షెడ్యూల్డ్ కులాల(ఎస్‌సీ)వారు క్రైస్తవంలోకి లేదా ఇస్లాంలోకి మారితే ఎస్‌సీ హోదాను కోల్పోతారా? కోల్పోక తప్పదనే గతంలో అనేక సార్లు న్యాయ స్థానాలు ఆదేశాలు ఇచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఇలాంటి ఆదేశాలే ఇచ్చింది. ఇదే విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తాజాగా మరోసారి తేల్చిచెప్పింది. హిందూధర్మం నుంచి క్రైస్తవం లేదా ఇస్లాం తీసుకున్న వారు రిజర్వేషన్ సౌకర్యాలు కోరలేరనే న్యాయ స్థానాలు చాలాసార్లు ఘోషించాయి. అలాగే ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం నుంచి రక్షణ పొందలేరని ఆంధప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. వీటిని ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయడం లేదు. కులగణన చేయవచ్చునని కేంద్రం కూడా ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలోనే ఆంధప్రదేశ్ హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడం ముమ్మాటికీ స్వాగతించ దగినదే.
ఇప్పుడు కులగణనలో దళిత క్రైస్తవులను, దళిత ముస్లింలను ఏ కేటగిరిలో చేరుస్తారో స్పష్టమైన విధానం అనుసరించవలసి ఉంటుంది. ఇదొక బహుముఖ సమస్య. దీనిని పరిష్కరించడంలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగింది. ఈ అంశం మీద స్పష్టమైన కోర్టు తీర్పులు ఉన్నా హిందూ దళితులకు న్యాయం జరగడం లేదు. దీనితో సమస్యలు పెరిగిపోతున్నాయి. కొన్నిచోట్ల క్రైస్తవం వేర్పాటు వాదానికి కూడా కారణమయింది. జనాభా సమీకర ణాలు మార్చింది. హిందూ దళితుల రాజకీయ, ఆర్థిక అవకాశాలను మతం మారినవారు తన్నుకు పోతున్నారు. ఈ వ్యవహారం ఎంత యాంత్రికంగా తయారయిందంటే, ఒక దళితుడు క్రైస్తవంలోకి మారినా, ఆఖరికి అమెరికా పౌరసత్వం వచ్చినా భారత్‌లో తన రిజర్వేషన్ ఢోకా లేదన్నంత నమ్మకంతో ఉన్నారని అనిపిస్తుంది. అయితే ఈ సంవత్సరాంతానికి రిజర్వేషన్ల సమస్య మీద దేశంలో ఒక సమగ్ర విధానం రూపొందే అవకాశం కనిపిస్తున్నది.
గుంటూరు జిల్లా కొత్తపాలెం వాస్తవ్యుడు చింతాడ ఆనంద్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చింతా ఆనంద్ చర్చి పాస్టర్. ఆయన చందోలు పోలీసుస్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని ఆక్షేపించింది. పోలీసులు ఛార్జి షీట్ వేయకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. కేసును కొట్టేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఈ మేరకు ఇటీవల తీర్పు ఇచ్చారు.
తనను కులం పేరుతో దూషించి, దాడి చేసి గాయపరిచారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవాని పాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఎ. రామిరెడ్డి మరో ఐదుగురిపై ఎస్‌సీ, ఎస్‌టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్‌సీ, ఎస్‌టీ కోర్టులో పెండింగ్‌లో ఉంది. కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జేవీ ఫణిదత్ వాదనలు వినిపించారు. ఫిర్యాదుదారు పదేళ్లుగా పాస్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదులోనే పేర్కొన్నారు. క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం (షెడ్యూల్డ్ కులాలు) ఆర్డర్-1950 ప్రకారం హిందూమతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించినవారు ఎస్‌సీ హోదాను కోల్పోతారు. కులవ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టేయండి అని కోరారు. పాస్టర్ ఆనంద్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదుదారుడు ఎస్‌సీ అని తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని గుర్తుచేశారు. ఈ సర్టిఫికెట్‌ను గుర్తించడానికి కోర్టు నిరాకరించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. ఎస్‌సీ, ఎస్‌టీ చట్టం కింద ఫిర్యాదుదారుడు రక్షణ పొందలేరు. నిందితులపై ఐపీసీ కింద నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు అని తీర్పులో పేర్కొన్నారు.
ఒక దశాబ్దం పాటు పాస్టర్‌గా ఉంటూ, ఇప్పటికీ తనకు ఎస్‌సీ హోదా ఉందని భమ్రించిన ఆనంద్‌కూ, పుదుచ్చేరికి చెందిన సెల్వరాణి కేసుకూ చాలా దగ్గర సంబంధం ఉంది. సెల్వరాణి కూడా క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చారు. తన రిజర్వేషన్ సౌకర్యం కోసం తన పాత ధర్మంలోకి తిరిగి వస్తున్నట్టు పేర్కొన్నది. దీనికి స్థానిక అధికారులు అంగీకరించ లేదు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి ఒక మంచి ఆదేశం వెలువడే అవకాశం ఇచ్చింది. నిజానికి హిందూధర్మం వదిలిపెట్టి ఇస్లాం లేదా క్రైస్తవం స్వీకరించిన వారికి రిజర్వేషన్‌లు అమలు చేయాలా వద్దా అనే అంశం ఇప్పటి వివాదం కాదు. చాలామంది దళితులు హిందూధర్మంలోని ఎస్‌సీ ఎస్‌టీ హోదాను అనుభవిస్తూ, ఆరాధనా విధానంలో మాత్రం క్రైస్తవాన్ని అనుసరిస్తారన్న ఆరోపణ బలంగానే ఉంది. ఇది ఎంతో వాస్తవం. ఇది రెండు విధాల వంచన. ఒకటి క్రైస్తవంలో ఉంటూ హిందూధర్మం ద్వారా వచ్చే సౌకర్యాలు పొందడం. ఇది క్రైస్తవాన్ని మోసం చేయడం. రెండు క్రైస్తవం మతాన్ని గుర్తించదు. అయినా రిజర్వేషన్ పొందడం హిందూ ధర్మంలో కొనసాగుతున్న దళితుల ఆర్థిక, సామాజిక సౌకర్యాలకు వెన్నుపోటు పొడుస్తున్నారు.
సెల్వరాణి కేసు గురించి పరిశీలించడం ఇప్పుడున్న పరిస్థిలులలో చాలా అవసరం. ఒక మతం ద్వారా దఖలు పడే రిజర్వేషన్ కోసం మాత్రమే ఆ మతంలోకి మారడంపై సుప్రీం కోర్టు నవంబర్ 26,2024న కీలకమైన ఆదేశాలే ఇచ్చింది. ఎలాంటి విశ్వాసం లేకుండా రిజర్వేషన్ కోసమే ఒక మతంలో చేరాలనుకుంటే అది రాజ్యాంగ విరుద్ధమేనని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఆ కేసు పూర్వాపరాలు ఇవి. పుదుచ్చేరికి చెందిన సి. సెల్వరాణికి స్థానిక అధికారులు ఎస్‌సీ ధ్రువపత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. తాను హిందువుగా మారడానికి ఎస్‌సీ సర్టిఫికెట్ కోరుతున్నానని, హిందూమతంలో చేరితే ఉద్యోగాలలో రిజర్వేషన్ లభిస్తుందని పేర్కొన్నది. సెల్వరాణి పుదుచ్చేరి ప్రభుత్వంలో అప్పర్ డివిజన్ క్లర్క్ కోసం దరఖాస్తు చేసింది. తాను వల్లువాన్ కులానికి చెందినట్లు ఆమె ప్రకటించుకున్నారు. పుదుచ్చేరి ఆదేశాలు-1964 ప్రకారం వల్లువాన్ ఎస్‌సీ జాబితాలో ఉంది. తాను క్రైస్తవంలోకి వెళ్లినా ఇప్పుడు హిందు ఆచారాలనే పాటిస్తున్నాను కాబట్టి ఎస్‌సీ హోదా ఇవ్వమని కోరింది. అంటే ఎస్‌సీ రిజర్వేషన్ హోదా ద్వారా లభించే సౌకర్యాలు వర్తింప చేయాలని కోరింది. దీని మీద అధికారులు దర్యాప్తు జరిపారు. ఆమెకు చిన్నతనంలోనే బాప్టిజం (క్రైస్తవంలోకి మార్చడం) ఇచ్చారు. జీవితమంతా క్రైస్తవురాలిగానే ఉంది. ఆ దర్యాప్తులో ఇంకా చాలా విషయాలు బయటపడ్డాయి. సెల్వరాణి తండ్రి ఈమె పుట్టక ముందే క్రైస్తవం స్వీకరించారు. ఇక సెల్వరాణి జన్మించిన తరువాత ఈమెకు క్రైస్తవం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ మత ఉత్సవాలకు, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నది. అలాగే, ఆమె హిందూ ధర్మంలోకి వచ్చినట్టు గాని, ఈ ధర్మంలోని ఆచార వ్యవహారా లను పాటిస్తున్నట్టు గాని ఎక్కడా ఆధారాలు దొరక లేదు. ఆఖరికి హిందూధర్మం స్వీకరించినట్టు చూపే ఏ కార్యక్రమానికి సంబంధించిన ఆధారం కూడా లేదు.
ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఎవరైనా ఒకసారి క్రైస్తవం వంటి ఇతర మతంలోకి మారిపోతే వారు తమ కులానికి సంబంధించిన హోదా కోల్పోతారు. మతం మార్చుకునే వారు అవతలి మతంలోని విశ్వాసాలను పరిగణనలోనికి తీసుకుని మారాలి గాని, అదిచ్చే సౌకర్యాల కోసం కాకూడదు అని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మత మార్పిడి కేవలం రిజర్వేషన్ సౌకర్యాలు పొందడం కోసం కాకూడదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. కులంద్వారా వచ్చే సౌకర్యాలు పొందడానికి నకిలీ ప్రకటనలు, పత్రాలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు చెప్పింది. అంతేకాకుండా, రిజర్వేషన్‌లు ఏ వర్గం ప్రయోజనం కోసం ఉద్దేశించారో, ఏ వర్గం ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను ఆశించి ప్రవేశ పెట్టారో అవి ఇలాంటి వ్యవహారాల వల్ల బలహీన పడతాయని కూడా స్పష్టం చేసింది.
ఈ కేసులోనే డాక్టరీన్ ఆఫ్ ఎక్లిప్స్ గురించి సుప్రీంకోర్టు తెలియచేసింది. దీని ప్రకారం ఒక వ్యక్తి హిందూధర్మం నుంచి ఇతర మతాలలోకి మారితే కులం ప్రకారం ఆ వ్యక్తికి వచ్చే హోదా తాత్కాలికంగా సస్పెండ్ అవుతుంది. మళ్లీ ఆ వ్యక్తి వెనక్కి రావడం అనేది నిజాయితీగా మాతృమతంలో ప్రవేశించి నప్పుడు, అందుకు అతడి సామాజిక వర్గం ఆమోదించి నప్పుడే సాధ్యం. అయితే, ఒకరు ఒక మతంలో తరతరాలుగా ఉండి, మళ్లీ పూర్వపు మతంలోకి వస్తామంటే దానిని పునరుద్ధరించడం దాదాపు అసాధ్యం.
సెల్వరాణి కేసు మొదట మద్రాసు హైకోర్టులో వీగిపోయింది. తరువాతనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మద్రాసు హైకోర్టు తీర్పును సమర్థించింది.
దళితుల హోదా ఉన్నవారు ఇతర మతాలలోకి మారితే రిజర్వేషన్ సౌకర్యాలు కోల్పోతారని, ఆ సౌకర్యాలను వారు కోరలేరని భారత ప్రభుత్వం కూడా ఏనాడో చెప్పింది. 2022లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన వివరణ ఇంకొక అడుగు ముందుకు వేసింది. దళితులుగా ఉన్నవారు క్రైస్తవం లేదా ఇస్లాం స్వీకరిస్తే అలాంటి వారు ఎస్‌సీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి అనర్హులని ఆయన వివరణ ఇచ్చారు. నిజానికి హిందూధర్మం నుంచి ఇతర మతాలలోకి మారిన దళితుల పరిస్థితి గురించి అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంఘాన్ని కూడా నియమించింది. అంటే రిజర్వేషన్ సౌకర్యాల పరంగా వీరికి ఎలాంటి విధానం అమలు చేయాలన్నదే ఆ కమిటీ బాధ్యత.
