ఆ ఆవేదన నిజం లోచన ప్రశ్నార్థకం

రైతు ఉద్యమాన్ని రైతు ఉద్యమంగానే చూడాలని, దానిని జాతీయోద్యమం అన్నట్టు చిత్రించడం సరికాదని అంటున్నారు డాక్టర్‌ ఎన్‌. ‌జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ (ఐఏఎస్‌) . ‌ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం పంజాబ్‌, ‌హరియాణా రైతులదేనని, కొన్ని భయాలూ, అపోహల వల్లనే అది రూపుదిద్దుకుందని కూడా అన్నారు. అయినా ఢిల్లీకి జలుబు చేస్తే మనం తుమ్మవలసిన అవసరం లేదన్నారు. కేంద్రం తెచ్చిన ఆ మూడు వ్యవసాయరంగ సంస్కరణ బిల్లులతో రైతుకు సంకెళ్లు తెగిపోతాయని ఆశించవచ్చునని ఆయన చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా బంద్‌లు, రాస్తారోకోలు సరికాదని అంటున్నారు. మిగిలిన ఏ రంగంలోను లేని ఆంక్షలు రైతులకు మాత్రం ఎందుకు విధిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఆ ఆంక్షల నుంచి రైతును గట్టెక్కించి, అదనపు ఆదాయం చేకూర్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన నమ్ముతున్నారు. కనీస మద్దతు ధరకీ, చట్టానికీ సంబంధం ఉండదనీ, గోధుమ-వరికి తప్ప మిగిలిన పంటలకు కనీస మద్దతు ధర వల్ల ఒక్క రూపాయి ఆదాయం కూడా పెరగదని ఆయన తేల్చి చెప్పారు. చిన్నరైతులు పంటను ఎక్కడికో పట్టుకెళ్లి ఎలా అమ్ముకుంటారన్న ప్రశ్న అర్ధరహితమని, ఒకచోట పంట ధర పెరిగితే అన్నిచోట్లా పెరుగుతుందని, ఇది ఆర్థిక సూత్రమని చెబుతున్నారాయన. బానిసత్వంలో ఉండొద్దని, సంకెళ్లు తెగిపోవాలనే ఎవరైనా కోరుకుంటారని చెబుతూ, అవి కొనసాగాలని కోరుకునే వారు ఎవరూ ఉండరని ఆయన చెప్పారు. యథాతథ స్థితిలో, సంకెళ్లలోనే ఉండాలంటూ రోడ్డెక్కేవారు ఉండరని కూడా చెప్పారు. ఈ ఉద్యమంలో ఆవేదన ఒక వాస్తవమే అయినా, రైతుల ఆలోచన ప్రశ్నార్ధకంగానే ఉందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్‌ ‌జేపీతో జాగృతి జరిపిన ముఖాముఖీ పాఠకుల కోసం..

ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆరంభంలో వారు కోరినట్టే కనీస మద్దతు ధర, వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ ‌కమిటీ వ్యవస్థ సుస్థిరతలకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నది. అయినా ఈ ప్రతిష్టంభన ఎందుకు?

ఒకటి మొదట అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో 20 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఎక్కువే కావచ్చు. ఇంతటి విశాల దేశంలో కేవలం పంజాబ్‌, ‌హరియాణాలు, కొద్దిగా పశ్చిమ యూపీ నుంచి.. ప్రధానంగా అవిభక్త పంజాబ్‌ ‌నుంచే ఈ ప్రతి ఘటనలు, నిరసనలు ఏమిటి? అయినా ఇదేదో జాతీయోద్యమం అన్నట్టు చిత్రించకూడదు. ఢిల్లీకి జలుబు చేస్తే మనం కూడా తుమ్మవలసిన అవసరం లేదు. పత్రికలు, టీవీ చానళ్లు అక్కడ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రచారం వస్తుంది. కానీ అక్కడివాళ్లకేమీ ఉండదు. మనమే ఇక్కడ ఉండి భూతద్దంలో చూస్తున్నాం. ఇంత విశాల దేశంలో మంచివీ, అవసరమైనవీ కొన్ని కొన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా కొన్ని ప్రాంతాలలో భయాలూ అపార్థాలూ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆనాటి అవిభక్త పంజాబ్‌ ‌రాష్ట్రంలో, అంటే పంజాబ్‌, ‌హరియాణాలలో అదే జరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే అక్కడ ఒక చట్టం తెచ్చి, దానితో మండీలు అని గొప్పగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ప్రతాప్‌సింగ్‌ ‌ఖైరాన్‌ ‌ముఖ్యమంత్రిగా, చౌతూరామ్‌ ‌వ్యవసాయమంత్రిగాను ఉండగా అది జరిగింది. వారిద్దరూ కూడా రైతు మంచిని కోరినవారు. సంక్షేమాన్ని ఆకాంక్షించినవారు. ఆ రోజుల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోను జరగనంత మంచిని రైతులకు చేసిపెట్టారక్కడ. ఇక మండీల నాయకులు కూడా అంతే. వీరు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పలుకుబడి ఉన్నవాళ్లు. మహారాష్ట్రలో చెరుకు కర్మాగారాల నిర్వాహకుల మాదిరిగా అన్నమాట. వారేమీ చెడ్డవారు కాదు. రైతు కుటుంబాలకు ఎంతో మంచి చేసినవారే.

మార్కెటింగ్‌ ‌చట్టాలలో ఇవాళ ఏం చేశాం! ఒకటి- రైతు తన పంటను మండీలలోనే అమ్ముకో నక్కరలేదు. ఎక్కడ సౌలభ్యంగా ఉంటే, ఎక్కడ ధర ఎక్కువ ఉంటే, తనకు సంతోషం కలిగించే చోటు ఎక్కడైనా అమ్ముకో వచ్చునని అన్నాం. అంటే మండీల గుత్తాధిపత్యం సడలిపోయినట్టే కదా! వందలో పది పోతే 90కి పడిపోయినట్టే కదా! 70 అయితే ముప్పయ్‌ ‌పడిపోయినట్టే కదా! మొత్తంగా మండీల నాయకుల ప్రభావం తగ్గిపోతుంది. రైతులేమో ఈ మండీల నాయకులకు విధేయులుగా ఉన్నారు. ఎక్కడో మండీయే అన్నం పెడుతున్నదన్న భావన. రెండోది- మండీలలో అమ్ముకోకపోతే సెస్‌ ‌చెల్లించనవసరం లేదని చెబుతున్నాం, రైతులకు అనుకూలంగా. ఇందువల్ల మండీల ఆదాయం పోతుంది.

ఇక అపోహ గురించి: ఒక బలమైన అపోహను పంజాబ్‌ ‌రైతుల మనసులలో నాటారు. దేశంలో గోధుమ, బియ్యం ప్రధానంగా ప్రభుత్వం సేకరించేది పంజాబ్‌, ‌హరియాణాల నుంచే. బియ్యం ఇక్కడే ఎక్కువ. అయినా ఇక్కడ నుంచి కంటే, అక్కడ నుంచే బియ్యం సేకరణ ఎక్కువ. అక్కడ బియ్యం తినే వాళ్లుండరు. అయినా అది మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకునే తరహా బియ్యం కాదు. ముతక బియ్యం. తెలుగు ప్రాంతాలలో ఉత్పత్తి చేసే బియ్యం రెండు రకాలు. సన్న బియ్యం. ముతక బియ్యం. ఇందులో సన్నబియ్యం మనం ఉంచుకుని, ముతక బియ్యం సరఫరా చేస్తాం. కానీ దేశంలో వరి, గోధుమ అవసరానికి మించి ఉత్పత్తి అవుతోంది. ఫలితం మార్కెట్‌లో రేటు బాగుండడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వం చెల్లించే ధర కంటే, మార్కెట్‌లో ధరే ఎక్కువ. కానీ పదేళ్లుగా మార్కెట్‌లో ధరే తక్కువగా ఉంది. కాబట్టి ఈ చట్టాలు తెచ్చి కనీస మద్దతు ధర ఎత్తేస్తారనీ, సేకరణ నిలిపివేస్తారనీ అపోహ రేగింది. ఇప్పుడు ఆ మూడు చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లంతా ప్రధానంగా, నా ఉద్దేశంలో 99 శాతం, వరి, గోధుమ రైతులే. కాబట్టి ఇలా అపోహలు, అపార్థాలు ఉన్నప్పుడు రాజకీయ కారణాలు కూడా వెనుక ఉంటాయి. పైగా, యాభయ్‌ ఏళ్లుగా నష్టపోతూనే ఉన్నాం, బాధలు పడుతూనే ఉన్నాం అన్న బాధ రైతాంగంలో ఉంది. ఇలాంటి సమయంలో ఒక్కసారి వ్యవసాయరంగంలో వేడిపుడితే ఏమవుతుంది? రాజకీయ పక్షాలు కూడా అధికారంలో ఉంటే ఒకరకంగా, విపక్షంలో ఉంటే ఒక రకంగా మాట్లాడుతుంటాయి. వీటన్నిటి ఫలితమే ఆ ప్రతిష్టంభన.

నెల దాటిపోయింది. ఢిల్లీ పరిస్థితులను బట్టి ఉద్యమం పేరుతో అక్కడికి వచ్చిన 25మంది వరకు రైతులు దుర్మరణం పాలయ్యారు. రైతులకు మద్దతుగా అంటూ ఒక న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నారు. ఖలిస్తాన్‌వాదుల చేతులలోకి ఉద్యమం వెళ్లిపోతున్నదన్న మాట మరొకటి. అంటే రోజులు గడిచే కొద్డీ కొత్త కొత్త కోణాలు కనిపిస్తు న్నాయి. కాబట్టి ఈ సమస్యకి పరిష్కారం ఏమిటి? ఎప్పుడు?

ఇక్కడ ఓ మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి- రైతు ఉద్యమాన్ని రొమాంటిక్‌గా చూడడం సరికాదు. వాస్తవాలను సాకల్యంగా, హేతుబద్ధంగా, చర్చ, తర్కాల పునాదిగా చూడాలి. అలా కాకుండా మా రైతు, మా వర్గం అంటూ ఉద్వేగంతో వ్యవహరిస్తే వాస్తవాల దగ్గరకి వెళ్లలేరు. రెండు- నేను మొదటి నుంచి కూడా బలవన్మరణాలను గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాను. ఆత్మహత్యల రాజకీయం చాలా ప్రమాదం. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌సుస్పష్టంగా చెప్పలేదా! ఆనాడు చేశారంటే, తెల్లవాళ్లు మనకి ప్రాధమిక హక్కులు ఇవ్వలేదు. ఓటు హక్కు ఇవ్వలేదు. ఏ హక్కు ఇవ్వలేదు. కాబట్టి వాటిని సాధించుకోవడానికి రకరకాల మార్గాలు అనుసరించా రప్పుడు. ఇప్పుడు స్వాతంత్య్రం వచ్చింది. మనం ఎన్నుకున్న ప్రభుత్వం ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ఓటు హక్కు ఇచ్చింది. కాబట్టి హింస, నిరాహార దీక్షలు, బలవన్మరణాలు, ఇతరుల హక్కులకు భంగం కలిగిస్తూ చేసే బంద్‌లూ రాస్తారోకోలూ ఆధునిక వ్యవస్థలో సరికాదు. స్వతంత్ర సమాజంలో, రాజ్యాంగ బద్ధ పాలనలో సరైనవి కాలేవు. దురదృష్టవశాత్తు దేశంలో ఏ రాజకీయ పార్టీ డాక్టర్‌ అం‌బేడ్కర్‌ ‌మాటను పాటించడం లేదు. కాబట్టి చర్చలో, సమస్య పరిష్కారంలో ఉద్విగ్నతకు చోటివ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తాను. అసలు విషయం పక్కదోవ పడుతుంది కదా! మూడు- మనది సంక్లిష్ట సమాజం. ఎన్నో వర్గాలూ, భాషలూ, మరెన్నో సంస్కృతులు. అయినా మనం సమైక్యంగా ఉండడం అత్యద్భుతం. అయినా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఒకప్పుడు ఖలిస్తాన్‌ ఉద్యమం ఉంది. ఈశాన్యంలో అలజడి ఉంది. అయినా గానీ రైతు సమస్యను రైతు సమస్యగానే చూద్దాం. రైతు వేదన గొప్ప వాస్తవం. ఆ వేదన మూలాలను బట్టి పరిష్కారాలను అన్వేషించాలి. అర్థమయ్యేటట్టు వారికి చెప్పాలి. రెచ్చగొట్టి ఉద్వేగానికి తావివ్వకూడదు. నేను ప్రభుత్వాన్నీ, పత్రికలనీ కోరేదేమిటంటే ఎవరికి ఎవరినీ దూరం చేయకండి. అంతకంటే రైతుకు అన్యాయం జరుగుతోందని అంతా ఒప్పుకుంటున్నాం కదా! వాళ్లకి న్యాయం జరగాలనే కదా మన కోరిక. ఇందుకు రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి.

ఒకటి: ప్రభుత్వం దుర్మార్గంగా వేసే సంకెళ్లు తొలగించి, రైతుకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించాలి. ఇప్పుడు కేంద్రం తెచ్చిన ఆ మూడు చట్టాలు అలాంటి ఆర్థిక స్వేచ్ఛను ప్రసాదించడానికి ఉద్దేశించినవే. ఇప్పటిదాకా రైతాంగానికి దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి చేసిన ప్రయత్నమది. అయితే ఇవి కూడా సరిపోవనే అంటున్నాను నేను. ఇవికాక, రైతాంగానికి అదనంగా లబ్ధి చేకూర్చే రీతిలో ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగు తున్నాయి కూడా. ఇంకా చేయాలి. సంకెళ్లు అంటే- మీరు ఉత్పత్తి చేసినదేదైనా ఇక్కడే అమ్మాలన్న ఆంక్ష రైతుకు తప్ప మిగిలిన ఏ రంగంలో అయినా చూస్తామా! ఒక పెన్సిల్‌, ఒక కంప్యూటర్‌, ఒక యంత్రం ఉత్పత్తి చేస్తే ఫలానా చోట తప్ప అమ్మరాదని చెబుతున్నామా? వీళ్లకే అమ్ముకోవాలని నిర్దేశిస్తున్నారా? ఒక టీచర్‌నీ, ఒక ఇంజనీర్‌నీ మీ సేవలు ఒక పరిధికేనని ఎవరైనా శాసిస్తున్నారా? ఒక డాక్టర్‌ని ఇక్కడే వైద్యం చేయాలనీ, లేదా ఒక ఆర్కిటెక్ట్‌ను ఇందుకోసమే పని చేయాలనీ లక్ష్మణరేఖలు గీసిపెడుతున్నదా ప్రభుత్వం? అలాగే వ్యాపారం. ఈ వ్యాపారమే చేయాలనీ, ఇక్కడే చేయాలనీ ఆదేశిస్తున్నారా? మరి రైతులకు మాత్రమే ఈ నిబంధన ఏమిటి? రైతులకు అన్యాయంగా పడిన సంకెళ్లను తెంచడానికే ఆ చట్టాలు తెచ్చారు. కానీ ఈ విషయాలు రైతుకు అర్ధమయ్యేటట్టు చెప్పడంలో ఎక్కడో లోపం జరిగింది. ఇక పత్రికలు, టీవీ చానళ్లు చూస్తుంటే మరీ వింతగా ఉంది. ఆ ఉద్యమాన్ని అందమైన దృశ్యంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ వర్ణనలలో కూరుకుపోతూ అసలు సంక్షోభానికి కారణం ఎక్కడ ఉంది? ప్రభుత్వాల పాత్ర ఏమిటి? ఈ చట్టాల వల్ల రైతుకు అధిక ధర లభిస్తుందా? లేదా? వంటి చర్చకు చోటు తగ్గించేస్తున్నారు. అక్కడే వండుకుని తినడం, చలిలో పడుకోవడం.. ఉద్వేగంగా చెబుతున్నారు. ఆ నినాదాలు, హడావుడి దృశ్యీకరిస్తున్నారు. దీనితో రైతు సంక్షేమం అన్న ఆశయం తెర వెనక్కి పోతోంది.

గోధుమ, వరి రైతులే ఈ చట్టాలను వ్యతిరేకిస్తు న్నారు. కనీస మద్దతు ధర గురించి పట్టుపడు తున్నారు. చట్టబద్ధం చేయాలంటున్నారు. కానీ ఇది రైతాంగం మొత్తం సంక్షేమాన్ని కోరే ఉద్యమమే అయితే 21 వరకు పంటలకే పరిమితమైన కనీస మద్దతు ధరను మిగిలిన పంటలకు వర్తింప చేయాలన్న డిమాండ్‌ ఎం‌దుకు రావడం లేదు?

కనీస మద్దతు ధర వల్ల ఏ పంటకీ అదనంగా ఒక్క రూపాయి కూడా ఆదాయం పెరగదు. అన్నీ నామమాత్రమే. కనీస మద్దతు ధర పరిధిలో ఉన్న పంటలను కూడా నామమాత్రంగానే కొనుగోలు చేస్తారు. అది పేరుకే. ఈ వస్తువు నా దగ్గర ఉంది అని చెబితే కొనే నాథుడు లేడు. కనీస మద్దతు ధరతో కాస్త మేలు జరుగుతున్నది గోధుమ, బియ్యం ఉత్పత్తులకే. పెట్టుబడి మీద ఓ పదిరూపాయలు అదనంగా వస్తాయేమో! అదీ చాలదు. ఇక పత్తి వంటి పంటల మీద ఖర్చులు కూడా తిరిగి రావు. చాలా మద్దతు ధరలు కాగితం మీదనే ఉన్నాయి.

ఇంతకు ముందు శరద్‌జోషి, మహేంద్ర సింగ్‌ ‌తికాయత్‌ ‌వంటి వారు రైతు ఉద్యమాలు నడిపారు. ఇవాళ్టి ఉద్యమం వాటి కంటే ఏ విధంగా భిన్నమైనదంటారు?

నా ఆలోచనలను ప్రభావితం చేసిన ఇక్కడి పెద్దలలో శరద్‌జోషి ఒకరు. ఆయన నాకు మిత్రుడు, గురువు కూడా. వ్యవసాయం, రైతు సంక్షేమం వంటి అంశాలలో ఆయనకు మించిన దూరదృష్టి కలిగిన వారు దేశంలో ఇంకొకరు లేరు. పంటలకు గిట్టుబాటు ధరలు రాకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాల వల్లనేనని ఈ దేశంలో ఎలుగెత్తి చాటిన మొదటి వ్యక్తి జోషి గారు. సాధికారికంగా, వాస్తవిక ఆధారాలతో ఈ విషయం వెల్లడించారాయన. ఈ దేశంలో రైతు ఉద్యమ ధోరణులు రెండు రకాలు. నాకు ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వండి. మార్కెట్‌లో ధర పెరిగే వెసులుబాటు కల్పించి, మా ఆదాయం పెరిగే మార్గాలు మూసేసి సంకెళ్లు వేయకండి. ఈ సంకెళ్లు, గుదిబండలు తొలగిస్తే మేమే మా కాళ్ల మీద నిలబడతాం. అనేది ఒక పంథా. ఇది శరద్‌ ‌జోషి ధోరణిలోనిది. నిజమే, ప్రభుత్వం నుంచి సాయం పొందే హక్కు దేశ ప్రజలందరికీ ఉంది. రెండో రకం ధోరణి: ఇది తికాయత్‌ ‌గారిది. ఆత్మనిర్భరత, స్వావలంబన వంటి వాటి జోలికి వెళ్లకుండా ఉచితాలు కోరుకుంటారు. సబ్సిడీలు కావాలంటారు. మరొకటి ఇవ్వండి అని కోరతారు. ఇవాళ్టి ఉద్యమ పోకడలో తికాయిత్‌ ‌కనిపిస్తాడు. అయితే ఈ రెండు ధోరణులు రైతు శ్రేయస్సు కోసమే. మొదటిది మాత్రం రైతుల సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించజాలదని నమ్ముతుంది. ఆర్థిక స్వేచ్ఛ ప్రధానమంటుంది. రాజ్యాంగంలోని 12-1జి ఇస్తున్న స్వేచ్ఛను రైతుకు లేకుండా చేయవద్దు అంటుంది. రైతుకు సంకెళ్లు ఉన్న వాస్తవాన్ని అంతా అంగీకరిస్తున్నారు. నేనే కాదు, ఎందరో ఆర్థికవేత్తలు ఇదే నిజమని చెబుతున్నారు. దీనిని కాదనే అవకాశమే లేదు. వాస్తవాన్ని గమనించిన ప్రభుత్వం ఇన్నాళ్లకు మేల్కొని చెంపలు వేసుకుని ఈ మూడు చట్టాలు చేసింది. వచ్చిన చట్టాలు ఏం అద్భుతాలు చేసి చూపుతాయో వేచి చూడాలి. వీటితో నష్టం ప్రశ్న అయితే లేదు.

మూడు చట్టాలతో దళారీ వ్యవస్థకు చోటు ఉండదని, రైతే నేరుగా పంటను అమ్ముకోవచ్చునని ప్రభుత్వం చెబుతున్నది. కానీ పాత పద్ధతే మేలు, అంటే చట్టాలు రాని క్రితం పరిస్థితే చాలునన్నట్టు ఉద్యమకారులు చెబుతున్నారు. ఇదెంత వరకు వాస్తవం?

సంకెళ్లు కావాలనీ, మేమంతా వాటి మధ్యనే ఉంటామనీ రైతులందరి తరఫున చెప్పే హక్కు వాళ్లకి లేదు. ఆందోళన చేస్తున్నవారు పంజాబీలు. వారి ఇష్టం మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చేత సంకెళ్లు వేయించుకోవచ్చు. వేరేవారిని ఎందుకు బాధించడం? స్వేచ్ఛ అవసరం లేదని మీరు అనుకున్నంత మాత్రాన ఎవరికీ ఆ అవసరం లేదని ఎలా అంటారు? నిజానికి ఇది పంజాబ్‌ ‌రైతుల సొంత వ్యవహారం కానేకాదు. నాది, మీది కూడా. చట్టాలతో పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చుననే స్థిరంగా చెబుతోంది. మండీలలో మద్దతు ధర బాగా ఉంటే అక్కడే అమ్ముకోవచ్చు. ఎవరూ వద్దనడం లేదు. ఇంతవరకు మండీలకే అమ్మాలని చట్టం. మండీల కంటే బయట ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకోవచ్చు అని ఇప్పుడు అంటోంది. బయటే అమ్మి, మండీలను వదిలివేయ మని అనడం లేదు. బయట అమ్ముకోవడానికీ అవకాశం ఇస్తోంది. బాగుంటే, ఇష్టమైతేనే అమ్ముకోవచ్చునంటున్నది. ఎక్కడ ధర వస్తే అక్కడ అమ్ముకోమంటున్నది. అంటే ఆంక్షలు ఎత్తేశారు.

మధ్య దళారీలు, దళారీ వ్యవస్థ పోవాలన్నది చిరకాల నినాదం. అయితే ఈ నినాదం నీడలో రైతుల కొన్ని వాస్తవిక సమస్యలు కూడా, దళారీ వ్యవస్థతో సంబంధం లేనివి- మరుగున ఉండి పోతున్నాయి. అసలు దళారీ వ్యవస్థను నిర్మూలిస్తే రైతాంగ సమస్యలన్నీ సమసిపోతాయా?

కావు. అసలు దళారీ అన్న పదాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ఆ వ్యవస్థని ప్రపంచమంతటా విధిగా భావిస్తారు. ఉత్పత్తిచేసే వాడికీ, కొనుగోలు దారుడికీ నడుమ ఎవరూ లేకపోతే అసలు ఆర్థిక వ్యవస్థలో కదలికే ఉండదు. ఒక సబ్బు తీసుకోండి! ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లి మనం కొనడం సాధ్యం కాదు. హోల్‌సేల్‌ ‌వర్తకుడు, డిస్ట్రిబ్యూటర్‌ ‌రిటైలర్‌, ‌రవాణా చేసేవాడు… పేరు ఏదైనా ఒక మధ్యవర్తి అనివార్యం. కానీ ఇక్కడ వీళ్లు ఎక్కువైపోయారు. పైగా గుత్తాధిపత్యం సంపాదించారు. దీనినే ఆ మూడు చట్టాలలోని మార్కెటింగ్‌ ‌చట్టం అరికడుతోంది. అంతేకాదు, దళారీల మధ్య పోటీ పెంచుతుంది. అప్పుడు రైతుకు ఆదాయం పెరుగుతుంది. వినియోగదారుడికి భారం తగ్గుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? కొన్ని వ్యవసాయోత్పత్తులను మనం బయట వంద రూపాయలకు కొంటే, రైతుకు వెళ్లేది 25 రూపాయలే. కొన్ని పంటలయితే పది రూపాయలే కూడా. అదే మధ్యవర్తుల మధ్య పోటీ పెరిగితే రైతుకు యాభయ్‌ ‌రూపాయలు దక్కుతాయి. ఇప్పుడు మార్కెట్లు మాఫియాల చేతులలోకి పోయాయి. అందుకే ఈ చట్టాలు మార్కెటింగ్‌ ‌వ్యవస్థను ఆధునీకరించేందుకు ఉపకరిస్తాయి. ఇదంతా అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. పైగా ఇది విస్తృతమైన సమస్య. నిజానికి ఈ దేశంలో సగం జనాభాకు చెందిన సమస్య. రైతుకు ఆదాయం ముఖ్యం. ఈ చట్టం దానికి హామీ ఇస్తున్నది. ఒక ఉదాహరణ. మన రాష్ట్రంలో పండే ఒక రకం సన్న బియ్యం ధర 2012లో బస్తాకు 750 రూపాయలకు పడిపోయింది. ఇదే బియ్యం అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్రలలో 1200 ధర పలుకుతోంది. కానీ పాత చట్టాల వల్ల రవాణా మీద ఆంక్షలు. ఇక్కడ కొనేవాడు లేడు. అలా అని నిల్వ చేయలేరు. అంటే తెగనమ్ముకోవాలి. అప్పుడు నేను, ఇంకొంతమంది సంకేతాత్మకంగా చేతులకు సంకెళ్లు వేసుకుని వెళ్లి సరిహద్దులలో అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ప్రాంతాలలో ధాన్యం అమ్మాం. దీనితో కొద్దిరోజులలోనే అదే ధర ఇక్కడా ఇచ్చారు. రూ. 3,600 కోట్లు అదనపు ఆదాయం వచ్చింది రైతులకి. దీనిని ఎలా కాదంటారు? ప్రభుత్వం చాలా చేయాలన్నది సరైన వాదన. ఇంకా చాలా చేయాలీ అంటూనే, ఇప్పుడు చేసినదానిని కూడా కాదనడం, చేయకుండా ఆపేయాలనడం సరైన వాదన అనిపించు కోదు. ఈ రెండింటికీ చాలా తేడా ఉంది.

రైతు ఉద్యమాలంటే సేద్యంలో కీలకంగా ఉండే కౌలు రైతుల, రైతుకూలీల సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఉంటాయి. ఢిల్లీలో రైతులు వీరి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదు?

ప్రస్తావించడం లేదు. కానీ ఇందుకు నేను తప్పు పట్టను. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం కావు. ఏ చట్టమైనా, ఉద్యమమైనా ఏకకాలంలో పరిష్కారాన్ని అందించలేవు. ఇక, నేను కౌలురైతునే అనుకుందాం. శిస్తు యజమానికి ఇచ్చి మిగిలినది అమ్ముకుంటాను. ఇప్పుడు మార్కెట్‌లో ధర పెరిగే అవకాశం వచ్చింది. అది కౌలు రైతుల ఉత్పత్తికీ వర్తిస్తుంది. చిన్నరైతుకీ, పెద్ద రైతుకీ అందుతుంది. చిన్నరైతు పక్క రాష్ట్రానికి తీసుకుపోయి అమ్ముకుంటాడా అంటూ కొందరు విమర్శిస్తున్నారు. ఇది సరైన అవగాహన కానేకాదు. ఒక వస్తువుని మీరు ఎక్కువ ధరకు అమ్ముకున్నారు. వెంటనే నా వస్తువుకీ ధర పెరుగుతుంది. ప్రతివారు పక్క రాష్ట్రానికో, దేశానికో పోయి ఉత్పత్తిని అమ్మరు. కానీ ఆ వస్తువుని రవాణా చేసే అవకాశం ఉండి, ఆంక్షలు లేకుంటే అన్ని చోట్లా దాని ధర సమానమే అవుతుంది. అంటే ధర పెరుగుతుంది. ఇది ఆర్థిక సూత్రం. కాబట్టి మంచి ధర రావడానికి చిన్నాపెద్దా తేడా ఉండదు. ఈ అంశం గురించి ఢిల్లీలో ఆందోళన చేస్తున్నవాళ్లు ఆలోచించడం లేదు. రైతులలో ఆవేదన ఉంది. కానీ ప్రయోజనాల గురించి పట్టించుకోవడం లేదు. ఇది నేను స్పష్టంగా చెబుతున్నాను. వారికి చిత్తశుద్ధి ఉంది. కసి కూడా ఉంది. నాయకత్వం రైతాంగానికి ఏం కావాలో యోచించాలి. ఇంకా ఏం కావాలో ప్రభుత్వాన్ని అడగాలి. అవి పొందాలి. కసి వేరు, విజ్ఞత వేరు. ఆర్తి వేరు, అవగాహన వేరు. ఎంతో కొంత మేలు జరుగుతూ ఉంటే వద్దనడం విజ్ఞత కాదు. అందుకే శరద్‌జోషి వంటి నాయకులు రావాలి.

వాళ్లు నన్ను అడిగితే- ఇప్పుడు వచ్చిన స్వేచ్ఛను, ప్రయోజనాలను పొందండి. తరువాత, ఈ స్వేచ్ఛ చాలదు. మాకు సుదీర్ఘకాలంగా అన్యాయం జరిగింది. సేద్యం ప్రపంచంలో ఎక్కడైనా కష్టతరమే. మిగతా వ్యాసంగాల వంటిది కాదు. మాకు ఎప్పుడూ నష్టమే. కాబట్టి ఆ ప్రయోజనాలతో పాటు అదనంగా నాలుగైదు ప్రయోజనాలు సమకూర్చండి అని ప్రభుత్వాన్ని కోరమని చెబుతాను. కానీ వారు అలా అడగడం లేదు. చట్టాలు రద్దు చేయమంటున్నారు. చట్టంలో కనీస మద్దతు ధరను చేర్చమంటున్నారు. కానీ కనీస మద్దతు ధరకీ, చట్టానికీ సంబంధం లేదు.

ఒక అంచనా ప్రకారం దేశంలో నాలుగు లక్షల మంది వరకు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. కానీ ఈ అంశం ఢిల్లీ రైతుల ఆందోళనలో కనీసంగా కూడా ఎందుకు ప్రస్తావనకు రావడం లేదు? కానీ రైతుల బలవన్మరణాల గురించి ఏ ఒక్కరోజు తీవ్రంగా ఆలోచించని పార్టీలు, మీడియా ఇప్పుడు ఎందుకు అక్కడ రైతులకు మద్దతు పలుకుతున్నాయి?

ప్రపంచంలో ప్రజాస్వామ్య రాజకీయాలలో దురదృష్టం ఏమిటంటే- ఎక్కడైనా జనం తిరగబడ్డా రంటే, అక్కడ నాలుగు ఓట్లు ఉన్నాయంటే, అదే చాలు. మంచిచెడ్డలు అక్కరలేదు. విషయం ఏమిటో అసలే అక్కరలేదు. సందిట్లో సడేమియా అన్న సంస్కృతి పెరిగిపోయింది. ఇంతకు ముందు అనుకున్నట్టు ఒక రాజకీయ పక్షం అధికారంలో ఉండగా ఒకటి అంటుంది. విపక్షంలో కూర్చుంటే ఒక మాట అంటుంది. ఇవాళ ఒక మాట, రేపు వేరొక మాట. ఉదాహరణకి: తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏమని ప్రకటించింది? రైతులు పండించిన పంటంతా ప్రభుత్వం కొనడం ఎలా సాధ్యం అంటున్నది. మరి, ఇదే కదా కేంద్రం తెచ్చిన చట్టం చెబుతున్నది! మీకు ధర వచ్చిన చోట అమ్ముకోవాలని చెబుతోంది. కేంద్రం చట్టం కూడా అదే కదా చెప్పింది! తర్కం ఉపయోగిస్తే ఒకరకంగా మాట్లాడతాం. రాజకీయం కోసం మరొక రకంగా మాట్లాడతాం. అసలు పంట పండించే రైతు అంతరంగం ఏమిటి? తన కష్టానికి తగిన ఫలితం. అందుకు అతడికి ఇష్టమైన చోట అమ్ముకునే స్వేచ్ఛ ఉండాలి. అందుకు ఇప్పుడున్న సంకెళ్లు పోవాలి. అంతేతప్ప, ప్రపంచంలో ఎవరైనా బానిసత్వం ఉండాలని, తాను బానిసత్వంలోనే కొనసాగాలనీ కోరుకుంటాడా? బానిసత్వం కోరుకుంటూ రోడ్డెక్కినవాళ్లని ప్రపంచంలో ఎక్కడైనా చూస్తామా! అసలు ఇంతవరకు జరిగిన పోరాటాలన్నీ సంకెళ్లు తెంచుకోవడానికి కాదా! అలాగే, సంకెళ్లు తీసేశాం, హక్కులు ఇచ్చేశాం అంటేనే చాలదు. వారి ఆరోగ్యం, వారి పిల్లల విద్య, పనిచేసే స్థలంలో భద్రత వీటి మాటేమిటి? అవన్నీ నిజమే. కానీ ముందు సంకెళ్లు పోవాల్సిందే. తరువాత అంతకు మించి పొందాలి. ఇది ఆలోచించాలి. కానీ అది జరగడం లేదు. ఇందుకు పత్రికల బాధ్యత కూడా ఉంది. చాలా పత్రికలు గుడ్డిగా రాస్తున్నాయి. రైతుల ఉద్యమాన్ని రొమాంటిసైజ్‌ ‌చేస్తున్నాయి. చానళ్లు అరుపులు, కేకల చర్చలకే పరిమితమవుతున్నాయి. చట్టాల వల్ల లాభాల గురించి బేరీజు వేయడం లేదు. ఎనభయ్‌ ‌శాతం ఇలాగే ఉన్నాయి. ముందుచూపు లేదు. అవగాహన లేదు. అయితే నేను ఎవరి చిత్తశుద్ధిని శంకించడం లేదు. ఉన్న పరిస్థితి మారాలనే అంటున్నాను.

బఫర్‌స్టాక్స్‌కీ, పంట దిగుబడికీ మధ్య ఎలాంటి సమతౌల్యం ఉండాలంటారు?

ఆర్థికవేత్తలు, ఆహార రంగ నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మనదేశంలో దాదాపు 15 మిలియన్‌ ‌టన్నులు – కోటీ యాభయ్‌ ‌లక్షల టన్నులు- ఉన్నాయి. ఇవి చాలు, ఈ నిల్వలతో ఎలాంటి కొరతనైనా దేశం ఎదుర్కొనవచ్చు. ఈ సంవత్సరం మన దిగుబడి ఎంత? ఎనిమిది కోట్ల 30 లక్షల టన్నులు. ఇవాళ ఆహార కొరత ఎక్కడ ఉన్నా ఆర్డర్‌ ఇస్తే మరునాడు ఓడలో దిగిపోతుంది. భారత్‌తో పాటు ప్రపంచంలోనే మిగులు ఉంది. పూర్వం మాదిరిగా ఆహారం లేక చచ్చిపోవడం లేదు. మారుమూల కూడా ఆహారం అందని స్థలం లేదు. అయితే ఆహారం పొందని వాళ్లు ఉండవచ్చు. భారతదేశం వరకు కొనుక్కుందామంటే ఆహారానికి లోటే లేదు. ఇది నేను కచ్చితంగా చెబుతాను. బీదరికం ఉంది. దానికి డబ్బులు ఇవ్వాలి. అది వేరు. కోట్లకొద్దీ టన్నులు ఆహారపు నిల్వలు ఉంచుకోవా లన్నది పురాతన ఆలోచన. ఆహార పదార్ధాలతో అమెరికా నుంచి వచ్చే ఓడల కోసం ఎదురు చూసే రోజులు పోయాయి. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుల కోసం అన్నీ దాచిపెట్టారు. అలా దాచి పెట్టడం ఎనభయ్‌ ఏళ్లనాటి ఆలోచన. మన దేశంలో గడచిన 15-20 ఏళ్ల లెక్కలు చూడండి! వర్షాలు పడిన సంవత్సరాలు ఉన్నాయి. పడని సంవత్స రాలు ఉన్నాయి. అలాగే తుపాన్లు వచ్చినవి రానివీ, వరదలు వచ్చినవీ, రానివీ కూడా సంవత్స రాలు ఉన్నాయి. కానీ ఆహారధాన్యాల ఉత్పత్తి తగ్గలేదు. ఆకలి బాధ ఉంది. అది ఉత్పత్తికి సంబంధించిన బాధ అనలేం. ఆహార భద్రత పేరుతో కోట్ల టన్నులకొద్దీ దాచనక్కరలేదు. కిలో బియ్యం పథకం చూడండి. కిలో రెండు రూపాయలకు తీసుకుని, రేషన్‌ ‌షాపు దగ్గరే పదిహేను రూపాయల వంతున నలభయ్‌ ‌శాతం మంది మిల్లర్లకి అమ్ముకుంటారు. మిల్లర్లు దానినే ముప్పయ్‌ ‌రూపాయలకు ప్రభుత్వానికి విక్రయిస్తారు. అంటే మొదట మిల్లర్లే ప్రభుత్వానికి కిలో బియ్యం ముప్పయ్‌ ‌రూపాయలకి అమ్ముతారు. రేషన్‌ ‌షాపులో అదే రెండు రూపాయలు. అక్కడే మళ్లీ పదిహేను రూపాయలకు మిల్లరే కొని, మళ్లీ ఎఫ్‌సిఐకి ముప్పయ్‌ ‌రూపాయలకి అమ్ముతారు. కాబట్టి చిత్తశుద్ధితో యోచించి, ధనాన్ని వృధాగా పోనీయ రాదు. దానిని రైతుకు సాయపడడానికి ఖర్చు చేయాలి. ఒకరోజు ముప్పయ్‌ ‌రూపాయలు ఉన్న టొమేటో ఇంకొక రోజు రెండు రూపాయలు కూడా ధర పలకకపోవడం ఏమిటి? ఇది మారాలి.

భారత ఆహార సంస్థకి, రైతులకీ బంధం ఏమిటి?

గోధుమ పంటకి ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. వరి రైతుతో ఉండదు. వరి రైతుకీ, భారత ఆహార సంస్థకి మధ్య మిల్లర్లు ఉంటారు.

ప్రకృతి కరుణ మీద ఆధారపడి ఉన్న సేద్యంలో ఒడిదుడుకులు సహజం. ప్రకృతి, ప్రపంచ పరిస్థి తులు, మారిపోతూ ఉండే విధానాలు, ప్రాధాన్యాలు – వీటి నడుమ రైతును భద్రంగా ఉంచడానికి ఇప్పటికి చేపట్టగలిగిన జాగ్రత్తలు ఏవంటారు?

భారత రైతు సంకెళ్లతో ఉన్న మాట నిజం. కష్టపడి పండించిన పంటను కూడా నిల్వ ఉంచుకో కూడదని చెప్పే దుర్మార్గపు చట్టాలు చేశారు ఇక్కడ. మా చిన్నప్పుడు చూశాం. ఊళ్లోకి తహసీల్దార్‌ ‌వస్తే మా తాతగారు, ఇతర రైతులు కనిపించేవారు కాదు. కారణం, పండించి ఏవేవో కారణాలతో దాచిపెట్టిన ధాన్యం గురించి తమని ప్రశ్నిస్తారని. ఇదేమిటి? ఇప్పుడు వచ్చిన చట్టాలు ఆ సంకెళ్లు తెంచడానికి ఉపయోగపడతాయి. వీటితోనే అద్భుతాలు జరిగిపోతాయని మాత్రం అనుకోలేం. అయినా ఈ చట్టాలు నేటి అవసరమే. ఎందుకంటే వ్యవసాయ రంగంలో సంక్షోభం ఒక వాస్తవం. ఇక్కడే కాదు. ప్రపంచంలో చాలా దేశాలలో సేద్యం సంక్షోభాన్నే ఎదుర్కొంటున్నది. ఆ దేశాలు వ్యవసాయ రంగాన్ని రక్షించుకోవడానికి రైతుకు అదనపు ఆదాయం సమకూరుస్తున్నాయి. ఇక్కడ కూడా అది జరగాలి. అందుకు ఏం చేయాలి! పంటల రేటు పడిపోవడం సర్వసాధారణం. వ్యవసాయం అంటే పరిశ్రమలో ఉత్పత్తిలా ఉండదు. అక్కడ డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. సేద్యంలో అది అసాధ్యం. కాబట్టే ధర పడిపోవడం రైతుకు సర్వసాధారణం. ఎంత మహా నాయకుడైనా, ఆఖరికి రైతే అయినా ఈ సంవత్సరం దిగుబడి ఇంత అని చెప్పగలరా? హెచ్చుతగ్గులు నిజం. కానీ పంట తగ్గితే రైతులు డబ్బుల కోసం తెగనమ్ముకోవాలి. అదృష్టం బాగుండి విరివిగా పండితే, అధికార యంత్రాంగం ధర పడిపోయేదాకా నిద్రపోదు. ఇప్పుడు వచ్చిన నిత్యావసర వస్తువుల చట్టం ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు పనిచేస్తుంది. కానీ ఇది చాలదు. ధర లేనపుడు ఈ చట్టం రైతుకు ఉపయోగపడదనే చెప్పాలి. అందుకే ధర పడిపోతే తెగనమ్మవలసిన పరిస్థితి రాకుండా, పంట బాగున్నప్పుడు ధరను యంత్రాంగం దింపకుండా చూడడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. ధర వచ్చేదాకా పంటను నిల్వ చేసుకునే అవకాశం రైతుకు ఉండాలి. అంటే అతడు పంట దాచుకోగలగాలి. అదే సమయంలో ఇంట్లో గడవాలి. మళ్లీ పంటకు పెట్టుబడి పెట్టాలి. ఈ రెండు ప్రయోజనాల కోసం రైతు వద్ద ఉన్న నిల్వను తనఖా పెట్టుకోవాలి. గిడ్డంగులు ఏర్పాటు చేసి, అందుకు అవకాశం ఇవ్వాలి. ఇందుకోసం ప్రధాని మోదీ వెంటనే లక్ష కోట్లతో నిధి ఏర్పాటును ప్రకటించాలి. నిజానికి ఈ సమస్య గోధుమ, వరి రైతులకు రాదు. పత్తి, మిర్చి,పసుపు, పళ్లు, కూరలు పండించేవారికే వస్తుంది. వీటి ధరలలో ఎగుడుదిగుళ్లు ఎక్కువ.

మన దిగుమతులలో రెండు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి. అవి- వంటనూనెలు, పప్పులు. గోధుమ, బియ్యం నిల్వలలో మనది అగ్రస్థానం. అలాగే వంటనూనె, పప్పుల దిగుమతులలో కూడా మనదే అగ్రస్థానం. కాబట్టి సమతూకం దెబ్బ తింటున్నది. ఆ రెండు దిగుమతుల మీద సుంకాలు విధించమని చిరకాలం నుంచి చెబుతుంటే, మొత్తానికి నూనెల మీద వేశారు. పప్పులు మీద నేటికీ సుంకాలు లేవు. అయితే నూనెల మీద వేసిన సుంకాలతో వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం ఖజానాకు పంపుతోంది. అలా కాకుండా, పప్పులు పండించే రైతులకు ఎకరాకు లేదా బస్తాకు ఇంతని ముట్టచెబితే మంచిది. దానితో పంట పెంచుతారు. కొంత కాలానికైనా వాటి దిగుమతి అవసరం తగ్గుతుంది. ఇది మెట్ట ప్రాంత రైతులకు గొప్ప ప్రయోజనం కూడా. రైతులలో డెబ్బయ్‌ ‌శాతం వారే. ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దీనిని ప్రభుత్వం వెంటనే ప్రకటించ వచ్చు కూడా.

రైతుకీ, వినియోగదారులకీ మధ్య దూరం తగ్గించాలి. విదేశీ మార్కెట్‌లతో అనుసంధానం చేయాలి. పెట్టుబడులు తేవాలి. మనకు పండించే శక్తి, సామర్థ్యం పుష్కలం. కానీ విదేశీ మార్కెట్‌లో మన వాటా చాలా పరిమితం. నామమాత్రం.

 ఈ మూడు చేయగలిగితే ఎనిమిది లక్షల కోట్లు అదనపు ఆదాయం రైతుకు వస్తుంది. ఇలాంటి గొడవలు చల్లారిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram