తెలంగాణ రాజకీయాల్లో టామ్‌ అం‌డ్‌ ‌జెర్రీ మాదిరి వ్యవహారం నడుస్తోందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ప్రజోపయోగకరమైన చర్చలు, వాదనలకు బదులు.. అనవసరమైన ఆరోపణలు, ప్రత్యారోపణలే కనిపిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఇక, ప్రభుత్వ పాలన కూడా నిరాశా నిస్పృహలతో సాగిపోతోందన్న విశ్లేషణలు ఉన్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి సహా మంత్రులు లేవనెత్తుతోన్న సందేహాలు, బహిరంగ సభల్లో అధికారుల పనితీరుపై చేస్తున్న వ్యాఖ్యలు, సమీక్షల్లో వెల్లడిస్తోన్న అభిప్రాయాలు వీటిని బలపరుస్తున్నాయి. ఓవైపు అధికార కాంగ్రెస్‌ ‌పార్టీ… మరోవైపు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌నేతల తీరు, వ్యవహార శైలి.. ఆరోపణలు, ప్రత్యారోపణలు తెలంగాణ ప్రజలకు ఓ రకమైన వినోదంలా మారాయన్న వ్యంగ్యోక్తులు కూడా సాగుతున్నాయి.

తెలంగాణలో తాజా పరిణామాలు చూస్తే.. బీఆర్‌ఎస్‌ ‌పార్టీ (పూర్వనామం టీఆర్‌ఎస్‌) ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వరంగల్‌ ‌జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఆ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఫామ్‌ ‌హౌజ్‌కు మాత్రమే పరిమితమైన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేకర రావు ఎట్టకేలకు ఈ సభలో ప్రసంగించారు. తాము ఏం చేయబోతున్న దీర నిర్మాణాత్మకంగా ఎలా ముందుకు సాగుతారో  చెప్పకుండా అధికార కాంగ్రెస్‌ ‌పార్టీపై అంతెత్తున విరుచుకుపడ్డారు. ఆ విమర్శలు కూడా ఏదో చేయాలి కాబట్టి అన్నట్లు మొక్కుబడిగా ఉన్నాయే తప్పితే.. ఆయన ప్రసంగం గతంలో మాదిరిగా ధాటిగాకాని, ప్రభుత్వాన్ని నిలదీసిన స్వరం కానీ ఎవరికీ అనిపించ లేదు. అంతా చప్పగా సాగింది. మంత్రులు ఏదో జరిగిపోయిందన్నట్లుగా వెంటనే ప్రతి స్పందించారు. మొక్కుబడిగా కాకుండా అప్పటికప్పుడు ము్య•మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ఇంటికి వచ్చి మరీ మీడియాతో మాట్లాడారు. ఆ మరునాడే రేవంత్‌ ‌రెడ్డి కూడా కౌంటర్‌ ఇచ్చారు. అసలు ఏ అంశం మీద ప్రతిస్పందిచాలో, కూడదో అర్థం కాని పరిస్థితుల్లో మాట్లాడారు. తానేం చేశానో, తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకొచ్చారు. కానీ కేసీఆర్‌ ‌ప్రసంగంలో,అదే సమయంలో మంత్రుల ప్రతిస్పందన అంత ప్రభావితంగాలేదు.

ఆ జోష్‌ ఏమైపాయె?

భారత రాష్ట్ర సమితిగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి వరంగల్‌ ‌శివారులో సభ నిర్వహిం చింది. దాదాపు రెండు నెలల పాటు కసరత్తు చేసి మరీ సభ నిర్వహించారు. ప్రజలంతా కేసీఆర్‌ ‌కోసం ఎదురు చూస్తున్నారన్న ఆలోచన కలిగించాలనుకు న్నారు. దానికి తగ్గట్లుగా ఖర్చుకు వెనుకాడకుండా సభ ఏర్పాట్లు చేశారు. కానీ, ఫలితం ఎంత అనేది మాత్రం అందరినీ పెదవి విరిచేలా చేసింది. బీఆర్‌ఎస్‌ ‌శ్రేణుల్లో .. మరో సభకు వెళ్లాం.. వచ్చాం అన్న ఫీలింగ్‌తోనే తేలిపోయింది. బహిరంగసభ నిర్వహణకు ఉండాల్సిన.. ప్రధానంగా గత టీఆర్‌ఎస్‌ ‌పార్టీ సభకు, కేసీఆర్‌ ‌పాల్గొన్న సభకు ఉండాల్సిన భావోద్వేగం ఈ సారి కనిపించలేదు. బలవంతంగా చేసినట్లుగా అనిపించడంతోనే సభ అంతా కృత్రిమంగా కనిపించిన ఫీలింగ్‌ ‌వచ్చిందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.

వాస్తవానికి బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి బహిరంగ సభల్ని నిర్వహించడంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వాళ్లు నిర్వహించే సభకు జనం రావడం మొదటినుంచీ పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీ పెట్టిన తర్వాత తెలంగాణ ఉద్యమం సెంటిమెంట్‌ ‌జనాన్ని సభలకు లాక్కొచ్చేది. ఆ సెంటిమెంట్‌కు తోడు.. కేసీఆర్‌ ‌మైమరిపించే ప్రసంగం కూడా తెలంగాణ వాసులకు బాగా నచ్చేది. దీంతో, జనం తండో పతండాలుగా వచ్చేవారు. ఇక, తె•లంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత అప్పటి టీఆర్‌ఎస్‌కు అధికార పార్టీ హోదా కూడా పచ్చింది. ఇక జనం లోటు లేకుండా పోయింది. అలా సాగిపోయిన బహిరంగసభలు.. ఇప్పుడు చప్పగా సాగే స్థాయికి చేరుకున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని స్థాయుల్లోని నేతలకు టార్గెట్‌ ‌పెట్టారు. అయితే, గతంలో పండిన సెంటిమెంట్‌ ఇప్పుడు అంతగా కనిపించలేదన్నది అందరూ చెబుతున్నమాట.

కుటుంబంలో ఆధిపత్య పోరు?

ఇక, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుంచి ఆ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం తగ్గిపోయింది. క్యాడర్‌లో జోష్‌ ‌తగ్గిపోయిందనేకంటే అధినేతల తీరుతోనే వాళ్లలోనూ నిరాశ అలుముకుంది. అధికారంలో ఉన్నన్నాళ్లురాష్ట్రం తమ జాగీర్‌ అన్నట్లుగా.. ప్రగతి భవన్‌ ‌పాలన సాగించిన కేసీఆర్‌.. ఓటమి పాలైన తరువాత ఒకరకంగా అదృశ్యమైపోయారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఒక్కసారి మాత్రమే ప్రజాక్షేత్రంలో కనిపించి, ఆ తర్వాత ఫామ్‌హౌజ్‌కే పరిమిత మయ్యారు. ఏం జరిగినా, ఏమైనా బయటకు రాలేదు. పార్టీ ముఖ్య నేతల్లో కూడా కొన్నాళ్ల పాటు స్తబ్దత అలుముకుంది. అంతేకాదు.. కేసీఆర్‌ ఇం‌ట్లోనే కేటీఆర్‌, ‌హరీష్‌ , ‌కవితల మధ్య జరుగుతున్న అంతర్గత రాజకీయాలు, ఎవరి వర్గం వారి పోరాటం చూసి క్యాడర్‌ ఎవరి వైపు ఉండాలో తేల్చుకోలేకపోయింది. ఈ పరిస్థితుల్లో ఇక నడిపించే వాళ్లు, కేడర్‌కు దిశా నిర్దేశం ఇచ్చే వాళ్లు కరువై పోయి.. ఓ దశలో బీఆర్‌ఎస్‌ ‌శ్రేణులు పక్కచూపులు చూసే పరిస్థితి వచ్చింది.

ప్రసంగంలో ఏముంది?

ఇప్పుడు రజతోత్సవ సభ అంటూ ఒక వేదికను తయారు చేసుకున్న కేసీఆర్‌.. ‌ఫామ్‌హౌజ్‌ ‌నుంచి బయటకు రావడానికి దానినో మార్గంగా ఎంచుకున్నారు. కానీ, టార్గెట్‌ ‌రీచ్‌ ‌కాలేకపోయారన్న వాదనలున్నాయి. ఎల్కతుర్తి సభ బలవంతంగా నిర్వహించినట్లు ఉంది తప్పితే.. బీఆర్‌ఎస్‌ ‌స్పిరిట్‌, ‌తెలంగాణ సెంటిమెంట్‌ ఏమాత్రం కనిపించలేదు.

ఇక, ఆ సభ ఉద్దేశ్యం ఏంటో, లక్ష్యం ఏంటో అర్థం కాని విధంగా కేసీఆర్‌ ‌ప్రసంగం సాగింది. ఆత్మస్తుతి, పరనింద అన్నట్లుగానే ఆసాంతం ఆయన ప్రసంగం సాగింది. కేసీఆర్‌ ‌ప్రసంగం అంటే చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. ఆయన భాష, సెటైర్లు, విమర్శలు ఆసక్తికరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. ఆయన చెప్పే సామెతలు , ప్రాసలు, పిట్టకథలు, పంచులు ఎదుట ఉన్న వారికి ఉత్సాహం తెప్పిస్తాయి. చప్పట్లు కొట్టేలా చేస్తాయి. దీంతో, పార్టీ కేడర్‌ ‌మాత్రమే కాదు.. తటస్థులు కూడా కేసీఆర్‌ ‌ప్రసంగం వినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఈ సారి కూడా కేసీఆర్‌ ఆ ‌దిశగా ప్రసంగాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గానీ.. అసలు లక్ష్యం అందులో కనిపించలేదు. భవిష్యత్‌ ‌కార్యాచరణ ఏంటో, ప్రభుత్వ పొరపాట్లను ఎలా పాయింట్‌అవుట్‌ ‌చేయాలో అన్న దిశగా కార్యకర్తలకు మార్గదర్శనం చేయలేకపోయారు. అంతేకాదు.. గతంలో కంటే భిన్నంగా ఈ ప్రసంగం సాగింది. వ్యక్తి టార్గెట్‌గా చేసే ప్రసంగం పార్టీవైపు మళ్లింది. ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ ‌టార్గెట్‌ ‌తెలంగాణ సీఎం రేవంత్‌ ‌రెడ్డి. కానీ, కేసీఆర్‌ ‌ప్రసంగంలో రేవంత్‌ ‌ప్రస్తావన ఒక్కసారి కూడా రాలేదు. కేవలం కాంగ్రెస్‌ ‌పార్టీని విమర్శిస్తూనే ప్రసంగించారు. తెలంగాణకు కాంగ్రెస్‌ ‌పార్టీయే ప్రథమ శత్రువుగా అభివర్ణించారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అన్నింట్లోనూ ఫెయిలైందని తనదైన సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఇక, అసెంబ్లీకి హాజరు కాకపోవడంపైనా ఆయన చెప్పిన కారణం, చేసిన పోలిక అందరికీ నవ్వు తెప్పించింది.

వేలెత్తి చూపిన కుటుంబ వివాదం?

ఇక, బీఆర్‌ఎస్‌ ‌సభలో వేదికపై చోటు చేసుకున్న ఓ పరిణామం ఆ పార్టీలో నెలకొన్న కుటుంబ వివాదాన్ని వేలెత్తి చూపించింది. కేసీఆర్‌ ‌కుటుంబ సభ్యుల ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నిలిచింది. కవిత సభలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఆమెకు స్వాగతం చెబుతూ ఓ పాట పాడేందుకు ఒక గాయకుడిని వేదిక మీదికి పంపించారని చెబుతున్నారు. కానీ, అప్పటికే తన ధూమ్‌ ‌ధామ్‌ ‌టీమ్‌తో సభా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోన్న రసమయి బాలకిషన్‌.. ఆ ‌గాయకుడిని బౌన్సర్లతో స్టేజీ మీద నుంచి బలవంతంగా కిందకు దింపేసిన దృశ్యాలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వెంటనే కేసీఆర్‌ను పొగుడుతూ వ్యాఖ్యానించారు. అంటే.. కేసీఆర్‌ ‌కుటుంబంలో నెలకొన్న ఆధిపత్య పోరు ఇలా బయటపడిందన్న చర్చ నడిచింది.

మంత్రుల హోం వర్క్

ఇక, కేసీఆర్‌ ‌సభ అంటేనే తమకు ఏదో అయిపోతోందని భావించిన ప్రభుత్వంలోని మంత్రులు ముందుగానే మీడియా సమావేశం ప్లాన్‌ ‌చేసుకున్నారు. కేసీఆర్‌ ‌సభ మొదలు కాకముందే తామేం మాట్లాడాలో, ఎలా కేసీఆర్‌ ‌ప్రసంగాన్ని తిప్పికొట్టాలో అనే హోం వర్క్ ‌చేసినట్లు అనిపించింది. ఇక, అక్కడ ఎల్కతుర్తిలో కేసీఆర్‌ ‌ప్రసంగం పూర్తి కాగానే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ ‌తదితరులు తమదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. జూబ్లీహిల్స్ ‌లోని సీఎం రేవంత్‌ ఇం‌టికి వెళ్లి మరీ అక్కడినుంచి కేసీఆర్‌పై సహజ రీతిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణకు నెంబర్‌ ‌వన్‌ ‌విలన్‌ ఎలా అవుతుందో? అన్న వ్యాఖ్యకు గట్టి కౌంటర్‌ ఇవ్వలేకపోయారు. అలాగే, అసెంబ్లీకి కేసీఆర్‌ ‌రాకపోవడంపైనా ప్రజలను ఆకట్టుకునే రియాక్షన్‌ ‌మంత్రుల నుంచి కనిపించలేదు.

రేవంత్‌ ‌రియాక్షన్‌

‌మంత్రుల విమర్శలదాడి పేలవంగా ఉందను కుంటే.. మరుసటి రోజు రేవంత్‌ ‌రెడ్డి కూడా కేసీఆర్‌ ‌ప్రసంగంపై స్పందించారు. అది ఆశించిన స్థాయిలో స్పందించవలసిన స్థాయి కనిపించలేదు. కేసీఆర్‌ ‌ప్రసంగంలో అసలు పసలేదని, తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులవల్ల ఉన్న కడుపుమంటే కనిపిస్తోందంటూ మండి పడ్డారు. కేసీఆర్‌ ‌ప్రసంగం అక్కసు కూడినది ఖమ్మంలో తాము రాహుల్‌ ‌గాంధీ సభ పెట్టినప్పుడు వాళ్లు.. కనీసం బస్సులు కూడా ఇవ్వలేదని, కానీ.. తాము మాత్రం అడిగినన్ని బస్సులు ఇచ్చామని వివరణ ఇచ్చారు. అంతేకాదు.. తనకు, రాహుల్‌గాంధీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ప్రతిపక్ష ఆరోపణలను నమ్మాల్సిన పని లేదని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కేసీఆర్‌కు ఇవ్వాల్సిన స్థాయిలో రేవంత్‌ ‌రెడ్డి కౌంటర్‌ ఇవ్వలేక పోయారు. ఫలితంగా తెలంగాణలో నిర్మాణాత్మక రాజకీయాల కంటే.. దుందుడుకు రాజకీయాలు మాత్రమే సాగుతున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.

సుజాత గోపగోని

6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE