ఏప్రిల్ 22…2025 జమ్ముకశ్మీర్‌లో పర్యాటకరంగం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదనడానికి ఉదాహరణగా నిలిచిన పెహల్గావ్‌లోని ప్రిస్టిన్ పర్వత ప్రాంతం ఒక్కసారిగా ఉగ్రవాదుల తుపాకుల మోతలు, ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు…వారి బంధువుల ఆర్తనాదాలతో విలవిలలాడింది. మాస్క్‌లు ధరించి వచ్చిన ముష్కరులు, హిందువులుగా గుర్తించిన వారిపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపి హతమార్చారు. ఆ ఉగ్ర ఘాతుకానికి బలైనవారిలో 25 మంది హిందువులు కాగా ఒక్కరు షియా వర్గానికి చెందిన ముస్లిం.
గత ఆరేళ్లుగా ఎంతో ప్రశాంతంగా ఉన్న జమ్ము-కశ్మీర్ ఈ సంఘటనతో ఒక్కసారిగా కలవర పాటుకు గురైంది. ప్రపంచ మీడియా ఈ దారుణ సంఘటనను కవర్ చేయడంలో మరోసారి తన నిర్లక్ష్యాన్ని, వివక్షను ప్రదర్శించడం గమనార్హం. ముఖ్యంగా కశ్మీర్‌ను ‘ఇండియన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్’, ‘తుపాకులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు’ అంటూ వార్తలు ప్రచురించి మరోసారి హిందువుల పట్ల తన వివక్షను వెల్లడించింది. ‘ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో హిందువుల హత్య’ అని రాయకుండా ‘తుపాకులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు’, ‘భారత్ అధీనంలోని కశ్మీర్’ అంటూ రాయడం ద్వారా మరోసారి అస్పష్ట వైఖరిని అనుసరిం చడం పాశ్చాత్య మీడియాకే చెల్లింది. ఈ రకమైన రాతల ద్వారా బాధితులైన వారి గుర్తింపును కావాలనే నిర్లక్ష్యం చేసినట్లయింది. ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థానంలో ‘తుపాకులు ధరించిన వ్యక్తులు’ అని పేర్కొనడం కూడా వాటి నిర్లక్ష్యానికి నిదర్శనం.
యూదులకో నీతి… హిందువులకు మరో నీతి
పిట్స్‌బర్గ్‌లో ప్రార్థనలు చేస్తున్న యూదులపై కాల్పులు జరిపి 26 మందిని హతమార్చినప్పుడు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ‘‘యూదు వ్యతిరేక ఉగ్రవాదం’’ అని రాయడానికి ఎంతమాత్రం సంకోచించలేదు. ఈస్టర్ ఆదివారం పండుగ రోజున శ్రీలంకలో క్రైస్తవులపై కాల్పులు జరిపి హతమార్చి నప్పుడు బీబీసీ, సీఎన్‌ఎన్‌లు దీన్ని మతపరమైన ఉగ్రవాదంగా పేర్కొన్నాయి. మరి అదే భారత్‌లో హిందువులను హతమారిస్తే వీరు రాసే విధానం ఒక్కసారిగా మారిపోతున్నది. కశ్మీర్‌లో హిందువులను హతమార్చిన ఇస్లామిక్ ఉగ్రవాదులు ఒక్కసారిగా ‘‘తుపాకులు ధరించిన గుర్తుతెలియని వ్యక్తులు’’ మారిపోతారు. బీబీసీ, వాషింగ్టన్ పోస్ట్, అల్‌జెజీరాలు సరిగ్గా ఇదే పదాన్ని ఉపయోగించాయి. రాయిటర్స్, ఎన్‌వైటీ, ఏపీ సంస్థలు ‘‘మిలిటెంట్లు’’ అని రాసాయి. కొన్నిచోట్ల అల్ జెజీరా ‘‘తిరుగుబాటు దారులు’’ అని పేర్కొంది. ఈ ఉగ్రవాదుల దాడిని ‘‘కాల్పులు’’, ‘‘దాడి’’ లేదా ‘‘పర్యాటకులపై అరుదైన దాడి’’గా పాశ్చాత్య మీడియా అభివర్ణించింది. ఇదొక ఉగ్రవాద మన్న దృక్పథంతో ఈ మీడియా సంస్థలు రాయక పోవడం విచారకరం. యాదృచ్ఛికంగా ఇటువంటి భాషా ప్రయోగం చేశారనుకోవడం అమాయకత్వమే. ఎందుకంటే దాడికి పాల్పడిన ముష్కరుల గుర్తింపును, మరణించిన హిందువుల గుర్తింపును వెల్లడి చేయకుండా సంఘటన తీవ్రతను కావాలనే తక్కువ చేసి చూపడం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది.
లింగ వివక్షగా చిత్రించడానికి యత్నం
పెహల్గావ్ ఉగ్రవాద సంఘటలో స్త్రీ, పురుషులనే అంశాన్ని ముందుకు తెచ్చి, కేవలం పురుషులను మాత్రమే హతమార్చారంటూ రాయడం ద్వారా రాయిటర్స్ సంస్థ ఈ ఇస్లామిక్ ఉగ్రవాద దాడిని పూర్తిగా వక్రీకరించే యత్నం చేసింది. ముఖ్యంగా పురుషులను, మహిళలు, పిల్లల నుంచి ఏ విధంగా వేరుచేసి హతమార్చింది వివరిస్తూ దీన్నొక లింగవివక్ష సంఘటనగా చిత్రీకరించింది. సీఎన్‌ఎన్ ఏకంగా బాధితుల్లో కొందరు ప్రధాని మోదీకి మద్దతు దారులుగా ఆరోపణలున్నట్టు రాసింది. ఇక ఏపీ సంస్థ అయితే భారత ప్రభుత్వ పాలనపై పోరాటం చేస్తున్న తీవ్రవాదులు ఇందుకు బాధ్యులు అని పేర్కొనడం ద్వారా, హంతకులను స్వాతంత్య్ర పోరాటదారులుగా చెప్పడానికి ప్రయత్నించింది. ఈ విధంగా సంఘటన జరిగిన తర్వాత మొట్టమొదట వచ్చిన వార్తల్లో ఎక్కడా మరణించిన వారు హిందువులని, హంతకులు ఇస్లామిక్ తీవ్రవాదులన్న విషయమే పేర్కొనకపోవడం గమనార్హం.
ఉగ్రవాదంపై పోరుకు వెన్నుపోటు
ఇక్కడ గుర్తుతెలియని వ్యక్తులుగా ఇస్లామిక్ ఉగ్రవాదులను పేర్కొనడమే కాకుండా, భౌగోళిక- రాజకీయ అంశాల్లో కూడా పాశ్చాత్య మీడియా సంస్థలు కావాలనే పక్షపాతంతో వ్యవహరించాయను కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా అవి ప్రయోగించిన పదబంధాలు దీన్ని స్పష్టం చేస్తున్నాయి. ‘‘ఇండియన్ అడ్మినిస్టర్డ్ కశ్మీర్’’, ‘‘ఇండియన్ కంట్రోల్డ్ కశ్మీర్’’ అని కొన్ని మీడియా సంస్థలు, మరికొన్ని మరింత ముందుకెళ్లి ‘‘వివాదాస్పద భూభాగం’’ అని కూడా రాశాయి. ఇవేవో యాదృచ్ఛికంగా ప్రయోగించిన పదజాలంగా భావిస్తే అమాయకత్వమే. ఈ ప్రాంతంపై భారత సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే రీతిలో జాగ్రత్తగా ఉపయోగించిన పదబంధాలుగా భావించాల్సి వస్తోంది. కశ్మీర్‌పై సార్వభౌమాధి కారాన్ని భారత రాజ్యాంగమే స్పష్టంగా పేర్కొంది. కశ్మీర్, ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత అక్కడ అనుసరించిన ప్రజాస్వామ్య విధానాలు దీన్ని మరింత స్పష్టం చేశాయి కూడా. అయినప్పటికీ గ్లోబల్ మీడియా సంస్థలు మాత్రం ఇండియన్ యూనియన్‌లో రాజ్యాంగబద్ధంగా విలీనమైన ప్రాంతంగా కంటే పాకిస్తాన్ భాషలో దీన్ని ‘ఎవరికీ చెందని భూమిగా’ పేర్కొనడానికే ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. ఆ విధంగా భారత్‌ను ఈ ప్రాంతాన్ని ఆక్రమించిన దేశంగా చూపడానికే యత్నించాయి తప్ప, ఈ ప్రాంతంలోని హిందువులను మతపరమైన ఉగ్రవాదం నుంచి రక్షిస్తున్న రాజ్యంగా చూపడంలేదు. మీడియా చేస్తున్న ఈ విధమైన పదప్రయోగాలు 1947 నాటి ‘‘ఇన్‌స్ట్రమెంట్ ఆఫ్ యాక్సెషన్’’ ప్రకారం కశ్మీర్ భారత్‌లో చట్టబద్ధంగా విలీనమైన ప్రాంతమన్న సత్యాన్ని పక్కన పెడుతున్నాయి. ఇదే సమయంలో జిహాదీ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, తీవ్రవాద ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్‌కు అనుకూలంగా ఈ పదజాల ప్రయోగాలు ఉంటున్నాయి. ఈ విధమైన రాతలు భారత్ కొనసాగిస్తున్న ఉగ్రవాదంపై పోరుకు వెన్నుపోటు పొడవడం తప్ప మరోటికాదు.
