శ్రావణమాసం వచ్చింది. మహిళలు నోములకు సిద్ధమవుతున్నారు. వ్రతాల సమాహారంగా శ్రావణమాసం ప్రతి ఏడు మన ముందుకు వస్తుంది. శ్రావణమాసం అంటే ముందుగా అందరికీ మదిలో మెదిలేది వరలక్ష్మీవ్రతం. ఈ వ్రతం ఎంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తే అమ్మవారి కరుణాకటాక్షాలు అంతగా ఉంటాయి. అందుకే ప్రతీ ఇంట మహిళలు తమ శక్తికి తగ్గట్టుగా వ్రతాన్ని జరుపుకుంటారు.

సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీస్సరస్వతీ ।

శ్రీలక్ష్మీర్వర లక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ।।

అని శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని వర్ణిస్తూ మంత్రాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో లక్ష్మీ స్వరూపానికి విశేషమైన స్థానం ఉంది. అష్టలక్ష్ములనూ ఆరాధిస్తాం. శుద్ధమైన శరీరంతో, పరిశుభ్రమైన వాతావరణంలో, పవిత్రమైన అంతఃకరణంతో ఉండడమే లక్ష్మీ కళ అంటారు. లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడం అంటే ముందు ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒంటిని శుభ్రం చేసుకోవాలి. అనంతరం అంతఃకరణ శుద్ధితో భక్తితో ఆ అమ్మను ప్రార్థించాలి. ఈ శుద్ధి మనతో మొదలై దేశానికి విస్తరిల్లాలి. ఇలా చేస్తే దేశసౌభాగ్యం లక్ష్మీకళతో విస్తరించడం జరుగుతుంది. దాన్ని కాంక్షించి చేయడమే నిజమైన లక్ష్మీ పూజ.

ఐశ్వర్యం ఆనందం ఇవన్నీ ప్రతీవారు కోరుకునేవే. ఇలాంటి కోరదగిన విషయాలనే వరం అంటారు. వీటిని ప్రసాదించే ఆ తల్లే వరలక్ష్మీ దేవి. ప్రతి వ్యక్తి జీవితంలోనూ జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం ఈ మూడింటి కన్నా కోరదగిన గొప్పవరాలు ఏముంటాయి. సూర్యుడు కాంతిని ప్రసరించినట్లుగానే భక్తితో లక్ష్మీదేవిని కనుక వేడుకుంటే ఈ మూడు వరాలను ప్రసాదిస్తుందా తల్లి.

జ్ఞానం ఉంటే ఏదైనా సాధించగలం. అందుకే అందరూ మొదట జ్ఞానాన్ని కోరుకుంటారు. ఆ తర్వాత ఐశ్వర్యం. ధర్మబద్ధంగా సంపాదించేది, ధర్మానికి మాత్రమే వినియోగించేది మాత్రమే ధనలక్ష్మీ స్వరూపం అవుతుంది. అక్రమార్జన ద్వారా సంపాదించుకున్న ధనం ధనలక్ష్మీ స్వరూపం అవ్వదు. మనం సంపాదించే ధనం, ఖర్చుపెట్టే ధనంలో ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడే దానికి దివ్యత్వం చేకూరుతుంది. అది మనల్ని రక్షిస్తుంది. ఇక మూడవది ఆనందం. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన ఆనందం లభించదు. కలహం, స్వార్థం, విపరీత ధోరణులు ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదని పురాణేతిహాసాల్లో వర్ణించారు. కేవలం పరస్పర ప్రేమ, స్నేహం, సామరస్యాలు ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఆ చోట ప్రశాంతత, ఆనందం సహజంగానే ఉంటుంది. అదే లక్ష్మీ కళ. ఆనందం పొందాలంటే క్షమతో, ప్రేమతో సాధించుకోవాలి. చేసేపనికి లభించే సిద్ధి, దానికి కావలసిన బుధ్ది, దానితో చేసే ప్రయత్నం ఈ మూడు పూర్ణలక్ష్మీ స్వరూపాలు. ఈ మూడింటితో పాటూ క్రమశిక్షణ, నిగ్రహం, సదాచార యోగ జీవితాన్ని గడిపినప్పుడు ఆ ఇల్లు లక్ష్మీ నివాస స్థానం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ప్రతి స్త్రీ లక్ష్మీ స్వరూపమే అని దేవీ భాగవతంలో వివరించారు. స్త్రీ సంతోషంగా ఉండే చోట ఆ తల్లి కొలువై ఉంటుందని ధర్మశాస్త్రాలు తెలుపుతున్నాయి. స్త్రీ విజ్ఞాన, వికాస, ఆనందాల అభివృద్ధి వల్ల కుటుంబం, సమాజం కూడా వైభవోపేతంగా ఉంటుంది.

ఇక వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయడంవల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు లభిస్తాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి అని పెద్దలు భావన. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపు కుంటారు. ఆ రోజున వీలుకానివారు తరువాత వచ్చే శుక్రవారాల్లో ఈవ్రతాన్ని ఆచరిస్తారు. భక్తితో వేడుకుంటే కోరిన వరాలని ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీ దేవి. కనుకనే మహిళలు శ్రావణమాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తారు. సాటి మహిళలను ఇంటికి ఆహ్వానించి మంగళకర వస్తువులతో తాంబూలం అందచేస్తారు. పసుపు కుంకుమలు ధరించి, పట్టు వస్త్రాలతో స్త్రీమూర్తులు ఇంటికి వస్తే సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవే వచ్చినట్లుగా భావిస్తారు. చక్కగా ఆలంకరించిన గృహాలు, సుగంధ పరిమాళాల సువాసనలు, పరస్పరం ఇచ్చిపుచ్చుకునే వాయనాలతో ప్రతి ఇల్లాలి మదిలో ఆధ్యాత్మిక భావాలు వెల్లివిరుస్తాయి. ఇక ప్రత్యేకించి వరలక్ష్మీ వత్రమంటే చెప్పేదేముందు. మహిళ లకు ప్రతీవారం పండగే. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడానికి నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, శ్రద్ద, ఏకాగ్రచిత్తం ఉంటే చాలని భావించే మహిళామణులు కోకొల్లలు.

– సంతోషి దహగాం

About Author

By editor

Twitter
Instagram