జాగృతి – సంపాదకీయం

శాలివాహన 1941 – శ్రీ శార్వరి వైశాఖ శుద్ధ ద్వాదశి – 4 మే 2020, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌

—————————————————————————————————————–

‌కరోనా వైరస్‌ ‌కోరల నుంచి మానవాళిని రక్షించుకోవాలని ప్రపంచం మొత్తం తన శక్తియుక్తులను ధారపోస్తున్నది. కనపడని ఆ శత్రువు శక్తులన్నీ ఉడిగిపోయేటట్టు చేయడానికి చరిత్రలో బహుశా మొదటిసారి ప్రపంచ దేశాల సరిహద్దుల మీద కనిపించని ఇనుపగోడలు మొలిచాయి. రంజాన్‌ ‌మాసమైనా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు మసీదులకు వెళ్లకుండా ఇళ్లలోనే నమాజ్‌లు చేసుకుంటున్నారు. అంటే ముస్లిమేతరులు, చాలామంది ముస్లింలు కూడా ఏదో ఒక నీతికీ, ఏదో ఒకరకంగా మానవాళి శ్రేయస్సుకీ కట్టుబడి ఉన్నారు. కానీ పాకిస్తాన్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదలకి ఎలాంటి నీతీ లేదు. ఎలాంటి మత నిబంధనలు లేవు. పవిత్రంగా, ప్రశాంతంగా ఉండవలసిన రంజాన్‌ ‌మాసంలో కూడా వాళ్ల రక్తదాహం యథాతథంగా ఉంది. ఎలాంటి కఠినాత్ములైనా యుద్ధం సమయంలో కొన్ని నీతిసూత్రాలకు కట్టుబడడం కనీస ధర్మం. అలాంటి కనీస నీతినియమాలు కూడా పాక్‌, అది పెంచి పోషిస్తూనే ఉన్న ఉగ్రవాదులూ ఏనాడూ ప్రదర్శించలేదు. ఇందుకు తాజా ఉదాహరణ కశ్మీర్‌లోని హంద్వారా ఉదంతం.

చంగీముల్లా అనే గ్రామంలో ఉగ్రవాదులు ఒక ఇంట్లో దూరి 11 మందిని బందీలుగా పట్టుకున్నారు. ఈ సంగతి తెలిసిన సైన్యం చర్యలకు పూనుకుంది. కల్నర్‌ అశుతోష్‌ ‌శర్మ, పోలీస్‌ ఎస్‌ఐ ‌ఖాజీ నేతృత్వంలో అక్కడికి ఒక బృందం వెళ్లింది. అంటే సైన్యం, పోలీసు శాఖ సంయుక్తంగా చేపట్టిన చర్య. ఎంత హోరాహోరీగా కాల్పులు జరిగినా సైన్యం, పోలీసు శాఖ ఉగ్రవాదులు బంధించిన మహిళలు, చిన్నారులు అందరినీ విడుదల చేశారు. ఎవరూ మరణించలేదు. తరువాత కల్నల్‌ ‌శర్మ నేతృత్వంలో ఒక బృందం లోపలికి చొచ్చుకు వెళ్లింది. తరువాత ఎలాంటి స్పందన రాలేదు. అప్పుడే అసలు సంగతి తెలిసింది. కల్నల్‌ ‌శర్మ ఫోన్‌కు కాల్‌ ‌చేస్తే అవతల వచ్చిన మాట ‘అస్సలాం అలేకుం’ అని. ఈ మాటే సైన్యానికి జరిగిందేమిటో చెప్పేసింది. వెంటనే లోపలికి వెళ్లిన పారాట్రూపర్లు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చేశారు. మరొక ఇద్దరు పారిపోయారు. వీళ్లంతా సరిహద్దులు దాటి ఇండియాలోకి చొరబడే ఉగ్రవాదుల కోసం అక్కడ వేచి ఉన్నారని చెబుతున్నారు. ఏప్రిల్‌ 30‌న కూడా మన రక్షణదళాలకీ, ఈ ముఠాకీ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. కల్నల్‌, ‌మేజర్‌ ‌స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లు, ఒక సబ్‌ ఇన్స్‌పెక్టరు – మొత్తం ఐదుగురిని- రంజాన్‌ ‌పవిత్రమాసంలోనే పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. మే నెల 2వ తేదీ సాయంత్రం ప్రారంభమైన ఈ ఎదురు కాల్పులు మరునాడు ఉదయం వరకు సాగాయి. కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

21 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్‌ ఆఫీసర్‌ ‌కల్నల్‌ ‌శర్మ 2018, 2019 సంవత్సరాలలో సేనా పతకానికి ఎంపికైన సమర్ధుడైన సైనికుడు. కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ రెండోసారి కూడా ఆ పతకం సాధించిన వారు ఆయన ఒక్కరే. 21 రాష్ట్రీయ రైఫిల్స్ ‌కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అణచడానికి ఏర్పాటైనదే. ఉగ్రవాదం మీద మూడేళ్లుగా సాగుతున్న పోరులో 21 రాష్ట్రీయ రైఫిల్స్ ‌కమాండింగ్‌ ఆఫీసర్‌ ‌స్థాయి అధికారిని కోల్పోవడం ఇది రెండోసారి. ఈ దళాలే అక్కడ 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టాయి.

కుప్వారా జిల్లా పాకిస్తాన్‌ ‌సరిహద్దులలోనిదే. ఈ సరిహద్దులలో ఉన్న నాలుగు స్థావరాల నుంచి 120 మంది ఉగ్రవాదులను భారత్‌లోకి ప్రవేశపెట్టాలన్న కుట్ర సాగుతోంది. నౌగావ్‌ ‌సెక్టార్‌ ‌నుంచి 19 మంది లష్కరే తొయిబా ఉగ్రవాదులను కూడా ప్రవేశపెట్టే కుట్ర చాపకింద నీరులా సాగుతోంది. ఇలాంటి కుట్ర ఒకటి సాగుతోందని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గ్యూటెరస్‌ ‌దాదాపు నాలుగు వారాల క్రితమే హెచ్చరించారు. ఆ తరువాత కొవిడ్‌ 19 ‌సోకిన ఉగ్రవాదులను పెద్ద సంఖ్యలో మన దేశంలోకి పంపాలన్న కుట్ర కూడా సాగిందని వార్తలు వచ్చాయి. అంటే కరోనాను జీవాయుధంగా ఉపయోగించుకోవాలన్నది పాక్‌ ‌నీచమైన ఎత్తుగడ. గడచిన మూడు దశాబ్దాలుగా ఇక్కడి సరిహద్దులలో కట్టిన బంకర్ల ద్వారానే ఉగ్రవాదులు తమ మూకలను కశ్మీర్‌ ‌లోయలోనికి ప్రవేశపెట్టడానికి రాజమార్గంగా ఉపయోగించుకుంటున్నారు. ఇదంతా రాజ్వార్‌ ‌బెల్ట్ ‌పరిధిలోనిది. దీనినే స్థానికులు మినీ పాకిస్తాన్‌ అని పిలుస్తారు. ఇక కుప్వారా జిల్లా గేట్‌ ‌వే ఆఫ్‌ ‌మిలిటెన్సీగా పేరు మోసింది. ఉగ్రవాదులు కూడా రాజ్వారా గురించి సంకేతించాలంటే మినీ పాకిస్తాన్‌గానే పేర్కొంటూ ఉంటారని సమాచారం. ఇక్కడి లోలబ్‌ ‌లోయకు విశ్వవిద్యాలయం అన్న సంకేతనామం పెట్టుకున్నారు. 1990లో ఇక్కడ నుంచి వేలాది మంది శ్రీనగర్‌కు తరలిపోయారు. 1996 తరువాత పరిస్థితులు కొంచెం చక్కబడినాయి. ఇక్కడ ఉగ్రవాదులను అదుపు చేయడానికి సైన్యానికీ, జమ్ముకశ్మీర్‌ ‌పోలీసు శాఖకీ పది సంవత్సరాలు పట్టింది. 370 ఆర్టికల్‌ను ఎత్తివేసిన తరువాత పాకిస్తాన్‌ ‌తన దుర్బుద్ధికి ఇంకా పదును పెట్టింది. అంతర్జాతీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా కశ్మీర్‌ ‌మీద ఆశ వదులుకోలేకపోతోంది. దీని మీద ఇంకా ఉపేక్షించడం భారత నాయకత్వానికి విజ్ఞత అనిపించుకోదు. ప్రస్తుతం పాకిస్తాన్‌ ‌కశ్మీర్‌ ‌గురించి కాదు, తన దేశంలో వీర విహారం చేస్తున్న కరోనా వైరస్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉంటే మంచిది. లేకపోతే రేపన్న రోజున కశ్మీర్‌ ‌గురించి ఆలోచించే అవసరం ఉండదు.

About Author

By editor

Twitter
Instagram