ఒక గ్రామంలో బిక్షువు బిక్షాటన చేస్తూ ఒక ఇంటి వద్ద అడిగాడు. ఆ ఇంటి యజమాని పండితుడు మహాగర్వి. అరుగుమీద కూర్చుని ఉన్నాడు. ఇల్లాలు వినలేదనుకొని బిచ్చగాడు గట్టిగా అర్ధించాడు. పండితుడికి కోపం వచ్చింది. వీడికి తగిన శాస్తి చేస్తాను అని మనసులో అనుకుని ఏమేవ్‌! ‌మూడు జన్మల ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అన్నాడు. ఆమె బియ్యం తీసుకొచ్చి బిక్షువు పాత్రలో వేసి వెళ్లిపోయింది. బిక్షువు అక్కడి నుండి కదల్లేదు. మీరు నన్ను మూడు జన్మల ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు. ఓ.. అదా నువ్వు క్రితం జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోవచ్చు. గతజన్మలో నువ్వు ముష్టి వాడివి ఫలితంగా నువ్వు ఈ జన్మలో అలాగే అయ్యావు అన్నాడు. అర్థమైంది.. ఈ జన్మలో ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మలో కూడా నేను బిక్షమెత్తవలసిందేనా ? మరోమార్గం లేదా అని అడిగాడు. అపుడు పండితుడు నీవు దానం చేయడం మొదలుపెట్టు అన్నాడు. నా దగ్గర ఏముంది ఏం దానం చేస్తాను నిరాశగా బదులిచ్చాడు. నీలో దానగుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చేయవచ్చు. ఈ రోజునుంచి నీకు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకో, అందులో సగం దానం చేయి. తనకు అవసరమున్నా సరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం. బిక్షువుకి విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి తన చేతిని పాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ సగం దానం చేస్తూ మిగిలింది తిన్నాడు. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిక్ష తీసుకోడు. ఇతను మన ఇంటికొస్తే బాగుణ్ణు అనే భావాలు జనులకు కలిగాయి. అతని కోసం పవిత్రంగా పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. పుచ్చకున్న దానిలోంచి అతడు దానం చేయడం అందరూ చూశారు. ఆయనలో ఏదో గొప్పతనం ఉందని మిగిలిన బిచ్చగాళ్లు నువ్వే మా గురువన్నారు. అతడు అంగీకరించలేదు. ఇదే నియమం పెట్టుకుని కాశీకి బయలుదేరాడు. తన చేతుల్లో ఎంత పడితే అంతే ఆహారం తీసుకోనేవాడు. అందులోనూ సగం దానం చేయడం. మిగిలిందే తింటూ జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు. ఓ చెట్టుకింది కూర్చుని ఎవరో ఒకరు బిక్షవేస్తే అదే తీసుకుని వెళ్లిపోయేవాడు. సాయం ధర్మం చేయండి వంటి మాటలు అతని నోట వినిపించేవి కాదు. ఎప్పుడూ ధ్యానంలో ఉండేవారు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడని, కారణ జన్ముడని అతనికి ఏం చేసినా మంచి జరుగుతుందనే నమ్మకం బలంగా ఏర్పడింది. అతనికి కరపాత్ర స్వామీజీ అని ప్రజలే పేరు పెట్టారు. కరమే (అరచేయి)పాత్రగా కలిగినవాడని అర్ధం.ఆ పేరుతో వేద పాఠశాల ఒక సత్రం నిర్మించారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేసేవారు. కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శించాలనుకునే భక్తులు చాలామంది సత్రాల్లో బస చేస్తున్నారు. వారికి స్థానికులు భోజనాలు వడ్డిస్తున్నారు. కానీ ఇతనికీ విషయాలు ఏమి తెలియవు. కొన్నాళ్ల తర్వాత అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు రాసాగారు. పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో వీరిని దర్శిస్తే అంత పుణ్యమూ అని కొందరు, ఈయనే నాకు గురువు అని మరికొందరు ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కరపాత్ర స్వామీజీకి ఈ పేరు వింతగా అనిపిస్తోంది. తననే అలా పిలుస్తున్నారని గ్రహించలేకపోయారు. ఒకరోజున అతడు భిక్ష అయిన తర్వాత తన గురువు ఎవరా అని ఆలోచించాడు. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే తాను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసాడో ఆ గ్రామానికి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు, కాశీలో వేదం చదువుకున్న వాళ్లు, సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలో గుర్తించి స్వామిజీకి స్వాగతం పలికారు. అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని పేదలకు ఇచ్చేస్తూ తానేమీ తీసుకోకపోవడంతో ఆయన ఖ్యాతి అంతటా చేరింది. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. గ్రామస్థులు ఆనందంతో కరపాత్ర స్వామిజీ వచ్చారని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుని పరిచయం చేశారు. మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి అనేకమంది గొప్పగా చెప్పారు.స్వామిజీని దర్శించడం ఆనందంగా ఉందని చాలామంది మాట్లాడారు. స్వామీజీ మాట్లాడటం పూర్తైన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. పండితుడు మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించారు. ఇద్దరు వాళ్ళింటికి వెళ్లి లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే తెలిసిన ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది. ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకు ఏదో మాతృత్వం తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆయన నియమాన్ని భంగ పరచరాదని కరతలంలో భిక్ష పెట్టింది. అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు స్వామీజీ ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి చాచాడు. స్వామిజీ ఇచ్చేశాడు. ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని పండితుడు, అతిథిగా స్వామీజీ ఇద్దరు భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అన్నాడు. అబ్బే! నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు. సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు స్వామిజీ. వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగరాదు పండితుడు జవాబు చెప్పాడు. సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. నా గురుదేవులు మీరే అన్నాడు స్వామి. అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు. అయ్యా ముందు వినండి. నేను ఎవరో కాదు మీ మూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది. అంత మాటలొద్దమ్మా! ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. అప్పుడే కాదు ఈ నాటికీ నేను సామాన్యుడినే. కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను అహంకారిని, మహా పండితుణ్ని అని గర్వంగా ఉండేది నా గర్వాన్ని పోగొట్టారు. కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. హాయిగా పరమానందం పొందారు. ఒకరిలో మరొకరికి పరమేశ్వరుడు సాక్షాత్కారించాడు.

About Author

By editor

Twitter
YOUTUBE