ఓటు బ్యాంక్ రాజకీయాలు రాజ్యాంగ స్ఫూర్తికీ, రాజ్యాంగ నిర్మాతల ఆశయానికీ ఏనాడో తూట్లు పొడిచారు. షెడ్యూల్డ్ కులాలకు రిజర్వేషన్‌లు ఇవ్వడానికి ప్రధాన కారణం-వారు శతాబ్దాలుగా ఎదుర్కొన్న అంటరానితనం. అంటరానితనం కారణంగా కొన్ని కింది వర్గాలు సాంఘిక, ఆర్థిక వివక్షకు బలయ్యారు. రాజ్యాంగ ఆదేశం-1950 ప్రకారం హిందూధర్మంలో, బౌద్ధం, జైనం, సిక్కు మతాలలో ఉన్నవారికే దళితు హోదా కోరే హక్కు ఉంటుంది. నిజానికి హిందూధర్మంలో ఉన్న వారికే మొదట ఎస్‌సీ హోదా కోరే అవకాశం ఉండేది. 1956 సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఎస్‌సీ హోదా కోరే హక్కు ఇచ్చారు. అందుకే క్రైస్తవం లేదా ఇస్లాంలోకి వెళ్లిన వారు, అంతకు ముందు వారు దళితులే అయినా ఎస్‌సీ హోదా కొనసాగదు. రిజర్వేషన్‌లు వర్తించవు.
దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలను ఎస్‌సీ హోదా పరిధిలోకి తీసుకోవాలా వద్దా అనే అంశం మీద సుప్రీంకోర్టులో అనేక పిటిషన్‌లు ఉన్నాయి. దీని మీద అభిప్రాయం తెలియచేయవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం 2022 ఆగస్టులో కేంద్రాన్ని ఆదేశించింది. దీని ఫలితమే ముగ్గురు సభ్యుల కమిషన్ ఏర్పాటు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిషన్ ఈ సంవత్సరం అక్టోబర్‌కు తన నివేదికను సమర్పించవలసి ఉంది. అయితే 2007లో జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన సిఫారసులు ఈ వాదనలకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎస్‌సీ హోదాకూ, మతానికీ ముడి పెట్టరాదన్నదే జస్టిస్ మిశ్రా వాదన.
2005 నాటి సచార్ కమిషన్ నివేదిక మరొక చేదు వాస్తవం బయటపెట్టింది. దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులు మతం మారినప్పటికి వివక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని ఆ కమిటి వెల్లడించింది. అలాగే మతం మారిన దళితులు ఇప్పటికి ఆర్థిక వెనుకబాటుతనంతోనే బాధపడుతున్నా రని కూడా వెల్లడించింది. కాబట్టి మతం మారడం, మార్చడం ఎవరి మేలు కోసమో గట్టిగా ఆలోచించ వలసిన సమయం వచ్చింది. దళితులు మతం మారినా విదేశీ మతాలు వారికి పెద్ద పీట వేసి ముందు వరసలో కూర్చోబెట్టలేదు. ఇది దళితులే చాలామంది చాటి చెప్పే వాస్తవం. ఈ నేపథ్యంలో ఈ అక్టోబర్‌లో వచ్చే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఎలాంటి సిఫారసులు చేస్తారో వేచి చూడాలి. కేంద్రం తన వైఖరిని 2022లోనే వెల్లడించిందన్నది వాస్తవం.జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నియామకం చెల్లదంటూ తన ముందుకు వచ్చిన పిటిషన్‌ను 2023లోనే సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇతర మతాలలోలకి వెళ్లిన దళితులకు హిందూ ధర్మంలో కొనసాగుతున్న దళితులకు దక్కినట్టు రిజర్వేషన్ సౌకర్యాలు దక్కవు. నిజానికి దక్కరాదు.
– జాగృతి డెస్క్