– ఎస్‌. ‌నాగేందర్‌నాథ్‌ ‌రావు

భండారు సదాశివరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

పాల ప్యాకెట్‌ ‌తీసుకొని ఇంట్లోకి అడుగుపెడుతున్న రాంబాబుకు ఇంట్లో నుండి మాటలు బిగ్గరగా వినిపించసాగాయి. అతని భార్య సుగుణ, కొడుకు కేశవ ఇద్దరు గట్టిగా మాట్లాడుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నగా అరుచుకుంటున్నారు.

‘స్కూలుకు టైం అయితాంది రా, జల్ది తయారుగా’ అన్నది తల్లి సుగుణ.

‘టైం అయితే ఏంది, నేను స్కూల్‌కి పోతలేను’, అన్నాడు కొడుకు కేశవ్‌.

‘‌స్కూలుకు….. పోవా’

‘ఆ’… పొను’

‘దిమాక్‌ ‌గిట్ల ఖరాబ్‌ అయినాదిరా? నీ తోటోల్లంత బడికి పోయి చదువుకుంటా ఉంటే, నువ్వు ఇంట్లో కూర్చొని గాడిదలగాస్తావుర?

‘మన ఇంట్ల గాడిదలు ఏడున్నయి, నాయనతోని పనికి పోత’.

‘పనికి పోతవా, గదెం ఆలోచన రా? నీ మతికే పుట్టిందా, లేక ఇంకెవరన్న చెప్పిన్రా’?

‘నాకు ఎవ్వరు చెప్పేది లేదు. నాకు స్కూలు చదువు నచ్చలే. నాయనతోని పోయి పని నేర్చుకుంట’,

‘పని నేర్చుకుందుకు ముందు ముందు బతుకు చాల ఉన్నది. ఇప్పుడు బడికి పోవాల్సిందే’. తల్లి ఖండితంగా చెప్పింది. కేశవ గట్టిగా అరిచాడు. ‘నేను బోనని చెప్పిన కదా, సమజయిత లేదా? నాకు అస్సలు ఇష్టం లేదు’.

‘నాకే ఎదురు చెప్తవ్‌, ఎదవ నా కొడకా. నువ్వు బడికి పోయి చదువు కోవాల్సిందే, లేకపోతే సంపి బొంద పెడత’.. కోపం వచ్చిన సుగుణ కొడుకును ఎడాపెడా కొట్టింది.

‘అమ్మా…. కొట్టకే…’ అరుస్తున్నాడు కేశవ.

‘మరి పోతవా, బడికి పోతవా లేదా చెప్పు..’

‘పోను, పోను. నాకా చదువులొద్దు’.

గుమ్మం దగ్గర నిలబడి చూస్తున్న రాంబాబుకు తాను కలగ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది.

‘ఆగాగు, సుగుణా, వాడిని వదిలెయ్యి .

సుగుణ తన దృష్టి రాంబాబు వైపు మళ్లించింది. ‘ఏందయ్యా వదిలేది, వాడు బడికి పోయి చదువుకోడట. ఇన్నవా’?

‘చదువు అనేది ఇష్టంగా చదువుకుంటేనే వస్తది. బలవంతంగా ఎక్కిస్తే రాదు. వాడు కూడ పెద్దవాడు అయితాండు కద. వాడే తెలుసుకుంటడు, మంచిదో చెడేదో’.

‘చదువుకోకపోతే వాడు ఎట్ట బతుకుతడయ్యా’..అన్నది సుగుణ బాధగా.

‘నేను తాపీ మేస్త్రి పని చేస్తాన కద. మనం బతుకుతున్నమా లేదా ? కాలమే వాడికి ఏదో ఒక దారి చూపెడతది’.

సుగుణ రాంబాబుతో వాదనకు దిగలేదు. ఆమెది వాదించే మనస్తత్వం కూడా కాదు. ఒక్కగానొక్క కొడుకు. బాగా చదువుకొని ఉద్యోగం చేస్తడని అందరి తల్లులలాగే ఆశ పడ్డది. కాని, ఇంకా లాగితే పరిస్థితి చేజారిపోతుందని ఆమెకు తెలుసు. అందుకే ఆమె ఏమీ మాట్లాడలేదు.

రాంబాబు తాత దుర్గయ్య చీరల నేతగాడు. అతడు నేసే చీరలకు చుట్టుపక్కల గ్రామాలలో కూడా మంచి పేరు ఉండేది. అతను ఎంత నిపుణుడైన మగ్గం నేతగాడైనా, కాలం అంటూ ఒకటి ఉంటుంది కదా! అది చేనేత కార్మికుల పాలిటి శాపంగా మారింది. నేత వస్త్రాలకు మార్కెట్‌ ‌కరువై, చేనేత కార్మికులు ఆకలికి అల్లాడిపోయారు. ఆ దయనీయ పరిస్థితులలో దుర్గయ్య కూడా, నేత పని మానేసి, కూలి పనికి వెళ్లక తప్పలేదు. దుర్గయ్య కొడుకు అప్పయ్యకు బడికి పోయి చదువుకునే అవకాశం లభించలేదు. ఆ ఊర్లోనే, స్కూల్లో ఉన్నంతవరకు చదువుకున్నాడు. చుట్టుపక్కల ఊళ్లలో కూలిపనికి వెళ్లేవాడు. అలా పనికి వెళుతూ, వెళుతూ ఒక తాపీ మేస్త్రి దగ్గర కూలి పనికి కుదిరాడు. ఆ మేస్త్రి కూడా ఎక్కడ పని ఉన్నా అప్పయ్యను తీసుకెళ్లేవాడు. అప్పయ్య కూడా క్రమంగా తాపీ పనిలో మెళకువలు నేర్చుకొని, కూలి పని నుండి మేస్త్రి పనికి మారాడు.

అప్పయ్యకు తన కొడుకు రాంబాబును ఎలాగైనా చదివించాలని కోరికగా ఉండేది. రాంబాబుతో కూడా ఆ మాటే చెబుతూ ఉండేవాడు. ‘ఎట్టాగైనా నువ్వు పెద్ద చదువులు చదివి గవర్నమెంట్‌ ఉద్యోగం సంపాదిస్తే, మన కష్టాలు తీరిపోతాయి రాంబాబు’ అనేవాడు. కానీ ఒక ఓవర్‌ ‌బ్రిడ్జి నిర్మాణంలో మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు, ఆ బ్రిడ్జి కూలిపోయింది. చాలామంది మేస్త్రీలు, కూలీలు దాని కింద నలిగిపోయారు. అప్పయ్య కూడా రెండు కాళ్లు విరిగిపోయి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇల్లు గడవని పరిస్థితిలో రాంబాబు కూడా, తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన తాపీ, తూకం చేతబట్టి మేస్త్రిగా మారాడు.

పట్టణాలలో ఇళ్ల నిర్మాణం పనులు ఊపందుకుంటున్న తరుణంలో, మేస్త్త్రి పని వెతుక్కుంటూ కుటుంబంతో సహా పట్నం చేరుకున్నాడు రాంబాబు. ఎలాగైనా తన కొడుకు కేశవను బాగా చదివించాలని అనుకున్నాడు. కానీ కేశవ మొదట్లోనే మొండికేస్తున్నాడు. కేశవ చాలా తెలివైనవాడు, బాగా చదువుతాడని, టీచర్లు కూడా మెచ్చుకుంటున్నారు. కానీ కేశవ ఆలోచనలలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో, ఆ భార్యాభర్తలకు అర్థం కాలేదు. కానీ బలవంతంగా కేశవను స్కూలుకు పంపించి చదివించలేమని వాళ్లకు అర్థమైంది. కొద్ది రోజులు ఇలాగే వేచి చూద్దామని అనుకున్నారు. రోజులు గడుస్తున్నాయి.

తండ్రితో పాటు ఇల్లు నిర్మాణం పనికి వెళుతున్నాడు కేశవ. రోజు కూలిగా పనిచేయడం ప్రారంభించాడు. ఇటుకలు, ఇసుక మోయడం, మాలు కలపడం, అతనికి హుషారుగా అనిపించ సాగింది. ఇటుక మీద ఇటుక పేరుస్తూ తండ్రి గోడలు లేపి, ఇల్లు నిర్మిస్తుంటే అతనికి ఆశ్చర్యంగాను, ఆసక్తిగాను అనిపించసాగింది. తాను కూడా ఇలాగే మేస్త్రి పని నేర్చుకోవాలి అనుకున్నాడు.

‘నాయనా, పని కూడా చదువే కదా’.

‘అవున్రా, ప్రతి పనీ ఒక విద్య. ఏదైనా నేర్చుకోకపోతే రాదు కదా’, అన్నాడు తండ్రి.

‘నాకు ఈ మేస్త్రి పని నచ్చింది నాయినా, నేను ఇదే నేర్చుకుంట’.

ఏమి చెప్పాలో తోచలేదు రాంబాబుకు. ‘గట్లనే, నీ ఇష్టం కొడక’ అన్నాడు. ఇక కేశవ ఆనందానికి అంతు లేకుండా పోయింది. ఆ రోజు సాయంత్రం పని పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లేముందు షావుకారును కలిశారు.

‘సావుకారూ, పని అయిపోయింది. లెక్క చూసి డబ్బులు ఇయ్యండి’, అడిగాడు రాంబాబు.

‘గట్లనే మేస్త్రి, కూచో’ అన్నాడు షావుకారు. అరుగు మీద కూర్చున్నారు తండ్రి కొడుకులు.

షావుకారు లెక్కచేసి మొత్తం ‘100 ఫీట్‌ ‌లు వచ్చింది మేస్త్రి’ అన్నాడు.

రాంబాబు కాస్త ఆలోచించి, ‘ఇంక ఎక్కువ వస్తయనుకుంట సావుకారూ, మల్ల ఒకసారి లెక్క చేయండి’, అన్నాడు నెమ్మదిగా.

షావుకారు మళ్లీ ఒకసారి లెక్క చేసాడు. ‘గంతే ఒస్తున్నది మేస్త్రి’ అన్నాడు.

నా లెక్క కొంచెం తేడా ఉన్నది కదా సావుకారూ’.

షావుకారుకు కొంచెం కోపం వచ్చింది. ‘చదువుకున్నోన్ని నేను, తాపీ పని చేసుకునేటోనివి నువ్వు. లెక్కలు చేయడం నీకు తెలుసా, నాకు తెలుసా ?’ కొంచెం అరిచినట్లుగా అన్నాడు షావుకారు.

ఈ సంభాషణ ఆసక్తిగా చూడసాగాడు కేశవ.

‘అయ్యో, కోపం చేయకు సావుకారూ, చదువుకున్నోళ్లు మీకు తెల్వదని కాదు గాని, మల్లోక్కసారి

‘సరే, లెక్క నువ్వే చేయి మేస్త్రి’ అన్నాడు షావుకారు.

రాంబాబు ఓపికగా తాను వారం రోజులుగా చేస్తున్న పని ఒకదాని తర్వాత ఒకటి వివరంగా రాయించాడు. షావుకారు మొత్తం రాసి లెక్క చేశాడు.

‘నిజమే మేస్త్రి, నీ లెక్క ప్రకారం 130 ఫీట్లు వచ్చింది. నువ్వు చెప్పింది కరెక్టే’. మేస్త్రి చెప్పిన ప్రకారం లెక్క చేసి డబ్బులు ఇచ్చాడు షావుకారు. ఇంటికి బయలుదేరారు తండ్రి కొడుకులు.

నాయినా’.

దారిలో అడిగాడు కేశవ. ‘సావుకారు తప్పు లెక్క చెప్పి, మనల్ని మోసం చేయాలనుకున్నడు కదా

‘అట్లా ఆలోచించడం తప్పు. అది మోసం అని ఎందుకు అనుకోవాలి. ఆయన లెక్కలో తప్పు వచ్చింది. మనకు లెక్క సరిగా చేయడం వస్తే మనం మోసపోము కదా. కష్టపడేవాళ్లం…మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా’ అన్నాడు రాంబాబు. నిజమే అనుకున్నాడు కేశవ.

కాలమే అన్ని నేర్పిస్తుందని రాంబాబు అన్నమాట నిజమైంది. మర్నాడు పొద్దుట వంటపనిలో హడావిడిగా ఉంది సుగుణ. కేశవ స్నానం చేసి స్కూల్‌ ‌డ్రెస్‌ ‌వేసుకొని, స్కూల్‌ ‌బ్యాగు సర్దుకుంటూ, ‘అమ్మా, అన్నం పెట్టు. బడికి టైం అయితాంది’ అన్నాడు.

సుగుణ చేతిలోని గంటె జారి కిందపడి టంగుమని శబ్దం అయింది. ఆమె అవాక్కయి అలాగే చూడసాగింది.

బల్లమీద కూర్చున్న రాంబాబు ఇద్దరినీ చూడసాగాడు. అతడి మొహంలో ఏ భావమూ కనిపించడం లేదు.

ఆశ్చర్యంగా అడిగింది తల్లి. ‘ఏరా కేశవా, బడికి పోతానవా? పనికి పోతలేదా?’’

‘అవునమ్మా బడికి పోత’. తల్లి దగ్గరికి వచ్చాడు కేశవ. సుగుణ అతని తల నిమిరింది. ‘ఏం జరిగింది కొడకా’ అని అడిగింది. నిన్న పని దగ్గర జరిగిన షావుకారు లెక్కల సంగతి తల్లికి వివరించాడు కేశవ.

‘నాయినకు లెక్కచేయడం రాకపోతే చాలా పైసలు నష్టం వచ్చేది. చేసిన కష్టమంత దండగ అయ్యేది. కష్టం చేయడమే కాదు, దాని విలువను కూడా తెలుసుకోవాలి కద. ఆ పని, చదువు చేస్తదని నాకు అర్థమైందమ్మా. గందుకే ముందుగాల బడికి పోయి చదువు నేర్చుకుంట. ఆనిక్కే పని నేర్చుకుంట’. కొడుకు ఆలోచనలో మార్పుకు ఆశ్చర్యపోయింది ఆమె. కొడుకును దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నది. బ్యాగు తీసుకుని స్కూల్‌కు బయలుదేరాడు కేశవ.

సుగుణ రాంబాబు వద్దకు నడిచింది. అతని భుజంపై చేయి వేసింది. రాంబాబు సుగుణ కళ్లలోకి చూశాడు.

‘మనం ఏం చేయాలో, కాలమే నిర్ణయిస్తుంది సుగుణా. నేను పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయాలని, మా నాయన బాగ చెప్పేటోడు. కానీ కాలం ఆయన్ని కదలకుండ కట్టిపడేసింది. నాలుగు రోజుల కిందట, కేశవ, మేస్త్రి పని చేస్తా అన్నప్పుడు కాలం ఏం నిర్ణయిస్తదో అని గుబులు పడ్డ. కానీ వాడిని చదువు వైపుకి నడిపించింది. కేశవ తప్పకుండా సాధిస్తడని నాకు నమ్మకం కలుగుతున్నది. మన కుటుంబానికి మంచి రోజులు తప్పకుండ వస్తయి. ఒక సాలె మగ్గం నేతగాడి మనవడు, మరో అబ్దుల్‌ ‌కలాం అయినా ఆశ్చర్యం లేదు’. భుజం మీది కండువాతో కళ్లుతుడుచుకున్నాడు రాంబాబు.

దూరంగా గుడిలో గంటలు మోగుతున్నాయి శుభసూచకంగా.

వచ్చేవారం కథ..

పుత్తూరు కట్టు

– ఆర్‌.‌సి. కృష్ణస్వామిరాజు

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE