మే 11 నృసింహ జయంతి
భగవంతుడు సర్వాంతర్యామి. జగత్తంతా నిండి నిబిడీకృతమై ఉన్నాడని చాటడమే నృసింహావతార తత్వం.‘ఇందుగలడందులేడని /సందేహము వలదు/చక్రి సర్వోగతుం/డెందుందు వెదకి చూచిన/అందందే కలడు దానవాగ్రణి వింటే’ అని పోతనామాత్యుడు శ్రీమత్ మహాభాగవతంలో ప్రహ్లాదుడితో పలికించాడు. వైశాఖ శుక్ల చతుర్దశి స్వాతి నక్షత్రంలో స్వామి ఉద్భవించాడని నృసింహ పురాణం పేర్కొంటోంది. భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుని బ్రోచిన లక్ష్మీ నారసింహుడు సర్వులకు ఆరాధనీయుడు. ఉగ్ర, కృద్ధ్ద, వీర, విలంబ, కోప, యోగ, అఘోర, సుదర్శన, శ్రీ లక్ష్మీ నారసింహులుగా తొమ్మిది రూపాలలో పూజలు అందుకుంటున్నాడు. నృసింహుడిని ‘క్షిపప్రసాదుడు’ అంటారు. అనుగ్రహించదలిస్తే క్షణం కూడా జాగుచేయడని భావం. ‘నాహం వసామి వైకుంఠే నయోగి హృదయేరవౌ! / మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా!!’ (నేను వైకుంఠంలో లేను. యోగులు హృదయాలలోనో, సూర్యునిలోనో కనిపించను. నా భక్తులు తలచేచోట, నన్ను కీర్తించే చోటే ఉంటాను) అని నారదమహర్షితో శ్రీ మహావిష్ణువు అన్నట్లు పద్మపురాణం పేర్కొంటోంది. అది నారసింహుడి క్షేత్ర వైభవ విశిష్టతలను బట్టి అది అక్షరసత్యమనిపిస్తుంది.
మహాభాగవతం పేర్కొన్న 21 అవతారాలలో నృసింహావతారం14వది కాగా, ప్రధాన దశావతారా లలో నాలుగది. ‘పదునాలుగవదియైన నరసింహ రూపంబున కనక కశిపుని సంహరించె’ అన్నారు పోతన. శరణాగతులపై కరుణామృతం కురిపించే కారుణ్యమూర్తి నృసింహవిభుడు. ఈ అవతార•ం సద్యోజాతం. భక్తుడిని కాపాడేందుకు అప్పటికప్పుడు జనించింది. దశావతారాలను పూర్ణ, ఆవేశ, అంశావతారాలని మూడు విధాలుగా వర్గీకరించారు. రెండో విభాగానికి చెందినదే నృసింహావతారం. ఇవి పరిస్థితులను బట్టి ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. ఈ అవతారం సర్వశక్తి సమన్విత స్వరూపం. త్రిమూర్తుల సమన్వయశక్తితో దనుజ సంహారానికి అవిర్భవించిన పరబ్రహ్మ స్వరూపం. త్రిమూర్త్యా త్మకం. పాదాల నుంచి నాభివరకు బ్రహ్మ రూపం, నాభి నుంచి కంఠం వరకు విష్ణురూపం, కంఠం నుంచి శిరస్సు వరకు రుద్రస్వరూపంగా ఆధ్యాత్మికులు అభివర్ణించారు.
వైకుంఠ ద్వార పాలకులు జయవిజయుల శాపవిమోచన కోసం వరాహ, నృసింహులుగా అవతరించిన స్వామి, భక్తుల అభీష్టం నెరవేర్చేందుకు ఎన్నోచోట్ల స్వయంభువుగా వెలిశాడని ఆయా క్షేత్ర స్థల పురాణాలను బట్టి తెలుస్తోంది. మరికొన్ని చోట్ల ప్రజలు తమ ఇక్కట్లను తీర్చిన దైవంగా నరసింహు డిని ప్రతిష్ఠించి అర్చిస్తున్నారు. ఈ స్వామి ఆలయాలు పర్వతాలు, కొండగుహలు, అరణ్యాలు, సరిహద్దుల్లో దర్శనమిస్తాయి. కేశవుడు ఎక్కడెక్కడో ఈ రూపంలో కాపాడుతాడో శాస్త్రం చెబుతూ, ‘అటవ్యాం నారసిం హశ్చ…’ అనడంలో ఇదే బోధపడుతుంది. స్వామి ఆవిర్భవించినటువంటి ప్రదేశాలనే ఆయనను ప్రతి ష్ఠించదలచిన వారు ఎంచుకోవాలని ప్రాచీన వాస్తు గ్రంథం ‘మయమతం’ పేర్కొందని పెద్దలు చెబుతారు.
బ్రహ్మమానస పుత్రులు సనకసనందుల శాపం కారణంగా వైకుంఠ ద్వారపాలకులు జయవిజయులు మూడు జన్మల్లో హరివైరులుగా పుడతారు. కృతయుగంలో తొలిజన్మలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులుగా జన్మించారు. ధరను చాపగా చుట్టి సముద్రంలో ముంచిన హిరణ్యాక్షుడుని శ్రీహరి వరాహారూపుడై అంతమొందించి భూమిని ఉద్ధరించారు. సోదరుడిని హతమార్చిన విష్ణువుపై రగిలిన హిరణ్యకశిపుడు ప్రతీకార వాంఛతో బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి ‘నరులు, మృగాల వల్ల గాని, పగలుకాని, రాత్రి కాని..తదితర లెక్కకు మిక్కిలి మినహాయింపులతో మరణం లేకుండా వరం పొందాడు. అయితే పరమాత్మ ఆ వరాలకు ఎక్కడా విఘాతం కలుగకుండా తన లీలను ప్రదర్శించి దానవరాజును కడతేర్చారు. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, త్రేత,ద్వాపర యుగాలలో శ్రీరామ, శ్రీకృష్ణావతారాలుగా.. రావణ కుంభకర్ణుడు, శింశుపాల దంతవక్త్రులను వధించిన శ్రీ మహావిష్ణువు, నృసింహ అవతారంగా హిరణ్యకశిపుడే తన మృత్యువును తానే ఆహ్వానించుకునేలా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాడు. ‘సర్వోపగతుడని చెబుతున్న హరి ఈ స్తంభంలో కూడా ఉన్నాడా?’ అని కుమారుని ప్రశ్నించి దానిని గదతో బద్ధలు కొట్టాడు. అందులో సూక్ష్మరూపంలో ఉన్న హరి నృసింహుడిగా (స్తంభోద్భవుడు) వెలువడ్డాడు. హిరణ్యకశిపుడు పొందిన వరం ప్రకారమే… పగలు-రేయి కాని సంధ్యా సమయంలో, సగం సగం మృగ, మానవ రూపంగా, ఇంటా బయట కాకుండా ద్వారం మధ్యలో, నేలన నింగిలో కాకుండా ఒడిలోకి లాక్కొని, ప్రాణసహితం, ప్రాణరహితం కానీ వాడిగోళ్లతో చీల్చి వధించాడు. ఘోర తపస్సు(ల)తో సాధించిన వరాలతో దానవశక్తి ఎంత గొప్పదైనా, ఆత్మబలానికి ప్రతిరూపమైన దైవశక్తికి సాటిరాదని ఈ అవతారం నిరూపిస్తుంది.
నృసింహుడు దుష్టులకు ఎంత భయంకరుడో శిష్టులకు అంతటి ప్రసన్నుడు. ఉగ్రరూపుడే శరణుకోరిన వారికి కొంగుబంగారం. నృసింహ జయంతినాడు స్వామిని అర్చించడం వల్ల సర్వపాపహరణం, మోక్షసిద్ధి కలుగుతాయని నృసింహపురాణం చెబుతోంది. నరసింహుడు కొన్ని చోట్ల మూలవిరాట్‌గా, సాలిగ్రాములుగా, ఇతర ఆలయాలలో ఉపాలయా లుగా, గోడలు, స్తంభాలపై శిలా రూపాలుగా దర్శన మిస్తాడు. స్వామి స్తంభం నుంచి వెలువడినందున (స్తంభోద్భవుడు) శ్రీవైష్ణవులు భవంతి స్తంభాలను తిరుమణి, తిరుచూర్ణంతో అలంకరించి అర్చించడం కనిపిస్తుంది.
దేశవ్యాప్తంగా వందలాది నృసింహ ఆలయాలు ఉండగా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విశిష్టత గోచరిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఉత్తరాంధ్రలోని సింహాద్రి నుంచి రాయలసీమలోని కదిరి వరకు, తెలంగాణలోని యాదాద్రి తదితర క్షేత్రాలు దివ్య క్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. అంతర్వేది, కోరుకొండ, వేదాద్రి, ఆగిరిపల్లి, మంగళాద్రి (మంగళగిరి), సింగరాయ కొండ, పెంచలకోన అహోబిలం, స్తంభాద్రి, ధర్మపురి, మల్యాద్రి తదితర క్షేత్రాల్లో రాజ్యలక్ష్మీసమేత శ్రీ నృసింహస్వామి విశేష అర్చన, ఆరాధనలు అందుకుంటున్నారు. అప్పన్నగా సంభావించుకునే సింహాచలేశుడు ఏడాదిలో ఒక రోజు మాత్రమే (వైశాఖ శుద్ధ తదియ)నిజరూప దర్శనమిస్తాడు. అదే చందనయాత్ర. తన తండ్రి పినతండ్రులు హిరణాక్ష్య, హిరణ్యకశిపుల సంహరణకు ఎత్తిన రెండు అవతా రాలు (వరాహ, నృసింహ) ఒకటిగా శాంతమూర్తిగా దర్శనభాగ్యం కలిగించాలన్న ప్రహ్లాదుడి విన్నపాన్ని మన్నించిన స్వామి ఈ రూపంలో ప్రభవించాడు. అక్కడి గంగాధార లాంటి తీర్థం, వరాహ నృసింహుడి సాటి దైవం మూడు లోకాల్లోనూ లేడని (గంగధార సమం తీర్థం క్షేత్రం సింహాద్రి సమం/నారసింహ సమోదేవో త్రైలోక్యే నాస్తి నిశ్చయః) అని స్థలపురాణ వచనం. అంతర్వేది సాగర సంగమక్షేత్రం. వేదాద్రిలోని యోగానంద నృసింహుడు జ్వాల, సాలగ్రామ, వీర, యోగానంద, లక్ష్మీనరసింహులుగా పూజలు అందుకుంటున్నాడు. కృష్ణానదిలో సాలి గ్రామంగా అవతరించాడు. మంగళగిరిలో కొండ దిగువున శ్రీలక్ష్మీనృసింహస్వామి, కొండపైన పానకాల స్వామి, గిరి శిఖరంపై గండాల నరసింహస్వామి కొలువై ఉన్నారు. శ్రీలక్ష్మి ఈ కొండపై తపస్సు చేసినందున ‘మంగళాద్రి’, ‘మంగళగిరి’గా ప్రసిద్ధ మైందని స్థల పురాణం. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కల్యాణం, మరునాడు రథోత్సవం విశిష్ట మైనది. నారసింహ క్షేత్రాల్లో రథోత్సవానికి అంతర్వేది, మంగళగిరిని విశేషంగా చెబుతారు. అహోబిలంలో స్వామి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల ఈ క్షేత్రం ‘అహోబలం’ అనీ వ్యవహారంలోకి వచ్చిందట. ఆలయ సమీపంలోని కొండపై నవ నారసింహమూర్తులు కొలువై ఉన్నారు. ఆళ్వారులు దర్శించి, సేవించిన క్షేత్రాలను ‘దివ్య దేశాలు’ అంటారు. అలాంటి వాటిలో అహోబిలం ఒకటి.
కదిరిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. హిరణ్యకశిప వధానంతరం ఆగ్రహావేశాలతో ఈ ప్రాంతానికి వచ్చిన స్వామి అక్కడి అడవిలో క్రూర జంతువులను వేటాడారని, అలా అయనకు ‘వేటరాయుడు’ అని పేరు వచ్చిందని చెబుతారు. తెలంగాణ లోని ప్రముఖ నారసింహా క్షేత్రాల్లో ఒకటి యాదాద్రి వైభవం స్కంద, బ్రహ్మాండ పురాణాల్లో వర్ణితమైంది. ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీ నృసింహ రూపాలతో అవతరిం చాడు. ధర్మపురిలో నృసింహుడి ఆలయం వెలుపల గల యమధర్మరాజు ఆలయాన్ని దర్శించి గండ దీపంలో నూనెను సమర్పించిన వారికి అపమృత్యు దోషం ఉండదని భక్తుల విశ్వాసం.
తెలుగురాష్ట్రేతర ప్రాంతాలు కాంచీపురం, కుంభకోణం, రామేశ్వరం, గయ, బ్రహ్మకపాలం, హరిద్వారం తదితర క్షేత్రాలు భక్తకోటిని అలరిస్తు న్నాయి. దేశవ్యాప్తంగా వందలాది నృసింహ ఆలయాలు ఉండగా, ఒక్కొక్క చోట ఒక్కొక్క విశిష్టత గోచరిస్తుంది. ఆసేతు శీతాచలం పర్యటించి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించిన జగద్గురువు శంకరభగవత్పా దులు, నృసింహుడిని శ్లాఘించారు. మానవాళిపై అపార సహానుభూతితో వారికి చేయూతనివ్వాలని వేడుకుంటూ లక్ష్మీనరసింహ కరావలంబస్తోత్రం (కరావలంబ.. చేయూతనివ్వడం) అందించారు. దీని పఠనంతో సమస్త భయాలు దూరమై, లక్ష్మీ నృసింహుడి కారుణ్యం అమృతవాహిని అవుతుందని చెబుతారు.
డా।। ఆరవల్లి జగన్నాథస్వామి
సీనియర్ జర్నలిస్ట్