ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే బుల్డోజర్ బాబాగా ప్రచారం చేయడం వెనుక చాలామందికి దురుద్దేశమే ఉంది. ఆయన హంతకులను వేటాడతారు. అందులో సందేహం లేదు. పదే పదే అదే తప్పు చేసేవాళ్లను ఎన్‌కౌంటర్ చేసే అధికారం కూడా పోలీసులకి ఇచ్చారు. వీటినే ఎక్కువ చేసి చూపుతూ, యోగి చేస్తున్న మరొక గొప్ప సేవాకార్యక్రమాన్ని వెలుగులోకి రాకుండా చేస్తున్నారు. అదే యోగి చేపట్టిన గోరక్షణ కార్యక్రమం.
2017లో యోగి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి కూడా గోరక్షణను తమ ప్రాధామ్యాలలో ఒకటిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. గోరక్షణను గ్రామీణాభివృద్ధిలో, సహజ సేద్యంలో, జంతు సంక్షేమంలో భాగంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ జీవితంలో, సేద్యంలో సమస్యలు సృష్టించే ఎవరికీ చెందని ఆవులు, ఎద్దుల గురించి కూడా ఈ పథకం చేపట్టారు. ఇందులో ఒకటి ఎవరికీ చెందకుండా వీధులలో తిరిగే ఆవులను వ్యక్తులకు అప్పగించి, వాటి పోషణ చూడడానికి నిధులు ఇవ్వడం అలా 2.37 లక్షల ఆవులను వ్యక్తులకు అప్పగించారు. ఈ పథకం పేరు ముఖ్య మంత్రి సహభాగితా యోజన. ఇలా ఆవును పోషించేందుకు తీసుకున్న వ్యక్తికి రోజుకు రూ. 50 వంతున చెల్లిస్తారు (మొన్న ఫిబ్రవరి వరకు రూ. 30 చెల్లించేవారు). ఇది కేవలం పశు రక్షణే కాదు, ఆవులను దత్తత తీసుకున్న వారికి జీవనోపాధిగా కూడా ఉపయోగపడుతున్నది. ఈ ఆవులు ప్రధానంగా ఒట్టిపోయినవే. ఇవే గ్రామాలలో, పొలాలలో సమస్యగా ఉంటాయి. పైగా యోగి హయాం నుంచి 1955 నాటి ఉత్తరప్రదేశ్ గోసంరక్షణ చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేస్తున్నారు.
గడచిన ఎనిమిదేళ్లలో యోగి ప్రభుత్వం 7,713 గోరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో 16 లక్షల ఆవులు ఆశ్రయం పొందుతున్నది. ఇవన్నీ ఎవరికీ చెందని గోసంతతే. ఇలాంటి ఆవుల కోసం 2025-2026 ఆర్థిక సంవత్సరంలో రూ. 2000 కోట్లు కేటాయించింది. విస్తృత స్థాయిలో పశుపోషణకు రూ 140 కోట్లు, పశువుల ఆసుపత్రుల విస్తరణకు రూ. 123 కోట్లు వ్యయం చేస్తారు. 14.5 కోట్ల పశువులకు రాష్ట్రంలో వేక్సినేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి అమృతధార పథకాన్ని ఆవుల పోషణ, సహజ సేద్యం కోసం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద రూ.3 లక్షల నుంచి, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు. అయినా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఎవరికీ చెందని ఆవులతో సమస్యలు ఉంటున్నాయి. అందుకే వాటిని పట్టుకుని ప్రభుత్వ షెడ్డులకు తరలించే పని నిరంతరం జరుగుతూనే ఉంది. ఇందులో మరొక ఉద్దేశం కూడా ఉంది. ఈ ఆవులకు రక్షణ కల్పించడంతో పాటు, జాతీయ రహదారులపై వీటి కారణంగా ప్రమాదాలు జరగకుండా చూడాలన్నదే ఆ ఉద్దేశం.