కొమ్మూరి పద్మావతి.
జనన మరణాలు చెన్నైలో.
అరవై రెండేళ్ల జీవనకాలం.
కథా రచయిత్రి, తొలితరం రంగస్థల నటీమణి, సంగీతంలో దిట్ట, రేడియో ప్రసంగకర్త. ప్రధానంగా సంస్కరణాభిలాష.
ఇన్ని ప్రత్యేకతలున్నా – ఏనాడూ పురస్కార సత్కారం కోరలేదు. బిరుదులూ పదవులను కోరుకోలేదు. ప్రచారానికి బహుదూరం.
ఇదంతా సాధ్యమేనా అంటే, ఆమెకు సాధ్యమే. ఈ మే నెలలో స్మృతిలోకి తెచ్చుకుంటున్నాం.
అదే ప్రధానంగా యాభై ఐదేళ్ల తర్వాత… ఇప్పటికీ.
ఎక్కడి 1970! ఇప్పుడిది 2025.
కళాత్మకతకు ముగింపు ఉంటుందా ఎక్కడైనా?
ఉండదుగాక ఉండదు.
ఆమెను తలవని హృదయం ఉండదంతే!
ఎందుకంటే, ఆ ప్రజ్ఞ బహుముఖం కాబట్టి.
‘మా అమ్మ ప్రజ్ఞావతి’ అనేవారు తనయ ఉషారాణి.
పద్మావతి… ప్రజ్ఞావతి. అలా ఎలా అయ్యారంటే…
అది 1908. ఆ ఊరు చెన్నై.
ఆ నగరంలోనే పద్మావతీ దేవి జననం. తల్లిదండ్రులు సామాజిక దృక్పథం ఉన్నవారు. ఉద్యోగ, సంపాదనపైనే ఆధారపడేవారు కాదు.
అందుకే ఆమెకీ మొదటి నుంచి సమాజ హిత చింతన. వ్యక్తిగత ఆర్జనపైన విముఖత. చేసే ప్రతీ పనీ తోటివారికి ఎంతో కొంత ఉపకరించాలన్న తపన, ఉత్సుకత.
చదువు, సంగీతం, వివాహం. ఈ దశలన్నీ అయ్యాయి. అప్పట్లో నాటక రంగస్థలాన బళ్లారి రాఘవ ప్రాభవం. అనేకానేక భాషల్లో ప్రదర్శనలిచ్చిన అనుభవం. దేశ విదేశాల్లో పర్యటనలు సాగించి, భారతీయ కళను పరివ్యాప్తం చేసిన ఘనతత్వం.
స్త్రీ పాత్రలను వారే పోషించాలన్నది రాఘవ నాదం, విధానం. భావం, భాష, శైలి, చురుకుదనం, సమయస్ఫూర్తి నిండిన వనితల పాత్ర పోషణతో రంగస్థలం శోభించాలన్నదే ఏకైక అభిమతం. అందిపుచ్చుకున్నారు పద్మావతి. సాంఘిక, పౌరాణిక నాటక ప్రదర్శనలతో అలవోకగా దూసుకెళ్లారు.
మొదటి పాత్ర పోషణం ‘లీలావతి’గా. ప్రహ్లాదుని మాతృమూర్తిగా భక్తి, ధర్మనిరతి కలిగిన వ్యక్తిగా. లీల అంటే భగవానుని లీల. ప్రహ్లాదం అనేది ఆత్మానంద సూచిక. భక్తప్రహ్లాదను చూసి లోలోన ఆనందించిన జనని.ఆత్మశుద్ధి సమన్విత. అంతటి కీలకపాత్రలో నటించడం కాదు… జీవించేవారు పద్మావతి!
భక్త రామదాసు, చంద్రగుప్త, మరెన్నో చారిత్రక నాటక రూపాల్లో అభినయించేవారు. పాత్ర నేపథ్యం గ్రహించి, పూర్వాపరాలు పరిశీలించి, సంభాషణలతో పాటు వ్యక్తీకరణ పటిమకు ప్రాధాన్యమిచ్చి, వేదికమీద నటరాణిగా నిలిచేవారామె.
భక్తి ప్రపత్తి చాటాలన్నా, ఉత్కంఠ భరితమైన అభినయ రీతిని కనబరచాలన్నా మరెవరైనా ఆమె తర్వాతే! సమకాలీన సమస్యలను ప్రతిఫలించే సాంఘిక నాటకాలతోనూ ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న సందర్భాలు అనేకం.
నాటక ప్రదర్శనల మధ్య కాలవ్యవధిలో అతివలు ఎదుర్కొనే పలు స్థితిగతుల మీద పరిశీలనలు, అధ్యయనాలు సాగించారు. పరిష్కార మార్గాల అన్వేషణ క్రమంలో ఎన్నెన్నో పుస్తకాలు చదివారు. సంస్కరణవాదులతో చర్చలు సాగించి, ఆ అంశాలకు అక్షరరూపం ఇచ్చేవారు. వాటిని ప్రాచుర్యానికి తెచ్చి, ఆ విధంగా తనవంతు సేవలను విస్తారంగా అందించిన క్రియాశీలత.
ఆలోచనలకు, ఆచరణకు అంతటి సమన్వయం కేవలం ఆమెకే సాధ్యపడింది. ప్రజాదరణ పొందడం తక్షణ ఫలితం.
డాక్యుమెంటరీ చిత్రరంగంలో సైతం ఆమెది చెదరని ముద్ర. ఆ రోజుల్లోనే కొన్నింటికి వ్యాఖ్యాతగా పనిచేశారు. ప్రస్ఫుటమైన ఉచ్ఛారణతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. రచనను రూపుదిద్దడం, గాత్ర సహాయం అందించడంలోనూ ప్రత్యేకత నిరూపించుకోవడంతో పద్మావతి పేరు ఊరూవాడా మారుమోగింది.
ఆమె శతజయంతి మహోత్సవాలు 2008లో అయ్యాయి. అప్పుడు కొందరి అనుభవాలు వింటుంటే, ఎంతో విస్మయం కలిగింది. పద్మావతి గురించిన ఆ ప్రజ్ఞ అనుభవపరంపరలు తెలుసుకుంటే – ఒక వ్యక్తి ఇంతటి ప్రావీణ్యత గడించడం అసలు సాధ్యమయ్యే పనేనా అనిపిస్తుంది. ఉదాహరణకు రచనారంగం. ఆమె కలం విన్యాసం.
‘పొగడదండ’ కథనే తీసుకుందాం. ఇందులో సీతది కీలకపాత్ర. ఆమెకి పెళ్లి చేసి తెగ సంబరపడుతుంది మేనత్త. అయితే ఆ వివాహం ఆ అమ్మాయికి అస్సలు ఇష్టంలేదని తెలుసుకోలేక పోతుంది. ‘పొగడపూల దండ’ అనడంలోనే కథానేపథ్యం స్పష్టమవుతుంది చదువరికి. తెల్లటి పొగడపూలు. రాలినపుడు తెల్లదనం కోల్పోయి, లేత గోధుమ వన్నెకు మారిపోతాయి. సువాసన మటుకు అలాగే ఉంటుంది. పరిమళం వీడదు. చిట్టి నక్షత్రాల మాదిరి ఉండే ఆ పూలు – చెట్ల నిండా విరగబూస్తుంటాయి. అటు తర్వాత ఒకటొకటిగా రాలి నేలవాలుతుంటాయి. ఈ వివరాలు తెలిసి కథను చదువుతుంటే, ఎంతైనా భావార్థం అవగతమవుతుంది మనందరికీ!
ఈ ఒక్క కథా ఉదాహరణ చాలదా- కొమ్మూరి పద్మావతీ దేవిలోని సామాజిక స్పృహ, అవగాహన శక్తి ప్రాధాన్యం తెలియడానికి? ఏ వాక్యం రాసినా అందులో ప్రతీకాత్మకత ఉండేది. స్త్రీ సమస్యలను పరిష్కరించి తీరాలన్న గట్టి పట్టుదల కనిపించేది.
బళ్లారి రాఘవ సతీమణి కృష్ణమ్మ. పిలిచేపేరు ‘పెద్దమ్మ’ అని పద్మావతీదేవే తన రచనలో వివరించారు. రచనాకాలం 1940-1945 మధ్యన. అంటే అప్పటికి రచయిత్రి పద్మావతికి నలభై ఏళ్లలోపు వయసు. పెద్దమ్మ దొడ్డ మనసును ఎంతో బాగా విపులీకరించారు.
నిదర్శనం చూద్దాం – (రచయిత్రి వాక్యాల్లోనే)….
‘పెద్దమ్మ చేసే ప్రతీ పనిలో విశేషమే ఉంది. ఇంటికి ఆడపిల్లలెవరైనా వస్తే ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. వాత్సల్యంగా పలకరిస్తుంది. కళకళలాడే కళ్లు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నిండుకుండ తొణకదు అంటారు కదా. సరిగ్గా అదే విధంగా.’
ఇవే వాక్యాలు పద్మావతికీ వర్తిస్తాయి. ఆదరణలో తనూ పెద్దమ్మ మాదిరే! తన (పద్మావతి) కూతురు ఉషకి పెద్దమ్మ పెట్టిన పేరు- సుభద్ర. చెవికి ఇంపుగా ఉంది కదూ ఆ పేరు!
స్త్రీలు నాటకరంగంలోకి ప్రవేశించాలన్నది బళ్లారి రాఘవ విధానమైతే, ప్రథమంగా ఉత్సాహ ప్రోత్సాహాలు అందించింది పెద్దమ్మే! (ఆయనా భార్యను అలానే పిలిచేవారు).
ఆదర్శాన్ని ఆచరణగా మార్చడం పెద్దమ్మ అలవాటు. నాటక ప్రదర్శన కోసమే పలు భాషలు నేర్చుకుంది. అనేక పాత్రలను పోషించింది. అదే మాదిరిగా పద్మావతి పయనం కొనసాగింది. మొదటి నుంచి చివరిదాకా ఆ ఉత్తేజమే! ప్రతిభకు ఊతం తోడైనట్లు.
‘చిట్టి తండ్రి’ అని పద్మావతి రాసిందీ మరో కథానిక. అందులోని సంభాషణలు సహజ సుందరత్వాన్ని చూద్దాం ఇప్పుడు.
‘బావా! అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా’ అడిగింది.
‘నే చెప్పనా! నీకేమో అబ్బాయి. అక్కయ్యకి అమ్మాయి. అవునా’ అంది మళ్లీ. అంతా నవ్వారు.
ఆ తర్వాత ఒక రోజున – బాలచంద్రుడి లాంటి బంగారు కొడుకును కంది సుశీల. పసివాడిని చూసి అందరూ మురిసిపోయారు.
కాలపరిణామంలో….
ఆ నొక్కుల నొక్కుల జుట్టూ, నవ్వితే బుగ్గలమీద సొట్టలూ చూడు- అంటూ కొనసాగుతుంది కథ. ఈ రచనలో ఎన్నెన్ని మలుపులో చెప్పలేం. ముగింపును ఏ మాత్రం ఊహించలేం.
సాంఘిక నాటక చరిత్ర గురించి చెప్పాల్సి వస్తే మళ్లీ మనం 1931లోకి వెళ్లాల్సిందే. అది చెన్నై, అక్కడి ప్రదర్శన ధియేటర్‌లో మొదటగా నాటకాన్ని వేశారు. తప్పెవరిది? అనే ప్రదర్శన అది. నటుడు బళ్లారి రాఘవ అయితే, నటి మరెవరో కాదు- పద్మావతి!
కొమ్మూరి పద్మావతీదేవి కుటుంబీకులు రచనారంగంలో పేరెన్నిక గన్నవారు. కుమార్తె ఉషారాణి దేశ రాజధాని నగరంలోని ప్రసిద్ధ పత్రికలో పనిచేశారు. కథలు, నవలలు, ఇంకెన్నో పక్రియల్లో రచనలు వెలువరించారు. సాహిత్యమే తన వృత్తి ప్రవృత్తీ అనేవారామె. బాలసాహిత్య ప్రోత్సాహానికి ఎంతో పరిశ్రమించారు. స్ఫూర్తి తన తల్లి నుంచే లభించిందన్నారు.
కుమారుడు సాంబశివరావు తన మాతృమూర్తి గురించి చెప్తూ ఒక సందర్భంలో ‘ఆమె ప్రజ్ఞా పాటవాలు ముగ్ధుల్ని చేస్తాయి ఎవరినైనా’ అన్నారు. అందువల్లనే ‘పద్మావతి కాదు – ప్రజ్ఞావతి’ అని పిలిచి తలచుకోవాలనిపిస్తుంది ప్రతీ ఒక్కరికీ.
ఎంతగా ఎదిగారో, పేరు పొందారో ఆమె! అయినా సత్కారాలకు దూరంగా ఉంటూ, సత్కా ర్యాలను దగ్గరుండి చేయించడం పద్మావతీదేవి సహజ స్వభావం. అదే తన ఘన విజయ రహస్యం.
జంధ్యాల శరత్‌బాబు
సీనియర్ జర్నలిస్ట్