జమ్ముకాశ్మీర్‌లోని పహల్‌గాంలో ఉగ్రవాదులు భీకరదాడి చేసి 26 మందిని పర్యాటకులను హతమార్చిన సంఘటనను ఆంధప్రదేశ్‌ ‌ప్రజానీకం మొత్తం ఖండించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్‌ ‌జాతీయుల ఆచూకీ తీయడంతో పాటు కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది.

పెహల్గావ్‌లో ఉగ్రవాదుల అమానుష దాడిని రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలు, హిందూ సంఘాలు, ముస్లింలు రోడ్లమీదకు వచ్చి ఉగ్రవాదుల చర్యలను ఖండించాయి. పిరికిపందల మాదిరిగా పర్యాటకులపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న భారత్‌పై దాడులు చేసి అమాయకులను పొట్టనపెట్టుకోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఉగ్రవాదుల చర్యల వెనుక పాకిస్థాన్‌ ‌హస్తం, వారి ప్రోత్సాహం ఉందని, త్వరలో భారత్‌ ‌తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. ఏప్రిల్‌ 22‌నాటి ఈ దాడుల నేపథ్యంలో దేశంలోని పాకిస్థానీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దేశం విడిచి వెళ్లవలసిందిగా నిర్దిష్ట గడువు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం వీసా వ్యవధి ముగిసినప్పటికీ భారతదేశంలో బస చేసిన వారికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా రూ. 3 లక్షల వరకు జరిమానా విధించే నిబంధనను ప్రభుత్వం రూపొందించింది. దాంతో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఆంధప్రదేశ్‌లో ఉంటున్న పాకిస్ధానీ పౌరులను కూడా వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 21 మంది పాకిస్థానీయులు..

పాకిస్తాన్‌ ‌పౌరులు ఎక్కడున్నా వారి అచూకీ కనుగొనాలని, విదేశాలకు సంబంధించిన వారు దేశంలో ఎక్కడ ఉన్నా గుర్తించాలని, వారి కదలికలపై ఆరా తీయాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. గడువు దాటిన పాకిస్తానీ పౌరులను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

ఈ సందర్భంగా రాష్ట్ర పోలీసు శాఖ కూడా అన్ని జిల్లాల పోలీసు అధికారులను అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో 21 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసు శాఖ గుర్తించింది. జిల్లాల వారీగా విశాఖపట్నంలో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో ఒకరు, కాకినాడలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు, ఎన్టీఆర్‌ ‌జిల్లాలో ఇద్దరు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలో ఒక్కొక్కరు, అనంతపురం, సత్యసాయి జిల్లాలలో ఇద్దరిద్దరు ఉన్నట్లు గుర్తించారు. అన్న మయ్య జిల్లాలో అధికంగా ఐదుగురు పాకిస్తాన్‌కు చెందిన వారు ఉన్నట్లు పోలీసు శాఖ గుర్తించింది.

అన్నమయ్య జిల్లాలో

రెవెన్యూ డివిజనల్‌ ‌కేంద్రమైన మదనపల్లె పట్టణంలో ఐదుగురు పాకిస్థాన్‌ ‌దేశ పౌరసత్వం కలిగిన వారు ఉన్నట్లు పోలీసుశాఖలోని ప్రత్యేక విభాగం గుర్తించినట్టు సమాచారం.వారు పట్టణంలో స్థిరనివాసం ఏర్పరచుకొన్నట్లు అన్వేషణలో వెల్లడైనట్టు తెలుస్తోంది. ఇండియన్‌ ‌వీసా రెన్యువల్‌ ‌చేసుకునే క్రమంలో ఈ వివరాలు బయటపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మదనపల్లె పట్టణంలోని కురవంక ఇండియన్‌ ‌పబ్లిక్‌ ‌స్కూల్‌ ‌ప్రాంతంలో గత ఐదేళ్లుగా వారు నివాసం ఉంటున్నారని నిఘా వర్గాలు అంటున్నాయి. రెండు దశాబ్దాల క్రితం మదనపల్లె అంజనేయస్వామి గుడి వీధికి చెందిన ఒక మహిళ బతుకుదెరువు నిమిత్తం గల్ఫ్ ‌దేశానికి వెళ్లింది. అక్కడ పరిచయమైన పాకిస్థాన్‌ ‌దేశ పౌరుడిని వివాహం చేసుకుంది. ఈ క్రమంలో ఆమె అక్కడే నలుగురికి జన్మనిచ్చింది. అనంతరం ఆ కుటుంబం మొత్తం పాకిస్థాన్‌ ‌వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారి వైవాహిక జీవితంలో ఆఖరి సంతానం మదనపల్లెలో ఉండడంతో ఆ ఒక్కరికి మాత్రం భారతదేశ పౌరసత్వం ఉందని, మిగిలిన ఐదుగురికి పాకిస్థాన్‌ ‌పౌరసత్వం ఉందని పోలీసు శాఖ నిఘా విభాగం గుర్తించింది. ప్రస్తుతం వారంతా మదనపల్లెలోనే ఉన్నట్టు పోలీసు శాఖ గుర్తించింది.

పాకిస్థాన్‌ ‌పౌరసత్వం కలిగి మదనపల్లెలో ఉంటున్న ఆ మహిళ సంతానం ఇక్కడే చదువులు పూర్తి చేసుకున్నారు. పాకిస్థాన్‌ ‌పౌరసత్వం కలిగినప్పటికీ, భారత్‌లో రెసిడెన్స్ ‌వీసా పొంది రెన్యువల్‌ ‌చేసుకుంటూ ఇక్కడే నివాసం ఉంటున్నారు.

పాకిస్థాన్‌ ‌దేశీయుడిని వివాహం చేసుకున్న ఆ మహిళకు ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు సంతానం. వారిలో 35 సంవత్సరాల పెద్ద కూమార్తె బెంగళూరులో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. కొడుకు మదనపల్లెలో స్టార్‌ ‌హోటల్లో క్యాటరింగ్‌ ‌పనులు చేసుకుంటూ మదనపల్లెకి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నట్టు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో గాలింపు చర్యల్లో పాక్‌ ‌పౌరుల సమాచారం ఇలా వెలుగు చూడడంతో విషయం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో

ఉమ్మడి కృష్ణా జిల్లాలో ముగ్గురు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తులు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురిలో ఇద్దరు ఎన్టీఆర్‌, ఒకరు కృష్ణాలో ఉంటున్నట్లు తెలిసింది. కృష్ణా జిల్లా పరిధిలోని ఆ మహిళ పాకిస్థాన్‌•కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నారు. భర్తతో విడాకులు తీసుకొని తిరిగి పుట్టింటికి వచ్చారు. భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోగా ఇంకా అనుమతి రావాల్సి ఉంది. మిగిలిన ఇద్దరు కూడా దరఖాస్తు చేసుకున్నట్లు పోలీసులు నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు.

విశాఖలో

విశాఖలో పాకిస్థాన్‌ ‌పౌరుల ఉనికిని నగర పోలీసులు గుర్తించారు. ఓ కుటుంబంలో దంపతులు, ఇద్దరు పిల్లలు ఉండగా, వారిలో భర్త, పెద్ద కుమారుడు పాకిస్థాన్‌ ‌పౌరసత్వం భార్య చిన్నకుమారుడు భారత పౌరసత్వం కలిగి ఉన్నారు. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి, విశాఖకు చెందిన మహిళ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెద్ద కుమారుడు పాకిస్థాన్లో జన్మించాడు. అనంతరం ఆమె విశాఖ వచ్చేంది. భర్త తరచూ ఇక్కడికి వస్తుండేవాడు. విశాఖలో వారికి రెండో కుమారుడు జన్మించాడు. దీంతో వేర్వేరు పౌరసత్వాలు లభించాయి. ఏడాది కిందట పెద్దకుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తండ్రి పాకిస్థాన్‌ ‌నుంచి విశాఖ వచ్చాడు. అప్పటి నుంచి లాంగ్‌ ‌వీసాతో ఇక్కడే ఉంటున్నాడు. ఆయా వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

ధర్మవరంలో

పాకిస్ధాన్‌ ‌పౌరసత్వం కలిగిన ఒక యువతి వివరాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వెలుగుచూశాయి. ధర్మవరానికి చెందిన రంశా రఫీక్‌ 26 ఏళ్లుగా భారత్‌లోనే ఉంటోంది. తెలిసిన వివరాల ప్రకారం కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్‌ ‌పీరన్‌ అనే వ్యక్తి దేశ విభజన సమయంలో పాక్‌ ‌వెళ్లిపోయారు. అక్కడే ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. చిన్న కుమార్తె జీనత్‌ ‌పేరన్‌ను ధర్మవరంలోని తన చెల్లెలు కుమారుడు రఫిక్‌ అహ్మద్‌కు ఇచ్చి 1989లో వివాహం చేశారు. ఈ జంటకు మొదట కుమారుడు పుట్టారు. 1998లో జీనత్‌ ‌రెండోసారి గర్భం దాల్చిన సమయంలో పాకిస్థాన్‌లోని తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం అందింది. దీంతో తండ్రిని చూసేందుకు ఆమె పాక్‌ ‌వెళ్లారు. అదే సమయంలో కార్గిల్‌ ‌యుద్ధం మొదలుకావడంతో తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలించలేదు. జీనత్‌ ‌పీరన్‌ ‌పాకిస్థాన్‌లోనే రంశా రఫిక్‌కు జన్మనిచ్చారు. 2005లో జీనత్‌ ‌పీరన్‌ ఆమెను తీసుకుని ధర్మవరం వచ్చేశారు. పాకిస్థాన్‌లో పుట్టడంతో రంశా రఫిక్‌కు ఆ దేశ పౌరసత్వం వచ్చింది. తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. 2018లో పాక్‌ ‌పౌరసత్వాన్ని రెన్యూవల్‌ ‌చేసుకున్నారు. 2028 వరకు అది మనుగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమోదించలేదు. ఇప్పుడు ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌ ‌పౌరులను తిరిగి పంపాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో ఆమె వివరాలు బయటకు వచ్చాయి.

తీర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు

పెహల్గావ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధప్రదేశ్‌లోని నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు గల తీర ప్రాంతం భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళంలో 193 కి.మీ., విజయనగరంలో 29 కి.మీ., విశాఖపట్నంలో 132 కి.మీ., తూర్పుగోదావరి జిల్లాలో 144 కి.మీ, డా. బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌కోన సీమ జిల్లాలో 96 కి.మీ., పశ్చిమగోదావరి జిల్లాలో 23 కి.మీ. కృష్ణాజిల్లాలో 88 కి.మీ.,బాపట్ల జిల్లాలో లో 50 కి.మీ., ప్రకాశం జిల్లాలో 60 కి.మీ., నెల్లూరు జిల్లాలో 169 కి.మీ.మేర సముద్ర తీరం ఉంది. ఈ ప్రాంతాల నుంచి మత్స్యకారులు. సముద్ర జలాల్లోకి వేట సాగించేందుకు బోట్లపై వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి చొరబాటుదారులు ప్రవేశించే ప్రమాదం ఉండటంతో తీరం వెంబడి నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం రేవుల పరిధిలోకి ఇతర దేశాల నుంచి వచ్చే ఓడలపై కోస్టల్‌ ‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రతి నౌక సిబ్బంది పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాతే పోర్టులోకి అనుమతిస్తున్నారు. కశ్మీర్‌ ‌ఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీరప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ముష్కరులు చొరబడే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. మత్స్యకార గ్రామాల్లోకి ఎవరైనా అనుమానితులు కని వస్తే తక్షణం సమీపంలోని పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. తీర ప్రాంతాల వారీగా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలు చేపడుతున్నారు.

విమానాశ్రయాల్లో బందోబస్తు

దేశవ్యాప్తంగా రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించిన నేపథ్యంలో పోర్టులతో పాటు విమానాశ్రయాల్లోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. విశాఖ, రాజమండ్రి, గన్నవరం, తిరుపతి విమానాశ్రయాల్లో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల అదనపు ఎస్పీ, విమానాశ్రయం పోలీసు సిబ్బంది, ఎస్పీఎఫ్‌ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. వాహనాల రాకపోకల పైన, అనుమానిత వ్యక్తులపై దృష్టి సారించాలని, తరచూ తనిఖీలు నిర్వహించాలని సిబ్బందికి ఆయన సూచిస్తున్నారు.

తురగా నాగభూషణం

సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE