మూడున్నర దశాబ్దాల తరువాత దేశీయ విద్యావిధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. కనీసం ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలో విద్యాబోధన, విద్యార్థులపై పాఠ్యాంశాల భారం తగ్గించడం, వారి నైపుణ్యానికి మెరుగుపెట్టుకొనే వెసులుబాటు, కారణాంతరాల వల్ల మధ్యలో చదువు మానివేసినా తిరిగి కొనసాగించుకునే అవకాశం లాంటివి ఎన్నో ప్రత్యేకతలతో డాక్టర్‌ ‌కృష్ణస్వామి కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలో రూపొందిన జాతీయ నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ) కేంద్రమంత్రి వర్గం ఆమోదం పొందింది.

గడచిన యాభయ్‌ ‌రెండేళ్లలో విద్యావిధానం ప్రకటించడం ఇది మూడవసారి. 1968,1986లో విద్యావిధానాలు రూపొందాయి. 1992లో పరిమిత సవరణలతో దానికి ముందటి విద్యావిధానమే కొనసాగింది. విద్యా విధానంపై కేంద్ర కేబినెట్‌ ‌మాజీ కార్యదర్శి టీఎస్సార్‌ ‌సుబ్రమణియన్‌ ‌నేతృత్వంలోని కమిటీ 2016 మేలో, ఇస్రో మాజీ అధిపతి డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ ‌నేతృత్వంలోని కమిటీ గత ఏడాది మేలో నివేదికలు సమర్పించాయి. తాజా నివేదిక ముసాయిదాను కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉంచింది. పార్లమెంట్‌ ‌కమిటీలు, ఎంపీలతో పాటు 2.5 లక్షల గ్రామ పంచాయతీల అభిప్రాయాలను సేకరించింది. గత నెల 29వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం తుది నివేదికను ఆమోదించింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును విద్యాశాఖగా మార్చేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. (గత విద్యావిధానాల కంటే భిన్నంగా విప్లవాత్మక సంస్కరణలను సూచించిన తాజా నివేదికలో ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించడంతో పాటు నైపుణ్యం పెంపుదలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావించింది.)

‘విభిన్న వర్గాలతో విస్తృతంగా చర్చించి ఆమోదించిన నూతన విద్యావిధానం-2020 భారత విద్యారంగ చరిత్రో మేలి మలుపని, దూరదృష్టితో రూపొందిన ఈ విధానం దేశాన్ని చైతన్యపూరిత విజ్ఞాన సమాజంగా తీర్చిదిద్ద్దగలదని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభిలషించారు. కనీసం ఐదవ తరగతి వరకు మాతృభాషలో బోధించాలన్న సూచన హర్షణీయమని అన్నారు.

‘సంస్కరణల కోసం విద్యారంగం చాలా కాలంగా ఎదురు చూస్తోంది. సరళత, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం, అందరికీ అందుబాటు అనే పునాదులపై నూతన విద్యా విధానం ఉంటుంది. ఇది లక్షలాది మంది జీవితాలను మార్చబోతోంది. దేశంమరింత కాంతులీనాలి, సుసంపన్నత సాధించాలి’ అని ప్రధాని ఆకాంక్షించారు.

ఈ నూతన విద్యా విధానంలోని ముఖ్యాంశాలను స్థూలంగా పరిశీలిస్తే…..

డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌

మాతృభాషలకు పెద్దపీట

ప్రాథమిక విద్యాస్థాయిలోనే మాతృభాష అస్తిత్వానికి భంగం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారతీయ భాషలకు, మాతృభాషకు తాజా విద్యా విధానం ప్రాధాన్యం కల్పించింది. ప్రాథమిక విద్య వరకు మాతృభాషలోనే బోధించాలని నిబంధన విధించింది. కుదిరితే 8వ తరగతి వరకు, ఆపై తరగతులలో కూడా ‘అమ్మభాష’లోనే చదువు నేర్పాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. బోధనలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఏ ఇతర భాషను బలవంతంగా అమలు చేయడం కాని, ఇతర భాషలను వ్యతిరేకిచడం కాని ఉండదని ఈ విద్యావిధానం స్పష్టం చేస్తోంది. ‘మాతృభాషలో విద్యాబోధన కారణంగానే జపాన్‌,‌దక్షిణ కొరియా లాంటి దేశాలు శాస్త్ర రంగంలో దూసుకుపోతున్నాయి. ప్రాథమిక చదువు సొంతభాషలో ఉంటేనే సామర్థ్యం, నైపుణ్యం వేగంగా వృద్ధి చెందుతాయని యునెస్కో, యునిసెఫ్‌, ఇతర అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు, పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మనదేశంలో మాతృభాషలో విద్యాభ్యాసం చేయకపోవడం వల్లనే సైన్స్ ‌పరిశోధనలలో వెనుకబడి ఉన్నాం.వివిధ దేశాల విద్యా విధానాల సమగ్ర అధ్యయనం తరువాతే ఇక్కడ కూడా ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలని సూచించాం. పదవ తరగతి వరకు ‘అమ్మభాష’లో చదివితే ఇంకా మంచిది. ఈ తరువాత ఆంగ్లం తదితర భాషలను సులువుగా నేర్చుకోగలుగుతారు’అని డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ అభిప్రాయపడ్డారు.పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సంస్కృతాన్ని ఐచ్ఛిక అంశంగా బోధిస్తారు.మాధ్యమిక తరగతులలో విదేశీ భాషలను కూడా పరిచయం చేస్తారు.

నైపుణ్యాభివృద్ధికి..

విద్యార్థులు పాఠశాల విద్య పూర్తిచేసుకొని బయటికి వెళ్లే సమయానికి ఒక వృత్తి విద్యా నైపుణ్యాన్ని అయినా సాధించేలా చర్యలు తీసుకుంటారు. నిరుద్యోగ సమస్య నివారణకు దీనిని ఒక సాధనంగా పరిగణించారు. విద్యార్థులు ఏటా నేర్వవలసిన నైపుణ్యాలను తల్లిదండ్రులతో సంప్రదించి నివేదిక తయారు చేస్తారు.‘నైపుణ్యం అనేది ప్రాథమిక విద్యాస్థాయి పాఠ్యాంశాలలో ఒక భాగం కావాలి. పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచే పక్రియ ప్రాథమిక స్థాయి నుంచే ప్రారంభించాలి.అందుకు భిన్నంగా చదువు పూర్తయిన తరువాత నైపుణ్యంపై ఎంత శిక్షణ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. పిల్లలలో ఆసక్తి కల రంగాలను,సహజ నైపుణ్యాలను తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు గుర్తించగలగాలి. అందుకోస•ం ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరం’ అని డాక్టర్‌ ‌కస్తూరి రంగన్‌ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు గణితం, సైన్స్ ‌పట్ల ఆసక్తి పెంచేందుకు ప్రాథమిక స్థాయి నుంచే ప్రోత్సహిస్తారు. ఆరవ తరగతి నుంచే కోడింగ్‌ ‌నేర్పిస్తారు. ప్రస్తుతం అంతగా పట్టించుకోని కళలు, సంగీతం, ఆటలు లాంటి వాటిని పాఠ్యాంశాలలో చేరుస్తారు. పిల్లలకు శారీరక, మానసిక వికాసంతో పాటు కళల పట్ల ఆసక్తి, భావప్రకటన సామర్థ్యం పెంచాలని ఈ విద్యావిధానం లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగా 8 ఏళ్ల పిల్లలకు ఎన్‌సీఈఆర్‌టీ అవసరమైన పాఠ్యప్రణాళికను రూపొందిస్తుంది.

పాఠ్య ప్రణాళిక

ప్రస్తుత 10+2+3 ఏళ్ల పాఠ్య ప్రణాళిక 5+3+3+4 ఏళ్ల పాఠ్య ప్రణాళికగా మారుతుంది. 3,5,8 తరగతులకే నిర్దేశిత బోర్డుల ద్వారా పరీక్షలు ఉంటాయి.10,12 తరగతులకు పరీక్షలు యధాతథమే కానీ వాటి నమూనాలో మార్పు ఉంటుంది. విద్యార్థుల ప్రగతి నివేదికలో (పొగ్రెస్‌ ‌రిపోర్ట్) ‌ప్రస్తుతం వారు సాధించిన మార్కులతో పాటు వారి ప్రవర్తనపై ఉపాధ్యాయుల వ్యాఖ్యలు మాత్రమే ఉంటున్నాయి. నూతన విద్యా విధానం ప్రకారం, వాటితో పాటు సంబంధిత విద్యార్థి, సహ విద్యార్థుల అభిప్రాయాలనూ చేరుస్తారు. ‘12వ తరగతి వరకు ఆ నివేదికలలో వారి నైపుణ్యాలను నమోదు చేయవలసి ఉంటుంది. దీనివల్ల భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం పట్టభద్రులైన తరువాత నిరుద్యోగంతో బాధపడుతున్నారు.ఈ పరిస్థితిని నివారించేందుకే ఈ నూతన విద్యావిధానం రూపొందించాం’ అని కస్తూరి రంగన్‌ ‌వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇంటర్మీడియట్‌ ‌కోర్సు ఇప్పటికే పాఠశాల విద్యలో అంతర్భాగంగా ఉండగా, తెలుగు రాష్ట్రాలలోని ఇంటర్‌ ‌చదువు కూడా వాటి సరసన చేరబోతోంది.

చిన్నారుల సంరక్షణ విద్య

చిన్నారులకు మూడో ఏడు రాగానే ‘చిన్నారుల సంరక్షణ-విద్య’ (ఈసీసీఈ) మొదలవుతుంది.ఈ పథకం సమర్థంగా అమలు కావడానికి అంగన్‌వాడీలు, ప్రాథమిక, ప్రీ ప్రైమరీ పాఠశాలలు, ప్రీ స్కూల్స్‌ను బలోపేతం చేస్తారు. వాటిలోని సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.ఈసీసీఈ అర్హత గల వారిని వాటిలో ఉపాధ్యాయులుగా నియమిస్తారు.10+2 అర్హత గల వారికి ఆరునెలల శిక్షణ ఇచ్చి నియమిస్తారు. అంతకంటే తక్కువ అర్హత గల వారు ఏడాది పాటు డిప్లమో చేయవలసి ఉంటుంది.

‘బేటీ పడావో-బేటీ బచావో’ నినాదమూ మరింత సాకారమయ్యేలా బాలికా విద్య ప్రోత్సాహానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల స్థాయిని ప్రస్తుతం ఉన్న 8,10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు. జిల్లాల్లో బాలభవన్‌లు నెలకొల్పుతారు. మహిళా విద్యతో పాటు దివ్యాంగులపై దృష్టి పెడతారు.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ‌కోవింద్‌కు కొత్త జాతీయ విద్యావిధానం-2020 ప్రతిని అందజేస్తున్న
కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్‌ ‌పోఖ్రియాల్‌ ‌నిశాంక్‌

నిధుల కేటాయింపు

ప్రపంచ అత్యుత్తమ వ్యవస్థలో భారతీయ బోధన రంగం ఒకటిగా ఎదగాలన్న లక్ష్యంతో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో విద్యారంగానికి ప్రస్తుత 4.4 శాతం కేటాయింపును 6 శాతానికి పెంచాలని ఎన్‌ఈపీ ఉద్దేశించింది. 2035 నాటికి స్థూల నమోదు ఉత్పత్తిని ప్రస్తుత 26.3 శాతం నుంచి 50 శాతానికి చేర్చాలన్నది లక్ష్యంగా నిర్ణయించింది. ఫలితంగా ఉన్నత విద్యాసంస్థలలో మూడు కోట్ల సీట్లు పెరుగుతాయని అంచనా. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఈ విధానం చెబుతోంది. వెనుకబడిన ప్రాంతాలు, వర్గాలకు ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేస్తారు.

ఏకకాలంలో నచ్చిన అంశం…

డిగ్రీలో చేరిన తరువాత ఇష్టం లేకపోయినా అందులో పూర్తి కాలం కొనసాగవలసిన అవసరం ఉండదు. ఉదాహరణకు, ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు ఆర్టస్, ఆర్టస్ ‌కోర్స్‌ను ఎంచుకున్నవారు సైన్స్ ‌చదువుకునేలా అవకాశం కలుగుతుంది. వారు తమకు నచ్చిన పాఠ్యాంశాలను ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. డిగ్రీని పూర్తి కాలం పూర్తి చేయలేని వారికి అప్పటివరకు పూర్తయిన సంవత్సరాల ప్రాతిపదికగా సర్టిఫికెట్‌లు జారీ చేస్తారు. మళ్లీ కుదిరినప్పుడు ఆ చదువును కొనసాగించవచ్చు. మొదటి ఏడాదితో చదువు ఆపేసిన వారికి సర్టిఫికెట్‌, ‌రెండో ఏడాదితో ముగించిన వారికి అడ్వాన్స్ ‌డిప్లమో, మూడో ఏడాదికి బ్యాచిలర్‌ ‌డిగ్రీ, నాలుగవ సంవత్సరం పూర్తి చేసిన వారికి పరిశోధనతో కూడిన బ్యాచిలర్‌ ‌డిగ్రీ ప్రదానం చేస్తారు.మధ్యలో చదువు ఆపివేసిన వారికి డిగ్రీలో ఎంపిక చేసుకున్న కొన్ని కోర్సులను ‘ఆన్‌లైన్‌’ ‌ద్వారా పూర్తి చేసే అవకాశాన్ని ఈ నూతన విధానం కల్పిస్తుంది. పరిశోధనాసక్తి గలవారు నాలుగేళ్ల డిగ్రీ కోర్సును ఎంపిక చేసుకొని పీహెచ్‌డీలో ప్రవేశం పొందే అవకాశం కలుగుతుంది. ఇది వినూత్న ప్రయోగమని, మేధో వలసకు అడ్డుకట్టవేయాలన్న ప్రభుత్వ దృఢ సంకల్పం ఈ విధానంలో ప్రతిఫలిస్తోందని పలువురు విదావేత్తలు అభివర్ణిస్తున్నారు.

నియామకాలపై మార్గదర్శకాలు

విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ), జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్టీఈసీ), అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) లాంటివి ఇక ఒకే ఉన్నత విద్యావ్యవస్థ కిందికి వస్తాయి. ప్రైవేట్‌, ‌ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, కేంద్ర, డీమ్డ్ ‌విశ్వ విద్యాలయాలు, ఇతర ప్రత్యేక సంస్థలు ఒకే విధమైన ప్రమాణాలు పాటించవలసి ఉంటుంది. వాటికంటూ ప్రత్యేక నిబంధనలు ఉండవు. కళాశాలల ‘అనుబంధ’ (అఫిలియేషన్‌) ‌పద్ధతి మారుతుంది. కళాశాలలన్నీ పదిహేను సంవత్సరాలలో దశలవారీగా ‘స్వయం ప్రతిపత్తి’కి లేదా ‘కాలేజీ ఆఫ్‌ ‌యూనివర్శిటీ’ స్థాయికి చేరుకోవలసి ఉంటుంది. ప్రపంచంలోని వంద అగశ్రేణి విశ్వవిద్యాలయాలు మన దేశంలో ‘ప్రాంగణాలు’ (క్యాంపస్‌లు) నెలకొల్పుకునేందుకు ఈ విద్యా విధానం అవకాశం కల్పిస్తుంది. డిజిటల్‌ ‌విద్యను ప్రోత్సహించేందుకు ‘జాతీయ విద్య సాంకేతిక వేదిక’ (ఎన్‌ఈటీఎఫ్‌) ఏర్పాటవుతుంది.2022నాటికి ఎన్‌సీఈఆర్‌టీ ఉపాధ్యాయులందరికీ ‘జాతీయ వృత్తి ప్రమాణాలు’ను, ఉపాధ్యాయ శిక్షణకు జాతీయ పాఠ్యప్రణాళికను రూపొందిస్తుంది.నాలుగేళ్ల బీఈడీ డిగ్రీ ఉంటేనే బోధనకు అర్హత లభిస్తుంది. ఉపాధ్యాయ నియామకాలకు జాతీయ స్థాయిలో విధివిధానాలు రూపొందిస్తారు.వాటి ప్రకారం…విద్యావిషయకంగా, బోధన, పరిశోధన పరంగా, ప్రజాసేవపై నిబద్ధత, అంకిత భావాలను పరిశీలించి నియామకాలు చేపడతారు.వారి సామర్థ్యాలను మదించిన మీదటే పదోన్నతులు కల్పిస్తారు.

మరోవంక ఈ నూతన విద్యావిధానం పట్ల మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఈ విధానం ఉద్దేశాలు, ఆశయాలు బాగున్నాయని, ఇవి అమలైతే విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఖాయమని, అయితే వాటి సాధననకు చేపట్టే కార్యాచరణను స్పష్టం చేయవలసి ఉందని విద్యావేత్తలు,విశ్వవిద్యాలయాల ఆచార్యులు, వివిధ రాజకీయపక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కనుక దీని అమలులో రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, సహకారం ఏ మేరకు ఉంటుందో వేచిచూడాలంటున్నారు.

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
YOUTUBE