కరోనా మహమ్మారితో భారత్‌ ‌పోరాడు తున్న తరుణంలో లద్ధాక్‌లో చైనా దురాక్రమణ ప్రయత్నం చేసింది. గల్వాన్‌ ‌వద్ద జరిగిన పోరులో 20 మంది భారతీయ సైనికులు వీర మరణం పొందారు. ఈ నష్టం గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. 1962 తరువాత చైనాతో నెత్తుటి ఘర్షణ జరగడం ఇదే మొదటి సారని కూడా చెబుతున్నారు. భారత సైన్యం శౌర్య, పరాక్రమాలనూ, భారత నాయకత్వాన్నీ అవహేళన చేస్తూ కొంతమంది ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలు అడిగే వారి గత చరిత్రను పరిశీలిస్తే, వీరంతా బీజేపీ•ని కేంద్రంలోకి రాకుండా ఆపడానికీ, నరేంద్ర మోదీని ఓడించడానికీ తీవ్రంగా ప్రయత్నించిన వారేనని తెలుస్తోంది. ప్రస్తుత సమస్యలకు మూలాలు ఇలాంటి వారిలో దూరదృష్టి లేకపోవడం, అపరిపక్వత, నాయకత్వ లేమి, దేశం పట్ల నిష్ఠ లోపించడం అనేవి సుస్పష్టం.

గతంలో డోక్లాంలో, ఇప్పుడు గల్వాన్‌ ‌ప్రాంతంలో భారతదేశ అగ్ర నాయకత్వం చూపించిన పట్టుదల, ధైర్యం, సంయమనం ఇంతకుముందెన్నడు చైనా విషయంలో జరగలేదు. 1962 తరువాత కూడా చైనా ద్వారా దురాక్రమణ కొనసాగింది. కాని ఇప్పటి వరకు ఈ విధంగా బలమైన ప్రతిఘటన ఏనాడు ఎదురుకాలేదు. సైన్యం శౌర్య, పరాక్రమాలతో పాటు బలమైన నాయకత్వ పాత్ర ఇందుకు కారణమని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్ష విజయవంతమైనట్లు వెల్లడైంది. అందులో కూడా శాస్త్రవేత్తలతో పాటు నాయకత్వ నిర్ణయాత్మక పాత్ర ప్రముఖమైంది. భారతీయ శాస్త్రవేత్తలు 1994లోనే ఈ అణు పరీక్ష చేసేందుకు సన్నద్దంగా ఉన్నారు. కానీ, అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి నాటి నాయకత్వం అందుకు అంగీకరించలేదు. అదేపని 1998లో అటల్‌ ‌బిహారి వాజ్‌పేయి చేసి చూపించారు. ఆ విజయవంతమైన పరీక్ష తరువాత భారతదేశం, భారతీయుల పట్ల గౌరవ మర్యాదలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. 2014 నుండి పాకిస్తాన్‌, ‌చైనాలతో దేశ వ్యతిరేక, ఉగ్రవాద కార్యకలాపాల పట్ల భారత వైఖరిలో గణనీయమైన మార్పు వచ్చింది. యురి, సర్జికల్‌ ‌స్ట్రయిక్‌తో పాటు; బాలాకోట్‌, ‌డోక్లామ్‌, ‌గల్వాన్‌, ‌కశ్మీర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న పాక్‌ అనుకూల తీవ్ర వాదులను విజయవంతంగా అంతమొందిచడం తదితర కార్యకలాపాలు ఈ మార్పుకు సంకేతం. నేటి వరకు నిర్లక్ష్యం వహించిన భారతీయ సరిహద్దులలో అభివృద్ధి పనులు వేగంగా జరుగు తున్నాయి. గతంలో పాకిస్తాన్‌, ‌నేడు చైనా అధీనంలో ఉన్న అక్సాయిచిన్‌ను తిరిగి భారత భూబాగంలోకి తీసుకోని రావాలనే కోరిక, అందుకు దృఢమైన, దూరదృష్టి గల, సాహసవంతమైన నేతృత్వ పని తీరుకు నిలువెత్తు నిదర్శనం. ఇది కూడా చైనా అసహనానికి ఒక కారణం కావచ్చు. అంటే భారత్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే కొన్ని శక్తులు దిక్కుతోచని స్థితిలో క•ప్పిగంతులు వేస్తున్నాయని దీన్ని బట్టి అర్థం చెసుకోవచ్చు.
1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైన్యం సాటిలేని శౌర్య, పరాక్రమాలు ప్రదర్శించి, ఎన్నో త్యాగాలు చేసినప్పటికి మనం ఓడిపోయాం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, ఆ సమయంలో భారతదేశ అగ్ర నాయకత్వానికి దూరదృష్టి లోపించడం. రెండవది, యుద్ధానికి ఎటువంటి సంసిద్ధత లేదు. చైనాను సోదర దేశంగా భావించి కౌగిలించుకోవడం వల్ల అది ఏనాటికైనా మోసం చేయవచ్చునని ఆ దేశ విస్తరణవాద స్వభావం గురించి తెలిసిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఆనాటి సర్‌ ‌సంఘ్‌చాలక్‌ శ్రీ ‌గురూజీ, దూరదృష్టి గల అనేక మంది నాయకులు ముందుగానే హెచ్చరించారు. ఆ హెచ్చరికను విస్మరించి, ఎటువంటి భద్రతా సన్నాహాలు చేయకపోవడం, చైనాను పూర్తిగా కౌగిలించుకొని మైమర్చిపోవడం వల్ల 1962 యుద్ధంలో మనం తలదించుకోనేటట్లు ఘోరమైన పరిణామాలను చవిచూసాం. ఈ సంఘటన తర్వాతే సైనిక శక్తిని సమకూర్చుకోవాలని నిర్ణయించారు. కానీ సైన్యం శక్తిమంతం కావడంతో సంతృప్తి చెందితే సరిపోదు. దేశ నాయకత్వం పరిపక్వతతో వ్యవహరించడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం.

డిసెంబర్‌ 6, 2013‌న ఆనాటి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ పార్లమెంటులో మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటపడింది. అందులో ఆయన మాట్లాడుతూ, ‘‘భారతదేశం కంటే మౌలిక సదుపాయాల నిర్మాణంలో చైనా చాలా మెరుగ్గా ఉంది. సరిహద్దును అభివృద్ధి చేయకపోవడమే ఉత్తమ రక్షణ అని స్వతంత్ర భారతదేశ విధానంగా చాలా సంవత్సరాలుగా ఉండేది. అభివృద్ధి చెందని సరిహద్దులు అభివృద్ధి చెందిన సరిహద్దుల కంటే సురక్షితమైనవి అనే అభిప్రాయం ఉండేది. అందువల్ల చాలా సంవత్సరాలుగా, సరిహద్దు ప్రాంతాల్లో రోడ్లు లేదా వైమానిక క్షేత్రాలు నిర్మించలేదు. అప్పటికే చైనా సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూనే ఉంది. వారు ఇప్పుడు మనలను అధిగమించారు. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపరంగా, సామర్థ్యపరంగా చైనీయులు మనకంటే ముందున్నారు. ఇది చారిత్రక వాస్తవం నేను దీన్ని అంగీకరిస్తున్నాను’’. అని అన్నారు.

స్వాతంత్య్రం వచ్చిన వెంటనే, భారత విదేశాంగ విధానం, భద్రతా విధానం, ఆర్థిక విధానం తప్పు దిశగా పయనించాయి. భద్రతా విధానానికి ఉదాహరణ పైన వచ్చింది. ఆర్థిక విధానం గురించి ప్రస్తావించినట్లైతే గ్రామ ఆధారిత, వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యమివ్వడానికి బదులుగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ మహానగరాల చుట్టూ తిరుగుతున్నందున, భారతదేశ ప్రజలలో 70 శాతం నివసించే గ్రామాలు అభివృద్ధి చెందలేదు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత అవలంబించిన విధానాల కారణంగా, వ్యవసాయం, రైతులు నిర్లక్ష్యానికి గురైనారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి కోసం సుదూర నగరాలకు వలస వెళ్లడానికి ప్రజలు స్వగ్రామాలను విడిచిపెట్టవలసి వచ్చింది. కరోనా మహమ్మారి సమయంలో ఈ విధానాల కచ్చితమైన ఫలితం ఇప్పటికే కనిపించింది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన లక్షలాది మంది కార్మికులు తాము సంపాదించుకుంటున్న నగరంలోనే పరాయి వారైనట్లుగా భావించారు. దీనితో వారంతా తిరిగి గ్రామాల వైపు పయనమయ్యారు. ఈ సందర్భంగా వారు తమ ఆత్మీయుల నుండి, వారి భూమి, సంస్కృతి నుండి దూరమయ్యారు. భారతదేశంలో ఎక్కువ మందికి వ్యవసాయం ద్వారా ఉపాధి లభిస్తుంది.

విదేశీ విధానంలో అలీన విధానం గురించి చర్చకు వస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యవహారాల గురించి చెప్పుకునే సందర్భంలో భారత్‌ ‌శక్తిమంత మయ్యే వరకు యుద్ధనీతి దృష్ట్యా అలీన విధానం గురించి మాట్లాడటం అర్థవంతమే. అయితే మన విదేశాంగ విధానానికి అది ఆధారభూతం కాజాలదు. ఎందుకంటే ఏ రెండు మహాశక్తుల నుండి నిరపేక్షంగా ఉండే విషయమై చర్చ జరుగుతుందో ఆ మహాశక్తుల సామాజిక జీవనం, వారి సిద్ధాంతల భూమిక, వాటి రాష్ట్రీయ, సామాజిక, మానవ జీవన అనుభవం భారతదేశ రాష్ట్రీయ, సామాజిక, సిద్ధాంత భూమిక మున్నగు వాటితో పోల్చినప్పుడు అవి పరిపూర్ణమైనవి కావనీ, అపరిపక్వమైనవని తెలుస్తుంది. అటువంటి అపరిపక్వమైనటువంటి వాటి ద్వారా మన విధానాన్ని నిర్ధారణ చేయలనుకోవడం కూడా బానిస మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అమెరికా, సోవియెట్‌ ‌రష్యాలు అగ్రరాజ్య కేంద్రాలుగా ఉండేవి. అవి పురోగమించి ఐదువందల సంవత్సరాలు కూడా కాలేదు. ఏ సైద్దాంతిక ఆలోచన విధానాలనైతే వారు ప్రశంసిస్తున్నారో, వాటికి కనీసం వంద సంవత్సరాల అనుభవం కూడా లేదు. మరోవైపు, భారతదేశ చరిత్ర, జాతీయ జీవన స్రవంతి కనీసం పదివేల సంవత్సరాల నాటివి. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నతిని సాధించిన భారతీయుల జీవనవిధానం ఏకాత్మ భావనతో, సర్వవ్యాప్తమై ప్రపంచ ప్రజల మన్ననలు పొందింది. అందుకే సంపూర్ణ శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ భారత్‌ ఇతరదేశాలపై యుద్ధం చేయాలనే ఆలోచన చేయలేదు. వాణిజ్యం కోసం ప్రపంచంలోని నలుమూలకు వెళ్లినప్పటికీ, భారతదేశం వాటిని వలస రాజ్యాలుగా చేసుకోలేదు. దోపిడీ చేసి, దోచుకో లేదు. మత మార్పిడిలు చేయలేదు. అక్కడివారిని బానిసలుగా చేసి వ్యాపారం చేయలేదు.

మనవాళ్లు ఆయా దేశ ప్రజలను అన్ని రకాలుగా సంపన్నులను చేశారు. అక్కడ స్థితిగతులను మెరుగుపరిచారు. సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షించారు. వాటిని వికసింపచేశారు. భారతీయుల ఈ పురాతన దృక్పథమే ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపును తెచ్చింది. పర్యవసానంగా, అదే దృష్టి మన విదేశాంగ విధానానికి కూడా ఆధారం అయి ఉండాలి. కాని భారత ప్రథమ ప్రధానమంత్రిపై సామ్యవాద ప్రభావం ఉండేది. అందువల్ల, భారతీయ ఆధ్యాత్మికత (వైశ్విక, సంపూర్ణ వికాసం, ఏకాత్మ భావన) ఆధారంగా రూపుదిద్దుకొన్న ఆలోచనలు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన మన ప్రత్యేకమైన దృష్టి కోణాన్ని తిరస్కరించి, ఆధునికత పేరిట ఆకర్షణీయ మైన పాశ్చాత్య పదావళి వ్యామోహంలో భారతదేశ విధానాల దిశను పూర్తిగా మార్చివేశారు. ఆ తరు వాత కాంగ్రెస్‌లో సామ్యవాదుల ప్రభావం విపరీతంగా పెరుగుతూపోయింది. చివరకు కాంగ్రెసే సామ్యవాదుల ప్రభావంలోకి వచ్చేసింది. ఫలితంగా భారతీయ చింతన (భావాలు) నుండి భారతదేశానికి దూరం పెరిగింది. శతాబ్దాలుగా ప్రపంచానికి తెలిసిన భారత స్వీయ గుర్తింపును తిరస్కరించి, తనను తాను ప్రగతిశీల, ఉదారవాద, మేధావి అని పిలిపించు కోవడం ఆయనకు అలవాటుగా మారింది.

కాని సమాజంలో కొనసాగుతున్న సామాజిక, జాతీయ మేల్కొలుపు కారణంగా 2014 ఎన్నికల్లో కాంగ్రెసేతర పార్టీ స్వాతంత్య్రానంతరం మొదటిసారి సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. ఇది మాత్రమే కాదు, దేశమంతటా జాగృతమైన సమాజ విజయ పరంపర కొనసాగుతోంది. తద్వారా ఈ దేశ మూలాలతో తిరిగి అనుసంధానం జరుగుతోంది. ప్రస్తుతం సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించి దేశవ్యాప్తంగా పునరుజ్జీవనం చేసింది. ఇక ప్రగతిశీల ఆలోచనల పేరిట, భారతీయ సమాజంపై వలసవాద భావాలను రుద్దేవారు ఘోరంగా తిరస్కరణకు గురైనారు. 2019లో మరింత ప్రజా మద్దతుతో అదే కథ పునరావృతం అయింది. 2014 నుండే మార్పు మొదలైందనే సంకేతం స్పష్టమైంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 16 మే 2014న ప్రకటించారు. నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటి లభించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనిజాతీయ ప్రజాస్వామ్య కూటమికి (ఎన్డీఏ) ఆహ్వానం అందింది.

ఈ సందర్భంగా ‘సండే గార్డియన్‌’ ‌పత్రిక సంపాదకీయాన్ని ‘‘18 మే 2014ను బ్రిటన్‌ ‌చిట్టచివరకు భారతదేశాన్ని విడిచిపెట్టిన రోజుగా చరిత్రలో నమోదు చేయవచ్చు’’ అంటూ ప్రారంభించింది. ఎన్నికల్లో మోదీ సాధించిన విజయం సుదీర్ఘ యుగానికి ముగింపునిచ్చింది. భారతదేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత పరిపాలన తీరుతెన్న•లు, దాని స్వభావం బ్రిటన్‌ ‌భారత్‌ను పాలించిన నాటి రోజులకు పెద్దగా తేడా లేదు. భారతదేశంలో అనేక విధాలుగా కాంగ్రెస్‌ ‌పార్టీ పాలించిన కాలం బ్రిటిష్‌ ‌రాజ్యాధికారానికి కొనసాగింపుగా ఉందంటూ సంపాదకీయం ప్రారంభించడమే ఈ మార్పుకు అసలు వర్ణన. అదే సమయంలో శ్రీశివ విశ్వనాథన్‌ ‌రాసిన వ్యాసం ప్రచురించారు. ఇందులో రచయిత ఒక ముఖ్యమైన విషయం అంగీకరించారు. ఈ కథన సారాంశం శీర్షిక చూడగానే అర్థమవుతుంది. శీర్షిక పేరు ‘‘మోదీ నాలాంటి ‘లిబరల్స్’‌ను ఎలా ఓడించాడు’’. ‘‘లౌకికవాదం అనేది మధ్యతరగతి ప్రజల వైఖరి, వారి నమ్మకాలక• ఇబ్బందిగా, సంకోచంగా భావించేటట్లు వ్యతిరేకమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది’’ అని శివ విశ్వనాథన్‌ ‌రాశారు. లౌకికవాదం ఒక ఆడంబరమైన పదంగా రూపుదిద్దుకుంది. అంతేకాదు ప్రజలకు అప్రస్తుతం, అసౌకర్యంగా మారింది. కేవలం సమావేశాలలో ప్రస్తావించడానికి పరిమితం అయింది. దీని వల్ల మధ్యతరగతి ప్రజలు సుఖంగా లేరు. మే 17న నరేంద్ర మోదీ మళ్లీ కాశీని సందర్శించారు. కాశీ విశ్వనాథ ఆలయంలో పూజాదికాలు పూర్తి చేసిన తరువాత, ఆయన దశాశ్వమేధ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ నదీ ఒడ్డున పెద్ద ఎత్తున హారతి కార్యక్రమాలు జరిగాయి. ఇదంతా టెలివిజన్‌లో ప్రత్యక్షంగా ప్రసారం చేశారు. ఈ సంఘటనను పూర్తిగా వ్యాఖ్యానం లేకుండా చూపించాలని ప్రజలు కోరుకున్నారు. మరోవైపు కొంతమంది అలాంటి పూజాదికాలు బహిరంగంగా చూపించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. మోదీ లోకానికి అందించాలనుకున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది, ‘మేము మా ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తాం. దీని గురించి సిగ్గుపడవలసిన అవసరం మాకు లేదు.’ అన్నారాయన. ఇది గతంలో జరగలేదు. మొదట నేను దీనితో చిరాకు పడ్డాను. కాని ఆ తరువాత ఆలోచనలో మునిగిపోయాను. నా సహోద్యోగి ఒకరు దీనికి కొన్ని పదాలు జోడించారు. ‘మీరు, ఇంగ్లీష్‌ ‌మాట్లాడే లౌకికవాదులు, బలవంతంగా ప్రజల మధ్యన ఉన్నారు. మీ వ్యవహారం మెజారిటీ ప్రజలు సిగ్గుపడేలా చేస్తుంది’ ఈ వ్యాఖ్య చేదుగా అనిపించింది. నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయినా నాలాంటి ఉదారవాదులు ఇంత పెద్ద విషయానికి దోషులే అని నేను ఆ క్షణంలో గ్రహించాను!’’ అంటూ శివ విశ్వనాథన్‌ ‌వ్యాసం ముగించారు.

ఇది సరికొత్త భారతదేశమని భారతీయులందరితో పాటు ప్రపంచ ప్రజలు గ్రహిస్తున్నారు. వాస్తవానికి ఇది క్రొత్తది కాదు. శతాబ్దాలుగా ఈ దేశ ఆత్మగౌరవాన్ని అణిచివేసి, తప్పుడు ప్రచారాలు చేశారు. అయినా శతాబ్దాల నాటి చిర పురాతనం – నిత్య నూతనం అనే శాశ్వతమైన మాటను నిజం చేస్తూ సరికొత్త శక్తితో స్వాభిమాన దిశగా నిలదొక్కుకునేందుకు భారత్‌ ‌నేడు సిద్ధంగా ఉంది. భారతదేశ ఆలోచనా విధానం ‘వసుధైవ కుటుంబకం’, ‘సర్వేపి సుఖినః సంతు’ అయినందున నేడు ఎవరికి వారు స్వయంగా మేల్కొంటున్నారు. స్వాభిమానం, స్వావలంబన దిశగా అడుగులు వేస్తోన్న భారత్‌ను చూసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మేల్కొంటున్న భారతదేశం. కరోనా మహమ్మారి వంటి సంక్షోభంతో దేశం విజయ వంతంగా పోరాడుతున్నప్పుడు, విస్తరణ వాదంతో, నియంతృత్వ చైనా వల్ల ఎదురవుతున్న ఈ సవాలును స్వీకరించేందుకు భారతీయ సమాజం కలసి కట్టుగా ఉందని నిరూపించాలి. అది జరుగుతుంది కూడా. జాతీయ భద్రత, వ్యూహత్మక దృష్టి, సైన్యం, ప్రభుత్వ నిర్ణయాత్మక సామర్థ్యాన్ని విశ్వసించడం ద్వారా ప్రజలందరూ, అన్ని పార్టీల రాజకీయనేతలు పరిపక్వతను ప్రదర్శించడం నేడు అవసరం. రాజకీయ లాభ నష్టాలకు లేదా ఒకరిపై మరొకరు గెలుపొందా లనే ఆలోచనలకు ఇది సమయం కాదు.

– డా।। మన్‌మోహన్‌ ‌వైద్య, ఆర్‌ఎస్‌ఎస్‌, ‌సహ సర్‌ ‌కార్యవాహ

About Author

By editor

Twitter
Instagram