పూర్వపు నల్లగొండ జిల్లా మొత్తం కమ్యూనిస్టుల కంచుకోట అని ప్రతీతి. సి.పి.ఐ.; సి.పి.ఐ.(ఎం)లుగా చీలిపోయినప్పటికి వారి గూండాయిజానికి ఎదురుండేది కాదు. నేటి సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో 1960లో సంఘశాఖ ప్రారంభమైంది. కమ్యూనిస్టులు, కాంగ్రెసు వారు కలసి శాఖ నడవకుండా చేయాలని కక్ష కట్టారు. బెదిరింపులకు దిగారు. ఆ సమయంలో జనగామలో జనసంఘ్‌ ‌పూర్తి సమయ కార్యకర్తగా ఉన్న నన్ను తిరుమలగిరికి సంఘ విస్తారక్‌గా పంపించారు. కమ్యూనిస్టుల కేంద్రమైన ఇప్పగూడెం గ్రామంలో పుట్టి పెరిగిన వాడిని కనుక కమ్యూనిష్టుల గూండాగిరిని ఎదుర్కోవటం ఎలాగో తెలుసు. అందుకే నన్ను తిరుమలగిరి కేంద్రంగా సంఘపని చేయమన్నారు. క్రమంగా పరిసర గ్రామాల్లో శాఖలు ప్రారంభమై నాయి. సంఘ విస్తరణను చూసి కమ్యూనిస్టులు సహించలేక మేము ఒక ఇంట్లో సమావేశమైనప్పుడు దాడిచేశారు. మేము ప్రాణాలకు తెగించి చేసిన ఎదురుదాడిలో వారి గూండాలు, నాయకులు చాలామంది గాయాల పాలైనారు. నాతో సహా 15 మంది స్వయం సేవకులను ఆరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి క్రిమినల్‌ ‌కేసులు పెట్టారు. పోలీసులు గ్రామాన్ని దిగ్బంధనం చేసి ప్రతి స్వయంసేవకుడిని బెదిరించారు. దానితో సంఘ శాఖలకు రావటానికి చాలామంది జంకినారు. ఈ సమయంలో సోమయ్య గారు ఆ ఊరికి వచ్చి అందరిని పరామర్శించి మనోధైర్యాన్ని కలిగించారు. శాఖను పున:ప్రారంభించి స్ఫూర్తిదాయకమైన బౌద్ధిక్‌ ఇచ్చారు. వారి ప్రేరణతో రెట్టింపు ఉత్సహంతో సంఘ విస్తరణ వేగవంతమైంది. రామవరం, తొండ, తాటిపాముల, తదితర గ్రామాలలో శాఖలు ప్రారంభమైనాయి.

నల్లగొండ జిల్లా అంతటా సంఘం విస్తరించ డమే కాక సమాజంలో ప్రముఖులైన కట్టా రాంరెడ్డి, సీనియర్‌ అడ్వకేట్‌, ‌నల్లగొండజిల్లా కార్యవాహ, గవ్వా మధుసూదన్‌ ‌రెడ్డి (సీనియర్‌ అడ్వకేట్‌, ఆం‌ధప్రదేశ్‌ ‌రాష్ట్ర జనసంఘ అధ్యక్షులుగా పనిచేశారు) డా।। పుల్లయ్య వంటి పెద్దలు సంఘంలో చేరారు. అప్పటికి నల్లగొండ జిల్లా ప్రచారక్‌ ‌కీ.శే. ఈ.సి. రామమూర్తి గారు కలిగించిన ఉత్తేజంతో రోజురోజుకు కొత్త గ్రామాలలో శాఖలు ప్రారంభమవుతుంటే కమ్యూనిస్టులు తమ కంచుకోటలు కూలిపోతాయన్న భయం, కక్ష, ద్వేషంతో ఉన్మాదులై దాడులకు దిగారు.