తప్పుడు కథనాలు
సంఘటన జరిగిన కొద్ది రోజులకు, అల్ జెజీరా ‘‘మేం శాపగ్రస్తులం: పెహల్గావ్ హత్యల తర్వాత దాడుల భయంలో కశ్మీరీలు’’ పేరుతో ఒక ఫీచర్ స్టోరీని ప్రసారం చేసింది. అసలు విషయాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరోటుండదు. కశ్మీర్‌కు దూరంగా ఎక్కడో ఒక దేశంలోని నగరంలో కూర్చొని వార్తలను తన చిత్తం వచ్చిన రీతిలో వండి వార్చడం తప్ప మరోటి కాదు. ఇక ఇస్లామిక్ ఉగ్రవాదులు, హిందువులను పొట్టన పెట్టుకున్న రెండు రోజుల తర్వాత గ్లోబల్ మీడియాలో విచిత్రంగా ముస్లింలకు వ్యతిరేకంగా ప్రతిక్రియ మొదలు అంటూ కథనాలు వండివార్చడం మరో విచిత్రం. ‘‘దాడికి వ్యతిరేకంగా జమ్ములో నిర్వహించిన ప్రదర్శనలకు ‘రైట్ వింగ్ విజిలెంట్స్’ నాయకత్వం వహించారు’’ అని గార్డియన్ దినపత్రిక రాసింది. నిరాయుధులైన అమాయక హిందువులపై మతఛాందస ఉగ్రవాదులు జరిపిన దాడికంటే ఈ పత్రిక ప్రయోగించిన ‘రైట్ వింగ్ విజిలెంట్స్’’ అనే పదం దారుణంగా ఉందనే చెప్పాలి. విషాదమేంటంటే బాధితులు హిందువులన్న అంశాన్ని ఏ పాశ్చాత్య మీడియా సంస్థ రాయ పోవడం. ఇది యాదృచ్ఛికమా లేక కావాలనే అట్లా చేశారా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఇక బీబీసీ ‘‘బాధితుల్లో అధికులు హిందువులు’’ అని రాయడం కొంతలో కొంత మెరుగు. అయితే ‘‘మృతుల్లో ఒక ముస్లిం కూడా ఉన్నాడు’’ అని చెబుతూ, ఈ దాడి ‘యాదృచ్ఛిక సంఘటన’గా స్థానికులు తెలిపారని పేర్కొంది. సీఎన్‌ఎన్, ఏపీ, ది గార్డియన్ వంటి మీడియా సంస్థలు బాధితులు ‘‘హిందువులు’’ అన్న పదాన్ని తమ తొలి నివేదికల్లో విస్మరించడం గమనార్హం.
యూదుల దుకాణంపై ఇస్లామిస్టుల దాడి
2015లో ప్యారిస్‌లోని యూదుల కిరాణా స్టోర్స్‌పై ఇస్లామిక్ ఉగ్రవాదులు యూదులు లక్ష్యంగా దాడులు చేశారని పాశ్చాత్య మీడియా కథనాలు రాసింది. న్యూజిలాండ్‌లోని క్రిస్ట్ చర్చ్ మసీదుపై దాడి జరిగినప్పుడు ఇదే మీడియా ‘ముస్లిం’ అన్న పదాన్ని స్పష్టంగా పేర్కొంది. మరి పెహల్గావ్‌లో హిందువులు, ఇస్లామిక్ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణిస్తే, ‘హిందువులు’ అనే పదాన్ని రాయడానికి ఈ మీడియాకు చేతులు రాలేదు. కాల్పులు జరిపిన వారినేమో ‘గన్‌మెన్’ అని, మరణించినవారిని ‘బాధితులు’ అని మాత్రమే పేర్కొని చేతులు దులుపుకున్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఇస్లామిక్ ఉగ్రవాదానికి ప్రధాన లక్ష్యంగా మారిన ‘హిందువు లను’ వారి మతంతో పేర్కొనడానికి ఈ మీడియా సంస్థల ఎడిటోరియల్ బోర్డులు అంగీకరించడం లేదని భావించాల్సి వస్తున్నది. జరిగిన వాస్తవాన్ని వెల్లడించకుండా ఆయా సంస్థలు హిందువుల గౌరవాన్ని కించపరుస్తున్నాయనుకోవాలి. ఆ విధంగా హిందువులు తమ బాధను, మనోవేదనను బాహ్య ప్రపంచానికి వెల్లడించే హక్కును కూడా కోల్పోతు న్నారు. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించే గ్లోబల్ మీడియా ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతుల్లో హిందువులు మరణిస్తే, కప్పదాటు వైఖరిని ఎందుకు ప్రదర్శిస్తున్నది?
కులీన మీడియా ఆధిపత్య ధోరణి
దీనికి ప్రధాన కారణం ప్రపంచ వ్యాప్తంగా కులీన మీడియా ఒక ఆధిపత్య వాతావరణాన్ని నిర్మిస్తూ వచ్చింది. ఈ మీడియాకు బాధితులుగా ఉన్న హిందువులు కనిపించరు. అదీకాకుండా ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో ఉండటం, అంతర్జాతీయ దౌత్యంలో భారత్ దృఢమైన వైఖరితో వ్యవహరిస్తుండటాన్ని, ఈ మీడియా అనుమానాస్పద దృక్కులతో చూస్తోంది. వలసవాద కాలం ముగిసిన తర్వాత పాశ్చాత్య మీడియా సంస్థలు ‘‘పీడకులు’’ ‘‘పీడితులు’’ అనే సంక్లిష్ట ద్వైదీభావంలో కొట్టుమిట్టాడు తున్నాయి. ఈ చట్రంలో ఇరుక్కుపోయిన వారు కశ్మీర్ హింసలో బాధితులు హిందువులైనా వారిని హిందువులుగా గుర్తించడానికి అంగీకరించరు. అంతర్జాతీయ జిహాదీ సిద్ధాంతంతో పెచ్చరిల్లుతున్న ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని కేవలం ‘‘పాలకులకు వ్యతిరేకంగా జరిపే పోరాటం’’గా మాత్రమే పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో జరుగుతున్న హిందువుల నరమేధం వీరి ద్వైదీభావ చట్రంలో ఇమడక పోయేసరికి, ఈ మరణాలను నరేంద్రమోదీకి వ్యతిరేకంగా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తు న్నారు.
ముఖ్యంగా 370 అధికరణాన్ని రద్దు చేయడాన్ని ప్రస్తుత పరిణామాలకు కారణంగా చూపడానికే మొగ్గుచూపుతున్నారు. ఇస్లామిక్ మతఛాందస వాదంతో ఉగ్రవాదులు, హిందువులను చంపేస్తున్నారన్న సత్యాన్ని ఒప్పుకోకుండా కప్పదాటు వైఖరినే అనుసరిస్తున్నారు. గ్లోబల్ మీడియా ఇదేవిధంగా హిందువులపై, ఇస్లామిస్ట్ ఉగ్రవాదాన్ని అంగీకరించకపోతే ఈ హింసాకాండ యధేచ్ఛగా కొనసాగుతూనే ఉంటుంది. ఫలితంగా కొన్ని మరణాలకు (ఉగ్రవాదుల) పెద్ద ఎత్తున మౌనం పాటించడం, నిజమైన బాధితులను పట్టించుకునేవారు లేని దుస్థితి ఏర్పడుతుంది. కశ్మీరీ పండిట్లను తమ సొంత రాష్ట్రం నుంచి తరిమేయడం, బాంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, పాకిస్తాన్‌లో దేవాలయాలను అపవిత్రం చేయడం వంటివి జరుగుతున్నప్పుడు, హిందువుల బాధలు పాశ్చాత్య మీడియాకు పట్టడంలేదు. పెహల్గావ్ సంఘటన విషయంలో పాశ్చాత్య మీడియా నిర్లక్ష్యంగా ఇటువంటి పదజాలాన్ని ప్రయోగించిందని భావించడానికి వీల్లేదు. ఇస్లామిక్ ఛాందసవాద హింసకు, హిందు వులు బలవుతున్న విధానాన్ని ప్రపంచానికి తెలియ కుండా చేయడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను పెహల్గావ్ సంఘటన మరోసారి బహిర్గతం చేసింది.
ప్రపంచదేశాల దన్ను
పెహల్గావ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఇరాన్, ఇజ్రాయిల్, ఇటలీ, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, బాంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, చైనా, పాకిస్తాన్ దేశాలు ఉగ్రవాద దాడిని ఖండించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మృతులకు సంతాపం తెలపడమే కాకుండా అపత్కాలంలో భారత్‌కు అండగా నిలుస్తామని చెప్పారు. రష్యా అధ్యక్షులు పుతిన్ దాడికి కారకులైన వారు కఠిన శిక్షకు అర్హులన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని పునరు ద్ఘాటించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ, యు.కె. ప్రధాని కీర్ స్టార్మర్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నేతన్యాహు, జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ స్కోల్జ్, ఉక్రెయిన్ రాయబార కార్యాలయం కూడా సంఘటనను ఖండించింది. కాగా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా అసీఫ్, ఈ దాడికి తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
చైనాకు భారత్ అవసరం
చైనా విషయానికి వస్తే ప్రస్తుతం భారత్-పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తన ఆప్తమిత్రుడు పాకిస్తాన్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఆమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో చైనా ఇప్పుడు మార్కెట్ల కోసం వెంపర్లాడుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఇండియాను వదులుకోలేని పరిస్థితి! అదీకాకుండా గల్వాన్ సంఘటన తర్వాత ఇప్పుడిప్పుడే రెండు దేశాల మధ్య సంబంధాలు కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్నాయి. కైలాస్ మానస సరోవర యాత్ర మళ్లీ ఈ ఏడాది ప్రారంభం కానుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, చైనాకు కూడా ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు బాగా తెలుసు కనుక ఈ విషయంలో భారత్‌తో విభేదించడం సాధ్యం కాదు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు భారత్‌కు అండగా నిలిచాయి. గతంలో అమెరికా, పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్, ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇస్లామిక్ దేశాలన్నీ దాదాపుగా భారత్‌కే మద్దతిస్తున్నాయి. కశ్మీర్ సమస్య వాటి దృష్టిలో ఒక అరిగిపోయిన రికార్డు వంటిది. వాణిజ్య లాభాలు భారత్‌తో ఉంటే, ఒక్క మతం తప్ప మరే ఇతర ప్రయోజనం లేని పాకిస్తాన్‌తో అంటకాగడం ఆత్మహత్యా సదృశమన్న సంగతి వాటికి బాగా తెలుసు. పాకిస్తాన్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్న టర్కీ కూడా ఉగ్రవాద దాడిని ఖండించింది. భౌగోళికంగా భారత్‌ను వ్యతిరేకిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో టర్కీకి బాగా తెలుసు. అందుకని పాకిస్తాన్ ఎంతగా కలుపుకుపోదామను కున్నా, టర్కీ మౌనంగా ఉంటోంది.
ఇక పాక్ మద్దతుదారైన మలేసియా కూడా ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడినుంచి అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకునేది మనదేశమే! అందువల్ల గత యుద్ధాలతో పోలిస్తే ఇప్పుడ పాకిస్తాన్ పూర్తి ఒంటరి! అసీమ్ మునీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తర్వాత ఉగ్రవాద దాడితో మొత్తం పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సంఘటన తర్వాత దౌత్యపరంగా పాకిస్తాన్ తప్పులు మీద తప్పులు చేస్తోంది. ఇరాన్ మధ్యవర్తిత్వం వహిస్తానన్నా, అస్థిరత్వంతో కొట్టు మిట్టాడుతున్న ఆ దేశానికి ఎంతమేర ఈ సామర్థ్యం ఉన్నదనేని ప్రశ్నార్థకమే! ముఖ్యంగా పాక్ తీవ్ర వాదులతో ఇరాన్ కూడా ఇబ్బందులు పడుతోంది.
ప్రస్తుతం నరేంద్రమోదీ ప్రభుత్వం కూడా పాకిస్తాన్‌పై ఏదో ఒక చర్య తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇటువంటి దుస్సం ఘటన జరగడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రస్థాయిలో భావోద్వేగాలు వ్యక్తమవుతున్నాయి. అసలే క్రియాశీలకంగా పేరు సంపాదించుకున్న ఎన్‌డీఏ ప్రభుత్వం, దేశీయంగా, అంతర్జాతీయంగా లభిస్తున్న పూర్తి మద్దతు నేపథ్యంలో ఉపేక్షించి ఊరుకుంటుందనేది ఉత్తిమాట! అందునా ప్రధాని ఇప్పటికే ఉగ్రవాదులు ఊహించని రీతిలో శిక్షిస్తామని ప్రకటించారు కూడా! శిశుపాలుడి నూరు తప్పులను శ్రీకృష్ణుడు సహించాడు. తప్పిదాలను సరిచేసుకు నేందుకు రావణాసురుడికి, శ్రీరామచంద్రుడు అనేక అవకాశాలు ఇచ్చి చివరకు సంహరించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే
జమలాపురపు విఠల్‌రావు
సీనియర్ జర్నలిస్ట్