‘భగవంతునికీ, భక్తునికీ అనుసంధానమైనది’ అన్న మాటలతో పూజగది దృశ్యంతో ఒక వ్యాపార ప్రకటన వినిపిస్తుంది. ఆ ప్రకటన ఏ వస్తువు గురించో ఇట్టే గుర్తు పడతారంతా. అదొక అగరబత్తీ వ్యాపార ప్రకటన. కొవ్వొత్తికీ, అగరబత్తీకి ఒక సామ్యం ఉంది. కొవ్వొత్తి తను కాలుతూ వెలుగునిస్తుంది. అగరబత్తీ తాను కాలిపోతూ, సువాసనలను వెదజల్లుతూ ఒక ప్రశాంత వాతావరణాన్ని సృష్టించి చివరకు బూడిదగా మిగిలిపోతుంది. దీన్ని బట్టి శారీరక అందం శాశ్వతం కాదనీ, దాన్నించి వచ్చే సువాసన అనే గుణగణాలు, విలువలు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయనే పరమార్ధాన్ని మనకు చెప్పకనే చెబుతున్నట్లుంది. ధూపం, అగరబత్తీ పూజాద్రవ్యాలుగానే చూసిన వాటికి చాలా చక్కని ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చరిత్ర కూడా పెద్దదే.
1900లో మైసూరు రాజు ఈ గుబాళింపుని ఎక్కువ సమయం వచ్చేలా చేయమని తన ఆస్థానంలోని అధికారిని కోరాడు. ఆ అధికారి ఓ వెదురు పుల్లకు గంధం పేస్టును, కొన్ని నూనెలను కలిపి అగరబత్తిని తయారు చేశారు. ఆ తరువాత సుగంధాలయవారు దాన్ని అనుకరించి, నేటి అగరబత్తీకి కారణమయ్యారు. భారతదేశంలో సుమారు 5000 అగరబత్తీ కంపెనీలు నడుస్తూ కొన్ని లక్షల మందికి పని కల్పిస్తున్నాయి. తిరుపతిలో శ్రీవారికి ఉపయోగించిన నిర్మాల్యాలతో (వాడిన పువ్వులను) దేవస్థానం వారు ఏడు బ్రాండ్లు గల అగరబత్తీని తయారు చేస్తున్నారు. దీని నుండి భారతదేశానికి ఎక్కవ మొత్తంలో విదేశీమారక ద్రవ్యం వస్తున్నది.
నిశ్శబ్దంగా వున్న గదిలో అగరబత్తీ వెలిగించాక వచ్చే ఆ సువాసన మనసుకు హాయినిస్తుంది. ఆ పొగ గాల్లో రింగులు తిరుగుతూ నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎర్రగా వెలిగే దాని అంచు నక్షత్రాన్ని తలపిస్తుంది. అగరబత్తీని చూస్తూ దాని వాసన పీలుస్తుంటే మనసులో అనవసరపు ఆలోచనలు దూరమవ్వడంతో పాటు జ్ఞాపకాలను పోగేస్తుంది.
అగరబత్తీలను వాడేసిన పూలు, కొబ్బరికాయలు, ఆవు పేడతో వీటిని తయారు చేసుకోవచ్చును. అగరబత్తీని తెలుగులో అగరువత్తి, సాంబ్రాణి వత్తి అని అంటారు. ఇంట్లో, గుడిలో భగవంతుడికి పూజ చేసేటప్పుడు అగరబత్తీని వెలిగిస్తారు.
దశాంగం గుగ్గులోపేతం
సుగంధం చసుమనోహరం
ధూపం దాస్యామి దేవేశి
వరలక్ష్మి గృహాణితం
ధూపం సమర్పయామి అని అమ్మవారి పూజలో చెబుతారు.
ప్రకృతి మనకు చాలానే ఇచ్చింది. దాన్నుంచి మనం మన ఆహారాన్ని, ఆనందాన్నీ వెదుక్కుంటాం. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సాంబ్రాణి ధూపం అలా అడవితల్లి ఒడిలోనే పుట్టిందే. ఆ వృక్ష జాతులే బోస్వెల్లియా శాక్రా (ఫ్రాంకిన్సెస్) కొమ్మిపోర మీరా (మిర్). ఈ చెట్లలో ఫ్రాంకిన్సెస్ జిగురు గట్టిగా ఉంటే, మిర్ రకం బంక గాఢమైన వాసన కలిగి ఉంటుంది. మధ్య ప్రాచ్య దేశాల్లోనూ, ఉత్తర ఆఫ్రికాలోనూ దాదాపు 5 వేల సంవత్సరాలకు పూర్వం నుంచే సాంబ్రాణి వ్యాపారం నడిచింది. ఆ కారణంగానే సుగంధమార్గం చిద్రూపం రూట్ ఏర్పడింది. స్నానం చేయించాక ఇప్పటికి పసిపిల్లలకు సాంబ్రాణి పొగవేస్తారు. దీని నుండి తీసే నూనెలను అనేక పెర్‌ఫ్యూమ్‌లలో వాడతారు.
సాంబ్రాణిని ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. తెల్లవారు జామున గుళ్లోకి వెళ్లగానే గుప్పున ముక్కు పుటాలను తాకే సుగంధ పరిమిళం, స్నానం చేయించిన పసిబిడ్డలకు ఎత్తుకోగానే హాయిన గొలిపేలా వచ్చే కమ్మటి సువాసన, పండగలప్పుడు ఇంటిని చుట్టేసే గుబాళింపుల ధూపం సాంబ్రాణి.
గాలిలోని బాక్టీరియా స్థాయిని అగరబత్తీ బాగా తగ్గిస్తుందని 2010లో జవాహార్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో పరిశోధనలో మైక్రోబయాలజీ ప్రొఫెసర్ డా।। విజయకుమార్ తెలియజేశారు.
నిద్రలేమితో బాధపడే వారికి రెండు అగరబత్తీలు వెలిగించి ఉంచితే ప్రశాంతమైన, మెరుగైన తీరులో నిద్రపోతారని 2016లో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం పరిశోధకులు తెలియజేస్తున్నారు. ఒత్తిడితో బాధ పడేవారికి అగరబత్తీలు వెలిగించడం వలన మనసుకు ప్రశాంతం కలుగుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఇంట్లో ప్రతికూల శక్తులను తరిమేందుకు అగరబత్తీలను వెలిగిస్తారని హిందూ శాస్త్రాలు చెపుతున్నాయి.
అగరబత్తీల కారణంగా శరీరంలో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ముఖ్యంగా లావెండర్, పుదీనా, యూకలిప్టస్ ప్లేవర్లు గల అగరబత్తీలు వీటికి ఉపకరిస్తాయని చెపుతున్నారు. మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. సృజనాత్మకమైన పనులకు అగరబత్తీల వాసన అవసరం.
పురాణాల ప్రకారం దేవుళ్లు ధూపాన్ని ఇష్టపడతారు. దేవతారాధన సమయంలో ధూపం వేయడం వలన వారు సంతోషిస్తారని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆర్గానిక్ అగరబత్తీలను ఎక్కువగా ప్రోత్సహించాలన్న సంగతి ఎవరూ విస్మరించరాదు.
బృహత్ సంహితలోని ఒక అధ్యాయం ‘‘గంధయుక్తి’’ (పరిమళాల మిశ్రమం) కి అంకితం చేశారు. వరహా మిహిర అనేక సుగంధ సూత్రాలను అందించాడు. దానిలో గంధార్ణవ (పరిమళాల మహాసముద్రం)లో 16 పదార్ధాలను వివిధ మోతాదుల్లో మిశ్రమాలుగా కలపడం ద్వారా 43,680 రకాల పరిమళ ద్రవ్యాలను తయారు చేయవచ్చని చెప్పాడు. పద్మశ్రీ రచించిన ‘‘నాగర సర్వస్వ’’ పరిమళం గురించి ఓ అధ్యాయం రాశాడు.
ధూపం కర్రలు (అగరబత్తీ) తయారీకి కావలసినవి వెదురు కర్రలు, రంపపు పొడి, జిగురు, (చెట్ల బెరడు నుండి తీసిన పదార్దం) పెర్‌ఫ్యూమ్ పదార్థాలు (పేస్ట్), నూనెల ద్రావకం, బేస్‌పేస్ట్‌ను వెదురు కర్రకు పూసిన తర్వాత, అది తేమగా ఉన్నప్పుడే చక్కటి చెక్క పొడితో చుడతారు. కొద్ది రోజులు ఆరబెట్టిన తరువాత సువాసన కలిగిన ద్రావకంలో ముంచుతారు.
భారతదేశంలో కర్ణాటకను అగ•రబత్తీ రాజధానిగా గౌరవిస్తారు. మైసూరు, బెంగళూరు సువాసన గల అగరబత్తీ కేంద్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయినా నేడు చాలా రాష్ట్రాలు అగరబత్తీ తయారీకి పూనుకొని లాభాలు గడిస్తున్నాయి.
వేదాలలో ప్రత్యేకించి అధర్వ, రుగ్వేదాలలో ధూపం తయారుచేసే ఏకరూప పద్ధతిని ప్రోత్సహించాయి. ధూపం తయారీ అనేది ఆయుర్వేద వైద్య విధానంతో అంతర్గతంగా ముడిపడి ఉంది. మహా భారతం కూడా ధూపాన్ని గురించి వివరించింది. కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో సుగంధద్రవ్యాల అమ్మకంపై 10వ వంతును పన్నుగా వసూలు చేసినట్లు చెప్పారు.
ధర్మశాస్త్రం, పురాణాలు ధూపానికి చెందిన పదార్ధాలను గురించి పరిచయం చేస్తూ గంధం, కలబంద, కర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలైన వస్తువులను గురించి వివరించాయి. బౌద్దులకు ధూపం మతాచారమయింది. బౌద్ద సన్యాసులు చైనాకు ధూపం కర్రల తయారీని నేర్పించారు.
భారతదేశం ప్రపంచంలో ధూపాలను ఉత్పత్తి చేసే ముఖ్యమైన దేశం. ఎగుమతిదారు కూడా. ఆ తరువాత చైనా, వియత్నం వస్తాయి. భారత్ నుండి 87,401 (షిప్‌మెంట్స్) ఎగుమతి కాగా 22,095 షిప్‌మెంట్స్‌తో చైనా ద్వితీయస్థానంలో ఉండగా 13,181 షిప్‌మెంట్స్‌తో వియత్నాం తృతీయ స్థానంలో ఉంది.
చదువు ప్రారంభంలో సుగంధభరితమైన అగరబత్తీ ఒకటి వెలిగించి పెట్టండి. మంచివాసన వస్తుంటే గ్రహణశక్తి బాగుంటుంది. ముక్కు కన్నం రాక్టెక్స్ వరకు వెళుతుంది. కార్టెక్స్ బాగుంటే చదువు బాగా వస్తుంది. జవ్వాదిని గెడ్డం క్రింద రాసుకుంటే స్మెల్ సర్కిల్ ఏర్పడుతుంది. తద్వారా చదువు బాగా వస్తుంది అని ఓ రచయిత అభిప్రాయపడ్డారు.
శ్రీఖండం ఘనసారాఢ్యం గుగ్గుల్వగరు సంయుతమ్ ధూపం దాస్యే యచ్చ యుష్మద్రూపం సాధుపమంగురో శ్రీ నిఖిలేశ్వరానంద స్వరూప నారాయణ దత్తశ్రీమాలీ గురుభ్యోనమః ధూపమాఘ్రా పయామి.
డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు