ప్రపంచంలో కొవిడ్‌ ‌వ్యాప్తి అనంతరం అనేక దేశాలు చైనా ఉత్పత్తులు, పెట్టుబడుల విషయంలో ఆలోచనలోపడ్డాయి. ఒకవైపు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌లతో సతమతమవుతుంటే చైనా మాత్రం ఆయా దేశాలలో నష్టాలు, కష్టాలలో ఉన్న సంస్థలను కొనుగోలు చేస్తూ తమ ఆర్థిక, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించే పనిలో తలమునకలైంది. దీనిని పసిగట్టి మన ప్రభుత్వం భారత్‌లో అటువంటి పన్నాగాలు సాగకుండా కట్టడిచేసే ప్రయత్నం చేసింది. ఇతర దేశాలలో చేసినట్లే మనదేశంలో కూడా చైనా హెచ్‌డిఎఫ్‌సి (HDFC) బ్యాంకులో తమ పెట్టుబడుల వాటాను పెంచుకొని ఆ బ్యాంకు యాజమాన్యంలో తన పెత్తనం సాగేలా ప్రయత్నం మొదలుపెట్టింది. వెంటనే భారత ప్రభుత్వం మన విదేశీ పెట్టుబడుల విధానంలో సవరణలు చేసి యాజమాన్యంలో మార్పులు వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం అవసరమయ్యేలా చేసింది.

దీనివల్ల ప్రయోజనం ఏమంటే చైనా మనదేశంలో పెట్టుబడులు పెట్టి ఇతర దేశాలలో చేసినట్టే వ్యాపార, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను కొనుగోలు చేయాలంటే ముందుగా అన్ని వివరాలతో ప్రభుత్వ అనుమతి పొందవలసి ఉంటుంది. మన ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేస్తుందో అందరికీ తెలుసు కాబట్టి వారు అడిగే వివరాలు అన్నీ సమర్పించేటప్పటికి సమయం పడుతుంది. అలాగే గుట్టుగా పెట్టే పెట్టుబడులు బహిర్గతమవుతాయి. అలా బహిర్గతమైతే పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. పోటీ పెరిగితే సంస్థ బలహీనతను ఆసరాగా చేసుకొని కారుచౌకగా యాజమాన్యాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం విఫలమవుతుంది. కాబట్టి మన ప్రభుత్వం ఇటువంటి సవరణ చేసిన వెంటనే చైనా ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల స్ఫూర్తికి విరుద్ధమని, అలాగే జి-20 దేశాల వాణిజ్య మంత్రుల సమావేశంలో వచ్చిన అవగాహనకు విరుద్ధమని, ప్రభుత్వం ఈ సవరణలను రద్దు చేయాలని, లేకపోతే ఏటా 8 బిలియన్‌ ‌డాలర్ల తమ పెట్టుబడులు భారత్‌కు తగ్గిపోతాయని చెప్పింది.

వర్తమాన పరిస్థితులలో చైనాకు మద్దతుగా నిలవడానికి ప్రపంచ దేశాలు సిద్ధంగా లేవని తెలుసుకోవడానికి చైనాకు ఎక్కువ సమయం పట్టలేదు. పోనీ తమకు గుడ్డిగా మద్దతు పలికే శక్తులతో (మనదేశంలో కూడా అలాంటి వారున్నారు) ఒత్తిడి తెప్పించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలలో అపోహలు సృష్టించి తమ పబ్బం గడుపుకుందామంటే ఆ శక్తులకు వర్తమాన పరిస్థితులలో అంతటి ప్రజాబలం కూడగట్టే శక్తి లేదని తేలిపోయింది. అప్పటికి లాబీయింగ్‌ ‌చేసి పత్రికలలో వ్యాసాలు, కథనాలు రాయించి, మీడియాలో అనవసర చర్చలు పెట్టి తమకు అనుకూలంగా పలికే చిలకల చేత ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే ప్రయత్నం చేసింది. అయినా దానివల్ల పెద్ద ప్రయోజనం చేకూరలేదు. పోనీ తమకు బాగా అవాటు, అనుభవం ఉన్న పద్ధతి – మన దేశంలో వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బలహీన పరుద్దామంటే అందుకు కూడా తగిన వాతావరణం వారికి కనపడలేదు. ఇలా పెట్టుబడులపై బ్యూరోక్రాట్ల అడ్డంకులను సృష్టించటంతో పాటు మన ప్రభుత్వం ధైర్యంగా ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌నినాదాన్ని ఇచ్చింది. అంటే స్థానీయ ఉత్పత్తులకు ప్రజలు మద్దతు తెలపాలని బాహాటంగా ప్రకటించింది. అంటే ప్రభుత్వం స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు తెలిపింది.
చైనా సంస్థ పెట్టుబడులు మన సంస్థలలో పెరిగినంత మాత్రాన ఆ సంస్థలలో పనిచేసే ఉద్యోగులపై ఎటువంటి ప్రమాదం ఉండదని, సంస్థ యజమానులకు కూడా ఏ ఇబ్బందీ ఉండదని చైనాకి అనుకూలంగా ఉండే మేధావులు, ఆర్థికవేత్తలు చెబుతున్నారు.

ఒక సంస్థ ఆర్థిక ఇబ్బందులలో ఉంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకే కాక, దానికి సరుకు, సేవలు అందించే వారు, ఆ సంస్థ ఉత్పత్తులను అమ్మి జీవించే వారు, వాటిని రవాణా చేసేవారు ఇలా అనేకమంది అవస్థలు పడతారని, అటువంటి సంస్థలకు చైనా ఆర్థిక సాయం చేసి ఆ సంస్థను నిలబెట్టటమే కాక దానిపై ఆధారపడిన అనేకమందిని ఆదుకుంటుందని, అంతేకాక పెట్టుబడి పెట్టాం కదా అని తమదేశం నుంచి కార్మికులను తీసుకురాదని మునుపటి వలె ఇక్కడ కార్మికుల ద్వారా వస్తు-సేవలను ఉత్పత్తి చేస్తుందని, కొన్ని సందర్భాలలో సంస్థను అమ్మేసిన వారితోనే ఆ సంస్థను నడిపిస్తుందని, దానివల్ల మన దేశంలో ఉపాధి అవకాశాలు పోవని, ఉత్పత్తి పెరుగుతుందని, ప్రభుత్వానికి పన్నులు వస్తాయని.. ఇలా అనేక విధాలుగా చైనా పెట్టబడులకు మద్దుతుగా కొంతమంది మేధావులు వాదించినా ఆశించిన ప్రయోజనం చేకూరలేదు.

ప్రపంచంలో తమ ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించటంలో చైనా అనుసరించే వ్యూహాలను ఛేదించటం అంతా సులభమైన పని కాదు. అనేక సందర్భాలలో చైనా తన పెట్టుబడులను గోప్యంగా ఉంచుతుంది. తమ దేశం నేరుగా పెట్టుబడి పెట్టకుండా సింగపూర్‌, ‌మారిషస్‌, ‌హాంగ్‌కాంగ్‌ ‌వంటి దేశాలలో కొన్ని సంస్థలను నెలకొల్పి వాటి ద్వారా చైనా తమ పెట్టుబడులు పెడుతుంది. కనీసం చైనీయుల పేర్లు కూడా వాడకుండా ఆ దేశంలోని స్థానికుల పేర్లనే వాడుకుంటుంది. ఇలా చైనా మనదేశంలో తమ పెట్టుబడులు యథేచ్ఛగా పెంచుకుంటూ పోతోంది. ఈ పెట్టుబడులు ప్రభుత్వ రికార్డులలో మాత్రం చైనా పెట్టుబడులుగా ఉండవు. మనదేశంలో ఉన్న సంక్లిష్టమైన వ్యవస్థ వల్ల పారదర్శకత చాలా తక్కువ, ఒక రకంగా లేదనే చెప్పాలి. ఇది కూడా చైనాకు రక్షణగా నిలుస్తున్నది. ఎవరైనా ఒక సంస్థలో పెట్టుబడులు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఎంత వచ్చింది తెలుసుకోవాలంటే సాధికారికంగా ఆ సమాచారాన్ని పొందే అవకాశం లేదు. చాలా సందర్భాలలో చైనీయులు మనదేశంలో తమ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.

చైనా తన ఆర్థిక సామ్రాజ్య విస్తరణ వ్యూహంలో భాగంగా మనదేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, సాంకేతిక నిపుణులు, ఆర్థిక, న్యాయశాస్త్ర నిపుణులను ముందుగా గుర్తిస్తుంది. వారిలో అత్యంత నిబద్ధత, వృత్తి నైపుణ్యం ఉన్నవారిని ఎంచు కుంటుంది. అవకాశం చూసుకుని పెట్టుబడిసాయం పేరుతో వారు ప్రారంభించే సంస్థలలో ప్రవేశిస్తుంది. గత ఐదు సంవత్సరాలలో మనదేశంలోని ఐటి, టెలికాం వంటి రంగాలలో ఈ విధానాన్ని విస్తృతంగా ఉపయోగించి మంచి పట్టు సాధించింది. అప్పట్లో మనదేశంలో ప్రారంభ సంస్థలకు పెట్టుబడులను అందించే వ్యవస్థ పటిష్టంగా ఉండేది కాదు. ఆ లోపం చైనాకు బాగా కలిసి వచ్చింది. వెంచర్‌ ‌క్యాపిటల్‌ ‌పేరుతో దాదాపు సగం ప్రారంభ సంస్థలలో చైనా తన పెట్టుబడులను పెట్టింది. 2015లో ఆలీబాబా పేరుతో డిజిటల్‌ ‌పేమెంట్స్ ‌సంస్థ అయిన పేటీఎంలో చైనా 40 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆ తరువాత 2016లో పెద్ద నోట్ల రద్దు అనంతరం ఈ సంస్థ మనదేశంలో విశేష ప్రజాదరణ పొందింది. దానితో పోటీపడే స్థాయిలో ప్రస్తుతం మన స్వదేశీ సంస్థ ఒకటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ రోజుకి కూడా పేటీఎంలో 40 శాతం వాటా చైనాదేననే విషయం చాలామందికి తెలియదు. చైనా పెట్టిన పెట్టుబడి కంటే ఇప్పటికి ఎన్నో రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది.

చైనా మనదేశంలో ప్రజల అలవాట్లు ఎలా మారబోతున్నాయో ముందుగానే అధ్యయనం చేసి వచ్చే అయిదు నుంచి పది సంవత్సరాలలో ఏ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోబో తున్నాయో గుర్తించి ఆ రంగంలో తమ పెట్టుబడులను ముందుగా ముమ్మరంగా పెట్టింది. ఉదాహరణకు ఆన్‌లైన్‌ ‌వ్యాపారంలో వచ్చే అవకాశాలను, అలాగే వీడియో గేమ్స్ ‌వంటివి ముందుగానే గుర్తించింది. చైనా పెట్టుబడి పెట్టిన రంగాలలో వేగంగా మార్పులు చోటుచేసుకోవటం, చైనా వారు అవలంబించే వ్యాపార వ్యూహాలతో ఆ సంస్థలు ఇతర సంస్థల కంటే వేగంగా అభివృద్ధి చెందటం మనం గమనించవచ్చు. ఉదాహరణకు మన ప్రభుత్వం ఇటీవల బ్యాన్‌ ‌చేసిన టిక్‌-‌టాక్‌ ‌యాప్‌ ‌మనదేశంలో పొందిన ప్రజాదరణను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవచ్చు. చైనా అతితక్కువ పెట్టుబడితో విశేషమైన ఫలితాలను పొందింది. కేవలం 6.2 బిలియన్‌ ‌డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో చైనా ప్రస్తుతం మన మార్కెట్లపై విశేషమైన పట్టు సాధించింది. మంచి భవిష్యత్తు ఉన్న సంస్థలను ముందుగా గుర్తించి వాటిలో పెట్టుబడులు పెట్టటం ద్వారా చైనా కలలు సాకారమైనాయి. పేటీఎంలో ఆలీబాబా గ్రూప్‌ ‌పేరుతో చైనా పెట్టిన పెట్టుబడి కేవలం 150 మిలియన్‌ ‌డాలర్లు. అలాగే థింక్‌ & ‌లర్న్ ‌ప్రైవేట్‌ ‌లిమిటేడ్‌ ‌సంస్థ ప్రారంభించిన బైజూలో చైనా పెట్టుబడి కేవలం 50 మిలియన్‌ ‌డాలర్లు. అలాగే ఫ్లిప్‌కార్టులో చైనా తన పెట్టుబడిని స్టెడ్‌వ్యూ క్యాపిటల్‌, ‌టెన్‌సెంట్‌ ‌హోల్డింగ్స్ ‌పేరుతో కేవలం 300 మిలియన్‌ ‌డాలర్ల పెట్టుబడితో అత్యంత కీలకమైన వ్యాపారంలో తమ పట్టు సాధించింది. అందుకోసం చైనా ఇతర సంస్థాగత పెట్టుబడి సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఫ్లిప్‌కార్టులో పట్టు సాధించటం కోసం వాల్‌మార్ట్‌తో జత కట్టింది. అంతేకాదు మైక్రోసాఫ్ట్, ఈబే, టైగర్‌గ్లోబల్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌వంటి సంస్థలతో కూడా జతకట్టి ప్లిఫ్‌కార్టులో తమ స్థానాన్ని పదిల పరుచుకుంది. ఇవాళ అత్యంత ప్రజాదరణ కలిగిన అన్ని సంస్థలతో చైనా తన పెట్టుబడులను పెట్టింది. అందులో బిగ్‌బాస్కెట్‌, ‌డెలీహంట్‌, ‌పేటీఎం, స్నాప్‌డీల్‌, ‌జొమాటో, బైజూ, ఓలా, స్విగ్గీ, ఉడాన్‌, ఓయె, షేర్‌చాట్‌, ‌జెస్ట్ ‌మనీ వంటి అనేక సంస్థలు ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు భారత ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. చైనా తన ఆర్థిక సామ్రాజ్యాన్ని చాపకింద నీరులా మనదేశంలో ఇలా విస్తరించింది కాబట్టి దానిని కట్టడి చేయాల్సిన అవసరాన్ని మన ప్రధాని గుర్తించారు. వీటికి ప్రత్యామ్నాయంగా స్వదేశీ సంస్థలను, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సాహించాలని పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువుల ఉత్పత్తిని పెంచటానికి భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టి, స్వదేశీ బ్రాండ్లను రూపొందించి మార్కెటింగ్‌ ‌చేయాలని, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు ప్రజలకు అవసరమైన ఉత్పత్తులను అందించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

వర్తమాన పరిస్థితులలో చైనా చేస్తున్న దురాగ తాలు, దురాక్రమణలను ప్రజలు గమనిస్తున్నారు. మనదేశ ప్రజానీకం మానసికంగా చైనా వస్తువులను బహిష్కరించటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి వారికి తగిన సమాచారం అందించాల్సిన అవసరం ఉంది. చైనా వస్తువుల్లో ఎక్కువగా వేటిని వాడుతున్నారు. వాటిలో వెంటనే బహిష్కరించగలిగిన వస్తువులు ఏవి, ప్రత్యామ్నాయ ఉత్పత్తులను ఎంత వేగంగా ప్రజలకు అందుబాటులో ఉంచగలం, వాటి ధరలు, నాణ్యత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, చైనా సంస్థలు అంత తొందరగా ఓటమిని అంగీకరించవు కాబట్టి వాటి పట్ల ఎలా జాగరూకులై ఉండాలో ప్రభుత్వమే అవగాహన కల్పించాలి. అలాగే ప్రధాని ఆకాంక్షించిన ‘వోకల్‌ ‌ఫర్‌ ‌లోకల్‌’ ‌నినాదం సాకారం దిశగా ప్రతిఒక్కరూ కృషిచేయాలి.

– సాయిప్రసాద్‌, ఆర్థిక నిపుణులు

About Author

By editor

Twitter
Instagram