ఆగష్టు 29న వామన జయంతి

విష్ణువు దుష్ట సంహరణార్థం అవతరించిన మోక్షప్రదాత. అందుకు వామనావతార ఘట్టం ఉదాహరణ. దశావతారాలలో ఐదవదైన ఇది అంశావతారమే తప్ప పరిపూర్ణావతారం కాదని, బలి చక్రవర్తిని నిర్జించి స్వర్గాధిపత్యాన్ని మళ్లీ ఇంద్రుడికి ఇప్పించడమే ఈ అవతార లక్ష్యమని పురాణాలు చెబుతున్నాయి. బలి దేవతలను గెలిచి ఇంద్రుని రాజధాని అమరావతిని వశపరచుకున్నాడు. దేవతలు భయకంపితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దానవగణ చేష్టలను సహించలేని దేవమాత అదితి భర్త కశ్యపునికి విన్నవించింది. ఆయన సూచన మేరకు శ్రీమహా విష్ణువును ఉద్దేశించి సర్వతపః ఫలమైన వయోభక్షణ వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతానికి మెచ్చిన శ్రీహరి తన అంశంతో భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు ఆమె గర్భాన వామనుడై పుట్టాడు. వామన జయంతిని విజయ ద్వాదశిగా కూడా పేర్కొంటారు.

కార్యసాధనకు చతుర్విధోపాయాలుగా చెప్పిన సామదాన భేదదండోపాయాలలో బలిని నిర్జించేందుకు శ్రీహరి దానగుణాన్ని ఎంచుకున్నాడు. దాతృత్వం ఆభరణంగా గల బలి అశ్వమేధ యాగం నిర్వహిస్తూ మరింత విరివిగా దానధర్మాలను చేస్తున్నాడన్న సమాచారంతో వామనుడు యాగశాలకు చేరాడు. ఆయనపై పవిత్రమైన అక్షింతలు చల్లి ఆశీర్వదించాడు. వామన దర్శనం రాక్షసరాజుకు అమితానందం కలిగించింది. ఉచితాసనం కల్పించి పాదాలను కడిగి శిరస్సున జలాన్ని చల్లుకున్న తర్వాత వామనుని ఉద్దేశించి ‘ఏమి కావాలో’ కోరుకోమన్నాడు. మణులు, మాణిక్యాలు, రాజ్యం ఇలా అనేకానేకాలు ఇవ్వజూపాడు. కానీ ఆ వటువు ‘వరదాతలలో పుంగవుడివైన నీ నుంచి ‘ఈషణ్మాత్రం’ (కొంచెం) భూమిని మూడడుగులు కోరుకుంటున్నాను’ అని బదులిచ్చాడు. దానికి బలి ఆశ్చర్యపోయాడు. పర్వతం దగ్గరకు వెళ్లి అణువును కోరినట్లు ఇదేమి అభ్యర్థన? అని ప్రశ్నించాడు. అర్ధించేటప్పుడు దాత స్థాయినైనా పరిగణలోకి తీసుకోవాలి కదా? అని అడిగాడు. ఆ వటుడు మాత్రం తన మాట మీదే నిలిచాడు. బలి దృష్టిలో వటుడి కోరిక అల్పం. వటుడు గ్రహించ బోయేది అనల్పం.

అయితే ఆ కోరికలోని ఆంతర్యాన్ని గ్రహించాడు రాక్షసగురువు శుక్రచార్యుడు. ఆ బాలుడిని శ్రీహరిగా అనుమానించాడు. రానున్న ముప్పును గ్రహించి శిష్యుడికి హితబోధకు ప్రయత్నించాడు. మాట తప్పని బలి గురువు మాటను పట్టించుకోలేదు. లక్ష్మీనాథుడి చేయి కింద, తన చేయి పైన అయితే అంతకు మించి కావలసిందేమిటి? అని సమర్థించుకున్నాడు. రాజ భోగాలు కాదంటున్నవాడికి ఈ మూడు అడుగుల భూమి దానం ఇవ్వడం ఏపాటిది? అనుకున్నాడు.

తన మాటను పడచెవినపెట్టి శిష్యుడి నిర్లక్ష్యానికి ఆగ్రహించిన శుక్రాచార్యుడు ‘నువ్వేదో పండితుడవను కుంటూ గురువు మాటను లెక్క చేయక అహంకారంతో వ్యవహరిస్తున్నావు. నా ఆజ్ఞను, సలహాను ఉల్లంఘిస్తున్న నీవు అచిరకాలంలో సంపదలన్నీ కోల్పోయి భ్రష్టుడివి అవుతావు’ అని శపించాడు. దానికి బలి వెరవలేదు. తానిచ్చిన మాటకు కట్టుబడ్డాడు. అతని ధర్మనిష్ఠ ‘త్రివిక్రము’డిని కదిలించింది. అయినా వచ్చిన పని నెరవేర్చడం అనివార్యం. మూడవ అడుగు నెపంతో బలిని పాతాళానికి పంపాడు. మనుషులు ఎంత ధర్మవర్తనులైనా పదవీ, ఐశ్వ్యర్యాల విషయంలో సర్వేశ్వరుని ఆలోచన మరోలా ఉంటుంది. ‘సంపద గర్వంలో మనిషి దేవుడిని, లోకాన్ని లక్ష్యపెట్టడు. ఆ గర్వం అంతరిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. అందుకే నేను అనుగ్రహించదలచిన వారి సంపదను ముందుగా హరించి వేస్తాను. పరీక్షలకు తట్టుకొని నిలబడిన వారికి సర్వసంపదలు అనుకోకుండా సమకూరుతాయి. సంపదలు పోయినా స్థిరచిత్తంతో ఉండేవాడే ఉత్తముడు. బలి అలాంటివాడే. మూడవ అడుగుతో పాతాళానికి వెళతాడని తెలిసినా అంతటి విపత్తులోనూ అతడు చలించలేదు. గురువు బెదిరించి శపించినా, నేను కపటపు మాటలాడినా కూడా ఆ సత్యసంధుడు ధర్మాన్ని వీడలేదు. అందుకే దేవతలకు కూడా అలవికాని స్థానం పొందాడు. రానున్న సావర్ణి మన్వంతరంలో నా శరణు పొంది ఇంద్రపదవి అధిష్ఠించగలడు’ అంటాడు వామనుడు విధాతతో.

‘స్త్రీలను సుముఖులను చేసుకొనేందుకు, వివాహ విషయాలలో, ప్రాణధ(దా)నమానాలకు హాని కలిగే సందర్భాలలో, గోబ్రాహ్మణ రక్షణ సమయాలలో అసత్యమాడినా పాపం అంటదు’ అనే ‘వెసులుబాటు’ను కూడా బలిచక్రవర్తి ఉపయోగించుకోలేదు. తాను సామాన్యుడు అయితే అందుకు అంగీకరించేవాడేమో కానీ వితరణశీలి. అందునా, అమితభక్తితో విష్ణువునే కట్టిపడేసిన ప్రహ్లాదుడి మనవడు. తాతను బ్రోచినవాడే మనువడి ముందు చేయి చాపడం భాగ్యం అని భావించాడు.

ఎన్నో సుగుణాలను ఒక దుర్గుణం అతిక్రమిస్తుందనేందుకు కూడా వామనావతార ఆవిర్భావ కారణాన్ని ఉదాహరణగా చెబుతారు. బలి పాలన సుభిక్షమైనదని, సకాలంలో వానలు కురిసి ధనధాన్యాలు సమృద్ధిగా ఉండేవని, అన్ని వర్గాల వారు సుఖశాంతులతో జీవించేవారని భాగవతం చెబుతోంది. ఆయన ఆడిన మాట తప్పడు. గురువు శాపాన్ని భరించాడు తప్ప దానం విషయంలో మాట తప్పలేదు. వామనుడిపై దండెత్తడానికి సిద్ధపడిన రాక్షసులను శాంతపరిచాడు. ఇంత సత్‌ ‌ప్రవర్తకుడి వినాశనం కోసం శ్రీమహావిష్ణువు అంశ వటువుగా వచ్చిందంటే, బలి గెలుచుకున్న ఇంద్రపీఠం విముక్తి కోసమేనని ఆధ్యాత్మికవాదులు చెబుతారు.

అంతేకాదు, గర్వం, అహం నశించిన వారికి జ్ఞానం కలుగుతుందని బలి చక్రవర్తి ఘట్టం చెబుతోంది. ధర్మం వేరు అహంకారం వేరు. దానధర్మాలు చేస్తూనే హింసకు పాల్పడడం సరికాదన్నది ఈ అవతారంలోని నిఘూడార్థం. ‘అతిసర్వత్రవర్జయేత్‌’ అనే ఆప్తవాక్యానికి బలి వివరీత ‘దాతృత్వం’ నిదర్శనం. ‘అతి దానాత్‌ ‌బలిర్బద్ధో’ అని చాణక్య వాక్యం. ఎవ్వరేది అడిగినా (వెనుకా ముందు ఆలోచించక) దానాలు చేస్తూ, ‘మూడడుగుల’ చోటు ఇవ్వమన్న విష్ణువు విచిత్రకోరికను అంగీకరించి చేటు తెచ్చుకున్నాడని, అతి దుష్ఫలితానికి దారితీసిందని పెద్దల మాట. అహంకారం వినాశ కారణం అనేది నిర్వివాదాంశమే. అదే సమయంలో మంచిగాని, చెడుగాని అతిగా ఉంటే విపరీత పరిణామాలకు దారి తీస్తుందని, స్వయంకృతాపరాధం కిందికే వస్తుందనేందుకు బలి ‘దాన’ గుణాన్ని ఉదాహరణగా చెబుతారు.

– ఎ.ఎన్‌. ‌రామానుజ కళ్యాణ్‌

About Author

By editor

Twitter
Instagram