సి.శంకరన్ నాయర్! భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా పని చేసిన ఏకైక మలయాళీ (ఇటీవలనే ఈ శీర్షికలో మా పాఠకులు ఆయన గురించి చదివి ఉంటారు). శంకరన్ 91వ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ 24న ఘన నివాళి సమర్పించారు. మంకారా పాలక్కాడ్ అనే చోట ఉన్న శంకరన్ స్మృతి మండపంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పీకే కృష్ణదాస్ నాయకత్వంలో కార్యకర్తలు ఆ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తరువాత వెల్లా రోడ్ కూడలిలో బహిరంగ సభ కూడా నిర్వహించారు. అలాగే పాలక్కాడ్ జిల్లా కాంగ్రెస్ శాఖ కూడా శంకరన్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. బీజేపీ ఉదయం 7.30కి పుష్పాంజలి ఘటిస్తే, కాంగ్రెస్ 8.30కి సమర్పించింది. బీజేపీ వారి బహిరంగ సభ 8.30కి జరిగితే, కాంగ్రెస్ వారి సభ 9.30కి జరిగింది. కాంగ్రెస్ సభలో ఎంపీ వీకే శ్రీధరన్ పాల్గొన్నారు. చరిత్రలో నిలిచిపోయిన జాతీయవాదులను గుర్తు చేసుకోవడం కోసం, వారు పాటించిన విలువలను స్మరించుకోవడానికి తాము ఈ కార్యక్రమం నిర్వహించినట్టు బీజేపీ నాయకులు చెప్పారు. నిజానికి మొదట శంకరన్ నాయర్ గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల హరియాణాలో జరిగిన ఒక సభలో గుర్తు చేయడంతో ఒక్కసారిగా జనం ఆయన చరిత్ర వైపు దృష్టి సారించారు. జలియన్‌వాలా బాగ్ దురంతానికి నిరసనగా వైస్రాయ్ కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసిన ధైర్యశాలి శంకరన్. వెంటనే కేంద్రమంత్రి, కేరళ ప్రముఖ బీజేపీ నేత సురేశ్ గోపి స్మృతి మంటపాన్ని సందర్శించారు. ఆయన వారసులతో మాట్టాడారు. బీజేపీకి స్వాతంత్య్ర సమరయోధులు ఎవరూ లేరు కాబట్టి శంకరన్‌ను తమ వారిని చేసుకుంటున్నదని కాంగ్రెస్ ప్రముఖుడు కె. మురళీధరన్ వ్యాఖ్యానించడం కాస్త నవ్వు పుట్టిస్తుంది. మోదీ గుర్తు చేస్తే తప్ప శంకరన్ నాయర్ గుర్తుకు రాలేదు వీళ్లకి. బీజేపీ జాతీయవాదులు ఎవరైనా గౌరవిస్తుంది. జాతీయవాదులంటే కాంగ్రెస్‌కు నచ్చదు. అందుకు తాజాగా మురళీధరన్ చేసిన వ్యాఖ్య నిదర్శనం. కొన్ని చీకటికోణాలు కూడా చూడాలి.కాంగ్రెస్ అధ్యక్ష పదవి తరువాత శంకరన్ బ్రిటిష్ వారితో రాజీ పడ్డారని అనిపిస్తుంది అన్నారు. గాంధీజీని వ్యతిరేకించినంత మాత్రాన శంకరన్ నాయర్‌ను బీజేపీ వారు తమ వాడిగా ఆయనను చెప్పుకోలేరని కూడా మురళీధరన్ గట్టిగా చాటే విఫలయత్నం చేశారు.