– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

ఆం‌ధప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కొత్త వేషం కట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పుష్కరాల సందర్భంగా విజయవాడలో కూలగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణానికి జగన్‌ ‌స్వయంగా శంకుస్థాపన చేశారు. అలాగే, సంక్రాంతి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నరసరావుపేటలో ఏర్పాటు చేసిన కామధేను పూజ (గో పూజ) కార్యక్రమంలోనూ స్వయంగా పాల్గొన్నారు. ఈ రెండు సందర్భాలలోనూ ముఖాన బొట్టుపెట్టి, హిందూ సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు. హిందూ ధర్మాన్ని రక్షించేందుకు పుట్టిన కొత్త దేవుడు ఆయనే అన్నట్లుగా జగన్‌ ‌వంధిమాగధులు, భజనబృందాలు ప్రభు గీతాలను ఆలపిస్తున్నారు. అయితే, ఇలాంటి జిమ్మిక్కులతోనే జనాలను మోసం చేయగలమనుకుంటే అది ఆయన అజ్ఞానమే అవుతుంది.


నిజానికి, చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునఃనిర్మిస్తామని వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలోనే వాగ్దానం చేసింది. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆ విషయాన్నే మర్చిపోయింది. బైబిల్‌ ‌బోధనలను బయటకు తీసి, విగ్రహాల ధ్వంస రచనను బోధించేందుకు ‘పల్లె పల్లెకు పాస్టర్లు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని వేల మంది పాస్టర్లకు ఒక్కొక్కరికీ నెలకు ఐదు వేల రూపాయల వంతున జీతాలు ఇచ్చి ఊళ్ల మీదకు వదిలిపెట్టింది. పర్యవసానంగా దేశంలో ఏ క్రైస్తవ ముఖ్యమంత్రి పాలనలో జరగని విధంగా జగన్‌ ‌పద్దెనిమిది నెలల పాలనలో ఆయన ప్రభుత్వం హిందువులపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిందా అన్నటుగా దేవాలయాలపై దాడులు జరిగాయి. విగ్రహాలు ధ్వంసమయ్యాయి. చివరకు, వందల సంవత్సరాల నాటి రామతీర్థం దేవాలయంలో హిందువుల ఆరాధ్య దైవం రాములోరి విగ్రహం తలను దుండగులు నరికివేశారు. అంతవరకు ఎన్ని అకృత్యాలు జరిగినా నిగ్రహాన్ని పాటించిన హిందువులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హిందువుల ధర్మాగ్రహాన్ని చల్లార్చేందుకే జగన్‌ ఈ ‌కొత్త వేషం కట్టారన్నది బహిరంగ రహస్యం.

అయితే, ఇవేవీ కొత్త కథలు కాదు. కొత్త వేషాలూ కాదు. సోనియాగాంధీ మొదలు చాలామంది క్రైస్తవ రాజకీయ నాయకులు హిందువుల ఓట్ల కోసం గతంలో ఇలాంటి వేషాలు చాలానే వేశారు. ఇప్పుడు ఒక జగన్మోహన్‌రెడ్డి మాత్రమే కాదు, మహానటుడు ఎన్టీఆర్‌ ‌నుంచే ‘మహానటుడు’ అని కితాబు అందుకున్న చంద్రబాబు కూడా హిందువులను తమవైపు తిప్పుకునేందుకు చాలా జిమ్మిక్కులు చేస్తున్నారు. గతాన్ని మర్చిపోయి హిందూధర్మాన్ని రక్షించేందుకు పుట్టిన ధర్మప్రభువులా నటిస్తున్నారు.

అయితే.. ప్రజల జ్ఞాపకశక్తి తక్కువేం కాదు. అవసరం అయినప్పుడు అక్షరం అక్షరం గుర్తు తెచ్చుకుంటారు. ప్రతి అక్షరాన్ని ఒక అస్త్రంగా చేసుకుని సంధిస్తారు. ఒక సందర్భంలో సోనియాగాంధీ గంగలో మునిగి తనకు హిందూధర్మం, హిందువుల ఆచార, వ్యవహారాల పట్ల తెగ విశ్వాసం ఉందని ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రచారం చేసుకున్నారు. ఇక రాహుల్‌ ‌గాంధీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. అనేక సందర్భాలలో ఆయన హిందూవేషం కట్టారు. రుద్రాక్షమాలలు ధరించి గుళ్లూ, గోపురాలు తిరిగారు. ‘నన్ను నమ్మండి.. నేనూ హిందువునే’ అంటూ ప్రకటనలు ఇచ్చారు. చివరకు, గుజరాత్‌ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌ ‌మెడలో యజ్ఞోపవీతం వేసి ఫొటోలు తీసి ఆయన హిందువు మాత్రమే కాదు, బ్రాహ్మణుడు కూడా అని గోత్రనామాలను తగిలించి ప్రచారం చేసుకుంది. ఆ విధంగా హిందూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే రాహుల్‌ ‌కైలాస మానస సరోవర్‌ ‌వెళ్లకుండానే మార్ఫింగ్‌ ‌చిత్రాలు సృష్టించి ప్రచారం చేసుకున్నారు.

అయితే- ఒక పార్సి (రాజీవ్‌ ‌గాంధీ)కి, రోమన్‌ ‌కాథలిక్‌ (‌సోనియా గాంధీ)కి పుట్టిన రాహుల్‌గాంధీ హిందువు ఎలా అవుతాడు? హిందువు కానివ్యక్తి బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? అని ప్రజలే ప్రశ్నించారు. ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. కాబట్టి, మాటలతో, చేతలతో ప్రజల్ని మోసం చేయాలను కుంటే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే జగన్మోహన్‌రెడ్డి విషయంలోనూ హిందువే కాని వ్యక్తి రెడ్డి ఎలా అవుతాడు? అనే ప్రశ్న సోషల్‌ ‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నిజానికి, జగన్మోహన్‌రెడ్డి కూడా ఇప్పటికే ఒకసారి హిందువులను ‘విజయవంతం’గా మోసం చేశారు. ఎన్నికలకు ముందు రిషికేశ్‌ ‌వెళ్లి నదిలో మునిగివచ్చారు. క్రైస్తవాన్ని వదిలి హిందుత్వాన్ని స్వీకరించారని ప్రచారం కూడా చేయించుకున్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత నిజరూపాన్ని నిలువెత్తున చూపారు. హిందువుల ఆగ్రహాన్ని మూటకట్టుకున్నారు. అందుకే, కావచ్చు ఇప్పుడు మళ్లీ హిందూవేషం కట్టారు. అయితే, ఎంత ముఖ్యమంత్రి అయినా అందరినీ అన్ని సందర్భాలలో మోసం చేయడం కుదరదు. అలాగే, ఇప్పటికే చాలా మంది జగన్‌ను ఏసు నామంతో కీర్తిస్తున్నారు, సంభోదిస్తున్నారు. అంటే, జగన్‌ ఉద్దేశపూర్వకంగా సృష్టించుకున్న క్రైస్తవ ముఖ్యమంత్రి ఇమేజ్‌ అం‌త తేలిగ్గా చెరిగిపోయేది కాదు. అదేదో సినిమాలో అన్నట్లుగా వేషం, భాష అయితే మార్చారు. కానీ మనిషి మాత్రం మారలేదు. ఎందుకంటే విగ్రహాలను కూల్చినవారిని పట్టుకోవడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం సోషల్‌ ‌మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని 21 మంది బీజేపీ, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టింది. అంతేకాదు, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ‌గీత దాటారు. రాజకీయ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దేవాలయాలకు రక్షణ లేదన్న ఆరోపణలలో నిజం లేదని అన్నారు. అక్కడితో ఆగలేదు. ఇది కొన్ని రాజకీయ పక్షాలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం మాత్రమేనని తేల్చిచెప్పారు. చివరకు ఈ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే దురుద్దేశం కనిపిస్తోందనే వరకు వెళ్లారు.

ఓవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ‘మచ్చ’లను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలోనే రాష్ట్రంలో క్రైస్తవీకరణ కుట్రలు ఎంత పెద్దఎత్తున జరుగుతున్నాయో తెలియచేసే సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో సాగుతున్న దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేయడం వెనక దాగున్న కుట్ర వీడియో రూపంలో బయటకు వచ్చింది. రాష్ట్రంలో మత ప్రచారం, మత మార్పిళ్లను ప్రోత్సహించేందుకు భారీగా నిధులు సమకూరుస్తున్న అమెరికన్‌ ‌స్పాన్సర్‌తో పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌చక్రవర్తి మాట్లాడిన సంభాషణ సోషల్‌ ‌మీడియాలో, ప్రధాన మీడియాలో కూడా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌చక్రవర్తి తమ అసోసియేషన్‌లో మొత్తం 3,642 మంది పాస్టర్లు ఉన్నారని, ఇప్పటి వరకు 699 క్రీస్తు గ్రామాలను, (అంటే ఊరు ఊరంతా క్రైస్తవులే ఉన్న గ్రామాలు. క్రైస్తవేతర విగ్రహం, చిహ్నం, ఆనవాలు ఏదీ లేని గ్రామాలు) నెలకొల్పామని, మరో నెలలో ఏడువందల గ్రామాలను క్రీస్తు గ్రామాలుగా మారుస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, హిందూ విగ్రహాలను, హిందువులు పూజించే చెట్లు, పుట్టలను స్వయంగా కాళ్లతో తన్నానని, ముక్కలు చేశానని చెప్పుకొచ్చారు. ఇంతవరకు దేవాలయాలపై దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ అరెస్ట్ ‌చేయని పోలీసులు పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ను వెంటనే అరెస్ట్ ‌చేశారు. రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై దాడులు చేయడం, మత మార్పిళ్లకు పాల్పడడం.. ఇతర నేరాల కింద నిందితుడిపై 153ఏ, 153బీ, 1సీ, 505, 295ఏ, 124ఏ, 115 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వేషం మార్చడంలో ఎంత చిత్తశుద్ధి ఉందో, ఈ అరెస్ట్ ‌వెనక కూడా అంతే చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి వేషం మార్చి మాయ చేయ చూస్తే.. హిందూ ఆలయాలపై జరుగుతున్న వరస దాడుల ప్రధాన సమస్య నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు పోలీసులు పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌పాత వీడియోను బయటకు తీశారు. అతన్ని అరెస్ట్ ‌చేశారు. నిర్దిష్ట ఆరోపణలు లేకుండా సాధారణ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిజానికి, ఆ వీడియో సుమారు రెండేళ్లుగా వాటర్‌ ‌లైఫ్‌ ఇం‌టర్నేషనల్‌ అనే సంస్థ వెబ్‌సైట్‌లో ఉంది. ఈ సంస్థ నుంచే పాస్టర్‌ ‌ప్రవీణ్‌కు సంవత్సరానికి 25 కోట్ల రూపాయల మేర నిధులు అందుతున్నాయి. అంధులకు ఆశ్రయం కల్పించడం పేరున కాకినాడ సమీపంలో ప్రవీణ్‌ ‌నడుపుతున్న సిలోం బ్లైండ్‌ ‌సెంటర్‌, ఇటుక బట్టీలలో పనిచేసే బాలకార్మికుల విముక్తి కోసమంటూ సెట్‌ ‌ఫ్రీ అలయన్స్ ‌పేరుతో నడుపుతున్న మరో సంస్థ పేరున ఈ నిధులు వస్తున్నాయి. అయితే, వాస్తవంగా ఈ నిధులు ఉపయోగిస్తున్నది మాత్రం ప్రవీణ్‌ ‌నడుపుతున్న సిలోం పాస్టర్స్ ‌లీగ్‌. ఈ ‌సంస్థ ఆధ్వర్యంలో సుమారు మూడువేల మంది పాస్టర్లు మత ప్రచారం సాగిస్తున్నారు. నిజానికి ఇవేవీ ఎవరో కల్పించి చెపుతున్న విషయాలు కాదు. ప్రవీణ్‌ ‌తమ అమెరికన్‌ ‌స్పాన్సర్‌ ‌వాటర్‌ ‌లైఫ్‌ ఇం‌టర్నేషనల్‌కు రాసిన లేఖలో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. పాస్టర్‌ ‌ప్రవీణ్‌ ‌మీద చర్యలు తీసుకునే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే, విదేశీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు పెట్టాలి. కానీ, పోలీసులు ప్రవీణ్‌ ‌చేసిన పెద్ద నేరాలను పక్కనపెట్టి, అస్పష్ట ఆరోపణలతో కోర్టుల నుంచి తేలికగా బయటపడే సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కాబట్టి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందనే విషయం స్పష్టమవుతోంది.

About Author

By editor

Twitter
Instagram