సమస్యాత్మకమైన సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్‌ ‌ముఖచిత్రం మారుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370, 35ఎ అధికరణల రద్దుతో దశాబ్దాలుగా, కొన్ని తరాలుగా అక్కడ నివసిస్తున్న పౌరులు అధికారికంగా ఇప్పటికి రాష్ట్ర పౌరులుగా మారారు. వీరికి  రాష్ట్ర అధికార యంత్రాంగం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను అందజేస్తోంది. ఈ పక్రియ ఇప్పుడు చురుగ్గా సాగుతోంది. ఎంత కీలక చట్టమైనా అమలుకు నోచుకోకపోతే కొద్ది నెలలకే ప్రాధాన్యం కోల్పోతుంది. ఆ చట్టం తేవడానికి ముందు పరిస్థితికి బలైపోయిన వారి త్యాగాలు వ్యర్థమవుతాయి. ఇది కొన్ని కీలక చట్టాల విషయం జరిగింది కూడా. ఆ గతి ఈ చట్టానికి పట్ట కూడదనే కేందప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నది.

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నవీన్‌కుమార్‌ ‌చౌదరికి జూన్‌ 26‌న రాష్ట్ర అధికార యంత్రాంగం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం అందజేసింది. బిహార్‌లోని దర్భంగ జిల్లాకు చెందిన చౌదరి 1994 బ్యాచ్‌ ‌జమ్ము కశ్మీర్‌ ‌కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. ఆయన గత 26 సంవత్సరాలుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. శ్రీనగర్‌ అసిస్టెంట్‌ ‌కమిషనర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌ ‌సెక్రటరి. జమ్ములోని గాంధీనగర్‌లో నివసిస్తున్న చౌదరికి ఈ ప్రాంతంలోని ‘బాహు’ తహసీల్దార్‌ ‌రోహిత్‌శర్మ ఇటీవల శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. దీంతో చౌదరి అధికారికంగా శాశ్వత పౌరుడిగా గుర్తింపు పొందినట్లయింది.

 రాష్ట్రంలో ఏళ్ల తరబడి నివసిస్తున్న గూర్ఖా రెజిమెంట్‌కు చెందిన మాజీ సైనికులు, సైనికాధికారులు, పశ్చిమ పాకిస్తాన్‌ ‌శరణార్థులు, వాల్మీకి సామాజిక వర్గ ప్రజలు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు పొందారు. కొన్ని దశాబ్దాల కితం అక్కడి పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడంతో ప్రజా అవసరాల నిమిత్తం 1957లో పొరుగున ఉన్న పంజాబ్‌ ‌నుంచి వాల్మీకి సామాజిక వర్గం వారిని రప్పించారు. అప్పటి నుంచి ఇక్కడే నివసిస్తున్నప్పటికీ అధికారికంగా ‘స్థానికులు’ కాలేకపోయారు.  ఇప్పుడు వారి ఆనందానికి అవధులు లేవు. తాము ఈ గడ్డపై పుట్టామని, ఇక్కడే మట్టిలో కలుస్తామని వారు ఉద్వేగంతో చెబుతున్నారు. తమ పూర్వీకులు పంజాబ్‌ ‌నుంచి వచ్చినప్పటికీ తాము కశ్మీర్‌ ‌గడ్డపైనే పుట్టామని తమను నిన్న మొన్నటిదాకా రాష్ట్ర ప్రభుత్వం వేరుచేసి చూసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు లేనందున తాము ఇప్పటిదాకా పరాయివారిగానే మిగిలిపోయామని, తమ పిల్లలు రాష్ట్రంలో విద్య, ఉద్యోగ అవకాశాలు పొందలేకపోయారని, అంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా మిగిలిపోయామని వాపోయారు. ఇది తమకు మరో స్వాతంత్య్రమని వారు చెబుతున్నారు.

370, 35 ఏ అధికరణలను రద్దుచేస్తూ గత ఏడాది ఆగష్టు 5న నరేంద్రమోదీ  నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. ఈ అధికరణాన్ని రద్దు చేయాలన్నది పాత జనసంఘ్‌ ‌విధానం. 1980లో జనసంఘ్‌ ‌భారతీయ జనతాపార్టీగా రూపుదిద్దుకున్న తర్వాత కూడా ఈ విధానానికే కట్టుబడి ఉంది. తాము సొంత బలంతో అధికారంలోకి వస్తే ఈ అధికరణలను రద్దు చేసి తీరుతామని కశ్మీర్‌కు స్వేచ్ఛను ప్రసాదిస్తామని బీజేపీ పలుమారు విస్పష్టంగా పేర్కొంది. 1990లో కశ్మీర్‌ ‌నుంచి కట్టుబట్టలతో వచ్చి ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాలలో జీవనం సాగించిన పండిత్‌ల గురించి కూడా గట్టిగా మాట్లాడిన పార్టీ కూడా బీజేపీయే. కొందరు పండిత్‌లు ఫుట్‌పాత్‌ల మీద గడిపారు. జమ్ములోని రక్షణ శిబిరాలలో ఏళ్ల తరబడి ఉన్నారు. 2019లో 300కు పైగా లోకసభ స్థానాలు సాధించిన పార్టీ వెనువెంటనే ఈ దిశగా అడుగులు వేసింది. గత ఏడాది ఆగష్టు 5న హోంమంత్రి అమిత్‌షా అనూహ్యంగా రాజ్యసభలో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరువాత అన్ని పార్టీలు, పార్లమెంట్‌, ‌రాష్ట్రపతి ఆమోదించడంలో ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. ఈ మేరకు నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు జమ్ముకశ్మీర్‌ ‌గ్రాంట్‌ ఆఫ్‌ ‌డొమిసైల్‌ ‌సర్టిఫికెట్‌ (‌ప్రోసీజర్‌) – 2000 ‌చట్టాన్ని ఈ ఏడాది మే 18న ఆమోదించింది. ప్రస్తుతం  ఈ చట్టం ప్రకారం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తున్నారు.

తాజా నిబంధనల ప్రకారం 15 సంవత్సరాలుగా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రజలు, వారి పిల్లలు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు అర్హులు. రాష్ట్రంలో పదేళ్ల నుంచి పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అఖిల భారత సర్వీసు అధికారులు ప్రభుత్వ సంస్థలు, స్వతంత్ర ప్రతిపత్తిగల కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, చట్టబద్ధ సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, గుర్తింపు పొందిన కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థల ఉద్యోగులు కూడా అర్హులేనని నూతన నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పదేళ్లుగా అక్కడే ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు, పదోతరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సైతం అర్హులే. రాష్ట్రానికి వెలుపల నివసిస్తున్న శాశ్వత నివాసధ్రువీకరణ పత్రం ఉండి, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న వారు కూడా అర్హులు. ఈ సరళమైన నిబంధనల కారణంగా ఎంతోమంది రాష్ట్ర పౌరులుగా మారడానికి అవకాశం ఏర్పడింది. పత్రాలు మంజూరు అధికారాన్ని స్థానిక తహశీల్దార్లకు ప్రభుత్వం అప్పగించింది. పౌరులు దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా ధ్రువీకరణ పత్రాలను తహశీల్దార్లు అందజేయాలి. నిబంధనల ప్రకారం అర్హులు అయి ఉండి 15 రోజుల్లోగా మంజూరు చేయనట్లయితే రూ.50వేలు  జరిమానా విధిస్తారు. వీలైనంత త్వరగా పత్రాలు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర అధికారయంత్రాంగం అధికార ప్రతినిధి రోహిత్‌ ‌కన్సల్‌ ‌వెల్లడించారు.

ఈ నెల నాలుగోతోదీ వరకు 33,157 దరఖాస్తులు వచ్చినట్లు అంచనా. వీటిలో 32వేల దరఖాస్తుల జమ్ము ప్రాంతంలోని పది జిల్లాల నుంచి రావడం గమనార్హం. కశ్మీర్‌లోయ నుంచి కేవలం 72 దరఖాస్తులు వచ్చాయి.

జమ్ముకశ్మీర్‌లో లక్షమందికి పైగా గూర్ఖాలు ఉన్నట్లు అంచనా. వారు స్థానిక ఎన్నికల్లో, అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు. కానీ వారు శాశ్వత ఆస్తులు సమకూర్చుకునేందుకు అవకాశం లేదు. నివాస ధ్రువీకరణ పత్రాలు పొందడంవల్ల ఇక నుంచి ఆ సమస్య ఉండదు. వారి పిల్లలు విద్య, ఉద్యోగ అవకాశాలు పొందగలరు. 19వ శతాబ్దాల మధ్యలోనే గూర్ఖాలు నేపాల్‌ ‌నుంచి రాష్ట్రానికి తరలి వచ్చారు. డోగ్రా సంతతి రాజుల హయాంలో, వారి ఆహ్వానం మేరకు వచ్చారు. తాజాగా 6,600మంది గూర్ఖా మాజీ సైనికులు, అధికారాలు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు కోసం దరఖాస్తు చేశారు. వీరు సైన్యంలోని గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేశారు. వీరిలో 5,900 మందికి నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశామని జమ్మూ డిప్యూటి కమీషనర్‌ (‌రెవెన్యూ) విజయ్‌కుమార్‌ ‌శర్మ వెల్లడించారు. కశ్మీర్‌లో గూర్ఖాల నుంచి 700 దరఖాస్తులు వచ్చాయి. తన పరిధిలో 2500 గూర్ఖాల నుంచి దరఖాస్తులు వచ్చాయని, వాల్మీకి సామాజిక వర్గం నుంచి కూడా కొన్ని దరఖాస్తులు వచ్చాయని జమ్ము ప్రాంతంలోని ‘బాహు’ తహశీల్దార్‌ ‌రోహిత్‌శర్మ వెల్లడించారు.

ప్రత్యేక ప్రతిపత్తితో ఇబ్బందులు ఎదుర్కొన్న వర్గాలు అక్కడ ఎక్కువే. స్వతంత్ర ప్రతిపత్తితో కశ్మీరీ పురుషులకు తప్ప మరెవ్వరికీ ఉపయోగం లేదన్న వాదన ఉండేది. అయితే ఆ అంశానికి తగిన ప్రాచుర్యం రాలేదు. కొన్ని వేల మంది అన్యాయానికి గురయ్యారు. 1957 ప్రాంతంలో కశ్మీర్‌ ‌వచ్చిన వాల్మీకి వర్గానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోనే స్థిరపడి, రెక్కలు ముక్కలు చేసుకుని జీవనం సాగించారు. ఆ సామాజిక వర్గంలో రెండు మూడు తరాలు గడిచిపోయాయి. తిరిగి పంజాబ్‌ ‌వెళ్లలేదు. దేశ విభజన సమయంలో పశ్చిమ పాకిస్తాన్‌ ‌నుంచి వచ్చిన శరణార్థులు కూడా రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.  నిన్న మొన్నటి వరకు గుర్తింపు లేని పౌరులుగానే జీవనం సాగించారు. ఇప్పుడు వారికి కూడా అధికార యంత్రాంగం శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలను మంజూరు చేస్తోంది. రాష్ట్రేతరులను వివాహం చేసుకున్న జమ్ముకశ్మీర్‌ ‌మహిళలకు, వారి జీవిత భాగస్వాములకు కూడా తాజా నిబంధనలు వర్తిస్తాయి. ఈ నెల 15వరకు 16వేలమంది పశ్చిమ పాకిస్తానీ శరణార్థులకు, 3వేలమంది వాల్మీకి సామాజిక వర్గంవారికి శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేశారు. ‘ఇప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఇక నుంచి మేం ఓటువేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేయవచ్చు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో పాల్గొనవచ్చు’ అని పశ్చిమ పాకిస్తాన్‌ ‌శరణార్థుల సంఘం అధ్యక్షుడు లాభ్‌ ‌రామ్‌గాంధీ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. శరణార్థుల్లో ఎక్కువమంది దళితులు కావడం విశేషం. దేశ విభజన సమయంలో 1947లో వారు పాకిస్తాన్‌లోని సియోల్‌కోట నుంచి సాంబ, కథువా ప్రాంతాలకు వలస వచ్చారు.

1957లో రాష్ట్రంలో పారిశుద్ధ కార్మికుల 6 నెలలు సమ్మె చేసినప్పుడు, శాశ్వత నివాస పత్రాలు ఇస్తామన్న హామీతో అప్పటి జమ్మూకశ్మీర్‌ ‌ప్రధాని బక్ష్మిగులాం మహమ్మద్‌ ‌తమను తీసుకువచ్చారని, కానీ తరాలు గడిచినా ఆ హామీ నెరవెరలేదని, ఇప్పుడు తమ కల సాకారమైందని వాల్మీకి సామాజిక వర్గ నాయకుడు షురుబట్టి హర్షం వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన దీపాదేవి తొలి మంజూరు పత్రాల అందుకున్నారని ఆమె జమ్మూ నగర పాలక సంస్థల సఫాయి కార్మికురాలిగా పనిచేశారని ఆయన తెలిపారు. ఇప్పుడు తాము రాష్ట్రంలో చట్టబద్ధమైన పౌరులమని తమ పిల్లలు భవిష్యత్తులో రాష్టప్రభుత్వంలో అధికారులుగా చూడగలుగుతామని ఆయన చెప్పారు.

జమ్మూ ప్రాంతం నుంచి నివాస ధ్రువీకరణ పత్రాల కోసం అత్యధికంగా దరఖాస్తులు వస్తున్నాయి. శ్రీనగర్‌ ‌జిల్లాలో కేవలం 65 దరఖాస్తులు వచ్చాయి. పుల్వామా జిల్లాలో 153, అనంతనాగ్‌లో 166, కుల్గాలో 90, బారముల్లాలో 39, షోపియాన్‌లో 20, బందిపొరలో 10, కుప్వారాలో 10, బుడ్గాంలో 9, దరఖాస్తులు రాగా వారికి నివాస ధ్రువపత్రాలు అందజేశారు.

జమ్ముప్రాంతంలోని దోడలో 8,500, రాజౌరీలో 6,214, జమ్మూలో 2820 మందికి మంజూరు పత్రాలు అందజేశారు.

నివాస ధ్రువీకరణ పత్రాలు మంజూరుకు సంబంధించి రిజర్వేషన్లు, చట్టంలోని సాంకేతిక అంశాలపై తాజాగా దాఖలైన వ్యాజ్యాలను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ విషయమై రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది.

న్యాయమూర్తి జస్టిస్‌ ‌లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ ‌హేమంత్‌ ‌గుప్తా, జస్టిస్‌ ఎస్‌.‌రవీంద్రభట్‌ ‌డివిజన్‌ ‌బెంచ్‌ ‌తాజాగా తీర్పు వెలువరించింది.

కొత్త చట్టాన్ని సహజంగానే ప్రదాన ప్రాంతీయ పార్టీలు నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌పీపుల్స్ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ (పిడిపి) వ్యతిరేకిస్తున్నాయి. ఇది రాష్ట్ర ప్రజల సమతూకాన్ని దెబ్బతీస్తుందని ఆ పార్టీల అధినేతలు ఒమర్‌ అబ్దుల్లా, ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వాదిస్తున్నారు. ఇంకా ఇతర చిన్నా చితక పార్టీలు సైతం ఇదే వాణిని వినిపిస్తున్నాయి. ఆఖరికి సిపిఎమ్‌ ‌నేత తారిగామి కూడా ప్రాంతీయ పార్టీలకు వత్తాసు పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తారిగామి రాష్ట్రంలో సీనియర్‌ ‌నాయకుడు. కొత్త నిబంధనలను భారతీయ జనతాపార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుండగా, హస్తం పార్టీ అస్పష్టంగా మాట్లాడుతోంది. ఏళ్ల తరబడి స్థానికులుగా ఉన్నప్పటికీ అధికారికంగా గుర్తింపు లేక ఎంతోమంది వివక్షకు లోనయ్యారు. నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంవల్ల వారంతా నేడు స్వేచ్ఛ పొందారు. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ పౌరులుగా గుర్తింపు పొందారు. ఇకపై అందరు ప్రజల మాదిరిగా వారు సమాన హక్కులు, అవకాశాలు పొందనున్నారు. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంలో సరిహద్దు రాష్ట్రం శక్తిమంతంగా రూపుదిద్దుకోనుంది! ఇది కశ్మీర్‌కు కొత్త అందమే.

– గోపరాజు విశ్వేశ్వరరావు : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE