‌హలాల్‌.. ‌తరచూ వినిపిస్తున్న ఈ అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది. చికెన్‌, ‌మటన్‌ ‌షాపులలో హలాల్‌ ‌పేరు కనిపిస్తోంది. అలాగే రెస్టారెంట్స్, ‌ఫుడ్‌ ‌కోర్టులలో హలాల్‌ ‌చేసిన మాంసాన్నే వడ్డిస్తున్నామని బోర్డులు పెడుతున్నారు. ఫుడ్‌ ‌డెలివరీ యాప్స్ ‌కూడా హలాల్‌ అని నిర్ధారిస్తున్నాయి. చివరకు విమానాల్లో ప్రయాణికులకు అందించే ఆహారం కూడా హలాల్‌ ‌చేసినదే అని చెబుతున్నారు. సాధారణంగా ప్యాక్‌ ‌చేసిన ఆహార పదార్థాలు, చాక్లెట్స్, ‌బిస్కెట్స్ ‌మీద శాకాహారం అయితే పచ్చగుర్తు, మాంసాహారమైతే ఎర్రగుర్తు వేస్తారు. ఇటీవల కొన్ని చాక్లెట్లపై శాకాహార గుర్తుతో పాటు హలాల్‌ ‌ముద్ర కూడా కనిపిస్తోంది. అసలు శాకాహారానికి హలాల్‌ ‌ముద్ర ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. హలాల్‌ అం‌టే ముస్లింల ఆచారం అని అందరికీ తెలుసు. హిందువులు, ఇతర మతస్తులపై హలాల్‌ ‌సంప్రదాయాన్ని ఎందుకు బలవంతంగా రుద్దుతున్నారు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇది లౌకికవాదానికి వ్యతిరేకం కాదా? ఇక ఈ హలాల్‌ ‌సర్టిఫికెట్‌ ఇచ్చేవారు ఎవరు? హలాల్‌ ఆర్థిక వ్యవస్థ వెనుక ఎవరున్నారు? ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే భారతదేశంపై మతపరంగానే కాకుండా ఆర్థిక కోణం వైపు నుంచి కూడా పెద్ద కుట్రే ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మూడేళ్ల క్రితం, 2017లో బెనారస్‌ ‌హిందూ యూనివర్సిటీ వారి ప్రశ్నాపత్రంలో త్రిపుల్‌ ‌తలాక్‌, ‌హలాల్‌, అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీలపై ప్రశ్నలు రావడం వివాదానికి దారితీసింది. ఎంఏ హిస్టరీ ప్రశ్నపత్రంలో ప్రశ్నలు ఇలా ఉన్నాయి: ఇస్లాంలో హలాల్‌ అం‌టే ఏమిటి? అల్లావుద్దీన్‌ ‌ఖిల్జీ కాలంలో గోధుమల రేటు ఎంత? తీన్‌ ‌తలాక్‌ ‌గురించి వివరించండి? దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఈ ప్రశ్నలు అభ్యంతరకరమని, విద్యార్థుల మధ్య మతపరమైన విభజన జరుగుతోందని విమర్శలు వచ్చాయి.

అయితే, విశ్వవిద్యాలయం చరిత్ర శాఖలో అసిస్టెంట్‌ ‌ప్రొఫెసర్‌ ‌రాజీవ్‌ శ్రీ‌వాస్తవ ఈ విమర్శలకు సమాధానం ఇస్తూ, ‘‘విద్యార్థులకు అటువంటి విషయాల గురించి అడగకుంటే వారు దాని గురించి ఎలా తెలుసుకుంటారు? వారికి మధ్యయుగ చరిత్రను బోధిస్తున్నప్పుడు, ఈ విషయాలు అందులో భాగమవుతాయి. చరిత్రను వక్రీకరించి చెప్పలేము. వారికి ఈ విషయాల గురించి తెలిస్తే ‘నిజమైన’ చరిత్రను తెలుసుకుంటారు’’ అని చెప్పాడు. జవహర్‌లాల్‌ ‌నెహ్రూ యూనివర్సిటీ, అలీఘర్‌ ‌ముస్లిం యూనివర్సిటీ పరీక్షా పద్ధతిని ఆయన ప్రశ్నించారు. ‘‘మేము ఇస్లాం చరిత్రను బోధిస్తున్నప్పుడు, అలాంటి విషయాలను బోధించవలసి ఉంటుంది’’ అని అన్నారు.

కొద్ది నెలల క్రితం ఒక హిందూ యువకుడు ఆహారం కోసం ‘జొమాటో ఫుడ్‌ ‌యాప్‌’ ‌లో ఆర్డర్‌ ఇచ్చాడు. డెలివరీ ఇచ్చేందుకు వేరే మతస్తుడు వచ్చినందుకు ఆ యువకుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనికి జొమాటో స్పందిస్తూ ‘ఆహారానికి మతం లేదు’ అని ట్వీట్‌ ‌చేసింది. జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్‌ ‌గోయల్‌ ‌కూడా స్పందిస్తూ ‘‘మేం అనుసరించే విలువలకు విరుద్ధంగా వ్యాపారం జరగాలంటే, దాన్ని కోల్పోయేందుకు కూడా మేం చింతించం’’ అని ట్వీట్‌ ‌చేశారు. ఈ విషయంపై సోషల్‌ ‌మీడియాలో చర్చలు, వాగ్వా దాలు జరిగాయి. కొందరు హిందూ యువకుడిని సమర్థిస్తే, మరి కొందరు జొమాటోనే వెనుకేసుకొచ్చారు.

ఇక్కడ ఒక కీలకమైన విషయం అందరినీ ఆలోచింపజేసింది. తిండికి మతం లేదని గొప్పగా చెబుతున్న జొమాటో తాము అందించే మాంసాహారం ‘హలాల్‌’ అని ఎందుకు ప్రత్యేకంగా చెబుతోంది? ముస్లిం ఆచారం ప్రకారం హలాల్‌ ‌చేసిన ఆహారం అందిస్తున్న ఈ సంస్థ హిందువులు, సిక్కులు పాటించే ‘జట్కా’ ఆచారం ప్రకారం ఆహారాన్ని ఎందుకు అందించడం లేదు? సోషల్‌ ‌మీడియాలో వచ్చిన ఈ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన జొమాటో, వినియోగదారులు కోరుకుంటే జట్కా మాంసం ట్యాగ్‌ను తీసుకు వచ్చేం దుకు అభ్యంతరం లేదని స్పష్టం చేయక తప్పలేదు.

ఇండిగో ఎయిర్‌లైన్స్ ‌తమ విమానాల్లో వడ్డించే మాంసాహార ప్యాకెట్‌పై ‘హలాల్‌’ ‌ముద్రను చూసిన ఓ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. హలాల్‌ ‌చేసిన మాంసం వడ్డించడం ద్వారా హిందువుల, సిక్కుల మనోభావాలను ఇండిగో యాజమాన్యం దెబ్బతీసిందంటూ సోషల్‌ ‌మీడియాలో నిరసన మొదలైంది. ఇండిగో విమానాల్లో హలాల్‌ ‌నిషేధించండి, లేదంటే హిందువుల నుంచి నిషేధం ఎదుర్కొంటారని హెచ్చరికలు వచ్చాయి. ఓ ప్రయాణికుడు ‘ఇండిగోలో హలాల్‌ ‌చేసిన మాంసాన్ని వడ్డించడాన్ని మీరు సమర్థిస్తారా’ అని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ ‌సింగ్‌ ‌పూరీని ట్యాగ్‌ ‌చేస్తూ ట్వీట్‌ ‌చేశాడు. దీంతో ఆయన ‘హలాల్‌ ‌చేసిన మాంసాన్ని హిందువులు, సిక్కులు ఎలా తింటారని అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు.

హలాల్‌ ఎం‌దుకు చేస్తారు?

ఇస్లాం సంప్రదాయంలో హలాల్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తారు. ముస్లింలు ఏదైనా మాంసం కొనే ముందు, లేదా తినే ముందు హలాల్‌ ‌చేసిందేనా అని నిర్ధారించుకుంటారు. చేయని ఆహారాన్ని ముట్టరు. విచిత్రంగా హిందూ సమాజంలో చాలా మంది హలాల్‌ ‌చేసిన మాంసమే తినాలి అనే నమ్మకాన్ని పెంచుకున్నారు. వాస్తవానికి హలాల్‌ ‌మన సంప్రదాయం కాదనే విషయం వారికి అంతగా తెలియదు. ఎవరైనా, ‘ఏమిటి ఈ హలాల్‌ ‌సంగతి?’ అని వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఉండదు. ‘ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం.. పాటిస్తేనే మంచింది కదా? హలాల్‌ ‌చేయని మాంసం మంచికాదు’ అనే చిత్రమైన సమాధానం వినిపిస్తుంది. అంటే వీరికి హలాల్‌ ‌గురించి సరైన అవగాహన లేదని స్పష్టంగా తెలిసిపోతుంది.

హలాల్‌ అం‌టే అరబిక్‌ ‌భాషలో అనుమతి అని అర్థం. ఆహారంగా మారే ప్రాణిని వారి పవిత్ర గ్రంథం ఖురాన్‌లో పేర్కొన్నట్లుగా దేవుని పేరిట వధిస్తారు. ఆ పద్ధతిలో వాటి గొంతును కోసి చంపేస్తారు. జంతువులను వధించే సమయంలో అవి ఆరోగ్యకరంగా ఉండాలని ఇస్లాం చట్టాలు చెబుతున్నాయి. జంతువు గొంతు కోసిన తర్వాత రక్తం కారుతున్న సమయంలో ముస్లింలు ఓ మంత్రాన్ని జపిస్తారు. తమకు ఎలాంటి పాపం తెలియదని చెప్పేందుకు ఇలా హలాల్‌ ‌చేసి ఒక జీవిని వధిస్తారు. వధించే జంతువును గట్టిగా పట్టుకొని మక్కావైపు పడుకోపెడతారు. ‘లాహి ఇలాహి ఇల్లల్లాః మహామ్మదూర్‌ ‌రాసూలల్లాహ్‌’ అనే పవిత్ర ఖురాన్‌ ‌లోని వాక్యాన్ని చదువుతూ దాని మెడ కింద రక్తనాళాన్ని పదునైన కత్తితో కోస్తారు. దీని అర్థం ‘ఓ అల్లాహ్‌! ఈ ‌జీవిని ఆహారం కోసం లేదా వృత్తి కోసం మేం ప్రాణం తీస్తున్నాం. ఈ చర్యలో మాకు ఎటువంటి పాపము అంటకుండా మమ్మల్ని రక్షించు. ఈ జీవికి ఏ నొప్పిగాని బాధగానీ రాకుండా నువ్వే ఈ శరీర బాధ తొలగించు!’ ఆ జంతువు రక్తం పోయాక ప్రాణాలు విడుస్తుంది. ఈ పక్రియనే హలాల్‌ అం‌టారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే వారు ఇచ్చే సమాధానం ప్రకారం రక్తంతో కలిసిన మాంసం తినొద్దు. అంత రుచిగా ఉండదు. అందుకే మెడకింది నరాన్ని కోసి రక్తం మొత్తం పోయేంత వరకూ ఎదురుచూస్తారు. మొత్తంగా ఒకేసారి మెడ నరికితే కోసినవారు ఏకంగా నరకానికి పోతారని వారి విశ్వాసం. హలాల్‌ ‌చేయకుండా చనిపోయిన జంతు మాంసాన్ని ముస్లింలు ముట్టరు. దాని ‘హరాం’ అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే హలాల్‌కు విరుద్ధమైనవన్నీ హరాం కిందకు వస్తాయి. ముస్లింలకు ‘హలాల్‌’ ‌మాదిరే యూదులకు ‘కోషర్‌’ అనే సంప్రదాయం ఉంది. అంటే వారి దేవుని పేరుతో జంతువును వధించి, ఆహారానికి సిద్ధం చేస్తారన్న మాట. హీబ్రూలో దీని అర్థం ‘సముచితం’ అని.

జట్కా సంప్రదాయం

హిందువులు, సిక్కుల సంప్రదాయం ప్రకారం ఆహారం కోసం కోసే లేదా దేవతలకు బలి ఇచ్చే జంతువుల మెడను కత్తితో ఒకే వేటు వేసి నరకాలి. దీన్ని ‘జట్కా’ అంటారు. హలాల్‌ ‌పద్ధతిలో మెడ నరం కోసిన జంతువు రక్తం పోయే దాకా కొద్ది నిమిషాలు గిలగిలకొట్టుకొని కొంత సమయానికి చనిపోతే, జట్కా పద్ధతిలో శరీరం నుంచి తల వేరు చేసిన జంతువు క్షణాల్లో ప్రాణం కోల్పోతుంది. హలాల్‌ ‌చేస్తే జంతువుకు నొప్పి తెలియకుండా నిదానంగా ప్రాణం కోల్పోతుందనే వాదన ఉంది. కానీ అది నిజం కాదు. ఏ ప్రాణికైనా రక్తమాంసాలు, ఎముకలు నరాల ద్వారా మెదడుతో అనుసంధానమై ఉంటాయి. మెడను కోసిన వెంటనే నొప్పి తెలుస్తుంది. దానిలో అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేసి ప్రాణాలు కోల్పోతుంది. హలాల్‌ ‌చేసే సమయంలో భయాందోళనల కారణంగా జంతువు శరీరంలోకి, మాంసంలోకి స్ట్రెస్‌ ‌హార్మోన్స్ ‌విడుదలవు తాయి. ఆ హార్మోనులు కలిసిన మాంసం తిన్నవారికి ఎంతో కొంతమేర ప్రమాదం ఉంటుంది. జట్కా పద్ధతిలో అయితే ఒక్క వేటుతో జంతువు మొండెం నుంచి తల వేరు కావడంతో ఆ జీవికి అర్థమయ్యేలోపు ప్రాణం పోతుంది. హలాల్‌ ‌తో పోలిస్తే ఇందులో స్ట్రెస్‌ ‌హార్మోన్స్ ‌తక్కువ.

గ్రామ దేవతలకు హలాల్‌ ఎం‌దుకు?

విచిత్రంగా చాలా మంది హిందువులు గ్రామ దేవతలకు ఇచ్చే బలిలో కూడా హలాల్‌ ‌సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అమ్మవారికి కోళ్లు, మేకలు బలి ఇచ్చేందుకు ముస్లింలను పిలుస్తున్నారు. వారి దేవుడి (హలాల్‌) ‌పేరుతో గ్రామ దేవతకు బలి ఇవ్వడం ఎందుకు అంటే వారి దగ్గర సమాధానం ఉండదు. హలాల్‌ ‌చేశావా అని మరీ అడుగుతారు. బలి ఇవ్వడం అంటే దేవతకు నైవేద్యం పెట్టడం. హలాల్‌ ‌పేరుతో ఇతర మత దేవునికి ఇచ్చిన ఎంగిలిని మన దేవతలకు పెట్టడం ఎందుకు అనే స్పృహ ఉండదు. ముస్లింలు మన దేవతలకు సమర్పించిన ప్రసాదాలను, ఇతర ఆహారాలను ముట్టుకోరు. సిక్కులు హలాల్‌కు వ్యతిరేకం. కానీ మనవాళ్లు మాత్రం వీర సెక్యులర్‌ ‌వ్రతావలంబీకుల్లా మారి పోయి, గుడ్డిగా హలాల్‌ ‌సంప్రదాయం పాటిస్తున్నారు. హిందువులకు హాలాల్‌తో సంబంధం ఉందా? వారి మతాచారాల ప్రకారం కోసి వండిన ఆహారాన్ని హింవుదులు ఎందుకు తినాలి? హిందువులు పవిత్రంగా పూజించే ఆవుని చంపుకు తినే వాళ్లతో మన గ్రామ దేవతల దగ్గర హలాల్‌ ‌చేయించడం, ఆ మాంసం తినడం అమాయకత్వానికి పరాకాష్ట.

మన దేశంలో అనాది కాలం నుంచి జట్కా సాంప్రదాయంలోకి హలాల్‌ ఎలా వచ్చింది అనేది ముందుగా తెలుసుకోవాలి. ఇస్లాం మతస్తుల పాలనా కాలంలో ఒక కుట్ర ప్రకారం హలాల్‌ ‌సెంటిమెంట్‌ను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా తెలంగాణలో నిజాం పాలనా కాలంలో హలాల్‌ ‌బలవంతంగా చొప్పించి, అదో అలవాటుగా మార్చేశారు. ఇలా ప్రవేశించిన హలాల్‌ ఒక మూఢ నమ్మకంగా స్థిరపడింది. ఇప్పటికే కొందరు హిందూ మాంస వ్యాపారులు హలాల్‌ ‌కోసం ముస్లింను పెట్టుకుంటున్నారు. హిందూ మతంలో మాంస సంబంధ వృత్తి ఆరెకటికలది. హలాల్‌ ‌పేరుతో ముస్లింలను తీసుకురావడంతో ఆరెకటికల జీవనోపాధికి ఇబ్బందులు వచ్చాయి. జట్కా సంప్రదాయం మరచిపోయి హలాల్‌ ‌పాటించడంవల్ల మాంస వ్యాపారం క్రమంగా వారి చేతిలోకి వెళ్లిపోతోంది.

శాకాహారానికి హలాల్‌ ‌ముద్ర ఏమిటి?

ఇటీవల హైదరాబాద్‌లోని ఓ మిత్రునికి విచిత్రం ఎదురైంది. ఓ సూపర్‌ ‌మార్కెట్‌లో మలేసియా నుంచి దిగుమతైన చాకొలెట్‌ను చూశాడు. దానిపై వివరాలు గమనిస్తే శాకాహారులు తినవచ్చు అని సూచించే ఆకుపచ్చ రంగు చుక్క లోగో ఉంది. మరోవైపు హలాల్‌ ‌మార్క్ ఉం‌ది. అసలు శాకాహారానికి హలాల్‌ ‌మార్క్ ఎం‌దుకు? లేదా, హలాల్‌ ‌మార్క్ ఉన్నందున దాన్ని మాంసాహారం అనుకొవాలా? మాంసాహారాన్ని శాకాహారం ముసుగుతో తినిపించే ప్రయత్నమా? శాఖాహారులు, మాంసాహారులు అన్ని మతాల్లోనూ ఉంటారు. కానీ హలాల్‌ ‌సంప్రదాయాన్ని శాకాహారం ముసుగులో ఇతరులపై రుద్దడం ఎందుకు? ఇది మన ప్రజల మనోభావాలు, విశ్వాసాలు, అలవాట్లపై జరుగుతున్న దాడి కాదా?
ఒక చాకోలెట్ల మీదే కాదు. మార్కెట్‌ ‌లో ఇతర శాకాహార ఆహార పదార్థాలపై హలాల్‌ ‌ముద్ర కనిపిస్తోంది. బిస్కెట్లు, న్యూడుల్స్, ‌జ్యూస్‌, ‌ప్యాకింగ్‌ ‌ప్రాసెస్‌ ‌పుడ్స్‌తో పాటు గోధుమ, మైదా ఇలా ప్రతి శాకాహార పదార్థాలనూ హలాల్‌ ‌పరిధిలోకి తెస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, టూత్‌పేస్టు, కాటుక, నెయిల్‌ ‌పాలిష్‌ల మీద కూడా హలాల్‌ ‌ముద్ర వేస్తున్నారు.

మన దేశంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలను నిర్ధారించి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు భారత ప్రభుత్వ సంస్థలైన ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్‌ ‌స్టాండర్డస్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా (FSSAI), ఫుడ్‌ అం‌డ్‌ ‌డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (‌FDA) ఉన్నాయి. వీటికి ధీటుగా మతపరమైన హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ఎవరు జారీ చేస్తున్నారు? దీని వెనుక ఉద్దేశం ఏమిటి?.ఇదంతా అధికారికంగా ఇస్లాం పాటించే దేశాల్లో జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ హిందువులు అధికంగా ఉన్న భారతదేశంలో, అందునా లౌకికవాదం ముసుగులో హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ఎం‌దుకు జరుగుతోంది? అసలు ఈ హలాల్‌ ఉత్పత్తులని మనతో ఎందుకు బలవంతంగా తినిపించే ప్రయత్నం చేస్తున్నారు? ఇందులోని కుట్రలను మనమంతా అర్థం చేసుకోవాలి.
దేశ ఆర్థిక స్వాతంత్య్రాన్ని హరించే కుట్ర హలాల్‌ ‌సర్టిఫికెట్‌ అం‌టే ఇస్లాం జీవన పరిస్థితులకు అనుగుణంగా తయారుచేసిన ఆహార పదార్థాలకు ఇచ్చే ఒక రకమైన సర్టిఫిక్‌ట్‌ (‌షఫీ, హన్బెలి, మాలికి, హనాఫీ శాఖల ప్రకారం). హలాల్‌ ‌సర్టిఫికేట్‌ ఒక రకమైన అంతర్జాతీయ పత్రం. ఇది ఇస్లాం నియమాలకు అనుగుణంగా ఉండే ఆహార పదార్థాలకు ఇచ్చుకునేది. వీళ్లు మాంసంతో పాటు ఇతర ప్రాసెస్‌ ‌ఫుడ్‌, ‌బేవరేజెస్‌, ‌ఫార్మాసూటికల్‌, ‌కాస్మటిక్‌ ‌పర్సనల్‌ ‌కేర్‌, ‌బేకరీ ప్రొడక్ట్, ‌న్యూట్రాస్యూటి కల్‌ ‌సహా అన్ని రకాల వ్యాపారాలకు విస్తరించారు. ప్రొడక్టస్, ‌వేర్‌ ‌హౌసెస్‌, ‌రెస్టారెంట్లకు హలాల్‌ ‌సర్టిఫికెట్లు జారీ చేయడమే కాకుండా హలాల్‌ ‌ఫ్రెండ్లీ టూరిజం, హలాల్‌ ‌ఫ్రెండ్లీ మెడికల్‌ ‌టూరిజం, హలాల్‌ ‌ట్రైనింగ్‌ అనే వ్యాపారాలు కూడా మొదలయ్యాయి.

భారతదేశంలో షరియత్‌ (ఇస్లామిక్‌ ‌చట్టం) నిబంధనలను అనుసరించి హలాల్‌ ‌చేసిన ఆహార ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు కొన్ని సంస్థలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి.. జమియత్‌ ఉలేమా-ఇ-హింద్‌, ‌జమియత్‌ ఉలేమా-ఇ-మహారాష్ట్ర, మరొకటి హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ఇం‌డియా. ఇవన్నీ ప్రభుత్వంతో సంబంధం లేని ప్రయివేట్‌ ‌సంస్థలు. భారత ప్రభుత్వ సంస్థలైన ఫుడ్‌ ‌సేఫ్టీ అండ్‌ ‌స్టాండర్డస్ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా (FSSAI), ఫుడ్‌ అం‌డ్‌ ‌డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (‌FDA) లకు దీటుగా, మతపరమైన హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ‌జారీ చేయడం వీటి ముఖ్య ఉద్దేశం.

హలాల్‌ ‌సర్టిఫెకెట్‌ ‌జారీ చేసేందుకు మూడు నియమాలను తప్పనిసరిగా గుర్తించాలి. 1. హలాల్‌ ‌చేసే కసాయి మైనారిటీ (వయసు) తీరిన ముస్లిం అయివుండాలి. 2. హలాల్‌ ‌చేసే సమయంలో దేవుని పేరిట, అల్లాహ్‌ ‌మాత్రమే దేవుడు అని చెప్పాలి. 3. హలాల్‌ ‌చేస్తున్న సమయంలో వధించే జంతువు తల మక్కా దిశగా పెట్టాలి. ఇవేవీ పాటించకపోతే ఆ ఆహారాన్ని హలాల్‌గా పరిగణించరు.

అంటే హలాల్‌ ‌గుర్తింపు రావాలంటే జంతువును వధించేవారు కచ్చితంగా ఇస్లాంను పాటించేవారై ఉండాలి. ఈ రకంగా వారికి అక్కడ ఉపాధి లభిస్తుంది. ఇతర మతస్తులు ఆ స్థానంలో ఉంటే హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ఇవ్వరు. ఈ కారణంగా ఇప్పటికే వెనుకబాటుకు గురైన కటిక సామాజిక వర్గానికి చెందిన వారు ఉపాధిని కోల్పోతున్నారు.

ఇదిలా ఉంటే కేరళ రాష్ట్రం కొచ్చిలో ఓ పత్రికలో వచ్చిన వ్యాపార ప్రకటన దిగ్భ్రాంతిని కలిగించింది. దేశంలోనే మొట్టమొదటి ‘షరియా అనుకూల, హలాల్‌ ‌సర్టిఫైడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌కాంప్లెక్‌’ ‌నిర్మాణం తాలూకు ప్రకటన అది. మక్కా దిశను చూసేవిధంగా ‘హలాల్‌ ‌సర్టిఫైడ్‌’ ఇం‌టి ఫ్లాట్ల నిర్మాణం ఇప్పుడు ఊపందు కుంది. ఈ హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ‌కేవలం ఇస్లామిక్‌ ‌మతపరమైన సంస్థలకు ఆర్ధిక లాభాలు తెచ్చిపెట్టడమే కాదు, హిందూ కార్మికుల ఉపాధి అవకాశాలకు గొడ్డలిపెట్టు వంటిది. ఈ ఇస్లామిక్‌ ‌సంస్థలు తమకున్న ‘గుర్తింపు అధికారం’తో ఏమి తినాలి, ఏమి తినవద్దు అని సూచించే స్థాయి నుండి ఇప్పడు ఏకంగా ‘హలాల్‌ ‌హాస్పిటళ్లు’, ‘హలాల్‌ ‌టూరిజం’, ‘హలాల్‌ ‌గృహ సముదాయాల’ వరకూ వచ్చేశాయి.
2013వ సంవత్సరంలో మలేషియాలో ‘ప్రపంచ హలాల్‌ ఉత్పత్తిదారుల ఫోరమ్‌ ‌సమావేశం’ పేరిట ఒక సదస్సు జరిగింది. అందులో పాల్గొన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కోఆపరేషన్‌ (×)‌కి చెందిన 57 ఇస్లామిక్‌ ‌దేశాల ప్రతినిధులు ‘‘ఇస్లామేతర దేశాల నుండి దిగుమతి అయ్యే ఆహార పదార్ధాలు తప్పనిసరిగా ‘హలాల్‌’ ‌గుర్తింపు కలిగి ఉండాల్సిందే’’ అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇస్లామేతర దేశాల్లో ఆహార ఉత్పత్తులకు హలాల్‌ ‌గుర్తింపునిచ్చేవి ఇస్లామిక్‌ ‌సంస్థలే కాబట్టి ఈ నిబంధన ఆయా దేశాల్లోని ఇస్లామిక్‌ ‌సంస్థలకు ఆర్ధికంగా లాభిస్తుందనేది దీని వెనుక ఉద్దేశం.
హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ‌మన దేశ లౌకిక సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధం. ఇది రాజ్యాంగ వ్యతిరేక చర్య మాత్రమే కాదు, ఆర్ధిక జీహాద్‌ ‌కూడా. ఇస్లాం దేశాలకు ఉత్పత్తులు ఎగుమతి చేయాలంటే హలాల్‌ ‌సర్టిఫికెట్‌ ‌తప్పనిసరి అని చెబుతున్నారు. కానీ అసలు ఉద్దేశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తు న్నాయి. మొగలుల కాలంలో జిజియా పన్ను గురించి విన్నాం. ఒక హిందువు హిందువుగానే ఉండాలి అంటే పాలకులకు పన్ను చెల్లించాలి. హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ‌వల్ల ఇంచుమించు అదే విధమైన ఆర్ధికపరమైన ఆంక్షలు హిందూ వ్యాపారవర్గం ఎదుర్కొంటోంది. హలాల్‌ ‌సర్టిఫికేషన్‌ ‌పేరిట జరుగుతున్న మతపరమైన ఆర్థిక దోపిడీ జిజియా పన్నుకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది.

నిధులు ఎక్కడికి పోతున్నాయి?

హలాల్‌ ‌సర్టిఫికెట్‌ ఊరికే ఇవ్వరు. దీనికి ప్రత్యేకమైన ఫీజు నిర్ణయించారు. సదరు ఏజెన్సీలకు ఫీజు చెల్లించాలి. మన దేశంలో హలాల్‌ ‌సర్టిఫికెట్‌ ఇచ్చే సంస్థల్లో జమాతే ఉలేమా ఇ హింద్‌ ఒకటి. ఈ సంస్థ భారతదేశంలో ఎక్కడ ఏ ఉగ్రవాద దాడి జరిగినా అరెస్ట్ అయ్యే వ్యక్తులకు, ఉగ్రవాదులకు న్యాయపరమైన సహాయం చేసే సంస్థల్లో ఎప్పుడూ ముందుంటుంది. పట్టుబడిన ఉగ్రవాది ఎంతటి దేశద్రోహానికి పాల్పడినా, ఎంతటి తీవ్రమైన నేరం చేసినా సరే, అటువంటి వారికి న్యాయ సహాయం కోసం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని హిందూ సంస్థ నాయకుడు కమలేశ్‌ ‌తివారి హత్య కేసు నిందితునికి కూడా ఆర్ధిక సహాయం అందించింది. 1919లో మన దేశంలో జమైత్‌ ఉలేమా-ఇ హింద్‌ ‌ప్రారంభమైంది. దేశవిభజన సమయంలో ఈ సంస్థ నుండి ఏర్పడిన మరొక సంస్థ జమైత్‌ ఉలేమా-ఇ-ఇస్లాం తన కార్యకలాపాలు పాకిస్తాన్‌ ‌కేంద్రంగా సాగిస్తోంది.

పాకిస్తాన్‌ ‌నుండి శరణార్థులుగా వచ్చే అక్కడి మైనారిటీల కోసం పౌరసత్వ చట్టం సవరణను జమైత్‌ ఉలేమా-ఇ-హింద్‌ ‌తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలాంటి సంస్థల పట్టు ఎంతగా ఉందంటే గల్ఫ్ ‌దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాలను కుంటున్న పూర్తి స్వదేశీ కంపెనీలు కూడా గత్యంతరం లేక ‘హలాల్‌ ‌సర్టిఫికేషన్‌’ ‌పొందుతున్నాయి. ఆ విధంగా తెలిసితెలిసి చట్ట వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతునిస్తున్నాయి.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మావోయిస్ట్‌లు సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నించినట్లు గానే ఇప్పుడు ఈ హలాల్‌ ‌కంపెనీలు సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్నాయి. మావోయిస్ట్‌ల కార్యకలాపాలను నిషేధించి, వాటిని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో అలాంటి కఠినమైన చర్యలు ఈ సమాంతర ఆర్ధిక వ్యవస్థను నడుపుతున్న సంస్థల పట్ల కూడా చేపట్టాలి. లేకపోతే దేశ సార్వభౌమాధికారం, ఆర్ధిక స్వాతంత్య్రం ప్రమాదంలో పడతాయి.

మనమేం చేయగలం?

2017లో భారత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను అక్రమ కబేళాలను ఆపాలని, అమలు కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. భారత రాజ్యాంగంలో భారతీయ పౌరులు జంతువుల పట్ల కరుణ చూపాలని, జంతువుల ప్రాథమిక హక్కులను గౌరవించాలని, జంతువులపై క్రూరత్వాన్ని నివారించాలని రాష్ట్రాలను కోరారు. కబేళాల నుండి జంతువుల బాధలను ఆపడానికి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి క్రమంగా మరింత కఠినమైన చట్టాలను అమలు చేసే దిశగా మారుతోంది.

హలాల్‌ ‌పేరుతో జరుగుతున్న వ్యాపారాలన మనం ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. అసలు హలాల్‌ అనేది హిందువులకు సంబంధించిన విషయం కాదు. ఇతర దేవుళ్ల పేరిట సమర్పించే ఆహారం మనకు నిషిద్దం. హలాల్‌ ‌మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అది మన సంప్రదాయా నికి విరుద్ధం కూడా. హిందువుల్లో మాంసాహారులు, శాకాహారులు కూడా ఉన్నారు. హలాల్‌ ఇప్పుడు ఒక్క మాంసాహారు లకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది మన ధర్మం, సంస్కృతి, సంప్రదాయాలు, అస్థిత్వం, దేశ ఆర్థిక వ్యవస్థపై జరుగుతున్న దాడిగా గుర్తించాలి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జాగృత•మై సమాజంలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది.

– క్రాంతిదేవ్‌ ‌మిత్ర, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE