ఆగస్టు 11 శ్రీకృష్ణ జన్మాష్టమి

శ్రీమహావిష్ణువు అవతరాలలో దేనికదే ప్రత్యేకమైనదైనా శ్రీ కృష్ణావతార వైశిష్ట్యం ఒక వైభవం. ఇతర అవతారాలు అలా సాగిపోతాయి. కృష్ణావతారంలో అందుకు భిన్నం. అందులో అనేక కోణాలు. భారత, భాగవత కృష్ణతత్వాలలో సున్నిత భేదం గోచరిస్తుంది. భారతంలోని శ్రీకృష్ణుడు మేధావి, రాజనీతిదురంధరుడు, వ్యూహకర్త, దార్శనికుడు. భాగవతంలో ‘లీలా’కృష్ణుడు. సున్నిత స్వభావి. గోపాలుడు. గోపీజనవల్లభుడు. ఆవులను కాస్తూ లేగదూడలతో ఆడుకున్నాడు. చెట్లు, కొండలు, గుట్టలు ఎక్కి ఆడుకున్నాడు. సాధారణ పిల్లాడిలా మన్నుతిని అదలించబోయిన అమాయక అమ్మకు నోటిలో అనంత విశ్వాన్ని ప్రదర్శించాడు. ప్రీతితో సేవించినవాడు. రాజనీజ్ఞుడు. మంచి మిత్రుడు. చీరలు ఎత్తుకెళ్లిన చిలిపివాడు, వస్త్రదానంతో శీలం కాపాడినవాడు.

‘ఎంతమాత్రమున నెవ్వరు దలచిన అంతమాత్రమే నీవు’ అని పదకవితా పితామహుడు అన్నమాచార్యులు అన్నట్లు, శ్రీకృష్ణుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనిపిస్తాడు. ఆరాధ్యులకు అనంద స్వరూపుడు. ఇష్టులకు జగన్నాటక సూత్రధారి, అయిష్టులకు కపట నాటక సూత్రధారి, ఆపన్నులకు జగన్నాథుడు, నమ్మినవారికి కొంగుబంగారం, జ్ఞానులకు వేదవేద్యుడు.పెద్దల పట్ల విధేయుడు.ఆదర్శ శిష్యుడు. అమాయక తల్లికి అల్లరి తనయుడు. అమిత స్నేహశీలి. చక్రం పడితే కోపధారి. నెగ్గాలన్న పట్టుతో పాటు తగ్గాలన్న విడుపు కలవాడు. పదవుల కోసం కాకుండా ధర్మం కోసం రాజకీయం నెరిపాడు. ‘ధర్మ సంస్థాపనా ర్థాయ / సంభవామి యుగేయుగే’ అని తానే చెప్పుకున్నట్లు అందుకు తగినట్లే వ్యూహరచన చేశాడు. ‘పాండవ పక్షపాతి’గా పేరు వచ్చినా తనది ధర్మం పక్షమేనని చాటిచెప్పాడు. పరిస్థితులకు అనుగుణంగా మసలాడు.వాటిని అనుకూలంగా మార్చుకున్నాడు. సర్వాంతర్యామి అయినా అందరితో అంటీముట్టనట్లే ఉన్నాడు.

రూపేచ కృష్ణ

ఉత్తమ ఇల్లాలికి ఉండవలసి లక్షణాలను ‘కార్మేషు దాసీ కరణేషు మంత్రి’ శ్లోకం చెప్పినట్లే, ఉత్తమ పురుషులకు ఉండవలసిన లక్షణాలను ‘కామందక’ శతక శ్లోకం చెబుతోంది. అందులో ఇల్లాలిని ‘రూపేచ లక్ష్మీ’ అని పోలిస్తే, ఈ శతకంలో భర్తను ‘రూపేచ కృష్ణ:’ అని అభివర్ణించడాన్ని బట్టి శ్రీకృష్ణుని మోహనరూపం అని అవగతమవుతుంది.

‘కార్యేషు దక్షః కరణేషు యోగీన

రూపేచ కృష్ణః క్షమయాత రామే

భోజ్యేషు తృప్తః సుఖ దుఃఖ మిత్రమ్‌

‌షట్కర్మయుక్తాః కుల ప్రాణనాథః’… కృష్ణుడు అంటేనే అందరి హృదయాలను ఆకర్షించే వాడని అర్థం. అందుకే ఆయన ముగ్ధమోహన రూపాన్ని

‘మధురం మధురం అధరం మధురం

అధరము సోకిన వేణువు మధురం

నామం మధురం రూపం మధురం

పిలుపే మధురం తలపే మధరం

నీవే మధురం……’ అని ఎంతగానో కీర్తిస్తారు. జన్మిస్తూనే తల్లిదండ్రులు దేవకీవసుదేవులకు నిజరూప సందర్శన భాగ్యాన్ని కలిగించిన మోహనాకారుడు. కృష్ణభక్తుల నుంచి ‘కృష్ణవైరుల’ దాకా ఆయన రసరమ్య రూపాన్ని పొదవి పట్టాలని ప్రయత్నించినవారే. ఆయనను చేరాలని, ఆయన కావాలని కోరడం అంటే వారి జీవనంలోకి కృష్ణతత్వాన్ని ఆహ్వానించడంగానే భావించాలి. పూతన జీవితాపహరణం నుంచి ఆయన మహాప్రస్థానం వరకు సంఘటనలను పరిశీలిస్తే అనేక కోణాలు అవిష్కృతమవుతాయి. శిశుప్రాయం నుంచి అడుగడున గండాలెదురైనా ఎదిరీది నిలిచాడు. కష్టసుఖాలు, సుఖదు:ఖాలు, ఎగుడుదిగుడులు జీవనంలో భాగమంటూ, వాటిని ఎలా అధిగమించాలి. ఎలా ఆనందమయం చేసుకోవాలో చాటిచెప్పిన చైతన్యమూర్తి.

జగద్గురువు

‘కృష్ణస్తు భగవాన్‌ ‌స్వయమ్‌’ (శ్రీ‌కృష్ణుడు భగవంతుడు) అని మహర్షులు కృష్ణావతారాన్ని కీర్తించారు. దుష్టశిక్షణ, శిష్ట రక్షణ ధ్యేయంగా అవతరించిన పది అవతారాలలో ఇది సంపూర్ణ అవతారమని, మిగిలినవి అంశవతారాలని చెబుతారు. ‘పరమాత్మ’ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లింది. పరమాత్మ దేవదేవుడై, దేవదేవుడు దేవకీసుతుడై మానవజాతి సంక్షేమం కోసం సమగ్ర మార్గదర్శకాలను ఆవిష్కరించాడు. అప్పటికి వేదాదుల నుంచి వ్యాప్తి చెందిన వివిధ యోగాలను సమన్వయించి బోధించిన ఆచార్యుడు. ఒక అధ్యయనం ప్రకారం, ఇప్పటికి 5121 ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు తన 87 ఏట ‘గీతా బోధ’ చేశారు. కృష్ణపరమాత్మ భూతలంపై 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించారని పెద్దలు నిర్ధారించారు. అర్జునుడి మోహాంధకారాన్ని తొలగించే నెపంతో బోధించిన ఈ ‘గీత’ సమస్త మావవాళికి ఆదర్శ గ్రంథమైంది. వ్యక్తిత్వ వికాస గ్రంథంగా నిలిచింది. ఇది ఏ ఒక్క మతానికో, జాతికో పరిమితం కాదు. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలు ధర్మబద్ధంగా, సజావుగా సాగేందుకు, ఆదర్శవంతమైన సమాజ స్థాపనకు సర్వకాలాలకు, సర్వ ప్రాంతాలకు ఆరాధ్యనీయమైంది. చేదు మందును తీపి పూతతో తినిపించడం వైద్యులకు తెలిసినట్లు, కఠినమైన పాఠాలను శిష్యులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పడం బోధనా నైపుణ్యం గల ఉత్తమ గురువుకే తెలుస్తుంది. అలా గీతను బోధించినందుకే శ్రీకృష్ణుడు ‘జగద్గురువు’అయ్యాడు.‘మానవుడు ఆత్మశక్తి కోల్పోయినప్పుడు గీత నూతన తేజస్సును ప్రసాదించి పునరుజ్జీవింపచేస్తుంది’అని స్వామి వివేకానంద లాంటి మహనీయులు ప్రస్తుతించారు.

నాయకత్వ లక్షణాలు

సమస్యలను, సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలే తప్ప భయపడి పారిపోకూడదని, ఆత్మ విశ్వాసంతో చివరి వరకు పోరాడాలన్న స్ఫూర్తిని నింపాడు శ్రీకృష్ణుడు. ఈ క్రమంలో అవసరమైతే పట్టువిడుపులు ఉండాలని, సమయానికి తగిన వ్యూహరచన చేయాలని అనుభవపూర్వకంగా నిరూపించాడు. జరాసంధ, కాలయవనులతో యుద్ధ ఘట్టాలే అందుకు ఉదాహరణ. జరాసంధుడితో పదిహేడుసార్లు తలపడవలసి వచ్చినా వెనకడుగు వేయలేదు. ఓడిపోయే సమయం ఎదురైన ప్రతి సందర్భంలోనూ జరాసంధుడు పారిపోయి, బలం పుంజుకొని మళ్లీ వచ్చేవాడు. అయినా కృష్ణుడు ఎదుర్కొన్నాడు. శత్రువును తుదముట్టించేందుకు ఒక అడుగు వెనక్కి వేయడం బలహీనత కాదని, అది విజయానికి పునాదన్నది ‘శ్రీకృష్ణ యుద్ధనీతి’. కాలయవనుడి విషయంలో దీనిని అనుసరించాడు. సైన్యసమేతంగా పోరుకు వచ్చిన కాలయవనుడి ఎదుట నిరాయుధుడిగా నిలిచాడు. అతనికి భయపడినట్లు నటించి పరుగులు తీసి పాడుపడిన గుహలోకి ప్రవేశించాడు (కాలయవనుడి మరణానికి కారకుడు మరొకరు ఉన్నారని). ఆయనని అనుసరించిన కాలయ వనుడు గుహలో గాంఢాంధకారంలో నిద్రిస్తున్న వృద్ధుడిని కృష్ణుడిగా భావించి కాలితో తట్టిలేపాడు. నిద్రాభంగాన్ని సహించలేని ఆ ముని (ముచకుందుడు) కళ్లు తెరిచేసరికి ఆయన నేత్రాగ్నికి కాలయవనుడు నిట్టనిలువున భస్మమయ్యాడు. అది యుద్ధతంత్రమే కాదు. ముచకుందుడికి మోక్షప్రదానం కూడా.

ప్రకృతి ప్రేమికుడు

శ్రీకృష్ణుడు ప్రకృతి ప్రేమికుడు. ప్రకృతిలో పెరిగాడు. ప్రకృతిని ఆస్వాదించాడు.ప్రకృతిలోనే దైవాన్ని చూశాడు. ఇంద్రాది దేవతల ఆరాధన కంటే కొండలను, చెట్లను పూజించడం మేలన్నాడు. కొండ ఓషధులు, బతకడానికి పండ్లు, పూలు, గోవులకు గడ్డి, పశుపక్ష్యాదులకు నీడనిస్తాయి. ఇంతకు మించిన దైవం ఏముంటుంది? అని వివరించి గోవర్ధనగిరిని అర్చింపచేశాడు. ఆయన వేషధారణలోనూ ప్రకృతి దర్శనమిస్తుంది. తలమీది పింఛం, మెడలోని చెంగల్వపూదండ, చేతిలోని వేణువు, మొలతాడుకు కొమ్ముబూర. అన్నీ ప్రకృతి ప్రేమచిహ్నలే. కృష్ణుడిని ప్రేమించడం అంటే ప్రకృతిని ప్రేమించడమే అంటారు ఆధ్యాత్మికవాదులు. అవతార కారణం ఏమైనా ప్రకృతి కోసమే పుట్టినట్లున్నాడు. పచ్చని పల్లె వ్రేపల్లెకు వచ్చాడు.

స్థితప్రజ్ఞత

తాను ఆచరించినదే ‘గీత’గా బోధించాడు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖ సమయంలో కుంగిపోవడం ధీర లక్షణం కాదని, సుఖదుఃఖాలను సమంగా స్వీకరించడం స్థితప్రజ్ఞతని అన్నాడు. రాజసూయయాగంలో అగ్రతాంబూలం సత్కారంలో భాగంగా వేలాది రాజుల సమక్షంలో ధర్మరాజు తనను అగ్రపీఠం మీద కూర్చోపెట్టినప్పడు గర్వించ లేదు. ద్వారాకా పట్టణం కళ్లముందే కడలిలో కుంగి పోతున్నా దు:ఖ పడలేదు. ఈ రెండూ కర్మానుభవ ఫలితాలుగానే భావించి సమంగా, ఆనందంగా స్వీకరించాడు. దాయాదుల పోరుతో కురువంశం కూలిపోగా, యదువంశంలో ముసలం పుట్టి పరస్పర కలహాలతో అంతరిస్తుందన్న గాంధారి శాపాన్ని విధి నిర్ణయంగానే భావించాడు. పరమాత్ముడై ఉండి కూడా ప్రతిచర్యకు పూనుకోలేదు. అ పరిణామాలను అవతారంలో భాగంగానే పరిగణించాడు.

స్నేహతత్వం

త్రేతాయుగంలో రామదండు లాంటిదే ద్వాపరంలో ‘కృష్ణ మిత్రమండలి’. ఇందులో చోటు దొరికితే అదృష్టమే. ఆనక క్రిష్ణయ్యే కాపాడుకుంటాడు. ఆయనను చూడకుండా మిత్రులు క్షణం కూడా ఉండ లేకపోయేవారు. అడవిలో చద్దులు తింటున్నప్పుడూ వృత్తాకారంలో కూర్చునేవారు. ఆయన అందరికీ కనిపించాలని. ఆయనంటే మిత్రులకు, జతగాళ్లంటే ఆయనకు అంతప్రేమ. పేదరికంతో బాధపడుతున్నా అడగడానికి అభిమానం అడ్డొచ్చిన బాల్యస్నేహితుడు కుచేలుడిని సత్కరించి ఆదుకున్న తీరు అద్భుతం. స్నేహానికి, బంధుత్వానికి మధ్య అంతరం పాటించాడు. స్నేహానికి చనువు, బంధుత్వానికి గౌరవం ఇచ్చాడు. ‘వెన్నదొంగ, గొల్లగోపాలా’ అని చిన్నతనంలో ఆట పట్టించిన అర్జునుడు అనంతర కాలంలో చెప్పిన క్షమాపణను మృదువుగానే స్వీకరించాడు. ఒకవంక బావ (సోదరి సుభద్ర భర్త), మరోవంక తాను అతనికి సారథి. అర్జునుని ఆ రెండు స్థానాలూ గౌరవనీయ మైనవే. అందుకే ఆ అంతరం పాటించాడు శ్రీకృష్ణుడు. పశ్చాత్తాపం ప్రకటించిన పార్థుడితో ‘నీ తేరు తోలేవాడిని.. అంత మాటలెందుకులే బావా!?’ అని పెద్ద మనసుతో మన్నించాడు.

చిన్నకృష్ణా….!

దివ్య మంగళ విగ్రహదేవుడూ, జగదానంద కారకుడు, జగన్నాటక సూత్రధారి, రాధామానస చోరుడు, సత్యావిధేయుడు…ఇలా ఎన్నిపేర్లతో పిలిచినా జనబాహుళ్యాన్ని అలరించేది బాలకృష్ణ రూపమే. ‘చేతవెన్న ముద్ద చెంగల్వపూదండ/బంగారు మొలతాడు పట్టుదట్టి/సందె తావీదులు సరిమువ్వ గజ్జెలు/చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతూ’అని బాలుడి రూపంలో సేవించుకొనేందుకే ఇష్టపడతారు. అలా స్తుతించడం శ్రేష్ఠమని అంటారు. అందుకే కృష్ణాష్టమి నాడు ప్రతి లోగిలిలో బాలకృష్ణుడికి స్వాగతం పలుకుతున్నట్లు పాదముద్రలు చిత్రిస్తారు. కిట్టయ్య అర్థరాత్రి పుట్టాడు కనుక పగలంతా ఉపవాస•ం ఉండి రాత్రి ఇల్లు అలంకరించి దేవకీదేవి వద్ద పాలు తాగుతున్నట్లున్న విగ్రహాన్ని, లేదా వటపత్రసాయి విగ్రహాన్ని ఊయలలో ఉంచి పూజించడం, ఊరేగించ•డం ఆచారంగా వస్తోంది. ముఖ్యంగా అమ్మంటే అయనకు ఇష్టం. ఎన్ని చిలిపి పనులు చేసినా అమ్మమాటకు కట్టుబడతాడు. అమ్మ దగ్గర అమాయక శిశువు. అమ్మంటే ఎనలేని ప్రేమ. అవతారపురుషుడు, అమితబలశాలి అయినా అమ్మచేతి మూరెడు తాడుకు బందీ అయ్యాడు.

‘చిక్కడు సిరి కౌగిటిలో

జిక్కడు సనకాది యోగిచిత్తాబ్జములన్‌

‌చిక్కడు శ్రుతి లతికావళి

జిక్కెనతడు లీల దల్లి చేతన్‌ ‌రోలన్‌’ అని పోతన చిన్ని కన్నయ్య లీలను వివరించారు. ఆదిమధ్యాంత రహితుడైన కృష్ణయ్య, తల్లి అమాయకత్వానికి కరిపోయాడు. అందుకే లక్ష్మీదేవి కౌగిలికి, వేదవేత్తలకు, సనకాది మునుల చిత్తాలకు చిక్కని వాడు ప్రేమమయి అయినా తల్లి చేతికి లీలావిలాసంగా దొరికిపోయాడు. బాలకృష్ణుని లీలలకు గుర్తుగా ఉట్లు కొట్టే సంప్రదాయం కొనసాగుతోంది. ఈ రోజున ఉపవాసపూజాదికాలు నిర్వహిస్తే పాపనివారణతో పాటు చతుర్విధ పురుషార్థాలు ప్రాప్తిస్తాయని, విజయం సిద్ధిస్తుందని స్కాంధపురాణం చెబుతోంది.

‘కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే

ప్రణతక్లేశనాశాయ గోవిందాయం నమో నమ:’

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

About Author

By editor

Twitter
Instagram