ఇది కొత్త విషయం కాదు, కొత్తగా జరుగుతున్న దుశ్చర్య కాదు. అంతకుముందు సంగతి ఎలా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానముల (టీటీడీ) వ్యవహారాల్లో సర్కార్‌ ‌జోక్యం, ఆధిపత్యం పెరుగుతూ వచ్చాయి. అలాగే, అరాచకాలు, అకృత్యాలు, భక్తుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా మారిన తర్వాత పరిస్థితి ఇంకా దిగజారుతూ వచ్చింది. ఒకరు ఆగమశాస్త్రాన్ని పక్కనపెట్టి ధర్మ విరుద్ధంగా వెయ్యి కాళ్ల మండపాన్ని నేలమట్టం చేస్తే, ఇంకొకరు ఏకంగా ఏడు కొండలను రెండు కొండలకు కుదించి, బ్రహ్మాండనాయకుని సన్నిధిలో చర్చిల నిర్మాణం చేపట్టేందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు సాగించిన కుట్రలు, కుతంత్రాలకు కొమ్ముకాశారు. ఒకరు ధర్మం పట్ల గానీ, దేవుని పట్ల గానీ విశ్వాసం లేని, వెంకన్న దేవుని ‘విలువలేని నల్లరాయి’గా అవహేళన చేసిన వామపక్ష భావజాలం నుంచి వచ్చిన వ్యక్తిని టీటీడీ అధ్యక్షుడిని చేస్తే, ఇంకొకరు ప్రత్యక్షంగా క్రైస్తవ మత ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్‌ ‌కుర్చీలో కూర్చోపెట్టారు. ఇలా ఇద్దరూ పోటాపోటీగా టీటీడీని పూర్తిస్థాయిలో రాజకీయ పునరావాస కేంద్రంగా, రాజకీయాలకు అడ్డాగా మార్చివేశారు. అన్యమతస్థులు, హైందవధర్మ వ్యతిరేకులు ఇదే అదనుగా టీటీడీలో చేరి అన్యమత ప్రచారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఇక ప్రస్తుత చైర్మన్‌ ‌విషయం అయితే చెప్పనే అక్కరలేదు. ఆయన తాను, ‘పవిత్ర హిందువును’ అంటారు. అదెంతవరకు నిజమో గానీ, ఆయన కుటుంబ నేపథ్యం, కొందరు కుటుంబసభ్యుల వ్యవహారశైలి చూస్తే అందరిలో కాకపోయినా కొందరిలో అయినా ఆయన మతవిశ్వాసాల పట్ల అనుమానాలున్నాయి. అలాగే, హిందూధర్మం పట్ల సంపూర్ణ అవగాహన, విశ్వాసంతో ధర్మరక్షణ కోసం, ధర్మ ప్రచారం కోసం కృషి చేస్తున్న హిందువులు అందరికీ ఆమోదయోగ్యమైన వారిని టీటీడీ చైర్మన్‌గా నియమించాలని వెంకన్న భక్తులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు.

టీటీడీ అధికార పత్రిక ‘సప్తగిరి’తో పాటుగా భక్తులకు అందిన ‘సజీవ సువార్త’

క్రైస్తవ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్న జగన్మోహన్‌రెడ్డి ఏలుబడిలో టీటీడీలో వివాదాలు ఒక విధంగా నిత్యకృత్యంగా మారిపోయాయి. ఒక వివాదం చల్లారింది అనుకునే సరికి మరో వివాదం తెరపైకి వస్తోంది. హైందవధర్మం పట్ల, హైందవ సంప్రదాయాల పట్ల కనీస అవగాహన, విశ్వాసం లేని వారిని టీటీడీ చైర్మన్లుగా నియమించడం మొదలు, ఆగమశాస్త్ర సాంప్రదాయాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం, టీటీడీ ఆస్తుల విక్రయానికి తలపడడం వరకు, అనేక అనర్ధదాయక నిర్ణయాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అదేమంటే, ఏదో సాకు చెప్పటం, పొరపాటనో, గ్రహపాటనో తప్పించు కోవడం.. కాదంటే, విచారణకు ఆదేశించామని, కేసులు పెట్టామని వాస్తవాలను మరుగున పరిచే ప్రయత్నం. మొత్తంగా మసి పూసి మారేడుకాయ చేసే కుట్రలు జరుగుతున్నాయి తప్పించి, గతంలో ఇలాంటి పాపాలు చేసినవారి అనుభవాలను గుర్తు చేసుకున్నది లేదు.
ఈ క్రమంలో చోటుచేసుకున్న మరో తాజా దురాగతం, మరో దుర్మార్గం, టీటీడీ అధికార పత్రిక ‘సప్తగిరి’తో పాటుగా భక్తులకు అందిన ‘సజీవ సువార్త’. ‘రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు’ అనే ట్యాగ్‌లైన్‌తో ‘సజీవ సువార్త’ పత్రిక కొందరు భక్తులకు ఏసుప్రభువు కానుకగా అందింది. నిజమే, ఈ సజీవ సువార్త, సప్తగిరి చందాదారులు అందరికీ అందలేదు. అలాగే, టీటీడీ చైర్మన్‌ ‌లేదా కార్యనిర్వాహణ అధికారి, సప్తగిరి సంపాదకులు ఇతర ఉన్నతాధికారులకు తెలిసే సువార్త ‘సప్తగిరి’ చందాదారులకు చేరిందని అనుకునేందుకు కూడా లేదు, కానీ, గతంలో జరిగిన ఉదంతాలను పరిగణలోకి తీసుకుంటే ఉద్దేశపూర్వకంగానే ఈ అకృత్యాలు జరుగున్నాయని, ప్రభుత్వంలోని పెద్దల అండదండలు, ఆశీస్సులతోనే ఇలాంటి తప్పులు, పాపాలు జరుగుతున్నాయని అనుకోవడంలో తప్పులేదు.

ఇదే సప్తగిరి పత్రికలో కొద్దిరోజుల క్రితం ఒక బాలమేధావి విరచిత రమాయణ విషవృక్షం లాంటి వికృత రచన వచ్చింది. ఇందులో సదరు బాలమేధావి శ్రీరామచంద్రమూర్తికి లవుడు ఒక్కడే కొడుకని చెపుతూ, కుశుడిని వాల్మీకి ధర్బతో చేసి ప్రాణం పోసిన బొమ్మగా వర్ణించాడు. దీనిపై వివాదం చెలరేగింది. టీటీడీ వంటి అత్యున్నత ధార్మిక సంస్థ ప్రచురించిన పత్రికలోనే హిందువుల పవిత్ర గ్రంథం రామాయణాన్ని వక్రీకరించే రచనలు ఏమిటని, హిందూధార్మిక సంస్థలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ పత్రిక ప్రధాన, ఉపసంపాద కులను సస్పెండ్‌ ‌చేసి చేతులు దులుపుకుంది. అయితే, చిత్రం ఏమంటే అది కూడా నిజం కాదు. తాజా సంచికలో ప్రచురించిన సంపాదకవర్గంలో అదే రాధారమణ, అదే చొక్కలింగం ఇప్పటికీ కూడా ప్రధాన సంపాదకుడు, సంపాదకునిగా కొనసాగు తున్నారు. అప్పుడున్న ఉప సంపాదకుడు రవిచంద్రన్‌ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు, ఈ సజీవ సువార్త విషయంలోనూ, టీటీడీ ఇలాంటి జిమ్మిక్కే చేస్తుంది కావచ్చు. అందుకే, టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎవరో కుట్రపూరితంగా చేసిన దుశ్చర్యగా టీటీడీ అధికారులు సువార్తను చూస్తున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తమ తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఇది, నిజంగానే ఎవరో చేసిన పాపమే అయినా టీటీడీ తమ బాధ్యత నుంచి తప్పించుకోలేదు.

జగన్‌ ‌సంవత్సర పాలనలో ఇలాంటి ఉదంతాలు ఇంకా చాలానే ఉన్నాయి. తిరుమల బస్సు టికెట్‌ ‌వెనక జెరూసలెం యాత్ర ప్రకటన మొదలు టీటీడీ వెబ్‌సైట్‌లో క్రైస్తవ గీతాల ప్రచారం వరకు ఒకటని కాదు, అనేక విధాలుగా టీటీడీ కేంద్రంగా క్రైస్తవ, అన్యమత ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఒక్క టీటీడీలోనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాలలో ఇదే కథ నడుస్తోంది. అన్య మతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు దేవాలయాలలో ఉద్యోగులుగా చేరి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ గుట్టును రట్టు చేసేందుకు, అన్యమతస్థులను ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు సంకల్పించినందుకే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని రాత్రికిరాత్రి బదిలీ చేశారు.

తాజాగా టీటీడీ భూముల విక్రయాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన అధికార పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై పార్టీ కత్తి కట్టింది. ఇది బహిరంగ రహస్యం. ఒకప్పుడు వైఎస్‌ ‌రాజశేఖరరెడ్డి చర్చిల మరమత్తులకు రూ.80,000 మంజూరు చేస్తే (22.08.1996 జీవో నెం.21), ఇప్పుడు జగన్‌ ‌హయాంలో ఏకంగా అధికారిక జనాభా లెక్కల ప్రకారం క్రైస్తవ జనాభా లేని గ్రామాలలో కూడా చర్చిలు వెలుస్తున్నాయి. పాస్టర్లు పుట్టుకొస్తున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచే వారికి ప్రతి నెల రూ.5000 ఇచ్చి క్రైస్తవ ప్రచారానికి తమ వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో క్రైస్తవులు 1.38 శాతం. కానీ సుమారు 30 వేల మంది పాస్టర్లను ప్రభుత్వం పోషిస్తోంది. అంటే, ప్రతి 24 మంది క్రైస్తవులకు ఒక పాస్టర్‌ ‌వంతున ఉన్నారు. ఇవి ఎవరో గిట్టనివారు ఇచ్చిన లెక్కలు కాదు, ప్రభుత్వమే స్వయంగా ప్రకటనల రూపంలో ఇచ్చినవి.

ఇదంతా ఎంతోకొంత బయటకు కనిపిస్తున్న వ్యవహారం. నిజానికి, బయటకు కనిపించకుండా జరుగుతున్న క్రతువు చాలానే ఉంది. జగన్‌ ‌ప్రభుత్వం అండ చూసుకుని క్రైస్తవ సంస్థలు చాలా దూరం వరకు వెళుతున్నాయి. ఇటీవలనే పాస్టర్‌ ఒకరు, ఏకంగా తమకు ప్రత్యేక దేశం కావాలనే వరకు వెళ్లారు. మతం మారుతున్న వారు రిజర్వేషన్లు, ఇతర ప్రయోజనాల కోసం హిందువులుగానే చెలామణి అవుతున్నా సామాజికంగా, రాజకీయంగా వచ్చే సరికి క్రైస్తవులుగానే చెలామణి అవుతున్నారు. నిజానికి చాప కింద నీరులా విస్తరిస్తున్న క్రైస్తవీకరణను అడ్డుకోవాలంటే, అందుకు ఒకటే మార్గం- కులాలను, రాజకీయ విబేధాలను పక్కన పెట్టి హిందూ బంధువులు అందరూ ఒకటి కావడం. అలాగే, హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనానికి వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని నిర్మించవలసిన సమయం కూడా ఇప్పుడు ఆసన్నమైంది.

ఈ మొత్తం అనర్థాలకు ఒక మూల కారణం హిందూ దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీ, ప్రభుత్వ అధిపత్యం. ఇతర ఏ మతంపైనా లేని ప్రభుత్వ అజమాయిషీ, అధిపత్యం ఒక్క హిందూ మతంపై ఎందుకు? ఇదే విషయంగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు స్వామి ధర్మ పోరాటానికి బలాన్ని ఇచ్చేవిధంగా కమ్యూనిస్టుల కన్నుపడిన తిరువునంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ ఆస్తుల విషయంలో చివరకు ధర్మమే విజయం సాధించింది. అనంత పద్మనాభస్వామి దేవాలయ ఆస్తులు దేవాలయ రాజపోషకులు ట్రావెన్‌కోర్‌ ‌రాజవంశస్తులకే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇది హిందూ సమాజం స్వాగతించదగిన తీర్పు. నిజం, హిందూధర్మం మీద అవగాహన, విశ్వాసం లేని పాలకులు, పాలకుల అకృత్యాలను ప్రశ్నించలేని అధికారగణం ఇప్పటికే దేవాలయాల పవిత్రతను చాలా వరకు చెరిపేశారు. వ్యాపార సంస్కృతిని ప్రవేశ పెట్టి భక్తుల విశ్వాసాలతో చలగాటమాడుతున్నారు. హిందూధార్మిక సంస్థలలో అరాచకాలను సృష్టిస్తున్నారు. ముఖ్యంగా హిందూధర్మాన్ని రాజకీయంగా వ్యతిరేకించే కేరళలో మత విశ్వాసాల కారణంగా ఆంధప్రదేశ్‌, ‌తమిళనాడులో దేవాయాల పరిస్థితి దైయనీయంగా మారింది. ఇది మనం చూస్తున్నాం, అనుభవిస్తున్నాం. దేవాలయాల ఆదాయాన్ని మాత్రమే కాదు ఆస్తులను మింగేసే పాలకులను మనం చూస్తున్నాం. మరోవంక ధూపదీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలు, కడుపు నిండా తిండి దొరకని అర్చకులనూ చూస్తున్నాం. కాబట్టి హిందూ దేవాలయాలపై లౌకికవాదం పేరుతో హిందూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న ప్రభుత్వాల అజమాయిషీ ఎంత త్వరగా తొలిగిపొతే అంత మంచిది.

రాజనాల బాలకృష్ణ  : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram