ప.పూ. శ్రీ గురూజీ 1940లో నాగపూర్ గురుపూజోత్సవంలో చేసిన ప్రసంగ సంక్షిప్త పాఠం

హిందూ సమాజంలోని విభిన్న ధార్మిక పంథాల, మతసంప్రదాయాల అనుయాయులు తమ సంప్రదాయంలోని ఒక శ్రేష్ఠవ్యక్తిని గురువుగా భావించి ఈ రోజు (ఆషాడ పౌర్ణమి) ఆయనను పూజిస్తారు. తమ సంప్రదాయపు పరంపరాగత గురువును, తమ కళ్లముందు సజీవంగా ఉన్న వ్యక్తిని ఆదర్శంగా భావిస్తారు. తాము కూడా ఆ ఆదర్శాన్ని అనుసరించాలనే సంకల్పంతో ఆయనకు పూజ జరుపుతారు. అయితే రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికి గురుపూజ విషయంలో తనదైన ఒక దృష్టికోణం ఉందని మీకు తెలుసు. సజీవంగా ఉన్న లేదా గతించిన ఏ వ్యక్తిని కూడా పరిపూర్ణ ఆదర్శంగా సంఘం భావించదు. గురువు పట్ల, పరమాత్మపట్ల ఒకే విధమైన శ్రద్ధా భక్తులు ఉండాలని మన ధర్మం చెబుతోంది. ‘‘యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ.’’ గురువు మహత్తు, పరమాత్మ మహత్తు ఒకటేనని భావం. అయితే సృష్టి, స్థితి, లయ కర్త అయిన పరమేశ్వరునితో సాటియైన మహత్తుగల వ్యక్తి ఈ సృష్టిలో ఉంటాడా అని ఆలోచించాలి.
గురువు ఏ విధంగా ఉండాలి, ఎవరిని గురువుగా స్వీకరించాలి అన్న విషయాన్ని హిందూధర్మ శాస్త్రాలు చాలా క్షుణ్ణంగా వివరించాయి.
ఈ శాస్త్రాలలో చెప్పిన సుగుణాలన్నీ ఒక్కవ్యక్తిలోనే ఉండడం సాధ్యం కాదు. ఈ గురుత్వపు గీటురాయి మీద పరీక్షించి సంఘం పవిత్ర భగవాధ్వజాన్ని గురువుగా భావించి స్వీకరించింది. ఈ ధ్వజం భారతీయ ప్రాచీన గౌరవసభ్యతలకు, చారిత్రక పరంపరకు ప్రతీక. (ఈ ధ్వజాన్నే వేదవ్యాస భగవానుడు ఆషాడపూర్ణిమనాడు పూజించి వేద విభజన చేసినట్లు పెద్దలంటారు.)

పవిత్ర భగవాధ్వజానికి ప్రాచీన పరంపరను స్ఫురణకు తెచ్చే శక్తి ఉంది. కాలంగాని యమదండంగాని ఆ శక్తిని లేకుండా చేయలేవు. ఈ విధంగా చిరంజీవి, బాలసూర్యుని వలె తేజోవంతం. పూర్వారుణ జ్యోతి వలె పవిత్రం, త్యాగశీలతకు ప్రతీక అయిన ఈ కాషాయ ధ్వజాన్ని మనం గురువుగా స్వీకరించాం.
అత్యంత ప్రాచీన కాలం నుండి మన జాతీయ జీవనంలో యజ్ఞానికి చాలా ప్రాముఖ్యముంది. యజ్ఞం అగ్ని ప్రధానమైంది. ఆ యజ్ఞ కుండంలోని హోమాగ్ని వర్ణం కాషాయం లేక భగవావర్ణం. కనుక ఆ యాగాగ్నికి ప్రతీక అయిన ఈ భగవాధ్వజాన్ని మనం గురువుగా స్వీకరించాం.
మన నిత్యజీవితంలో ఇది చక్కగా కనిపిస్తుంది. రాత్రి అంతా అంధకారం వ్యాపించి ఉంటుంది. ఉదయం కాగానే ప్రకాశవంతమైన సూర్యుడు తన సప్తాశ్వరథంపై అధిరోహించి ఉషఃకాల ధ్వజం రెపరెపలాడుతుండగా ఆకాశంలో ప్రవేశించి సమస్త అంధకారాన్ని తొలగిస్తాడు. ఆ ధ్వజాన్ని ప్రభాతవేళ స్వచ్ఛమైన ఆకాశంలోచూస్తే లేత ఎరుపురంగులో ఉంటుంది. అందులో బంగారు ఛాయకూడా కలిసి ఉంటుంది. అదే భగవంతుని ప్రకాశవంతమైన జ్ఞానధ్వజం. ఆ ధ్వజాన్నే మనం మన జాతీయ విశిష్టతలకు ప్రతీకగా భావించి గౌరవించాం. భగవధ్వజం అనే మాట రూపాంతరం చెంది భగవాధ్వజం అయింది. మన దేశం ప్రత్యక్షరూపాన్ని గోచరింపజేసేది, యజ్ఞజ్వాలకు ప్రతీక, ఉదయ భానుని ధ్వజం అయిన ఈ భగవాధ్వజం జీవితంలోని చీకట్లను తొలగించి వెలుగు నింపుతుంది. దానినే మనం గురువుగా స్వీకరించాం.

జాతికి ప్రత్యక్షదైవం

ఈ ధ్వజం మనకు ఆరాధ్యదేవత. అత్యంత ప్రాచీనం, తేజోమంతం, దేదీప్యమానం అయిన మన జాతీయ జీవనానికి ఇది రూపుదాల్చిన ప్రతీక. ఇది మన ఆత్మగౌరవమనే జ్యోతిని వెలిగిస్తుంది. అంతఃకరణలలో విశుద్ధ భావనల ప్రవాహాన్ని ఉత్పన్నం చేస్తోంది.
భారతీయుల దృష్టిలో నాలుగు ఆశ్రమాలలోను సన్యాసాశ్రమం శ్రేష్ఠమైంది. ఇందులో వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా పరిత్యజించి సమష్టి జీవితాన్ని ఆరంభించడం జరుగుతుంది. అందువల్లనే సన్యా సాశ్రమం స్వీకరించిన వ్యక్తి కాషాయ వస్త్రాన్ని ధరిస్తాడు. అందరికీ పూజనీయుడవుతాడు. ఇలా సర్వసంగ పరిత్యాగం చేసిన వ్యక్తి ధరించే దుస్తుల వర్ణమే భగవాధ్వజ వర్ణం.

చరిత్రకు సాక్షి

అందుచేత మన శ్రద్ధాకేంద్రాల్లో ఈ ధ్వజం అత్యున్నతమైంది. సకల శక్తులను సవాలు చేసే ఈ ధ్వజానికే మన హృదయాలలో సర్వోత్తమ స్థానం ఇచ్చాం. మనం దీని ముందే తలవంచుతాం. దీనికొరకే జీవితాలను సమర్పిస్తాం. ఈ భావనతోనే ఈ పవిత్ర పతాకను మనం గురువుగా స్వీకరించాం. దీనిని ముందుంచుకుంటే అతి ప్రాచీన కాలం నుంచి నేటి వరకు మనదేశంలో జరిగిన సకల మహోన్నత కార్యాలు, మన వీరుల సాహస పరాక్రమాలు, మన ప్రసిద్ధ వ్యక్తుల తేజోమయ వ్యక్తిత్వాలు కన్నులకు కనిపిస్తాయి. జగద్గురు స్థానానికి యోగ్యమైన సమస్తగుణాల సముదాయం ఈ ధ్వజం. దీనిని చూడగానే మన హృదయాలలో భక్తి, గౌరవ భావనలు మేల్కొంటాయి. ఇది మన రాష్ట్ర పురుషుని రూపంలో అనగా ప్రత్యక్ష పరమాత్మరూపంలో మనముందుంది. జీవితాన్ని యజ్ఞ స్వరూపంగా భావించుకొని అందులో మనని హోమం చేసుకునేందుకై ఇది ప్రేరణనిచ్చి మార్గదర్శనం చేస్తుంది.

శివోభూత్వా శివం యజేత్‌

దేనిని గురువుగా భావించి నిత్యం పూజించవలసి ఉందో దాని సద్గుణాలను మనలోకి తెచ్చుకోవాలి. అలా చేయనిదే కర్తవ్యం నెరవేరినట్లు కాదు. గురువుతో• మరింతగా ఏకాత్ముడు, ఏక రూపుడు అయినవాడే నిజమైన సాధకుడు. శివుడిని ఉపాసిస్తూ క్రమంగా తానే శివుడై పోవాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మనం ఏ జీవితరంగంలో ఉన్నా ఇటువంటి హృదయ తీవ్రతతో పనిచేస్తూ ప్రతివారి నోట మనపేరే స్మరించే విధంగా వ్యవహరించాలి.

గురుదక్షిణ అంటే ఫలానా మొత్తాన్ని ఇవ్వ వలసిందని ఒత్తిడిగాని, నియమిత రూపంలో వసూలు చేసే చందాగాని కాదు. ఇది పూర్తిగా స్వేచ్ఛతో కూడిన సమర్పణ. జీవితం గడపడం కష్టంగా ఉందనిగాని, కుటుంబపోషణే సరిగ్గా సాగటంలేదని గాని, నేను తక్కువ మొత్తం ఇస్తే అందరూ ఏమనుకుంటారోననిగాని గురుపూజను మానకూడదు. ఇక్కడకు వచ్చి అంతఃకరణ పూర్వకమైన భక్తిశ్రద్ధలతో ధ్వజానికి ప్రణామం చేసి ఒక్క పుష్పాన్ని సమర్పించినా సరిపోతుంది. ఈ రకంగా సమర్పించిన ఒక్కపైసా అయినా, ధనికుడైన వ్యక్తి అర్పించిన వేలాది రూపాయిలకన్నా ఎక్కువ విలువైంది.

దక్షిణను భిక్షగా భావించరాదు

‘‘మీకు కావలసి ఉంటే నా దగ్గర నుంచి వేయి రూపాయలు తీసుకుపొండి; కాని నేను పూజ వగైరా చేయను’’ అని ఎవరైనా అంటే అటువంటి భిక్ష మనకు అక్కరలేదు. భిక్షను యాచించడం మన ధర్మంకాదు. ఏడాదికి ఒక్కసారి గురుదక్షిణ ఇవ్వడం సరిపోదు.
కాస్త ధనం సమర్పించగానే మనం చేయవలసిన పని అయిపోయిందని, మన పితరులు ఉత్తమలోకా లను అందుకొన్నారని భావించడం సరికాదు. ఇది సంపూర్ణ సమర్పణ భావం కాదు. ఇది మనోభావనకి ఒక లక్షణం మాత్రమే. ప్రతి ఒక్కరి శక్తి, బుద్ధి సంఘకార్యం నిమిత్తం పూర్తిగా వినియోగానికి రావల్సిన అవసరం ఉంది. పరమేశ్వరుని దయవల్ల లభించినదానిని దేశకార్యం కోసం గురుచరణాలకు సమర్పించాలి. ప్రతిరోజు అన్నపానాలు, నిద్ర ఎలా స్వీకరిస్తామో గురుపూజ కూడా అదేవిధంగా నిత్యం జరగాలి.

సంఘంలో వ్యక్తిగత దురభిమానానికి స్థానంలేదు. సంస్థాగత దురభిమానం అవసరం లేదు. సంఘం అభిమానించేది యావద్భారత దేశాన్ని మాత్రమే. మనం ఈ దివ్యధ్వజం పైనకాక వేరే ఏ ఇతర ప్రతీకపై భక్తిగలిగి ఉండలేం. ఏ ఇతర ధ్వజాన్నీ మనం కించపరచాలనుకోవడం లేదు. కాని మన చరిత్రాత్మక మైన, పరంపరాగతమైన భగవాధ్వజానికే మన భక్తిశ్రద్ధలు సమర్పితం.

ఈ భగవాధ్వజాన్ని మరిచిపోయి మరేదో కొత్త శ్రద్ధాకేంద్రాన్ని నిర్మించుకోవాలనుకుంటే ఆ కొత్త ధ్వజం మన ఆదర్శాలను నెరవేర్చలేనిదవుతుంది. గడచిన వేలాది సంవత్సరాల నుంచి మన పూర్వులు ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ ధ్వజాన్ని అర్చిస్తూ వచ్చారు. ఎన్నో బలిదానాలతో ఈ ధ్వజం అనన్య గౌరవ పవిత్రతలకు నిలయమైంది. మనం కూడా అదేవిధంగా అవధులులేని భక్తితో ఈ ధ్వజాన్ని అర్చించి దీని గౌరవాన్ని పెంచాలి. దీనిని మరిచి పోవడమంటే మన చరిత్రను మరచిపోవడమే, ఆత్మ విస్మృతి అనే పాపానికి ఒడిగట్టడమే.
సంఘం ఒక సంస్థ కాదు. మన రాష్ట్రానికి (దేశానికి) ఒక చిన్న ప్రతీక. భవిష్యత్తులో సంఘం తానే రాష్ట్రమవుతుంది. ఈ ధ్వజమే శ్రద్ధాకేంద్రంగా రాష్ట్ర హృదయంలో స్థానం పొందుతుంది. సంఘం ఒక సంస్థకాదు కనుక అది వేరుగా ఒక కొత్త రాష్ట్రధ్వజాన్ని ఎగరవేసుకునే అవసరం ఎప్పుడూ రాలేదు, రాదు.

సంఘ నిష్ఠయే జీవనధ్యేయం కావాలి

ఎవరో ఒక వ్యక్తిని ఆదర్శంగా పెట్టుకొని, తరువాత అతడి పతనాన్ని చూసి, మనసు విరిగి ‘‘ఇంక నేను సంఘకార్యం చేయను’’ అనుకునే పరిస్థితి ఎన్నడూ రాకూడదు. మిగిలిన అందరూ దారిలో పడిపోయినా సరే నేను మాత్రం ఈ మార్గంలోనే ముందుకు నడుస్తూ ఉంటానని మనం నిశ్చయించు కోవాలి. ఇటువంటి దృఢనిశ్చయం మన హృదయంలో బలంగా, జాగృతమై ఉండాలి.
రాష్ట్రం మూల స్త్రోతస్సును గుర్తించాలి.

ఒకసారి డాక్టర్జీ మాటల సందర్భంలో నన్ను ‘‘ఎవరినీ గురువుగా స్వీకరించలేదా? ఎవరినుంచీ మంత్రదీక్ష తీసుకోలేదా?’’ అని అడిగారు. లేదని నేను చెప్పగానే ఆయన సంతోషించి, మంచిపనైంది అన్నారు. ఎవరినీ గురువు అనుకోవడం, మంత్రదీక్ష తీసుకోవడం ఆయనకు ఇష్టంగా ఉండేది కాదు. ఆయనకు మన ప్రాచీన పరంపర తెలియదనిగాని, దానిని ఆయన వదిలేశారనిగాని దీని అర్థంకాదు. ‘‘మంత్రదీక్ష స్వీకరించడం వల్ల మనిషి స్వతంత్ర కర్తృత్వానికి అడ్డంకి ఏర్పడుతుంది. అందువల్ల ఎవరినీ గురువుగా తీసుకోకూడదు.’’ అనేవారు. అంగీకరించినా సరే, కాదన్నాసరే ఈ విషయం మాత్రం సత్యం. ఇందువల్లనే ప్రజలు తమ మూలస్త్రోతస్సును గురించి ఆలోచించడం మానేసి వ్యక్తిగతానుభూతి ఆధారంగా తమతమ సంప్రదాయాలను ఏర్పరచుకోవడం మొదలు పెట్టారు. దానినే జీవనసాఫల్యంగా భావించి దేశం విషయం మరిచిపోయారు.

సంఘకార్యపద్ధతి విశిష్టత

సంఘం వ్యక్తిపూజ చేసేదై ఉంటే 1940లో ఆద్య సర్‌సంఘచాలక్‌ ‌డా।। హెడ్గేవార్‌ అస్తమించడం తోనే సంఘం కథ కూడా ముగిసిపోయి ఉండేది. అలాజరగలేదన్న విషయాన్ని మనమందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
సంఘంలో ఎవరూ కూడా ‘‘నేనులేనిదే సంఘం నడవదు, నడవబోదు’’ అనరు. ఇది సంఘకార్య విశిష్టత. డాక్టర్జీ అనారోగ్యంతో ఉన్నపుడు ‘‘డాక్టర్జీ తరువాత సంఘం ఏమైపోతుంది’’ అన్న ప్రశ్న చాలామందికి తలెత్తింది. కొందరు ప్రసిద్ధవ్యక్తులు రంగంలోకి దిగి ‘‘ఒక ట్రస్టు ఏర్పాటు చేసుకోండి. ఒక కమిటీ వేసుకోండి – లేకపోతే అంతా బంద్‌ అయిపోతుంది’’ అని డాక్టర్జీకి సలహాలిచ్చారు. కాని అయన అవేమీ పట్టించుకోలేదు. వాస్తవానికి డాక్టర్జీ అనంతరం సంఘకార్య యోజ న, నిర్మాణం, వృద్ధి స్వయంసేవకులందరి చేతనే జరిగింది. క్రాంతిదర్శి అయిన డాక్టర్జీ గతించిపోయారు. కాని వ్యక్తిపూజ లేదు కనుక సంఘం సజీవంగా నిలిచింది. విశిష్ట రీతిలో ఇంకా కొనసాగుతోంది.

About Author

By editor

Twitter
Instagram