యునెస్కో ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా భారతదేశానికి ఒక శుభవార్త వచ్చింది. సాంస్కృతిక పరిరక్షణలో భారత్‌కు ఉన్న శ్రద్ధాసక్తులు ఎంతటివో ఇది ప్రపంచానికి చాటుతుంది. నిజానికి ఇంతకు మించి భారత్ గర్వించేది ఏమీ ఉండదు. భగవద్గీతను ఇవాళ ఎవరో గుర్తించి గొప్ప గ్రంథంగా సర్టిఫికెట్ ఇవ్వక్కరలేదు. భగవద్గీతతో పాటు భరతుడి ‘నాట్యశాస్త్రం’ కూడా గౌరవాన్ని పొందడం గర్వించదగినదే. మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో ఈ రెండు పుస్తకాలు చోటు దక్కించుకున్నాయి. యునెస్కోకు చెందిన ఈ రిజిస్టర్‌లో ప్రపంచ స్థాయి వారసత్వ చిహ్నాలను నమోదు చేస్తారు. దీనితో యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ వారసత్వ చిహ్నాల (గ్రంథాలు) సంఖ్య 14కు చేరింది. యునెస్కో మెమరీ రిజిస్టర్‌లో మన రెండు మహా గ్రంథాలకు చోటు లభించడం ఎంతో గర్వించదగినదని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇంతక్రితం ఈ గౌరవం పొందిన వాటిని ఒకసారి చూద్దాం. 1. సిద్ధ, ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన తాళపత్రాలకు 1997లో ఈ గౌరవం దక్కింది. చెన్నైలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏసియన్ స్టడీస్‌లో ఈ పత్రాలు ఉన్నాయి. 2. శివ రాతప్రతులు: ఇవి పుదుచ్చేరిలో ఉన్నాయి. శైవం, సిద్ధం వైద్యం, భక్తిగీతాలు ఉన్న ఈ పత్రాలకు 2005లో ఈ గౌరవం దక్కింది.3. రుగ్వేద తాళపత్రాలు: 10,500పైగా మంత్రాలు ఉన్న పత్రాలివి. భారతీయ తత్త్వశాస్త్రానికి మూలాలే ఇవన్నీ. వీటికి 2007లో గుర్తించారు. 4. తరీఖ్ ఎ ఖాందాన్ ఎ తిమురియా: వీటికి 2011లో గుర్తింపు వచ్చింది. అక్బర్ కాలంలో పర్షియా భాషలో రాసిన పత్రాలు. తైమూర్, మొగల్ వంశాల పరంపరను వివరిస్తాయి. 5. విమలప్రభ: ఇది 11 శతాబ్దం నాటి బౌద్ధ గ్రంథం. తంత్రం, ఖగోళశాస్త్రం, భారతీయ తత్త్వశాస్త్రం గురించి ఇందులో ఉంది. దీనికి కూడా 2011లోనే గుర్తింపు ఇచ్చారు. 6. శాంతినాథ చరిత్ర: జైనంలోని 16వ తీర్థంకరుడు గురించి సచిత్రంగా వివరించే గ్రంథం ఇది. 1396లో దీని రచన ఆరంభమైంది. 2013లో దీనిని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చారు. 7. గిల్గిత్ రాతప్రతులు: కశ్మీర్‌లో వీటిని కనుగొన్నారు. బిర్చ్ చెట్ల బెరడుతో చేసిన పత్రాలపై రాసి ఉన్నాయి. ఆసియాలోని చాలా బౌద్ధ సంప్రదాయాల వివరాలు ఉన్నాయి. దీనికి 2017లో గుర్తింపు లభించింది.