దేశంలోని ప్రతి నదికి ఒక ప్రత్యేకత. ఆయా ప్రాంతాల ప్రజలు స్థానిక/సమీపంలోని నదులనే కాదు…ఆసేతుశీతాచల పర్యంతం గల నదులన్నిటిని దేవత(లు)గా పరిగణించి కొలుస్తారు. ఆయా నదులకు వచ్చే పుష్కరాలు జాతీయ పండుగలాంటివే. ఈ విషయంలో నదుల ప్రమాణంలో పెద్ద, చిన్న వ్యత్యాసం కనబడదు. గోదావరి, ప్రాణహిత, సరస్వతి, వరద, వైన్యా నదుల సంగమ స్థలిని పంచగంగా వ్యవహరిస్తారు. అలాంటి పవిత్ర నదుల్లో ఒకటైన సరస్వతికి ఈ నెల 15 వ తేదీ నుంచి పుష్కరాలు. ఈ పుష్కరాల వేళ ‘నదులను పూజిద్దాం… పవిత్రంగా ఉంచుదాం’ అని సంకల్పం చెప్పుకుందాం.
‘గంగేచ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు’…
స్నానశ్లోకాన్ని బట్టి నదీ మతుల్లల విశిష్టత తెలుస్తుంది. నదేతర ప్రాంతాలు/ప్రదేశాలలో స్నానమాడు తున్నప్పుడు అక్కడి నీటిలో ఆయా నదీజలాలు ప్రవేశించాలని విన్నవించడం. అంటే ‘నేను స్నానం చేసే నీటిలో ఈ నదీజలాలు ఉండుగాక’ అని ఆశించడం.
పుష్కరరాజు, బృహస్పతి (గురువు) ఈ నెల (మే) 14వ తేదీ రాత్రి 10 గంటల 33 నిమిషాలకు మృగశిర నక్షత్రంలో మిథున రాశిలోకి ప్రవేశిం చడంతో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభ మవుతాయి. మరునాడు సూర్యోదయం నుంచి పుష్కర స్నానం ఆచరించవలసి ఉంటుంది. గంగా యమున సంగమం వద్ద ప్రవహించే సరస్వతి నదిని ‘అంతర్వా హిని’గా పరిగణిస్తారు. రుగ్వేద, యజుర్వేదాలలో, బ్రహ్మవైవర్తన, బ్రహ్మాండ తదితర పురాణాలలో, రామాయణ, మహాభారతం, భాగవతం వంటి ఇతిహాసాలలో సరస్వతీ నది ప్రస్తావన ఉంది. విద్యలకు అధిదేవత సరస్వతి శాపవశాత్తు నదిగా మారిందని గాథలు ఉన్నాయి. బ్రహ్మాండ పురాణ గాథ ప్రకారం, మహాదేవుడి ఆద్యంతాలను కనుగొనాలన్న బ్రహ్మదేవుడి సంకల్పం ఫలించలేదు. కానీ, ‘పరమేశ్వరుని తుదీమొదలు కనుగొన్నట్లు’ విధాత ఆయనతోనే అసత్యమాడడంతో ఆగ్రహించిన ఆదిదేవుడు ‘బ్రహ్మ వాక్కు అయిన సరస్వతి నదిగా మారిపోవాలి’ అని శపించాడట.
హిమాలయాల్లో శివాలిక్ పర్వతాల్లోని సిరిమూర్ కొండల్లో పుట్టి (బ్రహ్మసరస్సు లేదా బదరికాశ్రమంలో పుట్టిందని మరో వాదన) ఒకనాడు భరతవనిలో గలగలా ప్రవహించిన సరస్వతి నది ఇప్పుడు అదృశ్య అంతర్వాహినిగా సాగుతోంది. నాడు అతి పెద్ద నదిగా విలసిల్లిన సరస్వతి భూకంపాలు, అగ్ని విస్ఫోటాలు వంటి ప్రకృతి విపత్తుల కారణంగా క్షీణించి చివరకు కనీ కనిపించని అంతర్వాహినిగా మారిందని చెబుతారు. ఈ నది అంతర్థానం వెనుక ఎన్నో గాథలు, కారణాలు చెబుతారు.
కురుక్షేత్రం సరస్వతి నది ఒడ్డున ఉంది. అక్కడికి సమీపంలోని విశాశన అనే చోట ఈ నది అంతర్థాన మైందని కూడా చెబుతారు. ఇది బద్రీనాథ్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలోని మాన గ్రామం నుంచి సుమారు అయిదు కిలోమీటర్లు ప్రయాణించి అలకనంద నదిలో కలుస్తుంది. ఆ ప్రదేశం ‘కేశవ ప్రయాగ’గా ప్రసిద్ధి. తరువాత అలహాబాద్ వద్ద గంగా యమునలతో (త్రివేణి సంగమం) కలుస్తూ, అక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఈ నదీ ప్రాంతంలోని గర్గర్ అనే నది వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. గర్గర్ లాంటి 32 చిన్నాచితక నదులు సరస్వతి పేరుతో వ్యవహృతమవుతూ దానిని చిరంజీవిని చేస్తున్నాయి.
ఈ నదీ స్మరణతోనే పాపాలు ప్రక్షాళనమవు తాయంటారు. ఈ నదీ స్నానంతోనే ఇంద్రుడు బ్రహ్మ హత్యాపాతకం నుంచి బయటపడ్డాడని, కుబేరుడికి ధనాధిపత్యం, వరుణుడికి జలాధిపత్యం ఈ నది స్నాన ఫలితమేనని, చంద్రుడు ఇందులో పుణ్య స్నానమాచరించి రాజయక్ష్మ అనే వ్యాధి నుంచి విముక్తు డయ్యాడని గాథలు ఉన్నాయి. వ్యాసభగవానుడు ఈ నదీతీరంలోనే వేద విభజనచేసి, భాగవత రచన చేశాడని గాథ.
సరస్వతీ నది పుష్కర పుణ్యస్నానానికి రాజస్థాన్ లోని బ్రహ్మ సరోవరం, గుజరాత్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం (దేవో స్వ ర్ణ క్షేత్రం), సిద్ధా పూర్ ఆలయం, మధ్యప్రదేశ్‌లోని బేడా ఘాట్ ముఖ్యమైన ప్రదేశాలు . బేడా ఘాట్ నర్మదా, సరస్వతీ నదుల సంగమం. తెలంగాణలో గోదావరి, ప్రాణహిత సంగమ ప్రదేశం కాళేశ్వరంలో సరస్వతి అంతర్వాహినిగా కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పుష్కర ఏర్పాట్లు చేస్తోంది. కాశీ నుంచి వచ్చే పురోహితులు ప్రత్యేక హారతులు, హోమాలు నిర్వహిస్తారని, ఇలా చేయటం తొలిసారి అని మంతి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
పితృదేవతలను స్మరించుకునేందుకు పుష్కరాలు మంచి సందర్భం. ఆ సమయంలో నిర్వర్తించే శ్రాద్ధకర్మల వల్ల వారికి సద్గతులు కలుగుతాయని విశ్వాసం. పుష్కర స్నానమంటే పర్యాటకమో, విహార/వినోద యాత్రగానో కాకుండా పవిత్ర కార్యంగా భావించాలి. పుష్కర స్నానం ‘దివ్య’స్నానమే తప్ప శరీర మాలిన్యాన్ని వదిలించుకొనేది కాదు.పరిశుభ్రమైన దుస్తులు ధరించి, సంకల్పం చెప్పుకొని ప్రవాహానికి ఎదురుగా, వాలుగా మూడేసి మునకలు వేయాలంటారు పెద్దలు. దంపతులు కలసి స్నాన మాడాలట. స్నానానంతరం నదీ మతల్లికి, త్రిమూర్తు లకు, పితృదేవతలకు, బృహస్పతికి, పుష్కరుడికి, సప్తర్షులకు, అరుంధతికి అర్ఘ్యం సమర్పించాలి.
‘తీర్థరాజ నమస్తుభ్యం సర్వలోకైకపావన
త్వయిస్నానం కరోమ్యద్య భవబంధ విముక్తయే’
– స్వామి