‘ఢిల్లీలో ఉన్న ఎర్రకోటతో ఆపేశారేమి? మొగలులు నిర్మించిన తాజ్‌మహల్, ఫతేపూర్‌సిక్రీ కూడా మీవే నంటే పోయేది కదా!’ ఆఖరి మొగల్ పాలకుడు బహదుర్ షా జఫార్ నిజమైన వారసు రాలిని. ఎర్రకోట నాకు చెందుతుంది. కాబట్టి, ఇప్పించవలసింది’ అంటూ ఒక మహిళ వేసిన వ్యాజ్యానికి సుప్రీంకోర్టు సరైన సమాధానం ఇచ్చింది. అయినా ఇదొక కేసా? దీనికి విచారణ అర్హత ఉందా అని ఆమె తరఫు న్యాయవాదిని కూడా దుమ్ము దులిపింది అత్యున్నత న్యాయస్థానం. ఇంతకీ ఆ మొగల్ వారసురాలి పేరు సుల్తానా బేగం. ఈ కేసులో విచారణకు స్వీకరించదగినంత పస ఏమీ లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం కొట్టిపారేసింది. ఆ సందర్భంలోనే ప్రధాన న్యాయమూర్తి ఇలా స్పందించారు: ‘ఈ వాదనను మేం అంగీకరిస్తే, తరువాత మీరు ఎర్రకోటతోనే ఎందుకు ఆగుతారు? ఆగ్రా కోటలు, ఫతేపూర్‌సిక్రీ, ఇంకా మిగిలిన వాటిని అడగకుండా ఉంటారా?’
సుల్తానా బేగంకు ఎవరు ఎక్కించారో తెలియదు. ఏ సెక్యులరిస్టు ఎగదోశాడో తెలియదు. తాను ఆఖరి మొగల్ పాలకుడు బహదూర్ షా జఫార్ ముని ముని మనుమడి భార్యనని, నిజమైన వారసురాలినని చెప్పుకుంటూ న్యాయస్థానాలను ఆశ్రయించింది. అందులో భాగమే ఎర్రకోట నాదేనంటూ వ్యాజ్యం వేయడం. మొత్తానికి మే 5వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశంతో ఆమె ఆశలన్నీ కుప్ప కూలి పోయాయనే అనాలి. కొన్నేళ్లుగా ఆమె ఈ ఆస్తులన్నీ ఒడిలో వచ్చి పడతాయన్న భ్రమలోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. చిత్రం ఏమిటంటే, సుప్రీం కోర్టు ధర్మాసనమే నీ కేసు ఇది, అందులో నీవు ఎర్రకోట నీదని చెప్పావు. అదేం కుదరదు అని చెబితే, ఆదేశం వచ్చిన తరువాత ప్లేటు ఫిరాయించారామె. నేను అసలు ఎర్రకోట గురించి ప్రస్తావించనేలేదు, కేవలం బహదుర్ షా జఫార్ ఇంటి మీద హక్కును మాత్రమే కోరాను అన్నారు ఏఎన్‌ఐ వార్తా సంస్థతో. నాకు ఎర్రకోట అంటే ఏమిటో తెలియదు. ఫతేపూర్‌సిక్రీ ఆగ్రాకోటల గురించీ తెలియదు అన్నారామె. ఇంకా, ‘ఇంతకాలం నాకు కోర్టు ద్వారా న్యాయం జరుగుతుందని ఆశపడ్డాను. ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురైంద’ని నిట్టూర్చింది. ఇప్పుడు నేను ఎక్కడికి పోవాలి? ఆ ఆస్తులు ఆయనవి అని అందరినీ దేబరిస్తూ ఆయన పరువు తీయాలా? అని పెద్ద పెద్ద మాటలే ఆమె వల్లించారు. ఈమె మాటలు వింటే, ఎవడో వీర సెక్యులరిస్టు ఈమెను ఎరగా వేసి అల్లరికి పథకం వేసినట్టు కనిపిస్తుంది. బహదుర్ షా జఫార్ ఈ దేశం కోసం ఎంతో చేశాడనీ, కొడుకునీ రాజ్యాన్నీ పోగొట్టుకున్నాడనీ ఆమె చెప్పారు. తనకు సాయం చేస్తామంటూ చాలా దేశాల నుంచి సందేశాలు అందాయని కూడా చెప్పారు. ఇక్కడ నిరాశ ఎదురై ఉండవచ్చు. అయినప్పటికి ఆమె తన దేశం వదిలి పోదట. దేశానికి వెన్నుపోటు పొడిచిన వాళ్లంతా ఇప్పుడు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని, నిజంగా దేశం కోసం త్యాగం చేసిన జఫార్‌ను గుర్తించడం లేదని, తమ కుటుంబం అంటే జఫార్ వారుసుల కుటుంబం దారుణమైన పరిస్థితులలో ఉన్నదని ఆమె అన్నారు.
బేగం మొదట తనకు ఎర్రకోటను ఇప్పించ వలసిందిగా కోరుతూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. కానీ అక్కడ చుక్కెదురైంది. 2021, 2024లో రెండు పర్యాయాలు ఆమెకు వ్యతిరేక ఆదేశాలే వచ్చాయి. హైకోర్టు వ్యాఖ్య గమనించాలి. ఈ కేసేదో 150 సంవత్సరాల క్రితం వేసి ఉంటే బాగుండేది, మరీ ఇంత ఆలస్యమా అంది. దీనితో సుప్రీంకోర్టుకు వచ్చారు.
1857 ఘటన తరువాత తమ కుటుంబం నుంచి ఎర్రకోటను ఈస్టిండియా కంపెనీ అధికారులు తీసేసుకున్నారని, జఫార్‌ను కంపెనీ బర్మాకు తరలించి ఆయన ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుందని బేగం తన పిటిషన్‌లో గుర్తు చేశారు. అసలు విషయం ఇక్కడే ఉంది. కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు ఎర్రకోట ఆక్రమణ దారు అని, కాబట్టి ఎర్రకోట మీద హక్కు ఇప్పించాలని, లేదా 1857 నుంచి నేటి వరకు ఆ కోటను ఉపయోగించుకున్నందుకు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు బేగం.
తన భర్త మీర్జా మహమ్మద్ బెద్రా బక్త్‌ను జఫార్ వారసునిగా అంటే ముని మనుమనిగా చెప్పేవారని, బక్త్ ముని మనుమడేనని 1960లో జవాహర్ లాల్ నెహ్రూ అధికారికంగా గుర్తించారని కూడా ఆమె చెబుతున్నారు.
నెహ్రూ అక్కడితో ఆగలేదు. ఆమె భర్తకు పింఛను కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పారామె. అన్నట్టు నెహ్రూ మంజూరు చేసిన పింఛను 1980 వరకు బేగంగారి భర్త అనుభవిం చాడు. 1965లో ఈ పించన్ అందుకోవడం మొదలయింది. ఇప్పుడు అర్ధమై ఉంటుంది- బేగం గారు 2021లోనే ఎందుకు కోర్టుకు ఎక్కారో? కేంద్ర ప్రభుత్వం ఆక్రమణదారు అని ఎందుకు ఆరో పించారో! అయినా, ఈ కోర్టు గొడవ వదిలిపోయింది కాబట్టి, బేగంను ఆదుకోవడానికి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వమో,కర్ణాటక ప్రభుత్వమో ముందుకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఆఖరి మొగల్ చక్రవర్తి వారసుల కుటుంబం ఇంత బాధపడుతుంటే, మమతా బెనర్జీ, లేదా కాంగ్రెస్ పార్టీల జాలి గుండెలు కరిగిపోకుండా ఉండడం సాధ్యం కాదు.