‘1857లో జరిగిన మహా సమరం వెయ్యేండ్లుగా-విదేశీయుడీ గడ్డపై కాలిడిన తొలి నాటి నుండీ జరుగుతున్న జాతీయ సమరంలోని ఒక ముఖ్యఘట్టం మాత్రమే. ఈ భూమిన మళ్లీ ధర్మ సంస్థాపన జరిగే వరకూ, విదేశీయుల ప్రభావంలోని చిట్టచివరి అంశం ఈ గడ్డను విడిచి పోయే వరకు ఈ ధర్మ సమరం కొనసాగుతూనే ఉంటుంది’. దాదాపు 68 సంవత్సరాల క్రితం జాగృతి (మే 10,1957) వెలువరించిన అభిప్రాయ మిది. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం శతాబ్ది సందర్భంగా జాగృతి వారపత్రిక ప్రత్యేక సంచికను వెలువరించింది. ఆ సంచిక సంపాదకీయం కూడా ఆ ఘట్టం మీదే రాశారు. పై వాక్యాలు అందులోనివే. ఆ సంగ్రామానికి దారి తీసిన పరిస్థితులు, చరిత్రకారుల అభిప్రాయాలు, అందులోని భిన్నకోణాలనూ కూడా స్పృశించిన సంపాదకీయమిది. ‘1857’ ఒక మహా విప్లవం.
శ్రీమంత్ నానాసాహెబ్ పీష్వా ముఖచిత్రంతో ఈ సంచికను వెలువరించారు. ‘విప్లవ సారథి నానాసాహెబ్ పీష్వా, మహాసేనాని తాత్యా (రచన సత్యవాన్), ‘స్వధర్మ, స్వరాజ్యాలకై సాగించబడ్డ స్వాతంత్య్ర సమరం’ (అమలినేని వెంకటస్వామి), శ్రీ మంగళ్‌పాండే, ‘57’ గుణపాఠం (సౌమిత్రి స్వగతం), ‘1857 నుండి సుభాష్ వరకు భారత స్వాతంత్య్ర సమర సమీక్ష’ (బాలశాస్త్రి హరదాస్), ‘స్వాతంత్య్ర సమర వీరనారి ఆదర్శమూర్తి ఝాన్సీ లక్ష్మీబాయి’, ‘హైదరాబాద్‌లో విప్లవజ్వాల’, ‘జోరా పూర్ బాలరాజు’ (శ్రీనీరంరాజు) వ్యాసాలు 24 పేజీల (టాబ్లాయిడ్ సైజ్) ఈ సంచికలో చోటు చేసుకున్నాయి. స్థలాభావం వల్ల కున్వార్‌సింహ, అమరసింహ గాథలను తరువాతి సంచికలలో వెలువరించారు.
1857 చారిత్రక ఘటన ఏమిటి? సమీపగతం లోని ఆ ఉదంతానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యం ఏమిటి? ఆ ఘటన గొప్పతనం, తరువాతి కాలాల మీద పరిణామాల మీద దాని జాడ ఎంత అన్నది ఇప్పటికీ పూర్తి స్థాయిలో అంచనా వేయలేదు. 1947 వరకు 9 దశాబ్దాల పాటు జరిగిన స్వతంత్ర పోరాటం మీద ఆ చరిత్రాత్మక ఘట్టం లేదా విప్లవం నీడ సుస్పష్టం. ప్లాసీ యుద్ధం (1757) భారతదేశం మీద ఆధిపత్యం సంపాదించిన ఈస్టిండియా కంపెనీకి ఎదురైన తీవ్ర ప్రతిఘటన. ఈ ప్రతిఘటనతో భారతదేశం నేరుగా బ్రిటిష్ మకుటం పాలన కిందకు వచ్చింది. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యం ఆ ప్రతిఘటనే అంతం చేసిందన్నదీ నిజమే. ఇది అసంతృప్తులయిన కొద్దిమంది సంస్థానాధీశులు, అసమ్మతి పెరిగిన సిపాయీలు (భారత జాతి సైనికులను ఇలా పిలిచేవారు) మాత్రమే లేవదీసిన తిరుగుబాటుగా నమ్మించడానికి ఈనాటికీ ప్రయత్నం జరుగుతున్నది. ఆ మహా ఘట్టాన్ని ఈ కోణం నుంచి చూస్తున్నవారే ‘సిపాయీల తిరుగుబాటు’ అంటారు. కానీ కారల్‌మార్కస్ ఈ ఘటనను ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగానే పరిగణించాడు. వినాయక్ దామోదర్ సావర్కర్ ‘భారత స్వాతంత్య్ర సమరం’గానే అంచనా వేశారు. పీసీ సేన్ వంటి ఆంగ్లేయ మనస్తత్త్వం కలిగిన కొందరు సిపాయీల తిరుగుబాటుగానే అంచనా వేశారు. ఈ ఘటన పరిధిని ఉత్తర భారతదేశానికే పరిమితం చేసిన వారు కూడా ఉన్నారు. అందుకే చరిత్రను ఇంత ఘోరంగా వక్రీకరించిన సంఘటన మరొకటి లేదని కూడా అనిపిస్తుంది. హైదరాబాద్ నిజాం రాజ్యంలో ఈ ఉద్యమ జాడలు కనిపిస్తాయి. పాత పశ్చిమ గోదావరి జిల్లాలో కారుకొండ సుబ్బారెడ్డి అనే గిరిజన ఉద్యమకారుడు తాను తాత్యా తోపే స్ఫూర్తితోనే తిరుగుబాటు చేశానని ఉరికంబం ఎక్కుతూ ప్రకటించాడు. మరొక గిరిజన వీరుడు కారం తమ్మనదొర కూడా తాము నానా సాహెబ్ ప్రేరణతోనే కంపెనీ పాలన మీద తిరగబడ్డామని రాజమండ్రి న్యాయస్థానంలో చాటాడు. ఈ ప్రతిఘటనకు ఒక ప్రణాళిక ఉంది. ఆశయం ఉంది. నాయకత్వం ఉంది. రక్త తర్పణాలు ఉన్నాయి. పోరాటంలో విజయం శాతమే ఎక్కువ. కానీ బ్రిటిష్ మకుటం చొరబడి ఫలితాన్ని దారి మళ్లించింది. కంపెనీ పాలనను రద్దు చేసి నేరుగా బ్రిటిష్ రాచరికం కిందకు భారత్‌ను తీసుకుపోయింది. 1857-58 బ్రిటిష్ రాణి ప్రకటన ద్వారా కంపెనీ పాలన నుంచి భారత్ బ్రిటిష్ ఇండియాగా మారింది.
చాలామంది అంచనా వేసినట్టు 1857 ఒక పద్ధతి ప్రకారం జరిగిన, భారతదేశమంతటా ఏకాభిప్రాయంతో (ఈస్టిండియా కంపెనీని మూయించడం) తలెత్తిన ప్రతిఘటన. ఫ్రెంచ్ విప్లవానికి (1789), బొల్షివిక్ విప్లవానికి (1917) దారి తీసిన పరిస్థితులను ఒక క్రమంలో చెబుతారు. కారణాలంటే అవే. ఏదో ఒక పరిణామాన్ని అత్యవసర కారణంగా చూపి, అక్కడ నుంచి విప్లవ గమనం గురించి-ప్రతిఘటన ప్రస్థానాన్ని- వివరించడం కనిపిస్తుంది. ఫ్రెంచ్ విప్లవం లూయీ 16 పాలనాకాలంలో బద్దలయింది. బొల్షివిక్ విప్లవం జార్ చక్రవర్తి మీద జరిగింది. 1857 ప్రతిఘటనకు కేంద్రబిందువు డల్హౌసీ. 1857 ప్రతిఘటన చరిత్ర నిర్మాణం లోను ఇది కనిపిస్తుంది. రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక,సైనిక కారణాలు ఉన్నాయి. ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాలు ఉపయోగించమన్నందుకు సిపాయీలు (హిందువులు, ముస్లింలు కూడా) కంపెనీ పాలనను కూలదోయడానికి పథకం వేయడమే తక్షణ లేదా అత్యవసర కారణంగా పేర్కొంటారు.
సైన్య సహకార పద్ధతి, దత్తత స్వీకార పద్ధతి రద్దు సంస్థానాధీశులను కంపెనీ పాలనను ప్రతిఘటించడానికి ప్రేరేపించాయి. దత్తత స్వీకార పద్ధతి రద్దు వల్ల ఝాన్సీ, సతారా బ్రిటిష్ వశమయ్యాయి. సంస్థానాల సైన్యాన్ని రద్దు చేయించి, కంపెనీ సేనలను అక్కడికి పంపడం మరొక పద్ధతి. దీని ఖర్చు పేరుతో సంస్థానాల నుంచి ఎకరాలకు ఎకరాలు కంపెనీ అధీనంలోకి పోయేవి. ఆర్థిక కారణాలు చాలా బలమైనవి. కంపెనీ ఏ విధానమైనా అది ఇక్కడి హస్తకళలను, చేతివృత్తులను ధ్వంసం చేసేదిగానే ఉండేది. ఫలితం నిరుద్యోగం. మితిమీరిన పన్నులు, శాశ్వత శిస్తు పద్ధతి రైతాంగాన్ని మట్టి కరిపించాయి. బ్రిటిష్ వ్యాపారులు లాభపడేటట్టు, భారతీయ వ్యాపారవర్గాలు నష్టపోయే విధంగా విధానాలు ఉండేవి. సైనిక కారణాలు చాలా అమానుషంగా ఉంటాయి. ఒకే ర్యాంక్‌లో ఉన్నా, ఐరోపా వాడికీ, భారతీయుడికీ జీతం విషయంలో ఎంతో వివక్ష ఉండేది. ఒక ర్యాంక్ తరువాత ఆసియా వాసులకు పదోన్నతికి అవకాశమే ఉండేదికాదు. భారతీయులకు సముద్రయానం నిషిద్ధం. కానీ నిరంతరం యుద్ధాలలో మునిగి ఉండే కంపెనీ సిపాయీలను ఓడలలో విదేశాలకు తరలించడం వారిని తీవ్ర మనస్తాపానికి గురి చేస్తూ ఉండేది. ఈ అసంతృప్తిని తారస్థాయికి తీసుకువెళ్లినదే ఎన్‌ఫీల్డ్ తుపాకుల ప్రవేశం. వీటిలో కొవ్వు పూసిన తూటాలను ఉపయోగించడం అనివార్యం. వాటిని నోటితో కొరికి తుపాకీలో జొనిపేవారు. ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాలను నోటిలో పెట్టుకోవడం హిందువులకు, ముస్లింలకు ధర్మ విరుద్ధమే. కానీ చాలామంది చరిత్రకారులు, ప్రధానంగా ఆంగ్లేయులు ఈ ధార్మిక, సాంస్కృతిక కారణాల తీవ్రతను తక్కువ చేసి చూపారనే చెప్పాలి. విదేశీ చరిత్రకారులకు ఈ తరహా మనోభావాలు అర్థం కావు. అర్థమైనప్పటికీ మన చరిత్రకారులు పట్టించుకోలేదు. దానితో మొత్తంగా 1857 ఘటన వెనుక ఆగ్రహ హేతువు సంపూర్ణ చిత్రం వెల్లడి కాలేదు. ఫలితమే ఆత్మగౌరవం కోసం ఆనాటి భారతీయ సమాజం పడిన తపననే అసమ్మతిగా, అసంతృప్తిగా చిత్రించారు. దీనిని 68 ఏళ్ల క్రితమే జాగృతి సరిచేసే ప్రయత్నం చేసింది. మంగళ్‌పాండే అనే సిపాయీ తొందరపడి నిర్దేశించుకున్న సమయం కంటే ముందు, అంటే మార్చి 29, 1857న అధికారిని కాల్చి చంపాడు. మొత్తం ప్రణాళిక లోతుపాతులు వెల్లడైనాయి. ఏప్రిల్ 8న ఆయనను ఉరి తీశారు. మళ్లీ మే 10న మీరట్ సైనిక శిబిరంలో సిపాయీల తిరుగుబాటుతో దేశమంతటా జ్వాల రగిలింది.
ఈ సంచిక ముఖపత్ర కథనం అనదగిన ‘స్వధర్మ, స్వరాజ్యాలకై సాగించబడ్డ స్వాతంత్య్ర సమరం’ (అమలినేని వెంకటస్వామి) ఆ కోణాన్ని ఆవిష్కరించింది. ‘1857 నాటి ఉద్యమాన్ని ఇంగ్లీషు చరిత్రకారులు సిపాయీల తిరుగుబాటు అని వర్ణిస్తారు. కానీ వాస్తవానికి అది జాతీయ విప్లవం. తమ మాతృభూమి పట్ల, సంస్కృతి పట్ల శ్రద్ధాసక్తులు కలిగిన ప్రజలంతా త్యాగదీక్షను గైకొన్ని తరుణమది’ అన్నారు వ్యాసకర్త. తూటాల వివాదాన్ని ముందు పెట్టడం మొత్తంగా ఆ ఘటన ఆత్మకు అన్యాయం చేయడమేనని అభిప్రాయపడ్డారు. తూటాలు, వాటి మీద కొవ్వు ప్రధాన అంశమైతే, బ్రిటిష్ గవర్నర్ జనరల్ దాని మీద వివరణ ఇచ్చారు. నోటితో కాదు, చేతితో కూడా తెరవవచ్చునని తెలియచేశాడు. దానితో ప్రతిఘటన ఆగాలి. కానీ ఆగలేదంటే అంతకు మించిన బలమైన కారణమే ఉందని గ్రహించాలి. ‘‘57’’ గుణపాఠం’ ఓ అద్భుత విశ్లేషణ. ప్లాసీ యుద్ధంలో 50,000 సిరాజుద్దౌలా సైన్యం, 3000 మంది సైనికులు మాత్రమే ఉన్న రాబర్ట్ క్లైవ్ చేతిలో ఓడిపోయింది. కారణం, మీర్జాఫర్. ఆ యుద్ధమే కంపెనీ పాలనను భారత్‌పై రుద్దింది. 1857లో సిక్కులు, గూర్ఖాలు ఆంగ్లేయుల తరఫున పోరాడారు. అంటే 1857 యోధుల మీద యుద్ధం చేశారు. ఇందులో గూర్ఖాల పాత్ర విస్తు గొలిపేదే. 1818లో ఆంగ్లేయులకూ, నేపాల్‌కూ యుద్ధం జరిగింది. అప్పుడు చేతిలో డబ్బులు లేని కంపెనీకి అయోధ్య నవాబు రెండు కోట్ల రూపాయలు అప్పు ఇచ్చాడు. యుద్ధం జరిగింది. 1857 ప్రతిఘటనలో అయోధ్య పాల్గొన్నది. అక్కడి ఉద్యమాన్ని అణచివేయడానికి కంపెనీకి సాయపడిన వారు గూర్ఖాలే. తమను చావగొట్టింది కంపెనీ సైన్యమే అయినా, అందుకు అప్పు ఇచ్చిన అయోధ్య నవాబు మీద పగ తీర్చుకోవడానికి కంపెనీ ద్వారానే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి సిగ్గుపడలేదు గూర్ఖాదళం. ఈ వ్యాసం ముగింపు చెప్పుకోదగినది. ‘1957 వచ్చింది. ఈనాడు దేశంలో 1757 లోను, 1857లోను ఉన్నటువంటి పరిస్థితులే కొన్ని కనిపిస్తున్నాయి.’ ఇది ఇవాళ కూడా నిజమే.
బాలశాస్త్రి హరదాస్ రాసిన వ్యాసం చదవడం మంచి అనుభవం. ‘1857 నుండి సుభాష్ వరకు: భారత స్వాతంత్య్ర సమీక్ష’ శీర్షికకు తగ్గట్టు 1857 నుంచి 1942 వరకు దేశంలో సాగిన స్వాతంత్య్రో ద్యమం గురించి చర్చించింది. ఇక నానాసాహెబ్, తాత్యాతోపే, ఝాన్సీరాణీ వ్యాసాలు ఉత్తేజ పూరితంగా ఉన్నాయి. ‘ఆ మహా విప్లవానికి కారణాలుగా పేర్కొనబడుతున్న అంశాలను కాదనక్కరలేదు. జాతి హృదయంలో జ్వలిస్తున్న స్వాతంత్య్ర పిపాస వెలికి వచ్చి విజృంభించడానికి ఇవన్నీ నిమిత్తాలుగా పని చేశాయి. నాటి సాంఘిక, రాజకీయ, సైనిక, ఆర్ధికాది స్థితిగతులన్నీ మహా విప్లవానికి చక్కగా రంగాన్ని సిద్ధం చేశాయి. అందువల్ల వీటి కారణాలుగా ఎవరైనా భావిస్తే మనం కొట్టివేయనక్కరలేదు.’ అని వ్యాఖ్యానించింది నాటి సంపాదకీయం.
ఇది ఉత్తర భారతదేశానికి పరిమితం అన్న అభిప్రాయం, అలాగే ఎలాంటి ప్రణాళిక లేకుండా ఆవేశంతో మాత్రమే జరిగిందన్న ప్రచారం ఎంత సత్యదూరాలో బాలశాస్త్రి హరదాస్ తన వ్యాసంలో విశ్లేషించారు. ‘1857 మే 10న ప్రారంభమైన ఈ స్వతంత్ర సమరం ఏదో ఆకస్మికంగా రేగిన తిరుగుబాటు కాదు. ఆనాటి దేశ పరిస్థితికి అనుగుణంగా పరంపరాగతంగా వస్తున్న నాయకత్వ అడుగుజాడలలో నడిచిన మహత్తర ప్రజా విప్లవం అది. అగ్నిపర్వతం బద్దలై, భగభగ మండుతూ లావాను వెలిగక్కే సమయంలో అదంతా ఆకస్మికంగా జరిగినట్టు కనిపించవచ్చు. కాని దానిలోని అగ్ని ఎంతోకాలం నుంచి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. భూగర్భంలో జరిగిన పరిణామాలే దానిలోని అగ్నిజ్వాలలకు కారణాలవుతాయి. అదే విధంగా 57 స్వాతంత్య్ర సమరమనే దేశ వ్యాప్తమైన విప్లవం వెనుక కూడా ఎన్నో కారణాలు పెనవేసుకుని ఉన్నాయి. లార్డ్ బేకన్ ఒక వ్యాసంలో, ఏదైనా విప్లవం రావటానికి గల కారణాలను ఈ విధంగా పేర్కొన్నాడు. ‘‘మతంలో కొత్త కొత్త సంస్కరణలు, పన్నులు, శాసనాలలోను ఆచార వ్యవహారాలలోను మార్పులు, పరంపరాగతంగా వస్తూన్న హక్కులకు భంగం కలగటం, నిరంకుశ పరిపాలన, అనర్హులకూ అగంతకులకూ అధికారం ప్రాప్తించటం కరువులు, సైన్యం నుంచి తొలగించబడిన వారిలో పెచ్చు పెరిగిన కక్షలు ప్రజలలో ఆవేశాలను పెంచి వారంతా కలసి ప్రతిఘటించేటట్టు చేసే ప్రతి పనీ’ 1857 వెనుక కూడా ఉన్నాయి.
నిజమే, 1857 ఘటన విఫలమైనట్టు అంగీకరించడానికి అభ్యంతరం ఉండదు. అదొక రక్తపంకిల అనుభవం కూడా. మే 10, 1957 నాటి జాగృతి సంచిక సంపాదకీయం ముగింపు మెచ్చదగినది. ‘పరిస్థితులు మళ్లీ బ్రిటిష్ వారి ప్రయోజనానికి వచ్చాయి. విప్లవమప్పటికి విఫలమైంది. కానీ జ్వాల ఆగలేదు. అనేక రూపాల్లో అది విజృంభించింది.’ అని వ్యాఖ్యానించారు. మరొక వ్యాఖ్య కూడా గమనించదగినదే. ‘కాని నూరేండ్ల క్రిందటి ఆనాటి స్థితిగతులకు నేటి భారత పరిస్థితులకు ఎక్కువ భేదం మాత్రం కానరాదు. స్వధర్మంపై నాడు విజాతీయులు అక్రమాలు చేయగల్గితే నేడు స్వజాతీయులే చేయగల్గుతున్నారు. నాటికి వలె నేడు ధర్మ విద్రోహులు, స్వజాత్యాఘాతకులు, సత్యం విషయంలో కూడా ‘తాటస్థ్యం’ వహించగల ధీమంతులూ అన్ని రకాల వారూ నేడూ ఉన్నారు’ అనడం వాస్తవమే.
మే 10వ తేదీ సంచికలో సూచించినట్టే 17,1957 జాగృతిలో రాణా కుమార్‌సింగ్, అమరసింగ్ 1857 పోరాటానికి చేసిన సేవ గురించి వివరించారు. బిహార్ ప్రాంతంలో ప్రథమ స్వాతంత్య్ర పోరాటం విస్తరింప చేయడానికి ప్రయత్నించిన వారు కున్వార్‌సింగ్. గెరిల్లా యుద్ధనీతితో ఆయన కంపెనీ సేనల మీద యుద్ధం చేశారు. ఆయన సోదరుడే అమర్‌సింగ్. కున్వార్‌సింగ్ జగదీశ్‌పూర్ సంస్థానాధీశుడు. కంపెనీ రెవెన్యూ పద్ధతి కారణంగా తన సంస్థానాన్ని, దేవాలయాలను కూడా కోల్పోయాడు. కంపెనీ మీద తిరుగుబాటు బావుటా ఎగరవేసే నాటికి ఆయన వయసు 80 ఏళ్లు. పశ్చిమ బిహార్‌లోని అరణ్యాల నుంచి ఆయన కంపెనీ సేనలపై పడేవాడు. ఆత్రోలియా అనేచోట కంపెనీ సైన్యాలతో ఇతడు యుద్ధం చేశాడు. మొదట వెనకడుగు వేయవలసి వచ్చినా తరువాత మిల్‌మన్ నాయకత్వంలోని కంపెనీ సైన్యాలను తరిమివేశాడు. మిల్‌మన్ ఆజీంఘడ్ చేరుకున్న తరువాత కల్నల్ జేమ్స్ యుద్ధానికి వచ్చాడు. అతడికి కూడా మిల్‌మన్ గతే పట్టింది. జనరల్ లేగ్రాండ్ అనే బ్రిటిష్ సేనాని భారీ సేనతో వచ్చి జగదీశ్‌పూర్‌ను ముట్టడించాడు. అయినా వారిని వృద్ధ వీరుడు ఎదిరించాడు. ఇది జరిగిన మూడురోజులకే అంటే ఏప్రిల్ 23, 1857న ఆయన చనిపోయాడు. తరువాత అమర్‌సింగ్ రంగంలోకి దిగాడు. తరువాత కూడా కంపెనీ సేన జగదీశ్‌పూర్‌ను ముట్టడించే ప్రయత్నం చేసింది. అమర్‌సింగ్ పోరాడాడు. కానీ ఆయన ఏనాడు అస్తమించాడో చరిత్ర ఇంకా చెప్పలేదు.
మే 17, 1957 సంచిక చదివితే 1857 శతాబ్ది ఉత్సవాల మీద కాంగ్రెస్ వైఖరి స్పష్టమవుతుంది. అలాంటి ధోరణి అవాంఛనీయమైనది. శతాబ్ది ఉత్సవాలను మే 10న కాకుండా ఆగస్టు 15న జరిపించాలని ఆ పార్టీ నిర్ణయించింది. కానీ దేశమంతా మే 10వ తేదీనే ఘనంగా జరిగాయి. నాటి హుతాత్మలకు నివాళి ఘటించారు ప్రజలు. ‘కాంగ్రెస్ వైఖరి’ (వార్తలు, వ్యాఖ్యలు శీర్షిక) ఈ విషయాలు కనిపిస్తాయి. ‘ఈ సమరాన్ని, సమరవీరులను కాంగ్రెస్ వారు తరుచు కించపరచడం జరుగుతోంది. దీనిని ప్రజా విప్లవమని అంగీకరించని కాంగ్రెస్ వారు చాలా మంది ఉన్నారు’ అని శీర్షిక రచయిత వ్యాఖ్యానించడం విశేషం. ఆగస్ట్ 16, 1957 నాటి జాగృతి ‘స్వాతంత్య్ర సమరంపై శ్రీ ఆజాద్ వ్యాఖ్య’ (తారానాథ్) శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో 1857 ఉదంతం మీద మొదటి విద్యామంత్రి వ్యాఖ్యలు గర్హనీయంగా ఉంటాయి. అంతటి ధీరోదాత్త ఘటన మీద స్వతంత్ర దేశంలో ఒక మంచి గ్రంథం వస్తుందని భారతీయులు చూశారు. ఒక గ్రంథాన్ని ఎస్‌ఎన్ సేన్ రాశారు. కానీ ఇది భారతీయులను తీవ్రంగా నిరాశపరిచింది. దీనికే మౌలానా కలాం ఆజాద్ ముందుమాట వెలయించారు. అందులో, ‘మనకు లభించిన ఆధారాల దృష్ట్యా పరిశీలించిన పక్షంలో 1857 తిరుగుబాటు ఒక ప్రత్యేకమైన పథకం జరిగిందని కాని, గొప్ప మేధావులు మరుగున ఉండి దానిని నడిపించారని గాని చెప్పలేమనే నిర్ణయానికి వస్తాము’ అని తేల్చారాయన. తన ఆప్తమిత్రుడు జవాహర్‌లాల్ నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాసిన కొన్ని వాక్యాలను కూడా మరచిపోకుండా ప్రస్తావించారు ఆజాద్. అది: ‘ఈ తిరుగుబాటు ప్రముఖంగా భూస్వాములు, వారి అనుచరులు విదేశీయులపై వ్యతిరేకతను ఆసరాగా తీసుకుని జరిపించినదే… చరిత్రలో వారి పాత్ర ఏనాడో పూర్తయింది. భవిష్యత్తులో వారికి ఎలాంటి స్థానమూ ఉండదు’.
ఆగస్ట్ 16,1957 సంచికలో రాణీ లక్ష్మీబాయి గురించి విశిష్ట సమాచారం ఉంది. లక్ష్మీబాయి మనుమడు లక్ష్మణ్‌రావ్‌తో వామన్ హెచ్ పండిట్ జరిపిన ఇంటర్వ్యూలో (80 ఏళ్ల వయసులో ఇచ్చారు) ఆ సమాచారం ఉంది. మనకు కనిపిస్తున్న ఆ యోధురాలి బొమ్మలలో ఒకటి ఇందోర్ చిత్రకారుడు భేరు ముసావర్ చిత్రించినది. దీనిని లక్ష్మణ్‌రావు తండ్రి దామోదరరావు వేయించారు.
కంపెనీని ఈ దేశం నుంచి పారద్రోలిన ఆ హుతాత్మలకు ఇదే మా నివాళి.
– జాగృతి డెస్క్