బంగారాన్ని దొంగ రవాణా చేయడంలో దేశంలో కేరళ తర్వాతే ఏ రాష్ట్రమైనా. కాంగ్రెస్ నాయకత్వంలోని యు.డి.ఎఫ్ ప్రభుత్వ హయాంలో కూడా బంగారం రవాణాలో చాలా తక్కువ స్థాయిలో ఉన్న కేరళ, వామపక్షాల నాయకత్వంలోని ఎల్.డి.ఎఫ్ ప్రభుత్వ హయాంలో అగ్ర స్థానానికి చేరుకున్నట్టు ఆ రాష్ట్రంలో ఎవరినడిగినా చెబుతారు. బంగారం రవాణా కేసుల్లో ప్రస్తుతం కేరళ అగ్రస్థానంలో ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక నివేదికలో తెలియజేసింది. ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకుండా విమానాశ్రయాల ద్వారా, నౌకాశ్రయాల ద్వారా రాష్ట్రంలోకి బంగారాన్ని రవాణా చేయడం అన్నది కేరళలోని మంత్రులు, అధికారులకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కేరళ మరో అడుగు ముందుకు వేసి, దౌత్యపరమైన సరుకు రవాణా (కార్గో) ద్వారా రాష్ట్రంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడంతో దాని గుట్టు పూర్తిగా రట్టయింది.
రెవెన్యూ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం గత నాలుగేళ్లలో కేరళలో 3,173 బంగారం అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. అక్రమ రవాణాదార్ల నుంచి 2,300 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేరళ తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ బంగారం అక్రమ రవాణా దార్లంతా కేరళనే తమ వ్యాపార కేంద్రంగా ఎంచుకుం టుంటారు. దేశం మొత్తం మీద కేరళకే ఈ రకమైన డిమాండ్ ఎక్కువగా ఉంది. తిరువనంతపురం, కొచ్చి, కోళికోడ్ విమానాశ్రయాల ద్వారానే ఎక్కువగా బంగారం స్మగ్లింగ్ జరుగుతుంటుంది. నిజానికి, అక్కడి విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో ఇందుకు సంబంధించిన అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఈ అక్రమ రవాణాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరుగుతోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఈ అక్రమ రవాణాతో ‘సన్నిహిత’ సంబంధాలున్నందువల్ల ఎక్కువ పర్యాయాలు ఈ అక్రమ రవాణాలు విజయ వంతంగానే పూర్తవుతున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి బంగారం ఎక్కువగా అక్రమ రవాణా అవుతుంటుందని అధికారుల ద్వారా తెలిసింది.
దిగ్భ్రాంతికర విషయాలు
ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అధికారుల దృష్టికి ఈ అక్రమ రవాణా వ్యవహారం వచ్చి, వారు కేరళ మీద దృష్టి పెట్టిన తర్వాత తేలిందేమిటంటే, 2020-24 సంవత్సరాల మధ్య కేరళకు సుమారు 150 కిలోల బంగారం అక్రమంగా రవాణా అయింది. కాగా, 2020 డిసెంబర్ ప్రాంతంలో సుమారు రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం దౌత్యపరమైన కార్గో ద్వారా తిరువనంతపురం విమానాశ్రయంలో దిగింది. దౌత్యపరమైన కార్గోను తనిఖీ చేయడానికి వీల్లేదనే నిబంధన ఉన్నందువల్ల ఆ నిబంధనను అడ్డుపెట్టుకొని బంగారాన్ని రహస్యంగా దిగుమతి చేసుకోవడం జరుగుతోంది. ఈ విషయం తెలిసిన ఈడీ, సీబీఐ అధికారులు కేరళ మీద దృష్టి పెట్టినప్పుడు చాలా సంవత్సరాల నుంచి కేరళకు బంగారం అక్రమంగా రవాణా అవుతున్నట్టు, దీని వెనుక ఐ.ఎ.ఎస్ అధికారులు, పలువురు రాజకీయ నాయకులు ఉన్నట్టు తెలిసింది. ఈ అక్రమ రవాణా కేసులు వెలుగులోకి రావడం కేరళలో సంచలనం సృష్టించింది. వీటికి అండగా కేరళ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులతో పాటు పలువురు కేరళ రాజకీయ నాయకులు కూడా ఉండడం రాష్ట్ర ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తిరువనంతపురంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దౌత్య కార్యాలయం మాజీ కార్యనిర్వా హక కార్యదర్శి స్వప్నా సురేశ్ విస్తృత స్థాయిలో ఒక బంగారం అక్రమ రవాణా వ్యవస్థనే నిర్వహిస్తున్నట్టు ఈడీ, సీబీఐ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
దౌత్య సంబంధమైన మార్గాలను దుర్వినియోగం చేస్తుండడం, ఒక ఐ.ఎ.ఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ అక్రమ రవాణా అంతా జరుగుతుండడం, ఈ దురాగతంలో పలువురు ఐ.ఎ.ఎస్ అధికారులకు సంబంధం ఉండడం, చివరికి కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కు కూడా ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు అనుమానాలు రావడం దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. (యూఏఈ) తదితర గల్ఫ్ దేశాల నుంచి ఇక్కడికి బంగారం అక్రమ రవాణా జరుగుతున్నట్టు ప్రాథమిక విచారణంలో వెల్లడైంది. నిజానికి, 2019 డిసెంబర్ నుంచి ఈ అక్రమ రవాణకు సంబంధించిన సమాచారం బయటికి వెల్లడవుతున్నప్పటికీ, అంతకు ముందు కూడా బంగారం స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఈడీ గుర్తించింది. కాగా, 2020 జూలైలో దౌత్యపరమైన కార్గోలో వచ్చిన వస్తు సామగ్రిని తిరువనంతపురంలోని కస్టమ్స్ అధికారులు కొద్ది పాటి అనుమానం మీద తనిఖీ చేయడంతో 30 కిలోల బంగారం బయటపడింది. ఇది యూఏఈ దౌత్య కార్యాలయం నుంచి వచ్చింది.
అధికారుల ప్రమేయం
అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించినప్పుడు కొన్ని సంచలనాత్మక, ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేరళ ప్రభుత్వంలోని స్పేస్ పార్క్ సంస్థకు చెందిన పి.ఎస్. సారిత్ అనే అధికారికి, స్వప్నా సురేశ్‌కు ఈ వ్యవహారంతో సంబంధమున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ దగ్గర ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న ఎం. శివశంకర్‌తో ఈ స్వప్నా సురేశ్‌తో సన్నిహిత సంబంధాలున్నందువల్ల సహజంగానే ఆయన మీద కూడా అనుమానాలు కలిగాయి. రాజకీయంగా ఒత్తిడి రావడంతో విజయన్ ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయడం జరిగింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు, సారిత్, స్వప్నలను విచారించడంలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులకే కాకుండా దౌత్యవేత్తలు, మరి కొందరు స్మగ్లర్లకు కూడా ఈ అక్రమ రవాణా నెట్ వర్క్‌లో స్థానం ఉన్నట్టు వెల్లడైంది. అవినీతి, మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ శివశంకర్‌ను అరెస్టు చేసింది. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు జరగాలని, విజయన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు కోరడం ప్రారంభించడంతో ఇది రాజకీయ మలుపు తీసుకుంది.
స్వప్న సురేశ్‌తో పాటు మరికొందరు ప్రభుత్వ అధికారులు, దౌత్యవేత్తలు, రాజకీయ నాయకుల మీద అవినీతి, మనీలాండరింగ్, మోసం, అధికార దుర్వినియోగం వంటి కేసులను ఈడీ నమోదు చేసింది. దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాల దౌత్యవేత్తలకు, దౌత్యాధికారులకు, కేరళలోని పాలక పక్ష నాయకులకు ఈ అక్రమాలు, అవినీతితో సంబంధం ఉన్నట్టు గుర్తించిన ఈడీ వీరందరి పైనా కేసులు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తోంది. రెండేళ్ల క్రితం ఈడీ ఒక పూర్తి స్థాయి అభియోగ పత్రాన్ని రూపొందించింది. ఆర్థిక సంబంధమైన ఏర్పాట్లు చేయడంలో, హవాలా కార్యకలాపాలు సాగించడంలో సిద్దహస్తుడైన సందీప్ నాయర్ అనే వ్యాపారవేత్త ఈ వ్యవహారాలన్నిటిలో స్వప్నా సురేశ్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చాడు. అక్రమ రవాణాకు సంబంధించిన ప్రణాళికంతా ఇతని చేతుల మీదుగానే జరిగేది. తిరువనంతపురంలోని యూఏఈ దౌత్య కార్యాలయంలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేసిన సారిత్‌ను పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. అతనే ఎప్పుడు, ఎలా, ఏ మార్గంలో బంగారాన్ని తరలించాలన్నది చెప్పేవాడు.
ఇక యూఏఈకి చెందిన ఫైజల్ ఫరీద్ అనే వ్యక్తి ఈ అక్రమ రవాణాకు అవసరమైన ఆర్థిక సహాయం అందజేసేవాడు. యూఏఈ దౌత్య కార్యాలయ సిబ్బందిలో చాలా మంది ఈ కార్యకలా పాల్లోనే మునిగి తేలుతుండేవారని తెలిసింది. కేరళలో ఈ అక్రమ రవాణాతో సంబంధమున్న బ్యురా క్రాట్లంతా విజయన్‌కు సన్నిహితులు కావడం వల్ల వామపక్ష ప్రభుత్వంపై మాయని మచ్చ పడింది. స్వప్నను బెయిల్ మీద విడుదల చేశారు కానీ, శివశంకర్, సందీప్ నాయర్‌ను మాత్రం అరెస్టు చేసి విచారిస్తున్నారు. స్వప్న, సందీప్ నాయర్ లకు చెందిన కొన్ని డొల్ల కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరుగుతుండేవని, యూఏఈలోని దౌత్య అధికారులకు, కేరళలోని యూఏఈ దౌత్య కార్యాలయంలోని అధికారులకు ఎవరి వాటాలు వారికి సకాలంలో అందుతుండే వని ఈడీ అధికారులు తమ ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ఈ అక్రమ రవాణా వ్యవస్థకు ప్రధాన నిర్వాహకురాలైన స్వప్నా సురేశ్, మరో అధికారి శివశంకర్ తమ హోదాను అడ్డుపెట్టుకుని, కస్టమ్స్ అధికారులతోనూ, దౌత్యవేత్తలతోనూ సంబంధాలు పెంపొందించుకుని, పలువురు పాలక పక్ష నాయకులను కూడా కలుపుకుని ఏటా కోట్లాది రూపాయల స్మగ్లింగ్ జరుపుతు న్నట్టు ఈడీ, సీబీఐలు గత ఫిబ్రవరిలో బయటపెట్టిన తమ తుది నివేదికలో వెల్లడించాయి. ఇన్నేళ్లుగా జరుగుతున్న ఈ బంగారం స్మగ్లింగ్ వ్యవహారం ముఖ్యమంత్రి విజయన్‌కు తెలియకుండా జరిగే అవకాశం ఉందా అని ప్రతిపక్షాలు నిగ్గదీస్తున్నాయి. కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని ఇది దెబ్బకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జి.రాజశుక
సీనియర్ జర్నలిస్ట్