దుర్ఘటన అది.

ఎంత తెంపరితనం కాకపోతే, ఎంత అధికార పార్టీ అండలేకపోతే..ఎంతటి పరమత ద్వేషం, కుట్రకోణం లేకుంటే- ఒక పక్క రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సు నరికిన దుర్ఘటనకు రాష్ట్రం భగ్గుమంటోంది. అదే సమయంలో విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఎలుకలు తోసేసి ఉంటాయని ఒక పోలీసు అధికారి చెప్పడం ఎంత సిగ్గుచేటు! అది 128వ ఘటన.

ఏం? బానిస వంశస్థులూ, మొగలులూ, ఆంగ్లేయుల మనస్తత్త్వాలు ఆంధప్రదేశ్‌ ‌పాలకులను ఆవహించాయా?

పందొమ్మిది మాసాలలో 128 హిందూ దేవాలయాల మీద దాడేమిటి? పాలకులు మధ్యయుగంలోకి వెళ్లారా? అక్కడ నుంచి వచ్చారా? ఇలా పాకిస్తాన్‌లో జరుగుతోంది. మళ్లీ ఆంధప్రదేశ్‌లో జరుగుతోంది.

 భగవద్గీత, ఖురాన్‌, ‌బైబిల్‌ ఎదురుగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినవారు హిందువుల పవిత్రస్థలాలను మాత్రం ధ్వంసం చేయాలని దీక్ష పూనారా? దీనిని మత అసహనమని చెప్పడానికి ఇంకా సందేహించాలా?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డిలో దాగిన క్రైస్తవ మతోద్ధారకుడు నెమ్మదినెమ్మదిగా బయటపడుతున్నాడా? ఆయనలోని క్రైస్తవ పక్షపాతి పట్ల అప్రమత్తంగా ఉండవలసిన సమయం వచ్చిందా?

అసలు హిందూ ఆలయాలలోకి ప్రవేశించడానికి జగన్‌కు అర్హత ఉందని ఇంకా అనుకోగలమా?

జగన్మోహన్‌రెడ్డి పాలనలో హిందువులకు ఒక న్యాయం, క్రైస్తవులకు ఒక న్యాయమా?

 హిందువులు తమ దేవుళ్లను తాము రక్షించుకోలేరా? అంత చేవ చచ్చి ఉన్నారా అన్న ప్రతిఘటనా ధోరణిని వ్యక్తం చేసే పిలుపులు ఒక్కసారిగా ఎందుకు పదునెక్కుతున్నాయి?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాల తరువాత కూడా హిందువుల మనోభావాలకు విలువ లేదా? వారి ఆవేదనకు సాంత్వన దొరకదా?

హిందూ దేవతామూర్తులకు మలమూత్రాలు రాయడం, కాళ్లు చేతులు విరగ్గొట్టడం, రథాలు దగ్ధం చేయడం.. అలాంటి పనులు, అవి చేస్తున్నవారి లేదా చేయిస్తున్నవారి, వీటిని సమర్ధిస్తున్నట్టు మాట్లాడేవారి నీచత్వాన్ని నిరూపించేవే తప్ప, కుసంస్కారాన్ని బయటపెట్టేవే తప్ప మరొకటి కాదని వాళ్లకి అర్థం కావడం లేదా?


రామతీర్థం దుర్ఘటనతో మొన్న డిసెంబర్‌ ఆఖరులో ఆంధప్రదేశ్‌ ఒక్కసారిగా వేడెక్కింది. అప్పుడు వినిపించిన ప్రశ్నలే ఇవన్నీ. చర్చలలో బాహాటంగా వినపడినవే.

ఆంధప్రదేశ్‌లో హిందూ దేవతామూర్తులకు రక్షణ లేదు. అంతేకాదు, అందరికీ ఆరాధ్యమైన న్యాయదేవతకూ స్థానం లేదు. ఒక్కసారిగా హిందువు లందరినీ ఉలిక్కిపడేటట్టు చేసిన ఘటన రామతీర్థంలో డిసెంబర్‌ 29‌న జరిగింది. ఆ మరునాడే జగన్‌ ‌ప్రభుత్వం కుదేలైపోయేటట్టు చేసిన తీర్పు హైకోర్టు నుంచి వచ్చింది. హిందువుల ఆరాధ్యదైవం రాముడి విగ్రహం తలను ‘దుండగులు’ నరికి తీసుకువెళ్లి సమీపంలోని కోనేరులో పడేశారు. ఒక్కొక్కటిగా హిందూ మందిరాల మీద, విగ్రహాల మీద అడ్డూ అదుపూ లేకుండా సాగిన దాడులకు రామతీర్థం ఘటన పరాకాష్ట. దీని మీద హిందూ సమాజం భగ్గుమంది. ముఖ్యమంత్రిలో అందరూ క్రైస్తవ పక్షపాతిని చూడవలసి వచ్చింది. నెల్లూరు, అంతర్వేది, శ్రీశైలం, తిరుపతి, విజయవాడ, తాజాగా రామతీర్థం, రాజమండ్రి, పాడేరు, తాజాగా మళ్లీ విజయవాడలోని హిందూ దేవస్థానాలలో అవాంఛనీయ ఘటనలు జరిగిపోతున్నా, జగన్‌ ‌మీద ముద్దుల వర్షం కురిపించే పీఠాధిపతి ఏ చీకటి సమాధిలో తపస్సు వెలగ బెడుతున్నారని హిందువులు ఆగ్రహావేశాలు ప్రదర్శించడం కూడా ఇందుకే. రామతీర్థం దుర్ఘటనకు విరుగుడుగా తన ఆశ్రమంలో శాంతిహోమం చేస్తానని ఆయన సెలవివ్వడం పుండు మీద కారం రాసినట్టయింది. రామతీర్థానికి సమీపం లోనే ఉన్న ఆ స్వామి కనీసం చూడడానికి వెళ్లక పోవడం మీద అంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. హిందూ ఆలయాల మీద దాడులు ‘మతిస్థిమితం’ లేనివారే చేశారని చెప్పడం మరింత వివాదాస్పద మవుతోంది. మొన్న మతిస్థిమితం లేనివాళ్లు, ఇప్పుడు మూషికాలు రంగంలోకి వచ్చాయి. తాజాగా, విపక్షం తెలుగుదేశం విగ్రహాలను ధ్వంసం చేయిస్తోందని వైఎస్‌ఆర్‌సీపీ మంత్రులు చెప్పడం కొత్త మలుపు.

న్యాయస్థానం మండిపాటు

రామతీర్థం దుర్ఘటన మరునాడే (డిసెంబర్‌ 30) ఆం‌ధప్రదేశ్‌ ‌హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌రాకేశ్‌ ‌కుమార్‌ ఇచ్చిన తీర్పు జగన్మోహన్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ తీర్పులో సాంకేతిక కారణాలతో కొన్ని అంశాలు పరిధులు దాటాయని అనిపించవచ్చునని చెబుతూనే న్యాయమూర్తి ఆ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి మూలం మిషన్‌ ‌బిల్డ్ ఏపీ కార్పొరేషన్‌. ‘‌రాజ్యాంగ వ్యవస్థలను లొంగదీసుకోవాలని అనుకుంటున్నారు. న్యాయవ్యవస్థలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ జస్టిస్‌ ‌రాకేశ్‌కుమార్‌ ‌తన తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు పాలకుల చేతిలో పావులుగా మారిపోతున్నారని కూడా వ్యాఖ్యానించారు. మిషన్‌ ‌బిల్డ్ ఏపీ ఎందుకు? వైఎస్‌ఆర్‌సీపీ ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కావలసిన నిధులు సమకూర్చే పనిలో ఉన్న కార్పొరేషన్‌ ఇది. ప్రభుత్వ ఆస్తులను వేలం ద్వారా అమ్మి నిధులు పోగేస్తారట. ప్రజా ధనంతో తమ పార్టీని మళ్లీ మళ్లీ నెగ్గించే విన్యాసాలకు ఇలాంటి జనాకర్షక పథకాలు పనికి వస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తుల వేలం దీనికే. ఈ చర్యనే పలువురు సవాలు చేశారు. ఐదేళ్లు ఉండి వెళ్లిపోయే ప్రభుత్వం తన ఆధీనంలో ఉండే ఆస్తులను వేలం వేయవచ్చా? ఇది రాజరికమా? తేల్చాలంటూ పిటిషన్లు, పిల్స్ ‌వచ్చాయి. ఈ వివాద పరిష్కారం కోసం నియమించిన ఇద్దరు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్‌ ‌రాకేశ్‌కుమార్‌ ఒకరు. దీని మీద ప్రభుత్వ వాదనను అఫిడవిట్‌ ‌ద్వారా ఆ కార్పొరేషన్‌ అధిపతి, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ‌ప్రకాశ్‌ ‌తెలియచేశారు. జస్టిస్‌ ‌రాకేశ్‌కుమార్‌కు ఏ మాత్రం సంబంధం లేని కొన్ని వ్యాఖ్యలు తెచ్చి, అవి ఆయన చేసినవే కాబట్టి, ఈ ధర్మాసనం నుంచి ‘మర్యాదగా తప్పుకోవా’లని కోరడం విశేషం. దరిమిలా ఇచ్చిన 55 పేజీల తీర్పులో న్యాయమూర్తి పై వ్యాఖ్యలు చేశారు.

అయినా, కులాల గొడవలు ఉన్నాయని తెలిసిన తరువాత కూడా కోర్టులు ఎందుకు స్టేలు ఇస్తాయో అంతుబట్టదు అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే బహిరంగంగా వ్యాఖ్యానించడం ఏమిటి? కోర్టు తీర్పులను బాహాటంగా విమర్శించే ఈ సంస్కృతిని ఎందుకు ప్రవేశపెడుతున్నారు?

ఐదేళ్లకు ఎన్నికైన వారు ప్రభుత్వ ఆస్తులు అమ్మవచ్చుననుకునేవారూ, డబ్బుంటే ఏదైనా చేయవచ్చుననుకునేవారూ ఎక్కువయ్యారు. న్యాయ మూర్తులు తీర్పు ఎలా చెప్పాలో కూడా వారే చెబుతారా అంటూ గతంలో సుప్రీంకోర్టు ఏపీ పాలకుల మీద చేసిన వ్యాఖ్యను కూడా జస్టిస్‌ ‌రాకేశ్‌కుమార్‌ ‌గుర్తు చేశారు. ఈ తీర్పును రాజ్యాంగ విలువల రక్షకునిగా పేర్గాంచిన ఒక న్యాయమూర్తి ఇచ్చినదిగా కొందరు భావించారు. తీర్పు పరిధిని దాటిందని కొందరు వాదించారు. కానీ ప్రతిపక్షాల మీద అధికార పార్టీ అనుసరిస్తున్న తీరు, శాంతి భద్రతలు, హిందువుల పట్ల కనపరుస్తున్న వివక్ష, ఇతర పరిస్థితులను బట్టి చూస్తే న్యాయమూర్తి తీర్పు ప్రస్తుత ఆంధప్రదేశ్‌కు అద్దం పట్టేదే.

ఒక రాజకీయ పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత అందరి ప్రభుత్వంగా ఉండాలి. కానీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పంచాయతీ కార్యాలయ భవనాలకు పార్టీ రంగులు వేయించింది. దీని మీద న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బోనులో నిలబడవలసి వచ్చింది. ఇంగ్లిష్‌ ‌మీడియం కోసం మంకుపట్టు పట్టిన ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన ప్రతిసారి కులాన్ని రంగం మీదకు తేవడం, కొన్ని సమయాలలో సామాజిక మాధ్యమాల ద్వారా న్యాయమూర్తులను, వారి కుటుంబ సభ్యులను కూడా దూషించడం వరకు వ్యవహారం వెళ్లిపోయింది. అసలు లాక్‌డౌన్‌ అమలవు తున్న కాలంలో మిషన్‌ ‌బిల్డ్ ఏపీ కార్యకలాపాలు ఆరంభించడాన్ని కూడా జస్టిస్‌ ‌రాకేశ్‌ ‌తప్పుపట్టారు. తనకు ఇష్టం లేదు కాబట్టి కాలపరిమితి మేరకు ఎన్నికలు పెట్టదలచిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ఇబ్బంది పెట్టడాన్ని కూడా తీర్పు పేర్కొన్నది. పోలీసులు వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలా అని కూడా ప్రశ్నించవలసి వచ్చింది. ఎన్నికల కమిషన్‌ను పని పట్టారు. ఇక మిగిలి ఉన్నది న్యాయవ్యవస్థ కాబట్టి ఇప్పుడు దీని మీద పడ్డారని కూడా వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల మీద ఏపీ ప్రభుత్వం దాడికి దిగుతున్నదనే న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. చట్టసభలలో నేరగాళ్ల గురించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించగానే జగన్‌ ‌మీద ఉన్న ఏడు కేసులను మూసివేశారని న్యాయమూర్తి ప్రస్తావించారు. అందుకే అక్కడ న్యాయదేవతకు స్థానం లేదని చెప్పడం.

కొద్దికాలంగా అణగారి ఉన్న రాయలసీమ ఫ్యాక్షనిజం మళ్లీ ఇప్పుడు ఎందుకు తలెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గొడ్డళ్లతో ప్రత్యర్థి ఇంటి మీదకు వెళ్లడం ఏమిటి?

సర్వత్రా ‘ప్రభు’ భక్తి

అంతర్వేది రథం తగులబెట్టిన వారినీ, పిఠాపురంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని, నెల్లూరు దగ్గర వెంకటేశ్వరస్వామి రథాన్ని కాల్చేసిన వారిని ప్రభుత్వం ఇప్పటిదాకా పట్టుకోలేదు. కానీ అంతర్వేది రథం దగ్ధంతో ఆవేదన చెందినవారు దారిలో ఒక చర్చిమీద రాళ్లు వేస్తే నలభయ్‌ ‌మంది వరకు వెనువెంటనే అరెస్టు చేసింది. వారిని ఆలస్యం లేకుండా రిమాండ్‌కు పంపించారు. కానీ 128 హిందూ ఆలయాల మీద దాడులు జరిగితే ఎంత మందిని అరెస్టు చేశారు? ఇంతకీ అంత అలజడి కలిగించిన అంతర్వేది రథం దుర్ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వం జనాన్ని మోసం చేసిందా? నిజానికి సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని చెప్పడమే తప్ప, అందుకు సంబంధించిన అడుగులు వేయలేదని కొందరు చెబుతున్నారు. ఇదెంత మోసం? అలాగే తిరుమలలో ముక్కోటి ఏకాదశికి చేసిన విద్యుద్దీపాల అలకరణలో సిలువ ఆకృతి కనిపిస్తున్నదంటూ పోస్టు పెట్టిన గద్వాలకు చెందిన రాజశేఖరశర్మను కూడా వెనువెంటనే ఏపీ పోలీసులు వచ్చి అరెస్టు చేసి, దౌర్జన్యం చేసి మరీ తీసుకుపోయారు. ఈ సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియచేయలేదు. ఇక హిందువులమని చెప్పుకుంటూనే వైసీపీ ప్రభువు ఎడల, వైసీపీ నేత పూజించే ప్రభువు ఎడల ఆ పార్టీ ఎమ్మెల్యేలూ, నేతలూ చూపిస్తున్న భక్తి వేలంవెర్రిగా ఉంది. బెజవాడ దుర్గమ్మగుడి రథం వెండిసింహాలు పోతే వాటితో ఏమైనా మేడలు (దొంగలు) కట్టుకుంటారా? రథం తగలబడితే ఏమైంది! మళ్లీ చేయించుకుంటాం! దాని గురించి ఇంత రచ్చ ఏమిటి అంటూ జగన్‌ ‌మంత్రిమండలి సభ్యుడొకరు చేసిన ప్రేలాపన కూడా హిందువులను బాధించేది కాదని ఎవరైనా అనగలరా? అందులోని దిగజారుడు ఆ మంత్రికి ఇప్పటికీ అర్ధం కాలేదు. ఆంజనేయస్వామి చేతులు విరిస్తే రక్తం కారిందా అంటూ ఆ మంత్రే మాట్లాడడం మరింత జుగుప్సా కరంగా, నీచంగా లేదా? మళ్లీ రామతీర్థంలో కూడా అదే వెగటు వాచాలత.

డిసెంబర్‌ 30‌న చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ (వైఎస్‌ఆర్‌సీపీ) సోదరుడు జయదేవ్‌ ఒక ఘనకార్యం చేశాడు. క్రిస్మస్‌ ‌రోజున నియోజకవర్గంలోని ద్వారకానగర్‌లో ఆ మతం వారి వేడుకలు జరిగితే అన్నగారితో కలసి పాల్గొన్నాడు. వేదిక ఎక్కి క్రీస్తుగానం చేశారు. ఇంతవరకు అభ్యంతరం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ‘ప్రభు’ భక్తితో తన్మయులై ఉన్న వాస్తవం తెలిసినవారు ఏమాత్రం ఆశ్చర్యపోరు. అయితే జయదేవ్‌ ‌వెంకటేశ్వర మాల వేసుకుని, పసుపు దుస్తులతో ఉండడమే వివాదాస్పదమైంది. పదవుల మీద, అధినేత మీద పిచ్చి వ్యామోహంతో సాగిపోతున్న ఈ హిందూ వ్యతిరేక ధోరణిలో వైసీపీ సర్కారు ఉన్మాదం పతాక స్థాయికి చేరిందన్నది నిజం. కొందరు ఇక్కడితో ఆగకుండా హిందూ ఆచారం మేరకు వైసీపీ ప్రభువు బొమ్మను పల్లకీలలో ఊరేగించి తరిస్తున్నారు. అసలు దైవం ఆయనేనని నోరారా భజన చేస్తున్నారు.

మీరంటే మీరు అంటూ..

చంద్రబాబు రామతీర్థం పర్యటన రోజునే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా వచ్చారు. కావాలనే విజయసాయిరెడ్డి అదేరోజు పర్యటనకు వచ్చారని తెలుగుదేశం కార్యకర్తల ఆరోపణ. ఈ ఇద్దరు కూడా అసలు సమస్యను పక్కదోవ పట్టించడానికి శతథా యత్నించారనే చెప్పాలి. రాష్ట్రంలో 128 సార్లు హిందువుల మందిరాల మీద దాడి జరిగిన తరువాత ఇప్పుడు ఆ దాడుల వెనుక తెలుగుదేశం ఉన్నదని, చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌ ఉన్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. రామతీర్థంలో ఆయన చేసిన ఆరోపణే ఇది. అందుకు ఆధారాలు ఉంటే, రామతీర్థంలోని సాధారణ ప్రజలను ఎందుకు అరెస్టు చేయడం? ఆ పెద్ద తలలనే అరెస్టు చేయవచ్చు కదా! మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదంతా వైసీపీ చేయిస్తోందని ఎదురు దాడి చేస్తున్నారు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి ప్రభుభక్తికి ఎల్లలు లేవనే అనిపించింది. కొంతవరకు చంద్రబాబు హిందువుల మనోభావాల గురించి నాలుగు మాటలైనా చెప్పారు. విజయసాయి మొత్తం తెలుగు దేశాన్ని నిందించడానికే సమయం కేటాయించారు. పాత దుర్ఘటనలను కూడా ఖండించాలన్న ఇంగిత జ్ఞానం ఎవరిలోనూ కనిపించలేదు.

 నిజానికి ఆరోజు బోడికొండకు మొదట వచ్చిన వారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ ‌మాధవ్‌. ‌తరువాత విజయసాయిరెడ్డి వెళ్లారు. ఈయన వెంట ఆ పార్టీ జెండాలు పట్టుకుని కార్యకర్తలు దండెత్తడం మరొక నేరం. తరువాత తన పరివారంతో చంద్రబాబు వెళ్లారు. ఈయన బూట్లతోనే మెట్లెక్కారని వైసీపీ ఆరోపణ. విజయసాయిరెడ్డి వచ్చిన సందర్భంలో పోలీసులు చూపిన అత్యుత్సాహం దారుణంగా ఉంది. తెలుగుదేశం వారి మీద కంటే బీజేపీ వారి మీదే వారు ప్రతాపం చూపించారు. బీజేపీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని కిందపడిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పర్యటనకు కొద్ది గంటల ముందే రామతీర్థం ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో మొత్తంగా 1,08,230 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్లపట్టాలు పంపిణీ చేసింది. అటు పట్టాల పంపిణీ వేడుక. ఇటు రామతీర్థం సంఘటనతో జిల్లాలో ఉత్కంఠ.

మరో మూడు చోట్ల

రామతీర్థం అలజడి అక్కడ జరుగుతూ ఉండగానే రాష్ట్రంలో మరో మూడు దేవాలయాలలో అపచారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శ్రీరామనగర్‌ ‌విఘ్నేశ్వర ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయంలో స్వామివారి విగ్రహం రెండు చేతులను నరికి వేశారు. విశాఖ జిల్లా, మన్యప్రాంతంలోని ఘాట్‌ ‌మార్గంలోని వంట్ల మామిడి సమీపాన ఉన్న కోమాలమ్మ అమ్మవారి విగ్రహం పాదాలను ధ్వంసం చేశారు. ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు మోదకొండమ్మ పాదాలు, తర్వాత కోమాలమ్మ పాదాలను దర్శించుకుని పూజలు చేస్తుంటారు. మోదకొండమ్మ మీద గిరిజనులకు ఎంతో గురి. కోమాలమ్మ ఆ అమ్మవారి చెల్లెలని గిరిపుత్రుల విశ్వాసం. మైదాన ప్రాంత భక్తులు సైతం దర్శనానికి వస్తుంటారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన కోమాలమ్మ పాదాలు ధ్వంసమవటంతో భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. జనవరి మూడో తేదీన విజయ వాడలో ఆర్టీసి బస్టాండ్‌ ‌దగ్గర ఆలయంలో సీతమ్మ విగ్రహం ధ్వంసం చేశారు. ఒకపక్క హిందువులు ఉద్యమిస్తున్నా హిందూ దేవతామూర్తులకు అవమానాలు జరిగిపోతున్నాయంటే ఎవరి ప్రోద్బలం ఉన్నట్టు? ఇది అన్య మతస్థుల కుట్ర కాదా?

అశోక్‌ ‌గజపతి తొలగింపు

చంద్రబాబుతో కలసి రామతీర్థం వెళ్లినందుకు కాబోలు ఆ దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు, తెలుగుదేశం ప్రముఖుడు పూసపాటి అశోక్‌ ‌గజపతిరాజును తొలగిస్తూ ఏపీ సర్కారు ఆగమేఘాల మీద ఫర్మానా జారీ చేసింది. ఇంకా అక్కడ చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగానే ఆన్‌లైన్‌లో వచ్చిన జీవోను కింజరాపు అచ్చెన్నాయుడు తమ నేతకు ఫోన్‌లో చూపించారు. ప్రత్యర్థుల మీద వైసీపీ సర్కార్‌ ఎం‌త వేగంగా స్పందించగలదో, హిందుత్వకు సంబంధించిన అంశంలో ఆ వేగం ఇంకెంత నిశితమో చెప్పడానికి ఇది మరొక నిదర్శనం. రామతీర్థం మండలి అధ్యక్ష పదవితో పాటు పైడితల్లి (విజయన గరం), మందపల్లి (తూ.గో.) ఆలయాల ధర్మకర్తల మండళ్ల నుంచి కూడా అశోక్‌ను తొలగించారు. వంశపారంపర్య ధర్మకర్తను తొలగించడం ఇంత సులభమా? అయినా ఎందుకు తొలగించారు? అది కూడా నివేదించింది సర్కారు. దేవాలయాల పరిరక్షణలో గజపతి ఘోరంగా వైఫల్యం చెందారట. రామతీర్థంలో దాడి తెలుగు దేశం పార్టీదే అనడానికి పూసపాటి అశోక్‌గజపతి రాజు ఆ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కావడమే నిదర్శనమని ఎంపీ విజయసాయిరెడ్డి నిర్ధారించడం మరీ విశేషం. తమ కుటుంబం 105 దేవాలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యత్వం కలిగి ఉందని, ఈ ఆలయానికి ధర్మకర్తల మండలికి నేనే అధ్యక్షుడినని ఇప్పుడు మీరంటేనే తెలిసిందని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు అశోక్‌గజపతి అనడం కొసమెరుపు. మిగిలిన ఆలయాలలో ఏం జరిగినా తమకు సమాచారం ఇస్తారని, కానీ రామతీర్థంలో జరిగినదాని గురించి ఎవరూ తెలియచేయలేదని అన్నారాయన. అశోక్‌ ‌గజపతి వాదన అలా ఉంటే, ఈ దేవాలయాలను కాపాడలేని ఆ ‘వె..’ను ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవిలో ఎందుకు ఉంచాలని ఆంధప్రదేశ్‌ ‌దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అత్యంత సంస్కార హీనంగా వ్యాఖ్యానించడం ఇంకా జుగుప్సాకరం. మరి ఇన్ని దుర్ఘటనలు జరగడానికి వెసులుబాటు కల్పించిన వారినీ, ఈ దారుణాలను ఆపడంలో వైఫల్యం చెందిన వారినీ ఏమని పిలవాలి? వాళ్లని ఎందుకు మెడపట్టి గెంటరాదు?

హిందువుల మనోభావాలకు గౌరవం ఇంకా ఎప్పుడు దక్కుతుంది? హిందూ ధర్మానికి మన్నన ఎలా వస్తుంది? విదేశీ పాలనలోను, స్వతంత్ర భారతంలోను కూడా హిందువులు సాంస్కృతిక, మత స్వేచ్ఛలకు నోచుకోలేదా? కాంగ్రెస్‌ ‌తెచ్చిన లౌకికవాదం హిందువులను పదవుల కోసం, అధిష్టాన దేవతల మెప్పు కోసం అన్ని జీవన విలువలను వదులుకునేలా చేసింది. సర్వభ్రష్టులను చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం పార్టీలు చేస్తున్నది కూడా సరిగ్గా అదే. కమ్యూనిస్టు పార్టీలు అనేవి జన్మతః హిందూ వ్యతిరేకం. భారత ఉనికికే అవి ప్రమాదం. చాలా ప్రాంతీయ పార్టీలు ప్రజలకు పరోక్షంగా నేర్పుతున్నది కూడా ఇవే. దీని నుంచి హిందూ జాతీయతను, భారతీయతను పరిరక్షించుకోవాలి. దేవస్థానాలకు రాజకీయ చీడ సోకనివ్వకపోవడం ఇందుకు మొదటి చర్య అవుతుంది. హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను రాజకీయ నిరుద్యోగుల పునరావాస కేంద్రాలుగా మార్చే హక్కు వీళ్లకెక్కడిది? దేవాలయాలకు వచ్చిన నేతలు అక్కడ రాజకీయాలు వాగకుండా నాలుగు మంచి మాటలు చెప్పగలిగితే చెప్పి రావాలి. విలేకరులు కూడా ఈ నిబంధన పాటించాలి. వీళ్లు వాళ్ల చేత రాజకీయాలు వాగించే దురదను తగ్గించుకోవాలి. తిరుమల కొండమీద క్రిస్మస్‌ ‌శుభాకాంక్షలు చెప్పే ద్రోహులకు అసలు అక్కడ చోటు ఉండాలా? మరీ ముఖ్యంగా- దేవాదాయ శాఖను తన్ని తగలేయడం గురించి ఇప్పటికైనా హిందువులంతా ఉద్యమించాలి. హిందూ ఆచారాలను గౌరవించలేని, హిందూ ఆలయాలను కాపాడలేని నేతలకు, రాజకీయ పక్షాలకు ఓటు వేయడం ఎంత అనర్ధమో హిందువులు లోతుగా ఆలోచించడం మొదలుపెట్టాలి. మనం వేసిన ఓటుతో మన ధర్మాన్నే భగ్నం చేసే దుష్టశక్తులను ప్రతిష్టించు కోవడం అవసరమా అని ప్రశ్నించుకోవాలి. మెజారిటీ హిందువులు వేసిన ఓట్లు అంతిమంగా మైనారిటీల గొంతెమ్మ కోర్కెలు తీర్చడానికేనా అని ప్రశ్నించాలి. లౌకికవాద పక్షాలు నిజంగా ఉంటే ఆహ్వానిద్దాం. మతాన్నీ, రాజకీయాన్నీ వేరుగా చూడగలిగే విశాల దృక్పథం ఉన్న పార్టీలను స్వాగతిద్దాం. హిందూధర్మం ఆ రెండింటిని కలపదు కూడా. కానీ హిందూధర్మాన్నీ, ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలనూ గౌరవించకుండా, వారి ఓట్లతో గెలిచి మైనారిటీల తొత్తులుగా వ్యవహరించే నాయకులకు ఇక సెలవు ఇవ్వడం మంచిది. కులం మాటున విధ్వంసక మతాలను రుద్దే వికృత లౌకికవాదం పట్ల అప్రమత్తంగా ఉండాలి. లౌకికవాదం పేరుతో విధర్మీయులనీ, విచ్ఛిన్నకర ధోరణులనీ ఇంకా హిందువులు మోయడం ఆత్మహత్యా సదృశమే.

– జాగృతి డెస్క్


దోషులను పట్టుకోవాలి:

సోము వీర్రాజు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు

శ్రీరామతీర్థం సంఘటన కంటనీరు తెప్పిం చింది. శ్రీరాముడి విగ్రహం తలను ఖండించిన దోషులను వెంటనే శిక్షించాలి. ధర్మపరిరక్షణలో భాగంగా చారిత్రక ఆలయాలను పరిరక్షించాల్సిన బాధ్యత ముమ్మాటికి ప్రభుత్వాలదే. రాష్ట్రంలో రోజు రోజుకూ ఇటువంటి సంఘటనలు పెరిగిపోతున్నాయి. అంతర్వేది ఘటనతోనే ఈ ప్రభుత్వం మేల్కొని ఉండవలసింది. తర్వాత విజయవాడలో రెండూ, పాడేరులో కూడా దుర్ఘటనలు జరిగిపోయాయి. ఇందులో ప్రభుత్వం అలక్ష్యం సుస్పష్టం. తక్షణం దేవాదాయ, ధర్మదాయ శాఖ మంత్రి స్పందించాలి. లేనిపక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారు.


ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే:

 పీవీఎన్‌ ‌మాధవ్‌, ఎమ్మెల్సీ, బీజేపీ

దేవాలయాలను అపవిత్రం చేయడం, దేవాలయ వ్యవస్థను నాశనం చేయడం, హిందువుల, భక్తుల మనోభావాలను గాయపరచడంలో ఈ ప్రభుత్వానిది అందె వేసిన చేయి. హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. దోషులను అరెస్టు చేయలేదంటే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నదనే చెప్పాలి. ఎంత ధైర్యముంటే అతి పురాతమైన శ్రీ రామతీర్థంలోని కోదండ రాముడి తల ఖండించి, కోనేరులో వేస్తారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండడం, నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఒకటి తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి.


హిందువులు తిరగబడక ముందే మేల్కొనండి:

 రెడ్డి పావని, భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షురాలు

జగన్‌ ‌ప్రభుత్వం చేతకానితనం వల్లనే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనల ద్వారా హిందూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. దేశమంతా అయోధ్యలో రామమందిర నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న తరుణంలో ఇక్కడ రాముని విగ్రహం తల తొలగించటం ఘోరం. హిందూ సమాజం తిరగబడకముందే ఈ ప్రభుత్వం మేల్కొనాలి. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తక్షణమే రాజీనామా చేయాలి.


పాక్‌లోనే అనుకుంటే ఏపీలోనూ:

పవన్‌ ‌కల్యాణ్‌, ‌జనసేన నేత

దేవుడి విగ్రహం ధ్వంసంతో ఏపీలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రాజమహేంద్రవరంలో జరిగిన ఘటన హిందూధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. ఆవేదనకు గురిచేసింది. ‘పాకిస్తాన్‌లో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతూ ఉంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం. హిందూ ఆలయాలపై దాడి జరిగితే అంత ఉదాసీనత ఎందుకు?  అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా.. అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులు పెట్టిన ప్రభుత్వం.. హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తున్నది?


క్రైస్తవులకు ఒక న్యాయం, హిందువులకు వేరొక న్యాయం:

 రఘురామకృష్ణంరాజు, వైసీపీ ఎంపీ

రాముడి విగ్రహం తల నరికి తీసుకువెళ్లిన ఘటన చూస్తే ముఖ్యమంత్రికి సిగ్గు అనిపించడం లేదా? అదే, జీసస్‌ ‌విగ్రహం తల నరికితే క్షణాల్లో పట్టుకుంటారు. హిందూ దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేసినా.. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని నేరస్తులను పట్టుకోవడం లేదు. ముఖ్యమంత్రికి హిందువులంటే అంత చులకనా? హిందువులు అంత చేవ చచ్చి ఉన్నారా? వరుస సంఘటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికైనా స్పందించి దయచేసి కఠిన చర్యలు తీసుకోవాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram