సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి భాద్రపద బహుళ పంచమి – 07 సెప్టెంబర్ 2020, సోమవారం

అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్‌

 

దేశంలో మైనారిటీ వాదానికి గొంతు పెరుగుతున్నదంటే అర్థం, విభజనవాదానికి ప్రాచుర్యం కల్పించే పని ఎడాపెడా సాగుతున్నదనే. పౌర సవరణ చట్ట వ్యతిరేక అల్లర్ల నాటి షాహిన్‌బాగ్‌ ఉదంతంతో పాటు, దేశంలో పలుచోట్ల వెలసిన ఉప షాహిన్‌బాగ్‌ ‌శిబిరాలు కూడా విభజనవాదుల నిర్వాకమేనని రుజువవుతోంది. ఇదంతా కొన్ని ముస్లిం వేర్పాటువాద సంస్థలూ, ఛాందసవాదులూ చేస్తున్న పని. ఇది బహిరంగ రహస్యం. మైనారిటీ వాదం పేరుతో దేశంలో విభజనవాద కోరలకు పదును పెట్టే పని భారత్‌లోనే కాదు, ప్రపంచంలో పలు ముస్లిమేతర దేశాలలో కూడా శరవేగంగా సాగుతోంది. ఈ ఆగస్టు 11న బెంగళూరు నగరంలో జరిగిన దాడులూ, అనంతర పరిణామాలు కూడా వాటి కొనసాగింపేనని సిటిజన్స్ ‌ఫర్‌ ‌డెమాక్రసి సంస్థ ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ సంఘం చెబుతోంది. సెప్టెంబర్‌ ‌నాలుగో తేదీన ఈ కమిటీ ముఖ్యమంత్రి బీఎస్‌ ‌యడ్యూరప్పకు తన 49 పేజీల నివేదికను అందించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ‌శ్రీకాంత్‌ ‌డి బాబలాది నాయకత్వంలో ఈ సంఘం పని చేసింది. ఆగస్టు 11 నాటి దాడుల వెనుక మహిళల ప్రమేయాన్ని కూడా కొట్టి పారేయలేమని నివేదిక పేర్కొనడం మరొక విశేషం.

బెంగళూరు నగరంలో, కేవల బైరసంద్ర అనే ప్రాంతంలో రాత్రివేళ ఒక్కసారిగా అల్లర్లు చెలరేగాయి. నవీన్‌ అనే వ్యక్తి ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యంగ్య చిత్రం పోస్ట్ ‌చేశాడన్న ఆరోపణతో పలువురు ముస్లింలు ఈ దాడులకు తెగబడ్డారు. వీటి వెనుక పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ) అనుబంధ ఎస్‌డీపీఐ ఉందని ఆనాడే ఆరోపణలు వెల్లువెత్తాయి. అరెస్టయిన వారిలో వారే అధికులు. పులకేశినగర్‌ ‌శాసనసభ్యుడు అఖండ శ్రీనివాసమూర్తి ఇల్లు తగులబెట్టారు. ఆయన షెడ్యూల్డ్ ‌కులాలకు చెందినవారు. కేజీ హళ్లి, డీజే హళ్లి పోలీసు స్టేషన్ల మీద దాడి జరిగింది.

నిజనిర్ధారణ సంఘం ‘ఒక వర్గాన్ని’ అని పేర్కొన్నప్పటికీ, ఆ ప్రాంతంలో ఉన్న హిందువులను భయభ్రాంతులను చేయడమే ఆ ముస్లిం మూకల ధ్యేయమని నివేదిక చెప్పదలుచుకున్నది. హిందువులను బెదిరించి ఆ ప్రాంతంలో ముస్లిం ప్రాబల్యం పెంచుకోవడమే ఈ దాడుల లక్ష్యమని నిజనిర్ధారణ సంఘం తేల్చింది. అలాగే ఈ దాడులు ఆకస్మికం కానే కాదనీ, ఒక పథకం ప్రకారమే జరిగాయని స్పష్టం చేసింది. ఆగస్టు 16న ముస్లిం మహిళలు రంగంలోకి దిగి అమాయకులైన తమ వారిని అరెస్టు చేశారని ఆరోపిస్తూ, వారిని విడిపించాలని నినాదాలు చేస్తూ పోలీసు స్టేషన్లలోకి చొరబడే యత్నం చేశారని కూడా నివేదికలో చెప్పారు. ఇది ఇప్పుడు ముస్లిం వేర్పాటువాదులు అనుసరిస్తున్న వ్యూహం. ఈ ఫిబ్రవరిలో ఢిల్లీ దాడుల సమయంలోను, స్వీడన్‌లో (మాల్మో) జరిగిన దాడులలోను, లండన్‌లోని ఆక్సఫర్డ్ ‌స్ట్రీట్‌లోను మతోన్మాదులు మహిళలను ముందుంచి నిరసనలు జరిపారని నివేదిక గుర్తు చేసింది. ఇప్పుడు ఇదే ఇస్లామిక్‌ ఉన్మాదుల ఆలోచనా విధానమని కూడా నివేదిక నిస్సంకోచంగా వ్యాఖ్యానించింది. పోలీస్‌ ‌స్టేషన్లలోకి బలవంతంగా మహిళలు ప్రవేశించే యత్నం చేయడం, దానితో జరిగే అలజడుల ద్వారా ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడమే వారి వ్యూహమని సంఘం ఆరోపించింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఉన్న వాతావరణం, బాధితుల కథనాలను బట్టి చూస్తే అక్కడ ఉన్న ప్రముఖులైన హిందువులు, వారి ఇళ్లే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని చెప్పవలసి వస్తున్నదని కూడా సంఘం తెలియచేసింది. ధ్వంసమైన ఇళ్లు, వాహనాలు కూడా హిందువులవే. అల్లర్లు జరిగిన ప్రాంతంలోనే ఉండేవారు కొందరు కూడా ఈ దాడులకు తమ వంతు సాయం చేసిన సంగతి ఎఫ్‌ఐఆర్‌ ‌ద్వారా కూడా తెలుస్తున్నది. వీరికి ఈ రగడ గురించి ముందే సమాచారం ఉంది. అందుకే ఢిల్లీ, స్వీడన్లలో జరిగిన దాడుల తరహాలోనే ఇవీ జరిగాయని నిర్ధారణకు వచ్చినట్టు సంఘం పేర్కొన్నది.

సిటిజన్స్ ‌ఫర్‌ ‌డెమాక్రసి ప్రజాస్వామిక విలువల పునరుద్ధరణే ధ్యేయంగా 2011లో ఏర్పడింది. ఇందులో అంతా బాధ్యతాయుతమైన ఉన్నత పదవులు నిర్వహించినవారే. జస్టిస్‌ ‌బాబలాదితో పాటు మదన్‌ ‌గోపాల్‌ (‌రిటైర్డ్ ఐఏఎస్‌), ‌డాక్టర్‌ ఆర్‌. ‌రాజు (రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్‌), ‌డాక్టర్‌ ‌ప్రకాశ్‌ (‌రిటైర్డ్ ఐఆర్‌ఎస్‌) ఎంఎన్‌ ‌కృషమూర్తి (రిటైర్డ్ ‌డీజీపీ), జర్నలిస్టులు ఆర్‌ ‌కె మాటూ, సంతోష్‌ ‌తిమ్మయ్య ఇంకా ప్రొఫెసర్‌ ఎం ‌జయప్ప, ప్రొఫెసర్‌ ‌హెచ్‌టి అరవింద ఈ నిజ నిర్ధారణ సంఘంలో పనిచేశారు. నిజానికి ఈ అల్లర్ల మీద మీడియాలో జరగవలసినంత చర్చ జరగలేదు. దాడి మొత్తం ముస్లిం మతోన్మాదుల పని కాబట్టే ఆ వర్గం మీడియా నోరెత్తలేదని దేశం మొత్తం భావించే పరిస్థితి వచ్చింది. అల్లర్ల మీద మౌనం వహించి, వాటి వెనుక ఉన్నదెవరో మీడియా వెల్లడించింది. మీడియాకు ప్రజాస్వామ్యం, హక్కుల గురించి చిత్తశుద్ధి ఉంటే ఈ ధోరణి ఆపాలి. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి జరుగుతున్న కుట్రను ఆ మీడియా గుర్తించాలి.

మైనారిటీల హక్కుల రక్షణ అంటే, మెజారిటీ హిందువులకు రక్షణ లేకుండా పోవడం కాదని దేశం గుర్తించాలి. మతోన్మాదులు ఇంతగా రెచ్చి పోయినా మేధావులు, తమ పార్టీకి చెందిన ఒక ఎస్‌సి ఎమ్యెల్యే మీద దాడి జరిగినా కాంగ్రెస్‌ ఇప్పటి దాకా ఎందుకు నోరెత్తలేదో నిలదీయాలి.

About Author

By editor

Twitter
YOUTUBE
Instagram