కొవిడ్‌ 19 ‌కల్లోలం సద్దుమణగలేదు. ఈ వ్యాసం రాసేనాటికి భారతదేశంలో పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య లక్ష దాటింది. మరణాలు 3,164. నాలుగో దశ లాక్‌డౌన్‌ ఆరంభ మైంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలూ, పోలీసు యంత్రాంగం అలసిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునర్‌ ‌నిర్మాణం గురించిన ఆరాటం నిప్పులా కాలుస్తున్నది. రెండో దఫా కొవిడ్‌ 19 ‌విజృంభణకు సంబంధించిన వార్తలు వణికిస్తున్న సమయం కూడా ఇదే. కొందరు నాయకుల మూర్ఖత్వం, ఒక వర్గం మీడియా అత్యుత్సాహం, కుట్రలతో వలస కార్మికుల సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది. కానీ కొవిడ్‌ 19 ‌మహమ్మారితో మనిషి పోరాటం ఆగేటట్టు కనిపించడం లేదు. ఆ అవకాశం సమీపంలో లేదు కూడా. ఈ కోణాలన్నీ ఎలా ఉన్నా బాధితులకు చేయూత నివ్వడం, సాంత్వన కల్గించడమే ధ్యేయంగా తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, దేశ వ్యాప్తంగానూ కనిపిస్తున్నాయి. కొవిడ్‌ 19 ‌పోరాట గాధలో ఇదొక గొప్ప అధ్యాయంగా చెప్పుకోవాలి.

మార్చి 22, 2020న లాక్‌డౌన్‌ ‌నిర్ణయం ప్రకటించడంతోటే సేవా కార్యక్రమాలు కూడా ఆరంభమయ్యాయి. కొవిడ్‌ 19 ‌నిరోధానికి లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గమని ప్రపంచం భావిస్తున్నట్టే భారతదేశం కూడా విశ్వసించింది. దీనితో చాలా లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా సంభవించాయి. పైగా ఇవి మానవీయ కోణంతో చూడవలసినవి. అందులో మొదటిది వలసకూలీల సమస్య. లాక్‌డౌన్‌ ‌కారణంగా వీరి ఉపాధి పోయింది. ఇందులో చాలామంది రోజు కూలీ చేసుకు బతికేవారే. నిజానికి ఇలా ఉపాధికి దూరమైనవారు దేశం నిండా ఉన్నారు. అన్ని రంగాలలోను ఉన్నారు. కానీ ఏది ఉద్విగ్న భరితంగా ఉంటుందో, ఏది టీవీల టీఆర్‌పీ రేటును పెంచుతుందో, ఏది జాతీయ ప్రభుత్వా నికి ముందరి కాళ్లకు బంధంగా పనికొస్తుందో, బీజేపీ ప్రభుత్వ ప్రతిష్టకు సవాలు విసర గలుగుతుందో వాటినే ఒకవర్గం మీడియా ముందుకు తేవడంతో లాక్‌డౌన్‌ ‌కారణంగా నిరాశ్రయులైన చాలామంది పరిస్థితి దేశ ప్రజల ముందుకు రానేలేదు. లాక్‌డౌన్‌ ‌కారణంగా మొదట మూతపడినవి – సినిమా హాళ్లు, మాల్స్. ‌చిన్న వ్యాపారాలు, మధ్య తరగతి వ్యాపారాలు, పరిశ్రమలు, హోటళ్లు, లాడ్జీలు, బార్బర్‌ ‌షాపులు, చిరుతిళ్ల వ్యాపా రాలు, సాధారణ ఆస్పత్రులు, ఫంక్షన్‌ ‌హాల్స్ ‌సిబ్బంది, బట్టల దుకాణాలు, ఫర్నిచర్‌ ‌షాపులు, చిన్నచిన్న వృత్తులు చేసుకునేవారు… అక్షరాలా సహస్ర వృత్తుల వారు అనాలి. అంతా ఉపాధి కోల్పోయినవారే. వీరెవరి గురించి మీడియా పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల గురించి, చేనేత కార్మికుల గురించి, బీడీ కార్మికుల గురించి పట్టించు కుంటే లాభమేమిటి? టీఆర్‌పీ రేటు ఎప్పటికి పెరుగుతుంది? కానీ స్వచ్ఛంద సంస్థలు వీరి బాగోగుల కోసం పాటు పడుతున్నాయి. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక సంస్థ ఇలా వివిధ స్థాయిలలో లాక్‌డౌన్‌ ‌బాధితులకు ఆసరాగా నిలబడుతున్న అపురూపు దృశ్యం ఈ విపత్తు వేళ కూడా కనిపిస్తున్నది. సేవలు అందుకుంట్ను వారికీ, సేవలు అందిస్తున్న వారికి కూడా ఇప్పుడు లాక్‌డౌన్‌ ‌సంకటం సమానం. అయినా సేవ జరుగుతోంది.
దేశంలో వలస కార్మికులు కోట్ల సంఖ్యలో ఉన్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో ఎక్కువ మందికి ఆసరా అవసరమే. ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థలు, రామకృష్ణ మిషన్‌, ‌చిన్న చిన్న స్వచ్ఛంద సంస్థలు పెద్ద మనసుతో అలాంటి ఆసరాను కల్పించడానికి పాటు పడుతున్నాయి. సేవా భారతి ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రేరణతో పని చేసే పెద్ద స్వచ్ఛంద సంస్థ. రెండు తెలుగు రాష్ట్రాలలోను ఉపాధి కోల్పోయిన వారికి నిత్యం భోజనరూపంలో, వస్తు రూపంలో, ఇతర సేవల రూపంలో ఆసరా ఇస్తున్నది. అదే బాటలో విశ్వహిందూ పరిషత్‌ ‌కూడా పాటు పడుతున్నది. భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాలలోను తన వంతుగా సేవలు అందిస్తున్నది. కొండకోనలలో నివసించే గిరిపుత్రలకు సేవలు అందించడం మామూలు విషయం కాదు. కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు అందించిన సేవల కంటే వనవాసీ కల్యాణ్‌ ఆ‌శ్రమం ఒక అడుగు ముందే ఉంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌, ‌స్వదేశీ జాగరణ్‌ ‌మంచ్‌, ‌విద్యాభారతి, రాష్ట్రీయ స్వయం సేవికా సమితి, తెలంగాణ ఉపాధ్యాయ సంఘం, జాతీయ సాహిత్య పరిషత్‌, ‌భారత్‌ ‌వికాస్‌ ‌పరిషత్‌, ‌సమరసతా ఫౌండేషన్‌ ‌వంటి సంస్థలు ఎన్నో ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధంగా లేదా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌ప్రేరణతో పనిచేస్తున్నాయి. సామాజిక సేవలో అగ్రగామిగా ఉండే సత్యసాయి సేవా సమితి కూడా లాక్‌డౌన్‌ ‌బాధితుల సేవలో ఇతోధికంగా పని చేస్తున్నది. అలాగే రామకృష్ణ మిషన్‌ ‌కూడా బాధితులను ఆదుకుంటున్నది.

ఇవే కాదు, కొందరు వ్యక్తులు, మిత్రులు కలసి సంఘాలుగా ఏర్పడి సేవలు అందించడం ప్రస్తుత పరిస్థితులలో కనిపిస్తున్న అపురూప సన్నివేశం. వేరే ఆశయంతో సమాజ సేవలో ఉన్న సంస్థలు కూడా ప్రస్తుత అవసరానికి తగ్గట్టు తమ సేవను మలుచుకుంటున్నాయి. రక్తదానం ఉద్దేశంతో ఏర్పడిన సంస్థలు ఆ పని చేస్తూనే లాక్‌డౌన్‌ ‌బాధితులను కూడా వారి అవసరా లకు మేరకు ఆదుకుంటున్నాయి. స్పందన వెల్ఫేర్‌ ‌సొసైటీ, భారత్‌ ‌వికాస్‌ ‌పరిషత్‌, ‌హిందూ స్వరాజ్‌ ‌యూత్‌, ‌ఛత్రపతి శివాజీ సేన, భారత్‌ ‌సేవా సమాజ్‌, ‌సహృదయ ఫౌండేషన్‌, ఆసరా చారిటబుల్‌ ‌ట్రస్ట్, ‌భారతమాతా యూత్‌, ‌ప్రభాత సిందూరి దివ్యాంగుల సేవా సంస్థ, సంఘమిత్ర, యువమంచ్‌, ‌సేవా జ్యోతి, నవ నిర్మాణ సమితి, నో ఫుడ్‌ ‌వేస్ట్ ఆర్గనైజేషన్‌, ‌సొసైటీ ఫర్‌ ‌సైబరాబాద్‌ ‌సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సిఎస్‌సి), శ్రీరామచంద్ర మిషన్‌ ‌వంటి వందలాది సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాలలోను పని చేస్తున్నాయి.
లాక్‌డౌన్‌, ‌కరోనా మీద పోరాటం ఒక మహా సంగ్రామానికి తక్కువేమీ కాదు. ఇక్కడ శత్రువు కనిపించడం లేదంతే. కానీ ఎందరు క్షతగ్రాతులో! ఎందరు మృతులో! యుద్ధంలో ఉన్న ఏ దేశమూ, ఏ జాతీ సరిగా నిద్రా హారాలకు నోచుకోలేదు. వలసకార్మికులు, పైన చెప్పుకున్న సహస్ర వృత్తుల వారి పరిస్థితి అలాంటిదే. వీరి అవసరాలు తీర్చడం కూడా చిన్న విషయం కాదు. మొదట వారు పస్తు పడుకోరాదు. దీనికి తగ్గట్టే భారతీయ సమాజం స్పందించింది. బీహెచ్‌ఈఎల్‌లో సాధారణ ఉద్యోగి మాతృమూర్తి, ఏడుపదుల వయసు లోను రోజూ రెండు వందల మందికి వంట చేస్తున్నారు. బీఎంఎస్‌ ‌కార్యకర్తలు పంచి పెడుతున్నారు. ఒక కుటుంబం తమ ఇంటినే సేవకు నిలయంగా మార్చింది. భోజన వసతి, మంచినీరు, మాస్కులు, నిత్యావసరాల కిట్లు, పళ్లు, మందులు, బియ్యం, కూరగాయలు, చెప్పులు ఆయా సంస్థలు, వ్యక్తులు సమకూరు స్తూనే ఉన్నారు. కొన్ని లక్షల మందికి భోజన వసతి. అంతే సంఖ్యలో మాస్కులు పంపిణీ. మంచినీరు, మందులు, నిత్యవసారాల కిట్లు ఎన్ని పంచారో లెక్కకు కూడా అందదు. ఇదంతా ప్రభుత్వ నిధులతో చేస్తున్నది కాదు. అంతర్జా తీయ ప్రభుత్వేతర సంస్థలు వేసే బిచ్చంతో చేస్తున్నవి అంతకంటే కాదు. తమ జేబులలో నుంచి, ఇక్కడి సమాజం ఇచ్చిన నిధులతో, వస్తువులతో చేస్తున్నదే. కొందరు పిల్లలు తాము కిడ్డీ బ్యాంకులలో దాచుకున్న డబ్బు కూడా విరాళంగా ఇచ్చిన ఘటనలు ఉన్నాయి.

దేశం యావత్తు ఒక విపత్తులో విలవిలలాడుతున్న సమయంలో మేమున్నా మంటూ ముందుకు వచ్చిన ప్రతి అమ్మకు, ప్రతి సోదరికి, ప్రతి సోదరునికి, ప్రతి చిన్నారికి ధన్యవాదాలు తెలియ చేయవలసి ఉంది. కొవిడ్‌ 19 ‌మీద జరిగే యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులు, వారి సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది ఎంత శ్లాఘనీయులో తెర వెనుక ఉండి ఇంత సేవ చేస్తూ దేశం పెద్ద సామాజిక సంక్షోభం వైపు వెళ్లకుండా కాపాడుతున్న ఇలాంటి వారంతా కూడా అభినందనీయులే. ఇదంతా లాక్‌డౌన్‌ ‌నిబంధనల పరిధిలో జరగడం మరీ మరీ అద్భుతం. ప్రతికూల దృక్పథంతో సామాజిక సంక్షోభం కోసం ఎదురు చూస్తున్నవారికి సానుకూల దృక్పథంతో సమాధానం ఇచ్చిన సేవాతత్పరులు వీరంతా. అందుకే వీరికి జాతి రుణపడి ఉంటుంది. ఈ సేవా పరాయణులంతా నిస్వార్థంగా సేవలు అందిస్తూ సేవను జీవిత ధర్మంగా, జీవితాదర్శంగా పూజిస్తున్న ఒక జాతికి వారసులుగా నిరూపించుకున్నారు. భారతీయత, అందులోని ధార్మిక దృష్టి, సేవానిరతి ఈ దేశంలో, ఈ దేశ వాసుల గుండెలలో ఇంకిపోలేదని ఎలుగెత్తి చాటారు. ఈ సేవానిరతికి, త్యాగనిరతికి, నిస్వార్థ దృష్టికి ‘జాగృతి’ నమశ్శతములు.

About Author

By editor

Twitter
Instagram