తొండ గ్రామ శాఖలో సోమయ్యగారు ప్రసంగిస్తుండగా సి.పి.ఐ.(ఎం) గుండాలు గుంపుగా వచ్చి సోమయ్యగారితో పాటు స్వయంసేవకులందరిని తీవ్రంగా గాయపరిచారు. దాడులకు బెదరకుండా పర్యటన కార్యక్రమం ప్రకారం తర్వాత నాగులపాటి, అన్నారం గ్రామ శాఖలకు వెళ్లారు. పథకం ప్రకారం అక్కడ కూడా సి.పి.ఐ.(ఎం) గూండాలు పెద్ద సంఖ్యలో వచ్చి చేసిన దాడిలో సోమయ్యగారు గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైద్రాబాద్‌ ‌వెళ్లకుండా సూర్యాపేటలోనే డా।। పుల్లయ్యగారి ఇంట్లో ఉండి చికిత్స పొందారు. ఎందుకంటే కమ్యూ నిస్టుల వరుసదాడులతో స్వయంసేవకుల నైతిక స్థైర్యం, ధైర్యం దిగజారకుండా ఉండాలని భావించి తన గాయాల తీవ్రతను లెక్క చేయకుండా ఆ ప్రాంత స్వయం సేవకుల మధ్యనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

దాడి విషయం తెలిసి ఆందోళనతో నేను సూర్యాపేటకు వెళ్లి కలిశాను. శరీరంలో గాయాలు లేని చోటు లేదు. అయినా ఎప్పటి వలే చిరునవ్వుతో మాట్లాడినాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. ఇన్ని గాయాల నొప్పిని భరిస్తూ కూడా చిరునవ్వుతో ఉండటం వారికి మాత్రమే సాధ్యమైంది. నాయకుడైనవాడు ఇలాంటి సమయాల్లో స్థితప్రజ్ఞుని వలె గుండెనిబ్బరంతో ఉండి సహచరులకు స్ఫూర్తినివ్వాలి. సోమయ్యగారు అదే ఆచరణలో చూపెట్టారు.

సూర్యాపేటలో వారు స్వయంగా పర్యవేక్షించి మూడు విధాల కార్యక్రమాలు రూపొందించారు. 1) దాడి జరిగిన గ్రామాలలో బహిరంగ సభలు జరిపి కమ్యూనిష్టుల ఆరాచక చర్యలను ఖండించి ప్రజలను చైతన్యపరచటం. 2) స్వయంసేవకుల మనోధైర్యాన్ని నిలబెట్టడం కోసం గ్రామాలలో పర్యటించడం, గాయపడ్డ స్వయంసేవకుల బాగోగులు చూడటం. 3) దాడి చేసిన గూండాలతో పాటు దాడికి పథకం వేసి ఉసి గొల్పిన సి.పి.ఐ.(ఎం) అగ్రనాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు భీంరెడ్డి నర్సింహారెడ్డిని కూడా చట్టపరంగా శిక్షించే విధంగా ప్రయత్నించడం. ఆ ప్రకారం దాడి జరిగిన గ్రామాలలో భారీ బహిరంగ సభలు జరిపి కమ్యూనిష్టుల దౌర్జన్యాలను ఎదిరించాలని ప్రచారం చేయటం జరిగింది. గ్రామాల పర్యటన, పరామర్శ బాధ్యత కొందరికి అప్పగించారు.

అప్పటికే పరారీలో ఉన్న భీంరెడ్డి నర్సింహారెడ్డి దుర్మార్గాల గురించి, కమ్యూనిస్టుల అరాచకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసి పోలీసులపై ఒత్తిడి పెంచే విధంగా విస్తృతంగా కరపత్రాలు పంచాలని నిర్ణయించారు. మన వాళ్లెవరో రాసిచ్చిన పత్రం చదివి, ‘ఇది కమ్యూనిష్టులకు సరిపోయెంత ఘాటుగా లేద’న్నారు. నన్ను పిలిచి కరపత్రం రాయాలని – అది రాసేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. నాలుగు పేజీలకు సరిపోయేంత డ్రాఫ్ట్ ‌రాసి వారికిచ్చాను. పూర్తిగా చదివి తెలంగాణ యాస – పల్లెటూరి సామెతల ఉప శీర్షికలతో కామ్రేడ్లకు సరిపడే ఘాటైన మోతాదు ఇచ్చావని మొచ్చుకున్నారు. లక్ష కరపత్రాలు ముద్రించి నల్లగొండ జిల్లా అంతటా పంచటమే కాక అసెంబ్లీ ఆవరణలో, ఎం.ఎల్‌.ఎ. ‌క్వార్టర్స్‌లో, సెక్రటేరియట్‌ అం‌తటా పంచటంతో రాష్ట్రంలో పెద్ద సంచలనమయింది. మరునాడే భీంరెడ్డి నర్సింహారెడ్డిని అరెస్టు చేశారు. ఆనాటి సంఘటనలో సోమయ్య గారు సూర్యాపేటలో మకాం వేయకుండా హైద్రాబాద్‌ ‌వెళ్లిపోయి ఉన్నట్లైతే ఆ జిల్లాలో సంఘానికి పూడ్చలేనంత నష్టం జరిగి ఉండేది. స్వయంసేవకులకు మనోబలాన్ని ఈ విధంగా పెంచారు.

జనగామ జిల్లా పూర్తి సమయ కార్యకర్తగా ఉన్న నన్ను 1969లో నిజామాబాద్‌ ‌జిల్లాకు మార్చారు. అంతదూరం వెళ్లలేనని సోమయగారిని అడిగాను. వారు నవ్వుతూ భారతదేశ పటం తెప్పించి అందులో నిజామాబాదు ఎక్కడుందో చూపించి నాతో, ‘కశ్మీరు నుండి కన్యాకుమారికి వరకు ఇది మన మాతృభూమి ఉపన్యాలు చెబుతావు, పాటలు రాస్తావు! నిజామాబాద్‌ ‌దూరంగా ఉందా?’ అని నవ్వారు. నేను మారుమాట్లాడ లేదు. మూడోరోజుకల్లా నిజామాబాద్‌ ‌చేరుకున్నాను.

నేను మొదటిసారి నిజామాబాద్‌ ‌వెళ్లి నప్పుడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో డా।। శర్మ నన్ను పరిచయం చేశారు. అందరి పరిచయం అయిన తర్వాత పట్టణ జనసంఘ అధ్యక్షుడు మురళీధర్‌రావు (అడ్వకేట్‌) ‌నా చదువు గురించి అడిగితే 9వ తరగతితో చదువు మానేశాను అని చెప్పగానే ఆయన ముఖం చిట్లించాడు. నేను కొంత నిరుత్సాహానికి గురయ్యాను.

ఆ తర్వాత నెలరోజులకు సోమయ్య గారు పర్యటనలో నిజామాబాద్‌ ‌వచ్చారు. ఆ సందర్భంలో జరిగిన సమావేశానికి వివిధక్షేత్రాల వారిని కూడా పిలిచారు. అప్పుడు జనసంఘ్‌ ‌పట్టణ అధ్యక్షలు నా ప్రస్తావన తెచ్చి సంఘటనా కార్యదర్శిగా ఒక గ్రాడ్యువేట్‌ను పంపిస్తే బాగుండునని సోమయ్య గారితో అన్నాడు. నేను నూరుశాతం కుంగిపోయాను. అప్పుడు సోమయ్య గారు ‘‘మీరు ఉత్త గ్రాడ్యుయేట్‌ ‌కావాలన్నారు-కాని సత్యనారాయణరెడ్డి గారు సోషల్‌ ‌సైన్సులో, పోలిటికల్‌ ‌సైన్సులో పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేశాడని చెప్పి పూర్తిగా దిగజారిన నా మనోబలాన్ని కొండంత ఎత్తుకు పెంచారు. సమావేశం తర్వాత నన్ను దగ్గరికి పిలుచుకుని ‘ఇలాంటి మాటలకు కుంగిపోవద్దు, దీన్ని ఒక సవాలుగా తీసుకొని పని చెయ్యి అన్నారు’. వారిచ్చిన ధైర్యంతో మూడేండ్లు నిజామాబాద్‌లో భార్యాపిల్లలతో ఉండి పనిచేశాను.

– మందాడి సత్యనారాయణరెడ్డి : మాజీ శాసన సభ్యుడు

About Author

By editor

Twitter
Instagram