సంపాదకీయం
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు వైశాఖ శుద్ధ అష్టమి, – 5 మే 2025, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
జమ్ముకశ్మీర్ చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా ఏప్రిల్ 22 చీకటిదినమే. ఆ రోజే 26 మంది అమాయక పర్యాటకులను పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు లోయలోని పెహల్గావ్‌లో కాల్చి చంపారు. పెహల్గావ్ కాల్పులు అక్షరాలా, అచ్చంగా పట్టపగలు భారత సార్వభౌమాధికారం మీద దాడి. మానవత్వం మీద దాడి. ముస్లిం మతోన్మాదులు భారతీయుల మీద ఇలా దాడులకు తెగబడడం ఎన్నోసారి? ముంబై పేలుళ్లు, గోకుల్ చాట్ పేలుళ్లు ఎన్నని! ప్రపంచమంతా ఇస్లాం మాత్రమే ఉండాలన్న పిచ్చి భ్రమ, కశ్మీర్ విముక్తి సాకును చూపి ఎన్ని పర్యాయాలు ఇలా రక్తపాతానికి ఒడిగట్టారు? ఆ నెత్తుటి కథనాలు ఇక వినలేమన్నట్టే ఉంది నేటి భారత పరిస్థితి. అందుకే యుద్ధం గురించి లెక్కకు మించి పౌరులు గళం విప్పుతున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌తోను బుద్ధిరాని పాకిస్తాన్‌కు పూర్తిస్థాయి యుద్ధమే, తిరిగి తలెత్తకుండా చావగొట్టడమే సరైందన్న వాదన బలపడుతోంది. 1948 నుంచి, 1999 కార్గిల్ యుద్ధం వరకు పాకిస్తాన్‌ది అదే ధోరణి. హిందువుల రక్తంతో ఆడుకోవడమే. తాజా దాడి ఆ వైఖరికి పరాకాష్ట. మతం అడిగి మరీ చంపారు. భారతీయ సమాజం ఇంకా సహనంతో ఉండాలని, ఉంటుందని అనుకోవడం ఇక సాధ్యం కాదు.
ఇజ్రాయెల్ మీద హమాస్ ఉన్మాదులు చేసిన దాడి వంటిదే పెహల్గావ్ దురంతమన్న అభిప్రాయం ఇప్పుడు రాజ్యమేలుతున్నది. హమాస్ రక్తపిపాసులు దాడికి దిగిన కొన్ని గంటలలోనే ఇజ్రాయెల్ అతి బీభత్సమైన తీరులో ప్రతిఘటనకు దిగింది. అలాంటిదే భారత్ కూడా జరిపి ఉండాల్సిందన్నదే చాలామంది కోరిక. పుల్వామా దాడి తరువాత ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిగాయి. అవి తలకెక్కలేదని పాకిస్తాన్ తనకు తాను వెల్లడిస్తున్న పరిణామాలే ఏప్రిల్ 22 తరువాత జరిగాయి. ‘మా ప్రతిచర్య ప్రపంచం ఊహించనంత తీవ్రంగా ఉంటుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దోషం తమవైపే ఉందని ప్రపంచమంతా నిర్ధారణకు వచ్చిన తరువాత కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలనే ఆశ్రయిస్తున్నది. మోదీ చేత అలాంటివే ఇంకొన్ని ప్రకటనలు చేయించాలన్న దురద పొరుగు పాలకులలో కనిపించింది. రాముడు యుద్ధానికి రాక తప్పని పరిస్థితులు రావణుడే కల్పించుకున్నాడు. రాముడి చేతిలో చిత్తయినాడు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాంటిదేనని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత డాక్టర్ మోహన్ భాగవత్ సరిగానే వ్యాఖ్యానించారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగానే సిమ్లా ఒప్పందాన్ని కాలరాస్తున్నట్టు పాక్ ప్రకటించడం యుద్ధానికి మార్గాన్ని మరింత సుగమం చేయడమే. దాని ఫలితం ఐదురోజులు వరసగా (ఏప్రిల్ 29న ఈ సంపాదకీయం రాసే వరకు) అధీనరేఖ వద్ద పాక్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అంటే సిమ్లా ఒప్పందాన్ని ఉల్లం ఘించాం, ఇదిగో చూడండి అన్నారు. ఆ చర్య యుద్ధాన్ని ఆరంభించడమే. కార్గిల్ యుద్ధంలో పాక్ ఓటమి తరువాత 2003లో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ మేరకు 2006 వరకు ఒక్క తూటా కూడా పేలలేదు. ఆ తరువాత ఎన్నిసార్లు సిమ్లా ఒప్పందాన్ని ఆ దేశం ఉల్లంఘించిందో లెక్కలేదు.
పెహల్గావ్ ఘటన అనంతర పరిణామాలలో 29న కేంద్ర హోంశాఖ జరిపిన కీలక సమావేశం ఒకటి. బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎన్‌ఎస్‌జీ అధిపతులు కూడా పాల్గొన్నారు. యుద్ధం దిశగా వేసిన అడుగులు కూడా ఎక్కువే. 16 పాకిస్తాన్ యూట్యూబ్ చానళ్లకు మన దేశంలో 63 మిలియన్‌ల వీక్షకులు ఉన్నారట. ఇది విస్తుగొలిపే విషయమే. ఇవన్నీ నిలిపివేశారు. పెహల్గావ్ దాడి మీద జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఇది రాజ్యాంగ విలువల మీద దాడి అంటూ తీర్మానం కూడా చేసింది. ఇది ముమ్మాటికీ మొసలి కన్నీరు. నేషనల్ కాన్ఫరెన్స్ వైఖరి ఏనాడూ విశ్వసించదగినదిగా లేదు. కాబట్టే ఈ తీర్మానానికి ఎవరూ విలువ ఇవ్వలేదు. పెహల్గావ్ దాడి తమ రాష్ట్రహోదా డిమాండ్‌కు అడ్డం పడిందన్న బాధే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను వేధిస్తున్నట్టు కనిపిస్తున్నది. అంతర్జాతీయంగా భారత్‌కు మద్దతు పెరుగుతూనే ఉంది. తమ దేశం ఉగ్రమూకలకు మూడు దశాబ్దాలుగా పోషకురాలుగా ఉందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ స్కైన్యూస్ విలేకరి ముందు నిస్సంకోచంగా ప్రకటించడం ఆ దేశానికిక ఎలాగూ ముప్పే. సాక్షాత్తు రక్షణమంత్రి అలా ప్రకటిస్తే భారత్ మౌనంగా ఉండిపోవడమూ సాధ్యం కాదు. అందుకే ఏప్రిల్ 28న ఐక్యరాజ్య సమితిలో భారత్ తరఫు శాశ్వత సభ్యురాలు యోజనా పటేల్ పొరుగుదేశం తెంపరితనాన్ని ఇంకాస్త గట్టిగా చాటగలిగారు.
కానీ దేశంలో విపక్షాల వైఖరి ఆత్మహత్యా సదృశంగా ఉన్నది. పుల్వామాను లోక్‌సభలో విజయానికి ఉపయోగించుకున్నారు అంటూనే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇప్పుడున్న పరిస్థితిని తనకు ఉపయోగపడుతుందేమోనని దింపుడు కళ్లం ఆశతో చూస్తున్నది. మోదీ తలలేని ఒక బొమ్మను సామాజిక మాద్యమాలలో పెట్టి ప్రధాని మోదీ ఎక్కడ? అంటూ వ్యాఖ్య రాసింది. బీజేపీ మండిపడింది. అందుకు కర్ణాటక మంత్రి దినేశ్ గుండూరావ్ ఇచ్చిన వివరణ మరీ వికారంగా ఉంది. ప్రధాని విలేకరుల సమావేశంలో మాట్లాడతారా? ఏదైనా వివరణ ఇస్తారా? ఏం జరుగుతున్నదో (పెహల్గావ్ పరిణామాలు) ప్రజలు ఆయనను అడిగే అవకాశం ఉందా? పుల్వామా ఆయనకు లోక్‌సభ ఎన్నికలలో ఉపయోగపడింది. గోధ్రా గుజరాత్ ఎన్నికలకు ఉపయోగించింది. ఇప్పుడు బిహార్ ఎన్నికలలో లాభపడేందుకు ఆయన ఆలోచిస్తున్నారు. మీరు దేశం గురించి కూడా ఆలోచించాలి.’ అన్న వారి అమూల్యాభిప్రాయం తెలియచేయడానికే ఈ పద్ధతిని అనుసరించారట. పైన చెప్పుకున్న పాకిస్తాన్ వాదనలతో పాటు, కాంగ్రెస్ ప్రకటనలు, ఖలిస్తాన్ తీవ్రవాదుల వాచాలత చాలా దగ్గర పోలికలతో ఉన్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్‌పన్ను ఇంకా రెచ్చిపోయాడు. భారత్‌లోని రెండుకోట్ల మంది సిక్కులు పాకిస్తాన్‌కు ‘ఇటుకల గోడ’ మాదిరిగా రక్షణకు నిలబడతారట. పాకిస్తాన్ మీదకు యుద్ధానికి పంజాబ్ గుండా భారత సైన్యం వెళ్లలేదని కూడా చెప్పాడు. యుద్ధం కోరుకోవద్దు. అవసరమైతే ఆగొద్దు. మోదీ వెనుక జాతి నిలబడి ఉంది. పాకిస్తాన్ పీచమణచడం ఎంత ముఖ్యమో, దాని భక్తుల మెడలు వంచడమూ అంతే అవసరం.