ఆధునిక కాలంలో అనేక దేశాలు ప్రజాస్వామ్య పంథాలో పయనిస్తున్నాయి. ఈ క్రమంలో స్వేచ్ఛకు, పారదర్శకతకు, చట్టాలకు, మానవ హక్కులకు పెద్దపీట వేస్తున్నాయి. అదే సమయంలో దేశ ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి అనేక చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ప్రైవేట్‌ ‌భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వారికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నాయి. నరేంద్రమోదీ నాయకత్వంలోని నేషనల్‌ ‌డెమొక్రటిక్‌ అలయెన్స్ (ఎన్డీయే) ప్రభుత్వం ‘మేకిన్‌ ఇం‌డియా’ పథకంలో భాగంగా పెట్టుబడిదారులకు రాచబాటలు పరుస్తోంది. అంతేగాక విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దయెత్తున ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. దేశం ప్రగతిపథంలో ముందుకు సాగుతోంది. పొరుగున ఉన్న చైనా ఇందుకు పూర్తిగా భిన్నమైన పంథాలో ప్రయాణిస్తోంది. ఇంకా పాతకాలపు నాటి పద్ధతులను విడనాడటం లేదు. నిరంకుశ విధానాలను వీడటం లేదు. పారదర్శకతను పూర్తిగా పక్కన పెడుతోంది. అంతిమంగా అంతర్జాతీయంగా అభాసుపాలవుతోంది. చైనా పారిశ్రామిక దిగ్గజం, అలీబాబా గ్రూపు వ్యవస్థాపకుడు జాక్‌ ‌మా అదృశ్యమే ఇందుకు నిదర్శనం. గత రెండు నెలలుగా ఆయన ఆచూకీ లభించడం లేదు. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఆయన చేసిన విమర్శల కారణంగానే బీజింగ్‌ ‌సర్కారు ఆయనను నిర్బంధించిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ప్రభుత్వం ఈ విషయంపై నోరు మెదపడం లేదు. మౌనాన్ని వీడటం లేదు. దీంతో జిన్‌పింగ్‌ ‌సర్కారుపై  నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

దేశీయంగా, అంతర్జాతీయంగా జాక్‌ ‌మా ఘటన సంచలనం కలిగిస్తోంది. కలకలం రేపుతోంది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు చైనా అంటేనే ఉలిక్కి పడుతున్నారు. ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోంది. డ్రాగన్‌ ‌దేశంలో పెట్టుబడులు పెట్టడం ఏమాత్రం సురక్షితం కాదన్న అభిప్రాయానికి వస్తున్నారు. జాక్‌ ‌మా ఘటన వల్ల వ్యక్తిగతంగా అతనికి ఎంత నష్టమో చైనాకూ అంతే నష్టమన్న అభిప్రాయం అంతర్జాతీయంగా వ్యక్తమవుతోంది.

 జాక్‌ ‌మా ఘటనకు సంబంధించి పూర్వాపరా ల్లోకి వెళితే బీజింగ్‌ ‌నాయకత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తుందో అర్థమవుతుంది. నచ్చనివారిపై ఎంతటి కఠినచర్యలు తీసుకుంటుందో విస్పష్టంగా తెలుస్తుంది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారిపై, స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే వారిపై ఎలా ఉక్కుపాదం మోపుతుందో సోదాహరణంగా విదిత మవుతుంది. జాక్‌ ‌మా వంటి పారిశ్రామిక దిగ్గజాలకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే ఇక చిన్న, మధ్య తరగతి పారిశ్రామిక వేత్తల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ జాక్‌ ‌మా చేసిన పొరపాటేమిటి, ఆయన పట్ల జిన్‌పింగ్‌ ‌సారథ్యంలోని సర్కారు ఎందుకు అంత కరకుగా వ్యవహరిస్తుంది అన్నది ఆసక్తికరం. జాక్‌ ‌మా ఆషామాషీ వ్యక్తి కాదు. చైనాలోని రెండో అత్యంత ధనవంతుడు. వేల కోట్ల పారిశ్రామిక రాజ్యానికి అధిపతి. దేశ, విదేశాల్లో పెట్టుబడుల ద్వారా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన వ్యాపారవేత్త. గత ఏడాది అక్టోబరు 24న జరిగిన ఒక కార్యక్రమంలో చైనా ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ నియంత్రణ సంస్థల విధానాలలోని లోపాలను ఎత్తిచూపారు. బ్యాంకులు తాకట్టు సంస్థలుగా మారాయని పేర్కొన్నారు. వీటివల్ల ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి మందగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ ‌విధానాల్లో మార్పులు, సంస్కరణల ఆవశ్యకతను సోదాహరణంగా వివరించారు. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. ఆ తరువాత నవంబరు మొదటి వారంలో ఓ టీవీ కార్యక్రమానికి జడ్జిగా హాజరు కావాల్సి ఉంది. కాని చివరి నిమిషంలో జాక్‌ ‌మా రావడం లేదంటూ వేదికపై గల బ్యానర్‌ ‌నుంచి ఆయన పేరు, చిత్రం తొలగించారు. అప్పటినుంచి జాక్‌ ‌మా జాడ తెలియడం లేదు. రెండు నెలలు దాటుతున్నా ఆచూకీ తెలియడం లేదు. ప్రభుత్వ వర్గాలు పెదవి విప్పడం లేదు. అంతేగాక జాక్‌ ‌మా తనంతట తానే స్వయంగా అజ్ఞాతంలోకి వెళ్లా రన్న వాదనను ప్రభుత్వ వర్గాలు తెరపైకి తెస్తున్నాయి.

ఆర్థిక, పారిశ్రామిక రంగాల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై జాక్‌ ‌మా వ్యాఖ్యలను బీజింగ్‌ ‌నాయకత్వం సానుకూలంగా తీసుకోలేదు. దేశంలోనే కాకుండా ఆసియా పారిశ్రామిక దిగ్గజంగా అందరూ పేర్కొనే ఈ అలీబాబా గ్రూప్‌ ‌వ్యవస్థాపకుడు తన సుదీర్ఘ అనుభవంతో, ముందుచూపుతో చేసిన సలహాలు, సూచనలను ప్రతికూలంగా తీసుకోవడమే అసలు సమస్యకు మూల కారణం. జాక్‌ ‌మా విమర్శలు చేసినప్పటి నుంచి సర్కారు ఆయనపై, ఆయన సంస్థలపై కన్నేసింది. పూర్తిగా నిఘా పెట్టింది. వేధింపులు ప్రారంభించింది. నిబంధనల పేరుతో నియంత్రణ సంస్థలు నోటీసులివ్వడం మొదలు పెట్టాయి. మొత్తం అలీబాబా గ్రూపును దెబ్బతీసేందుకు ప్రణాళిక రచన చేసింది. దీనిని పకడ్బందీగా అమలు చేసింది. జాక్‌ ‌మా వ్యాపార సంస్థలపై దాడులు చేసింది. ఒక్క మాటలో చెప్పా లంటే ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఫలితంగా అలీబాబా గ్రూపు వ్యాపారం దారుణంగా దెబ్బతిన్నది. మార్కెట్‌ ‌విలువ బాగా పడిపోయింది. గత ఏడాది నవంబరులో జాక్‌ ‌మాకు చెందిన ఏఎన్‌టీ గ్రూపు ప్రపంచంలోనే అతి పెద్దదైన ఐపీవోను ప్రకటించింది. దీనివిలువ దాదాపు 37 బిలియన్ల డాలర్లు. దీనిని షాంఘై స్టాక్‌ ఎక్సేంజి కేవలం రెండు రోజుల ముందు అర్ధంతరంగా ఆపేసింది. మన దేశంలోని ముంబయి, పాకిస్తాన్‌లోని కరాచీ నగరాల మాదిరిగా షాంఘై ఆ దేశ ఆర్థిక రాజధానిగా పేరుగాంచింది. దేశం విడిచి వెళ్లవద్దంటూ అధికారులు జాక్‌ ‌మాను ఆదేశించారు. ఆయన సంస్థలపై అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఏఎన్‌టీ గ్రూప్‌, అలీబాబా సంస్థలు తమ విధానాలను మార్చుకోవాలని ఆదేశించారు. ఆయా సంస్థల్లోకి వస్తున్న పెట్టుబడులపై ఆరా తీయడం ప్రారంభించారు. ఎంతవరకు వేధించాలో, ఏ రకంగా వేధించాలో అన్నీ చేశారు. ఫలితంగా ఆయన సంపద 61.75 బిలియన్‌ ‌డాలర్ల నుంచి కేవలం రెండు నెలల్లో 50.9 డాలర్లకు పడిపోయింది. తన గ్రూప్‌ 25‌వ స్థానానికి పడిపోయింది. ప్రభుత్వ కక్ష సాధింపే ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ చర్యల వల్ల జాక్‌ ‌మా వ్యాపార సంస్థలకు వచ్చిన నష్టం అక్షరాలా రూ.87 వేల కోట్లు. జాక్‌ ‌మా కేవలం వ్యాపార కార్యక్రమాలకే పరిమితం కాలేదు. దేశ, విదేశాల్లో అనేక సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇందుకోసం ఏటా పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారు. సేవా కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజలు తనకు ఇచ్చిన సంపదలో కొంత మొత్తంతో సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారి రుణం తీర్చుకున్నట్లు ఉంటుందని వ్యాఖ్యానించేవారు.

జాక్‌ ‌మా అసాధారణ ప్రతిభా పాటవాలు గల పారిశ్రామికవేత్త. అందువల్లే వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యన్ని నిర్మించగలిగారు. కేవలం అమెరికా, బ్రిటన్‌, ‌ఫ్రాన్స్, ‌జర్మనీ, జపాన్‌ ‌వంటి పెట్టుబడిదారీ దేశాల్లోనే కాకుండా కమ్యూనిస్టు రాజ్యంలో కూడా పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చని నిరూపించారు. ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేసినప్పటికీ సంపదను సృష్టించవచ్చని చాటిచెప్పారు. తద్వారా ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 2020లో ఆసియాలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించారు. అలీబాబా గ్రూప్‌ ‌ప్రపంచంలోనే అతి పెద్ద ఈ-కామర్స్ ‌సంస్థ. బిలయన్‌ ‌డాలర్ల టర్నోవర్‌ ‌చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే అలీబాబా గ్రూప్‌తో చైనీయులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. దేశంలోని ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా ఈ సంస్థతో విడదీయరాని బంధం కలిగి ఉన్నాడు. భారత్‌లోని పేటీఎం కంపెనీలో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఆ రంగంలోని అంకుర పరిశ్రమ జోమాటా, అనైన్‌ ‌గ్రోసరీ, బిగ్‌ ‌బాస్కెట్‌ ‌తదితర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి.

ఇంతకీ జాక్‌ ‌మాపై, ఆయన గ్రూప్‌ అలీబాబాపై చైనా సర్కారు ఆగ్రహానికి కారణం ఏమిటన్న విషయం ఎవరికీ బోధపడటం లేదు. ఏకపక్ష విధానాలను అనుసరిస్తున్నారని, పోటీ సంస్థలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నారన్నది సర్కారు ప్రధాన అభియోగం. ఏ విధంగా చూసినా ఇందులో హేతుబద్దత లేదు. ప్రభుత్వ విధానాలు అందరికీ ఒకేవిధంగా ఉన్నప్పుడు ప్రత్యర్థులను ఎలా అడ్డుకుంటారన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకదు. ఏ పారిశ్రామికవేత్త ఎదుగుదలకైనా కావాల్సింది పకడ్బందీ ప్రణాళిక, ముందుచూపు, ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం, మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మారడం వంటివి. వీటిని పాటించడం ద్వారా ఎవరైనా ఎంత స్థాయికి అయినా చేరుకోవచ్చు. కఠిన నిబంధనలు అమలయ్యే దేశంలో ప్రత్యర్థులను అడ్డుకోవడం ఎలా సాధ్యమన్న ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లభించడం లేదు. ఒకవిధంగా చెప్పాలంటే ప్రభుత్వమే జాక్‌ ‌మాను దెబ్బతీసేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తోంది.

నిరంకుశ విధానాలను అమలు చేసే చైనాలో ప్రభుత్వ విధానాలను విమర్శించిన, సదుద్దేశంతో సూచనలు చేసిన వారికి ఇబ్బందులు తప్పవు. ఏదో రూపంలో వేధింపులు ఉంటాయి. వ్యాపార సంస్థలపై దాడులు జరుగుతాయి. ఇప్పుడు జాక్‌ ‌మా వంతు వచ్చింది. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వ్యక్తులు మాయమవడం, నిర్బంధాలకు గురవడం మాములే. ఇంతకుముందు హాంకాంగ్‌లోని ఓ ప్రచురణ సంస్థకు చెందిన అయిదుగురు వ్యక్తులను చైనా నిర్బంధించింది. అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో చివరకు ఇద్దరిని వదిలిపెట్టింది. మిగిలిన వారి చేత బలవంతంగా నేరం అంగీకరింపజేసింది. గత ఏడాది కొవిడ్‌ ‌సమయంలోనూ ఇలానే వ్యవహ రించింది. చైనాకు చెందిన వైద్యుడు లివెన్‌ ‌లియాంగ్‌ ‌దేశంలో కరోనా వ్యాప్తిని గుర్తించారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపారు. ఆయన సూచనలను సర్కారు పరిగణనలోకి తీసుకో లేదు. చివరికి ఆయనే కరోనాతో కన్నుమూశారు. మరణానంతరం బీజింగ్‌ ‌సర్కారు లివెన్‌కు క్షమాపణ చెప్పడం గమనార్హం. ప్రైవేట్‌ ‌వ్యాపార, వాణిజ్య సంస్థలకు తగిన స్వేచ్ఛ, అవకాశాలు ఇవ్వకపోవడం పెద్ద లోపం. సద్విమర్శను స్వీకరించకపోవడం అన్నింటికీ మించి ప్రభుత్వపరంగా సవరించుకో వలసిన అంశమన్నది విశ్లేషకుల అభిప్రాయం. అమెరికాకు దీటుగా అగ్రరాజ్యంగా ఎదిగేందుకు అహర్నిశలు పోరాడుతున్న డ్రాగన్‌ ‌దేశం ముందు ఇంటి సమస్యలను చక్కదిద్దుకోవాలి. నిరంకుశ విధానాలను విడనాడాలి. ప్రజాస్వామ్యం, పారదర్శకత, సరళీకరణ విధానాలకు, చట్టబద్ధ పాలనకు పెద్దపీట వేయాలి. ఇరుగు పొరుగు దేశాలతో గిల్లికజ్జాలకు స్వస్తి పలకాలి. దురాక్రమణ విధానాలకు దూరంగా ఉండాలి. హుందాగా వ్యవహరించాలి. అప్పుడే ప్రపంచ శక్తిగా ఎదగగలదు. అంతర్జాతీయంగా అందరి మన్ననలు అందుకోగలదు.

– రాజేంద్ర, వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE