చరిత్రను గమనిస్తే యుద్ధంలో లాభాలు విజేతకు దక్కితే నష్టాలు పరాజితులకు మిగులుతాయి. యుద్ధంలో గెలిచిన వారిదే పైచేయి అవుతుంది. కానీ విచిత్రంగా ఇక్కడ ఓడిపోయిన శత్రువే ప్రయోజనం పొందాడు. భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన నాలుగు యుద్ధాల్లో మొదటి మూడింట జరిగింది ఇదే. మన వీర సైనికుల త్యాగాలను కాంగ్రెస్ పాలకులు వృథా చేశారు. ఫలితంగా మన శత్రు దేశంతో సమస్యలు అలాగే ఉండిపోగా, పదే పదే దాడులకు సాహసిస్తోంది. 1948, 1965, 1971 యుద్ధకాలాల్లో అసలేం జరిగింది? మన దేశం ఎలా నష్టపోయింది?
పెహల్గావ్‌లో జరిగిన పెను విషాద ఘటన తర్వాత భారతీయుల రక్తం మరిగిపోతోంది. మన జాతి ఆత్మ మీద జరిగిన దాడికి ప్రతీకారం కోసం ఎదురు చూస్తోంది. మన ప్రభుత్వం ఇప్పటికే దౌత్యపరమైన ఆంక్షలతో ఉన్మాద దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అయితే ఇంతకన్నా గట్టిగా బుద్ధి చెప్పాలని, మనదేశంపై శత్రువు మళ్లీ కన్నెత్తి చూసే సాహసం చేయకూడదని దేశ ప్రజలు కోరు కుంటున్నారు. దీంతో దేశ సరిహద్దుల్లో మరోసారి యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాకిస్తాన్‌తో భారత్ ఇప్పటికి నాలుగు యుద్ధాలు చేసింది. ఇవేవీ మనం ప్రారంభించినవి కాదు. శత్రువు దాడికి దిగినప్పుడే తిప్పికొట్టినవే. ఇందులో మూడు యుద్ధాలు కశ్మీర్ కేంద్రంగా జరిగితే, మరో యుద్ధం బాంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసింది. ఈ యుద్ధాల్లో విజయాల ద్వారా మన సైనికులు పైచేయి సాధించినా, వారి పోరాటాలు, త్యాగాలకు దక్కినదేమీ లేకపోగా ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి.
1948: ఓడిన శత్రువుకే లాభం
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొద్ది వారాలకే పాకిస్తాన్‌తో తొలియుద్ధం జరిగింది. జమ్ముకశ్మీర్ కోసం జరిగిన తొలి కదనం ఇది. దేశ విభజన తర్వాత భారత్‌లో చేరాలా? పాకిస్తాన్‌లో చేరాలా? అనే విషయంలో బ్రిటిష్ వారు స్వదేశీ సంస్థానాలకే నిర్ణయాధికారం ఇచ్చారు. కానీ జమ్ము కశ్మీర్ మహారాజా హరిసింగ్ ఈ విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోయారు. సంస్థానంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నందున కశ్మీర్ తమకే దక్కాలని పాకిస్తాన్ ఒత్తిడి తెచ్చింది. తన రాజ్యాన్ని అప్పనంగా ఒక మత రాజ్యం చేతిలో పెడితే హిందువులకు జరిగే నష్టంతో పాటు, భారత ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ తన స్నేహితుడు షేక్ అబ్దుల్లాకు కశ్మీర్ లో అధికారం దక్కేలా చేస్తున్న కుయుక్తులు కూడా ఇందుకు కారణం.
అక్టోబర్ 24, 1947న శ్రీనగర్ రాజప్రా సాదంలో దసరా ఉత్సవాల వేళ హఠాత్తుగా లైట్లు ఆగిపోయాయి. ఎంతసేపటికీ కరెంటు రాకపో వడంతో విచారిస్తే మహురా విద్యుత్తు కేంద్రాన్ని పేల్చేశారని సమాచారం అందింది. అప్పటికే గిరిజనుల ముసుగులో పాకిస్తాన్ సైనిక మూకలు క్రమంగా శ్రీనగర్ వైపు దూసుకొస్తున్నాయని తెలిసింది. వాస్తవానికి ఈ దాడి అక్టోబర్ 21 నుంచే మొదలైంది. వెంటనే అప్రమత్తమైన మహారాజా హరిసింగ్ సైనిక సహాయం చేయాలని తన ప్రధాని మెహర్‌చంద్ మహాజన్ ద్వారా భారత ప్రభుత్వానికి వర్తమానం పంపారు. దీనితో పాటు జమ్ముకశ్మీర్‌ను భారత్‌లో విలీనానికి అంగీకార లేఖ కూడా ఉంది.
జమ్ముకశ్మీర్ విలీన కసరత్తు పూర్తి కాగానే భారత సైన్యం కదిలింది. అప్పటికే శ్రీనగర్ సహా చాలా భాగాన్ని పాకిస్తాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. అప్పట్లో శ్రీనగర్‌కు భారత్ వైపు నుంచి రోడ్డు మార్గం కూడా సరిగ్గా లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అక్టోబర్ 27 ఉదయం భారత సైన్యంలోని సిక్కు రెజిమెంట్ తొలిజట్టు లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ రాయ్ నేతృత్వంలో వాయుమార్గంలో శ్రీనగర్లో దిగింది. మన సైనికులు కొదమ సింహాల్లా దూసుకుపోయారు. శత్రువులను మట్టుబెడుతూ కశ్మీర్ లోయను ముష్కరుల నుంచి విడిపిస్తూ ముందుకు సాగారు. కశ్మీర్‌లోని గుల్మార్గ్, బారాముల్లా, తన్మార్గ్, పూంచ్ కోట్లి, రాజౌరీ, యురి తదితర కీలక ప్రాంతాలు తిరిగి స్వాధీనమయ్యాయి. ఈ దురాక్రమణను భారత్ అంతర్జాతీయ సమాజం దృష్టికి వెళ్లడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు జిన్నా పరిస్థితి తేలు కుట్టిన దొంగలా మారింది. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, గిరిజన పోరాట యోధులు చేసిన తిరుగుబాటు అంటూ మభ్య పెట్టే ప్రయత్నం జరిగింది.
మరి కొద్ది రోజుల్లో పాకిస్తాన్ సైన్యం చెర నుంచి కశ్మీర్ పూర్తిగా విముక్తం పొందుతుంది అన్న దశలో ప్రధాని నెహ్రూ తొందరపాటుతో చారిత్రిక తప్పిదానికి పాల్పడ్డారు. కశ్మీర్‌పై పాకిస్తాన్ దాడికి పాల్పడిందంటూ జనవరి 1, 1948 న భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. అప్పటికి ఇంకా గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్, మీర్‌పూర్ విముక్తం కాలేదు. ఈ భూభాగాలు ఇంకా స్వాధీనం కాకముందే ఏదో కొంపలు మునిగినట్లు నెహ్రూ తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఆ ప్రాంతాలు పాకిస్తాన్ చెరలోనే ఉండిపోయాయి. మరోవైపు భారత ప్రభుత్వం ఎవరూ అడగకముందే జనవరి 1, 1949 నుంచి కాల్పుల విరమణ ప్రకటించింది. దీంతో అప్పటి• వరకూ మన జవానులు చేసిన పోరాటం వృథా అయిపోయింది. ఈ పోరాటంలో పాకిస్తాన్ ఓడిపోయి నప్పటికీ జమ్ముకశ్మీర్‌లోని మూడోవంతు భూభాగాన్ని అప్పనంగా దక్కించుకోగలిగింది. ఈ సమస్య నేటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.
1965: ఫలించని యుద్ధం
1947లో కశ్మీర్‌ను కబళించబోయి భంగపడిన పాకిస్తాన్ 1965లో మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వింది. 1962లో చైనా దురాక్రమణ కారణంగా జరిగిన యుద్ధంలో భారత్ పరాజయాన్ని అలుసుగా తీసుకుంది పాకిస్తాన్. ఈ యద్ధం తర్వాత చైనా-పాకిస్తాన్‌లు మిత్ర దేశాలుగా మారాయి. భారత్ ఓటమి నుంచి ఇంకా కోలుకోనందున దెబ్బ మీద దెబ్బ తీయొచ్చని పాకిస్తాన్ పాలకుడు, సైనిక నియంత జనరల్ అయూబ్‌ఖాన్ భావించారు. 1965 మార్చి మాసంలో గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో కవ్వింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 5, 1965న పాకిస్తాన్ దళాలు ‘ఆపరేషన్ జీబ్రాల్టర్’ పేరుతో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడ్డాయి. ప్రతిగా భారత సైన్యం సరిహద్దు దాటి పాకిస్తాన్ అధీనంలో ఉన్న కశ్మీర్‌లోకి చొచ్చుకు పోయింది. పాకిస్తాన్ దళాలు తిత్వాల్, యురి, పూంచ్‌లలోకి ప్రవేశించగా, మన సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని హాజి పిర్ పాస్ వరకు స్వాధీన పరుచుకుంది. సెప్టెంబరు 1న ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ పేరుతో పాకిస్తాన్ ప్రతిదాడి చేసింది. అఖ్నూర్ స్వాధీనానికి ప్రయత్నించగా మన వాయుసేన పాకిస్తాన్ సైన్యాన్ని చెల్లాచెదురు చేసింది. ఈ యుద్ధం కశ్మీర్ మొదలు పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ సరిహద్దుల వరకూ కొనసాగింది. భారత సైన్యం సియాల్ కోట్, లాహోర్ నగరాల సమీపం వరకూ దూసుకు పోవడంతో పాకిస్తాన్‌లో ఆందోళన మొదలైంది. భారత సైన్యం, వైమానిక దళం, నౌకాదళం ముప్పేట దాడులతో భీతిల్లిపోయింది. దీంతో పాకిస్తానీ పంజాబ్‌ను కాపాడుకోవడం కోసం కశ్మీరు నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది. మొత్తానికి ఆపరేషన్ గ్రాండ్‌స్లామ్ విఫలమైంది.
బ్రిన్ ప్రధాని హెరాల్డ్ విల్‌సన్ ఇరుదేశాలు యుద్ధం ఆపాల్సిందిగా ఒప్పించి వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌పై భారత్ విజయం అంచుల వరకూ వెళ్లిన తర్వాత ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది. సెప్టెంబర్ 23న యుద్ధం ముగిసింది. యుద్ధంలో భారత సైనికులు 3 వేల మంది వీర మరణం పొందారు. పాకిస్తాన్ 3,800 మందిని కోల్పోయింది.
తాష్కెంట్ ఒప్పందం – 1966
1965 యుద్ధంలో పాకిస్తాన్ మీద భారత్ విజయం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకొని నెహ్రూకు ధీటైన నాయకునిగా గుర్తింపు పొందారు. అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా), అమెరికా ఇరు దేశాల సంబంధాల పునరుద్ధరణ కోసం చొరవ తీసు కున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 10, 1966న ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో శిఖరాగ్ర సమావేశం జరిగింది. చర్చల అనంతరం ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, పాక్ పాలకుడు అయూబ్ ఖాన్ ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు. దీనికే తాష్కెంట్ డిక్లరేషన్ అని పేరు.
ఈ ఒప్పందం ప్రకారం 1965 యుద్ధంలో భారత్, పాకిస్తాన్‌లు ఒకరికొకరు స్వాధీనపరచుకున్న ప్రాంతాలను విడిచి పెట్టాలి. కశ్మీర్లో 1949 కాల్పుల విరమణ రేఖకు కట్టుబడి ఉండాలి. రెండు దేశాలు ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోవద్దు. ఆర్థిక, దౌత్య సంబంధాలు పునరుద్ధరించ బడాలి, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలి. ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చడానికి కృషి చేయాలి. యుద్ధంలో సాధించిన విజయం తాలూకు సంతోషాన్ని అనుభవించకమునుపే జరిగిన ఈ ఒప్పందం భారత దేశానికి పెద్దగా ఇష్టంలేదు. అగ్ర రాజ్యాల ఒత్తిడి కారణంగా అయిష్టంగానే శాస్త్రీజీ తాష్కెంట్ ఒప్పందానికి అంగీకరించారని అంటారు.
దురదృష్టవశాత్తు తాష్కెంట్ ఒప్పందం పత్రంపై చేసిన సంతకం తడి ఆరక ముందే అదే రోజు రాత్రి లాల్‌బహదూర్ శాస్త్రి తాష్కెంట్ లోని హోటల్ గదిలోనే కన్నుమూశారు. శాస్త్రీజీ గుండెపోటుతో మరణించారని రష్యా అధికారులు చెప్పినా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ విషయాన్ని నాటి కాంగ్రెస్ నాయకులు వివాదాస్పదం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ మిస్టరీ మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక కూడా వెలుగులోకి రాలేదు.
శాస్త్రీజీ మన మధ్య లేకపోయినా తాష్కెంట్ ప్రకటనకు అనుగుణంగా ఇరుదేశాల మధ్య మంత్రివర్గ స్థాయిలో 1966 మార్చిలో చర్చలు జరిగాయి. అవి అంతగా ఫలవంతం కాలేదు. కశ్మీర్ సమస్యపై అభిప్రాయ భేదాలే ఇందుకు కారణం. మరోవైపు 1968లో బ్రిటన్ ప్రధాని హెరాల్డ్ జోక్యంతో ఏర్పాటైన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్‌కు 900 చ.కి.మీ.ల భూభాగం దక్కింది.
1971: పాక్ వెన్ను విరిగి బాంగ్లాదేశ్ పుట్టింది
మతప్రాతిపదికన ఏర్పడ్డ పాకిస్తాన్‌లో భాషాపరమైన సఖ్యత లేకుండా పోయింది. బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్తాన్ ప్రజలు తమపై పశ్చిమ పాకిస్తాన్ ఉర్దూను రుద్దడాన్ని సహించలేకపోయారు. తూర్పు పాకిస్తాన్‌లో జనాభా ఎక్కువున్నా, రాజకీ యంగా పెత్తనం అంతా పశ్చిమ పాకిస్తాన్ నాయ కులదే. పాకిస్తాన్ పార్లమెంట్‌లో 313 సీట్లు ఉంటే అందులో 169 సీట్లు తూర్పు పాకిస్తాన్‌లో ఉన్నాయి. 1970లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ లో అవామీలీగ్ 167 సీట్లు గెలుచు కుంది. పార్లమెంట్‌లో ఆధిక్యత సంపాదించినందున అవామీలీగ్ నేత షేక్ ముజీబుర్ రహమాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దేశాధ్యక్షుడు యాహ్యాఖాన్‌ను అనుమతి కోరారు. అయితే పశ్చిమ పాకిస్తాన్ నాయకులు అంగీకరించలేదు. దీంతో తూర్పు పాకిస్తాన్‌లో నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనలు కాస్తా స్వతంత్ర బాంగ్లాదేశ్ ఉద్యమానికి దారి తీశాయి.
మార్చి 25, 1971న ఢాకాకు పశ్చిమ పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సైన్యం ముజబూర్ రహ్మన్‌ను ఖైదు చేసి పట్టుకెళ్లింది. ఈ సందర్భంగా జరిగిన అంతర్యుద్ధంలో 30 వేల మంది మరణిం చారు. ముఖ్యంగా హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. తూర్పు పాకిస్తాన్‌లోని సైన్యంలో చీలిక వచ్చింది. షేక్ ముజిబుర్ రహమాన్ తరపున మేజర్ జియావుర్ రహమాన్ ముక్తి బాహిని సైన్యం ఏర్పాటు చేశారు. ముక్తి బాహిని పాక్ సైన్యంలో గొరిల్లా పోరాటం ప్రారంభించింది. మార్చి 27, 1971న జియావుర్ రహ్మాన్ బాంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాటి భారత ప్రధాని ఇందిరా గాంధీ బాంగ్లాదేశ్ స్వాతంత్య్రపోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బాంగ్లా శరణార్థులకు మన దేశంలో ఆశ్రయం ఇచ్చారు. అవామీలీగ్ నాయకులు భారత దేశంలోని కలకత్తాలో ఉంటూనే ఏప్రిల్ 17,1971న తూర్పు బెంగాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
డిసెంబరు 3 సాయంత్రం భారత్‌లోని 8 వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ వైమానిక దళాలు బాంబు దాడులు జరిపాయి. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాకిస్తాన్ పైన దాడులు ప్రారంభించింది. ప్రధాని ఇందిరాగాంధీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ దాడులను భారత్‌పై యుద్ధ ప్రకటనగా భావిస్తున్నామన్నారు. ఈ యుద్ధంలో ధీటుగా పోరాడిన భారత సైన్యం పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.
పాకిస్తాన్ కేవలం రెండు రోజుల్లో, అంటే డిసెంబరు 16 న లొంగిపోయింది. మరుసటిరోజు భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. ఢాకాలో పాకిస్తానీ బలగాలు లొంగుబాటు పత్రంపై సంతకాలు చేసాయి. భారతదేశం సుమారు 93,000 మంది పాకిస్తానీ సైనికులను యుద్ధఖైదీలుగా అదుపులోకి తీసుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద సైనిక లొంగుబాటు ఇది. ఈ యుద్ధం వల్ల బాంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది. ఈ యుద్ధంలో 3,843 మంది భారత సైనికులు మృతి చెందగా 9,851 మంది క్షతగాత్రులయ్యారు. పాకిస్తాన్ వైపు 9 వేల మంది సైనికులు చనిపోగా 4,350 మంది గాయపడ్డారు. పాకిస్తాన్ తన నేవీలో సగభాగం, ఎయిర్ ఫోర్స్‌లో పాతిక, దాదాపు మూడొంతుల సైన్యాన్ని నష్టపోయింది, ఈ యుద్ధంలో భారత్ 14,000 చ.కి.మీ.ల మేర పాకిస్తాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది.
1972: సిమ్లా ఒప్పందం
1971 యుద్ధం తర్వాత భారత్, పాక్‌ల మధ్య ఘర్షణలు నివారించి సత్సంబంధాలు నెలకొల్పే లక్ష్యంతో సిమ్లా ఒప్పందం కుదిరింది. జూలై 2, 1972న హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సమావేశమైన భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
సిమ్లా ఒప్పందం ప్రకారం డిసెంబర్ 17, 1971నాటి కాల్పుల విరమణ రేఖను సిమ్లా ఒప్పందం నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)గా మార్చింది. భేదాభిప్రాయాలున్నా భారత్, పాక్ ఏకపక్షంగా రేఖను మార్చకూడదని ఒప్పందంలో ఉంది. కశ్మీర్ వివాదం పూర్తిగా భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక అంశమని సిమ్లా ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని చూపిస్తూనే ఐక్యరాజ్య సమితి సహా మరే తృతీయ పక్షమూ కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోకుండా భారత్ పలుమార్లు అడ్డుకుంది. భారత్ స్వాధీనం చేసుకున్న పాకిస్తాన్ భూభాగాలను సిమ్లా ఒప్పందం కారణంగా తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.
1999: లాహోర్ ప్రకటన
ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1998 మేలో పోక్రాన్‌లో అణుపరీక్ష నిర్వహించి ప్రపంచానికి భారత్ సత్తాను చాటారు. దీంతో పాకిస్తాన్ కూడా అరువు తెచ్చుకున్న పరిజ్ఞానంతో పోటీ పరీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను నివారించే నిమిత్తం ప్రధాని వాజ్‌పేయి 1999 ఫిబ్రవరిలో లాహోర్‌కు బస్సు యాత్ర జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రధానుల మధ్య చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఫిబ్రవరి 21, 1999న భారత ప్రధాని , పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ‘లాహోర్ ప్రకటన’పై సంతకం చేశారు.
సరిగ్గా లాహోర్ ఒప్పందం కుదిరిన సమయంలోనే పాకిస్తాన్ సైనిక ప్రధానాధికారి పర్వేజ్ ముషారఫ్ కుట్రకు తెర లేపారు.
1999: దురాక్రమణకు ధీటైన జవాబు
లాహోర్ ఒప్పందం కుదిరిన కొద్ది వారాలకు పాకిస్తాన్ సైన్యం దానికి తూట్లు పొడిచింది. 1999 మే మాసంలో కశ్మీర్‌లోని కార్గిల్‌లోకి చొరబడింది. పాకిస్తాన్ మీద భారత్ తిరుగులేని సత్తాను చాటిన యుద్ధం ఇది. ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది. పాకిస్తాన్ ప్రధానమంత్రికే తెలియకుండా ఆ దేశ సైన్యాధికారి పర్వేజ్ ముషారఫ్ దురాక్రమణకు దిగడం మరో వింత. మంచు కొండల్లో శరీరం గడ్డకట్టుకు పోయే వాతావరణంలో దాదాపు 60 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఎప్పటిలాగే భారత్‌దే పైచేయి అయింది. ఈ పోరాటంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారు. 1363 మంది గాయ పడ్డారు. పాక్ సైనికులు దాదాపు 12 వందలకు పైగా మరణించి, అంతకు మూడింతల మంది గాయ పడినా, ఈ లెక్కలను పాక్ అధికారికంగా గుర్తించ లేదు. వారు తమ సైనికులే కాదని బుకాయించింది. ఈ విజయాన్ని ప్రతి ఏటా జులై 26న కార్గిల్ విజయ్ దివస్‌గా జరుపుకుంటున్నాం. భారత్‌కు శాంతి మంత్రమే కాదు.. యుద్ధతంత్రం కూడా తెలుసు అని చాటి చెప్పారు నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.
గెలుపూ మనదే త్యాగమూ మనదేనా?
పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు యుద్ధాల్లో విజయం భారత్‌దే. ఈ అన్ని యుద్ధాల్లోనూ చిత్తుగా ఓడింది పాక్. అయినా కుక్కతోక వంకర అన్నట్లు పాక్ బుద్ధి మారలేదు. పైగా వెయ్యేళ్లయినా భారత్‌తో పోరాడతాం అంటూ మేకపోతు గాంభీర్య ప్రకటనలు చేస్తోంది మన శత్రుదేశం. ప్రపంచంలో జరిగిన ఏ యుద్ధంలో అయినా విజేతలు లాభపడతారు. పరాజితులు కోల్పోతారు. కానీ మొదటి మూడు యుద్ధాల్లో (1948, 1965, 1971) ఓడిపోయిన పాకిస్తాన్‌కు అనుకూలించేలా ఒప్పందాలు కుదరడాన్ని గమనించవచ్చు.
1948 యుద్ధంలో దురాక్రమణకు దిగి చిత్తయింది పాకిస్తాన్. కానీ ప్రధాని నెహ్రూ తొందర పాటు నిర్ణయం కారణంగా యుద్ధంలో గెలిచినప్పటికీ సగం కశ్మీరాన్ని వదులుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం ఉగ్రవాద తండాల తయారీ కర్మాగారంలా తయారైంది. ఈనాటికీ దీని తాలూకు దుష్పలితాలను అనుభవిస్తోంది భారత్.
1965 యుద్ధంలో పాకిస్తాన్ ఓడినప్పటికీ తాష్కెంట్ ఒప్పందం కారణంగా యుద్ధ ఖైదీలుగా పట్టుబడిన ఆ దేశ ఖైదీలకు ఎలాంటి శిక్షలూ విధించలేపోయాం. పైగా రాణ్ ఆఫ్ కచ్‌లో కొంత భూభాగాన్ని పాక్ దక్కించుకుంది. భారత సైన్యం లాహోర్, సియాల్‌కోట్‌లను దక్కించుకున్నా తిరిగి వదిలేయాల్సి వచ్చింది. కశ్మీర్లో 1949 కాల్పుల విరమణ రేఖకు కట్టుబడి ఉండాలని ఒప్పందం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరో విషాదం ఏమిటంటే ఒప్పందంపై సంతకం చేసిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద పరిస్థితుల్లో తాష్కెంట్‌లోనే చనిపోయారు.
1971లో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసిన యుద్ధంలో భారత సైన్యం పాకిస్తాన్‌ను అన్ని విధాలా దెబ్బతీయగలిగింది. కానీ సిమ్లా ఒప్పందంలో మన దేశానికి దక్కిన ప్రయోజనాలేమీ లేవు. 93 వేల మంది యుద్ద ఖైదీలను ఎలాంటి షరతులు లేకుండా వదిలేశాం. స్వాధీనం చేసుకున్న భూభాగాలనూ వదిలేశాం. ఈ యుద్ధ విజయంతో ఆక్రమిత కశ్మర్‌ను తిరిగి దక్కించుకునే అవకాశాన్ని చేజేతులారా వదులుకుంది మన ప్రభుత్వం.
ఈ మూడు యుద్ధాలు కాంగ్రెస్ పార్టీ హయాం లోనే జరిగాయి. మన సైనికులు త్యాగాలు వృథా అయ్యాయనే భావన దేశ ప్రజల్లో ఏర్పడింది.
1999లో లాహోర్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కార్గిల్ దురాక్రమణకు పాల్పడ్డ పాకిస్తాన్‌కు అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కారు ధీటుగా జవాబిచ్చింది. ఈ యుద్ధం తర్వాత పాకిస్తాన్‌తో ఎలాంటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు. తాజాగా ప్రధాని మోదీ కూడా పాకిస్తాన్ విషయంలో కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు.
ఐక్యరాజ్య సమితితో పాటు అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించి, వివాదం చేసేందుకు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను భారత్ దౌత్య పరంగా సమర్ధవంతంగా ఎదుర్కొంటోంది. గతంలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ ద్వారా శత్రుదేశానికి బుద్ధి చెప్పారు. తాజాగా పెహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌ను అనేక నిషేధాజ్ఞలతో అష్టదిగ్బంధం చేసింది.
ఓడినా గెలిచినట్టు పాక్ ప్రచారం
1965 నాటి యుద్ధంలో భారత్ విజయం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే యుద్ధం ఇంకా ముగియకముందే అంతర్జాతీయ సంస్థల ఒత్తిడి మేరకు సంధి కుదిరి సిమ్లా ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ ప్రజలు 1965 యుద్ధంలో తామే గెలిచామని చెప్పుకుంటారు. పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా ఈ అబద్ధాన్ని ప్రచారం చేస్తూ విద్యార్థుల పాఠ్యాంశాల్లో కూడా చొప్పించింది. అప్పట్లో కొన్ని అంతర్జాతీయ పత్రికల్లో హడావుడిగా వచ్చిన ఫేక్ న్యూస్ ఇందుకు ఆధారమైంది.
సిమ్లా ఒప్పందం
- భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు కారణమైన సంఘర్షణకు తెరదించాలి.
- ఇరు దేశాలు పరస్పరం స్నేహపూర్వక, సామరస్య సంబంధాల కోసం కృషిచేయాలి.
- సరిహద్దుల్లో ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకోవాలి.
- 1971 యుద్ధ ఖైదీలను స్వదేశాలకు అప్పగించాలి.
- యుద్ధం పూర్వపు శాంతియుత పరిస్థితులను తిరిగి తీసుకురావాలి.
- ఇరు దేశాలకు సంబంధించిన అన్ని వివాదాలను నేరుగా ద్వైపాక్షిక సంప్రదింపులతో ఉమ్మడి అంగీకారం సాధించడం ద్వారా పరిష్కరించుకోవాలి.
- జాతి సమైక్యత, ప్రాదేశిక పరిపూర్ణత, రాజకీయ స్వాతంత్య్రం, సార్వభౌమ సమానత్వాన్ని ఇరుదేశాలు పరస్పరం గౌరవించుకోవాలి.
లాహోర్ ప్రకటన
- అణ్వాయుధాలను ఎవరూ ఇష్టారాజ్యంగా వినియోగించకూడదు.
- ఇరుదేశాల మధ్య సంఘర్షణ తలెత్తకుండా జాగ్రత్త వహించాలి.
- శాంతియుతంగా కొనసాగేందుకుగాను ఐరాస ప్రణాళిక, విశ్వవ్యాప్తంగా ఆమోదం పొందిన ఇతర నియమాలకు కట్టుబడి ఉండాలి.
- సిమ్లా ఒప్పందాన్ని కాగితాలకే పరిమితం చేయకుండా సంపూర్ణంగా అమలు చేయాలి.
- అణు నిరాయుధీకరణకు సంబంధించి అంతర్జాతీయ ఒప్పందానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలి.
- ఉగ్రవాదంపై పోరాడాలి.
- ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోరాదు.
- కశ్మీర్ సమస్య సహా ద్వైపాక్షిక అజెండాలోని అన్ని వివాదాలు త్వరగా, శాంతియుతంగా పరిష్కారమయ్యేలా చర్చల పక్రియను ముమ్మరం చేయాలి.
క్రాంతిదేవ్ మిత్ర
సీనియర్ జర్నలిస్ట్