అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
శాలివాహన 1947 శ్రీ విశ్వావసు వైశాఖ పూర్ణిమ
ఏప్రిల్ 22 నాటి పెహల్గావ్ నెత్తుటికాండ భారత్-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఈ దేశం పట్ల, దేశ భద్రత పట్ల ప్రతి పౌరునికి బాధ్యత ఉంటుందని మనసా వాచా నమ్ముతున్న భారతీయులంతా యుద్ధంతో తప్ప పాకిస్తాన్ ఇక దారికి రాదనే విశ్వసిస్తున్నారు. కేంద్రం, అందునా నరేంద్ర మోదీ వంటి ప్రధాని నాయకత్వంలోని ప్రభుత్వం ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నట్టు అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఈ ఆవేశాన్నీ, ఈ ఆకాంక్షనూ అర్థం చేసుకోవలసిందే. ఏమైనా పాకిస్తాన్‌కు తిరుగులేని రీతిలో బుద్ధి చెప్పాలన్నదే ఇవాళ భారతజాతి ఉగ్ర కామన. జాతి అభిమతం మేరకే తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరచిపోవద్దు అని తాజాగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రకటించారు. 1971 తరువాత దేశంలో మాక్ డ్రిల్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ యుద్ధ సన్నాహాలే.
పొరుగు దేశానికి కనువిప్పు గావించడం, కోలుకోలేని దెబ్బ కొట్టడం ఎంత అనివార్యమో, మన దేశంలో అక్రమంగా చొరబడి దశాబ్దాలుగా తిష్టవేసిన అక్రమ వలసదారులను బయటకు పంపడం కూడా అంతే అవసరం. ప్రతి రాష్ట్రంలోను అక్రమ వలసదారుల చిట్టాలు బయటపడుతున్నాయి. కలుగులలో నుంచి బయటకు వస్తున్న ఎలక పరివారం మాదిరిగానే వీళ్లు బయటపడుతున్నారు. దశాబ్దాల తరబడి తిష్ట వేసిన వాళ్లు కూడా ఇందులో ఉన్నారు. వీళ్లకి పౌరసత్వం లేదు. కానీ ఆధార్ కార్డులు ఉన్నాయి. ఓటర్ ఐడీలు ఉన్నాయి. రేషన్ కార్డులు మప్పితంగా అన్నీ అంది స్తున్నాయి. ఇదొక వర్గం. చొరబాటుదారుల విషయంలో దేశం కశ్మీర్‌ను మరిపిస్తున్నది.
మేం భారతీయులను పెళ్లి చేసుకున్నాం, వాళ్లతో ఇక్కడ పిల్లల్ని కన్నాం కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వాల్సిందే అంటున్నారు ఇంకొందరు. వీళ్లలో ఎవరికీ పౌరసత్వం లేదు. కానీ పిల్లల్ని కన్నారు. వాళ్లకి పెళ్లిళ్లు ఇక్కడే చేశారు. వాళ్లు కూడా పిల్లల్ని కన్నారు. ఇక్కడే ఉండిపోయారు. దేశం ధర్మసత్రం మాదిరిగా తయార యింది. ఇదేమిటి? ఏ దేశంలో అయినా ఇలా ఉంటుందా? పాకిస్తానీ అమ్మాయిలు ఇక్కడి యువకులను పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇప్పుడు తమను తిరిగి వెళ్లిపొమ్మనడంలో న్యాయం ఏమిటని నేరుగా కోర్టులనే ప్రశ్నిస్తున్నారు. కోర్టులు వీరి వాదనలను వినడానికి సిద్ధపడుతున్నాయి కూడా. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ ఒకరు పాకిస్తాన్ వనితను పెళ్లి చేసుకుని చిరకాలంగా సంపారం చేస్తున్న వైనం బయటపడింది. ఇప్పుడు ఆమెను ఎలా పంపిస్తానని ఆయన ప్రశ్న. తమ సంతానం ఇక్కడ ఉండగా, ఈ దేశ పౌరసత్వం ఉండగా వారికి రక్తం పంచిన తమను వెళ్లమనడం ఏం సబబు అంటూ సెంటిమెంట్ చిత్రంలో వలె కన్నీరు మున్నీరు అవుతున్న వాళ్లు కూడా తక్కువేమీ కాదు. ఇలాంటి వాళ్లు తిరిగి స్వదేశం రాకుండా పాకిస్తాన్ తన సరిహద్దులు మూసేసి తన తుంటరి వైఖరిని అమానవీయ వైఖరిని మళ్లీ మళ్లీ రుజువు చేసుకుంటూనే ఉంది. ఈ పాకిస్తాన్ లేదా బాంగ్లా వాసులను పంపడం హక్కులకు భంగం కాదా అని అని ప్రశ్నించే భారత వ్యతిరేకులకు పాక్ దుశ్చర్య ఎందుకు కనపడడం లేదు? ఇప్పుడు భారత్ నుంచి వీళ్లని తిప్పి పంపడం ఒక సవాలుగా మారిందంటే అతిశయోక్తి కాదు.
గుజరాత్‌లో 500, పశ్చిమ బెంగాల్‌లో 100, ఢిల్లీలో 47 మంది, తమిళ నాడులో ఎనిమిది మంది బాంగ్లా చొరబాటుదారులను అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధప్రదేశ్ అక్కడా ఇక్కడా అనేమీ లేదు. దేశం ప్రతి మూలలోను వీళ్ల చీడ ఉంది. ఈ లెక్కలకు, దాదాపు 20 సంవత్సరాల క్రితం సాక్షాత్తు పార్లమెంటులో వెల్లడించిన లెక్కలకు హస్తి మశకాంతరం ఉంది. జూలై 14, 2004న నాటి యూపీఏ ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ పార్లమెంటులో చేసిన ప్రకటన ఇది. 12 మిలియన్‌ల అక్రమ బాంగ్లాదేశ్ చొరబాటుదారులు భారతదేశంలో నివాసం ఉంటున్నారు. ఇందులో ఒక్క పశ్చిమ బెంగాల్‌లోనే 5.7 మిలియన్‌లు ఉన్నారు’. 12 మిలియన్‌లు అంటే కోటీఇరవై లక్షలని మనవి. మరి, ఇలా వేయి, ఐదొందలు, వంద, పదీ, ఎనిమిదీ మంది బాంగ్లా అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నట్టు వార్తలు రావడం ఏమిటి? ఇంతకీ పాకిస్తాన్ చొరబాటు దారులు ఎందరు? వాఘా సరిహద్దుల నుంచి ఇంతవరకు వేయిమంది పాకిస్తాన్ వెళ్లినట్టు ఒక లెక్క ఉంది. మన దేశంలో తిష్ట వేసిన పాకిస్తానీలు ఈ కొద్దిమందేనా? ఆ సంఖ్య ఇంతే అంటే నమ్మగలమా? జమ్ముకశ్మీర్ మాటేమిటి? స్థానికులే అక్కడ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నారు. ఇంటి దొంగలు తెచ్చిన రక్తపిపాసులతో సరిహద్దు అంతా నిండిపోయింది. ఇటు పాకిస్తానీలు, అటు బాంగ్లా చొరబాటుదారులు ఈ దేశంలో ఎంతమంది పాతుకుపోయారో ఇప్పుడు కనుగొనడం నిజంగా సాధ్యమా? ఇందులో ‘స్లీపర్ సెల్స్’ ఎందరు? ఈ నిజాలు సగటు భారతీయుడిని దారుణంగా కలవరపరుస్తు న్నాయి. ఈ కలవరానికి ఇస్లామోఫోబియా అని ఎవరు పేరు పెట్టినా వాళ్లని క్షమించనవసరం లేదు. మొత్తంగా వీళ్లంతా శాంతంగా, కాందిశీకుల మాదిరిగా జీవించడానికి వచ్చినవారు కాదు. భారత్ మీద, హిందువుల మీద దారుణమైన కుట్రను అమలు చేయడానికే వచ్చినవారే.
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపవలసిన తరుణమే ఇది. ఇప్పటికి గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే కఠినంగా వ్యవహరిస్తు న్నాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా అదే బాటలో ప్రయాణించడం అనివార్యం. కోర్టులు కూడా వీరి పట్ల దయచూపడం ఎంతవరకు సబబు? అన్నది ఇప్పుడు దేశంలో వినిపిస్తున్న ప్రశ్న. ఇందుకు బాధ్యత నిఘా వర్గాల మీదకు తోసేస్తే సరిపోదు. కొన్ని ప్రభుత్వాలు చొరబాట్లను ప్రోత్సహిస్తు న్నాయి. పాకి స్తాన్‌తో యుద్ధం అనివార్యంగానే కనిపిస్తున్నది. అంతకంటే ముందు దేశంలో పొంచి ఉన్న, నక్కి ఉన్న శత్రువులను ఏరివేయడం శరవేగంగా జరగవలసిందే.