సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి భాద్రపద బహుళ ద్వాదశి – 14 సెప్టెంబర్‌ 2020, ‌సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ –  బృహదారణ్యకోపనిషత్‌


ఏ కాలంలో అయినా దేశ నిర్మాణంలో శ్రమజీవులది విస్మరించలేని పాత్ర. సమాజ సౌభాగ్యం వారి పుణ్యమే. సేద్యగాళ్లు, వృత్తులవారు, సేవలు అందించేవారు-అంతా శ్రమజీవులే. కర్మాగారాలలో పనిచేసే సంఘటిత కార్మికశక్తిని కార్మికులుగా పేర్కొనడం, వారి అవసరాలు, సంక్షేమం ప్రాతిపదికగా ఉద్యమాలు జరగడం పారిశ్రామిక విప్లవఫలితమే. మన స్వాతంత్య్ర పోరాటానికి చాలా ముందే కార్మికోద్యమం ఉంది. మొదటి కార్మిక సంఘం బొంబాయి జౌళి పరిశ్రమలలో కనిపిస్తుంది. మూడేళ్ల తరువాత కలకత్తాలో ఆరంభమైంది. మొదటి ఫ్యాక్టరీ కమిసన్‌ను 1879లో నెలకొల్పారు. తొలి ఫ్యాక్టరీల చట్టం 1881లో వచ్చింది. అప్పుడే కొందరు మహిళా కార్మికులు ఆదివారం సెలవు కోరారు. నిర్ణీత పనిగంటలు హక్కును కూడా కార్మికులు అలా కోరి సాధించుకున్నదే. అంతేకాని కమ్యూనిస్టులు ఒక్కరే సాధించినది కాదు.

ఆధునిక భారత కార్మికోద్యమానికి మూడు దశలు ఉన్నాయని చెబుతారు. 1919-1947 కాం తొలి దశ. 1947-1989 రెండో దశ. ఆపై మూడో దశ. మొదటి రెండు దశలను కాంగ్రెస్‌, ‌వామపక్షాలు, సోసలిస్టులు శాసించారు. ఇప్పుడు కొనసాగుతున్న మూడో దశ భారతీయతే సిద్ధాంతంగా ఉన్న భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ ‌వశం కావడం గొప్ప విశేసం. 2012లో ఆఖరిసారి కార్మిక సంఘాల మీద కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం దేశంలో 16,154 కార్మిక సంఘాలు ఉన్నాయి. కానీ ఇందులో ఐఎన్‌టియుసి, ఏఐటీయూసీ, ఏఐసీసీటియూ, ఏఐయూటీయూసీ, బీఎంఎస్‌, ‌హెచ్‌ఎంఎస్‌, ఎన్‌ఎఫ్‌ఐటియూ- డిహెచ్‌ఎన్‌, ‌యూటీయూసీ, ఎస్‌ఈడబ్ల్యుఏ, సీఐటీయు, టియుసీసీ, ఎల్‌పీఎఫ్‌ అనే పన్నెండే జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగి ఉన్నాయి. ఏఐటీయూసీతో లాలా లజపతిరాయ్‌, అహ్మదాబాద్‌ ‌లేబర్‌ ‌టెక్స్‌టైల్‌ అసోసియేసన్‌తో గాంధీజీ, ఐఎన్‌టీయూసీ ద్వారా నెహ్రూ, పటేల్‌ అనుబంధం కలిగి ఉన్నారు. ఇంకా డాంగే, ఎన్‌ఎం ‌జోసి, చతురానన్‌ ‌మిశ్రా, ఏబీ బర్దన్‌, ‌దత్తాసామంత్‌, ‌జార్జ్ ‌ఫెర్నాండెజ్‌ ఇం‌ద్రజిత్‌ ‌గుప్తా వంటి వారంతా కార్మిక రంగం నుంచి వచ్చిన వారే. కార్మికోద్యమానికి ఇక్కడ ఉన్న మూలాలను చెప్పడానికే ఈ అంశాల ప్రస్తావన.

భారతదేశంలో ప్రస్తుతం నడుస్తున్న మూడో దశ కార్మికోద్యమంలో భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ అ‌గ్రస్థానంలో నిలవడం వెనుక అద్భుతమైన తాత్త్వికత,కృషి ఉన్నాయి. చాలా కార్మిక సంఘాలు కమ్యూనిస్టు సిద్ధాంతానికి పేరు మార్చి మోస్తున్నవే. యాజమాన్యాలతో ఘర్సణే వాటి సిద్ధాంతం. మీ పరిస్థితులు మాకు అనవసరం, మా డిమాండ్లు నెరవేరడం ముఖ్యమన్నది వారి నినాదం. దీనితో కార్మికోద్యమం మీద నీలినీడలు అలుముకున్నాయి. పారిశ్రామికరంగం కుంటుపడింది. ఈ తరహా సంఘాలు పని సంస్కృతిని ధ్వంసం చేశాయనడం తొందరపాటు కాదు. అలా అని కార్మికోద్యమం అవసరం తీరిపోయిందనీ అనలేం. ఎన్నో సదుపాయాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్న ఐటీ పరిశ్రమలోను కార్మికోద్యమం మొదలు కావడమే ఇందుకు తార్కాణం. నవంబర్‌ 7, 2017‌న  కర్ణాటక స్టేట్‌ ఐటీ-ఐటీఈస్‌ ఎం‌ప్లాయీస్‌ ‌యూనియన్‌ (‌కిటు) ఆవిర్భవించింది. దీని ఉద్దేశం కూడా మళ్లీ పనిగంటలు, తొలగింపు, వేతనాల స్థిరీకరణ వంటి అంశాలపై పోరాడడమే. ప్రపంచీకరణ, ప్రైవేటు భాగస్వామ్యం పెరగడం వంటి ప్రస్తుత నేపథ్యంలో కార్మికోద్యమం కొత్త పాత్రను నిర్వహించవలసి ఉన్నది. అది కొత్త ప్రపంచానికి సరిపోయేది కావాలి. జాతీయతతో, నిర్మాణాత్మకంగా ఉండాలి. తమ సమస్యల విషయంలో రాజీ లేకుండానే, యాజమాన్యానికి చర్చల  ప్రకియకు చోటివ్వడం ఇప్పటి అవసరం. అలాంటి నిర్మాణాత్మక పాత్రను ఇప్పటికే నిర్వహిస్తున్న సంస్థ భారతీయ మజ్దూర్‌ ‌సంఘ్‌ (‌బీఎంఎస్‌).

ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్మించిన మహోన్నత వ్యక్తి దతోపంత్‌ ‌ఠేంగ్డీ ఈ సంస్థను స్థాపించారు. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీలలో పని చేసిన అనుభవంతోనే ఠేంగ్డీ బీఎంఎస్‌ ‌నెలకొల్పారు. ఏమిటి దీని ప్రత్యేకత? ‘ప్రపంచ కార్మికులారా ఏకంకండి!’ అంటాయి వామపక్ష సంఘాలు. ‘కార్మికులారా! ప్రపంచాన్ని ఏకం చేయండి! అంటుంది బీఎంఎస్‌. ‌రాజకీయాలకు అతీతంగా పనిచేసే జాతీయతా కార్మిక శక్తి బీఎంఎస్‌. ‌సంఘర్షణ. చర్చ అనేది కూడా ఈ సంస్థ నినాదమే. రాజకీయాలకు అతీతంగా కార్మిక శ్రేయస్సే ప్రధానమన్న సంస్థ వైఖరికి నిదర్శనం- వాజపేయి హయాంలో పెట్టుబడుల ఉపసంహరణను ఇది గర్హించింది. 2017లో కూడా హార్వార్డ్ ‌పండితుల ఆర్థిక సలహాలతో ప్రభుత్వం నడవడం సరికాదని వాదించింది. 1989లో చేసిన సర్వే ఆధారంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ దాచి దాచి 1994లో బీఎస్‌ఎస్‌ ‌ప్రథమ స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది.  శ్రీ గురూజీ మాటలలో ఇదంతా ఒకే చేత్తో జరిగింది. ఆ హస్తం ఠేంగ్డీజీది. ఇది వారి శతజయంతి సంవత్సరం. భారతీయత, సుహృద్భావాలే పునాదిగా కార్మికోద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడమే వారికి మనం అర్పించగలిగే నిజమైన నివాళి.

About Author

By editor

Twitter
Instagram