తెలంగాణలో రహదారుల విస్తరణ జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్ద ఎత్తున కొత్త రహదారుల నిర్మాణంతో పాటు… ఇప్పటికే ఉన్న రహదారుల విస్తరణ పనులు విస్తృతంగా చేపడుతోంది. దీంతో, తెలంగాణ రాష్ట్రంలోని రహదారుల వ్యవస్థ మరింత ఉన్నతంగా మారబోతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా.. పలు జిల్లాల గుండా రహదారుల నిర్మాణం, విస్తరణ వంటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటికి తోడు..కొత్తగా మరికొన్ని రహదారులకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. ఇక, రాజధాని హైదరాబాద్ నగరంలో పలు ఫ్లైవర్లు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. మరికొన్ని ఫ్లై ఓవర్లు నిర్మాణ దశలో ఉన్నాయి.
ఈ క్రమంలోనే ఈనెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో సుడిగాలి పర్యటన చేశారు. ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన గడ్కరీ.. సాయంత్రానికి హైదరాబాద్‌లో పలు రహదారులు, ఫ్లై ఓవర్లను ప్రారంభించారు. ఒక్కరోజే మొత్తం 26 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వాటి విలువ సుమారు రూ.5,413కోట్లు. ఈ స్థాయిలో రహదారుల కోసమే నిధులు వెచ్చించడం.. అదీ కేంద్ర ప్రభుత్వం కేటాయించడం దాదాపు ఇదే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. ప్రధానంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టడం, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ రహదారులకు అనుసంధానం చేయడమే.. ఈ పర్యటనలో చేసిన ప్రారంభోత్సవాల లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మే 5వ తేదీ, ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పర్యటించి.. అక్కడినుంచే.. రూ.3,900 కోట్ల విలువైన రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు. జిల్లాలో జాతీయ రహదారి 363ని గడ్కరీ జాతికి అంకితం చేశారు. కాగజ్‌నగర్ మహారాష్ట్ర బార్డర్‌లో రూ.3,526 కోట్లతో నిర్మించిన 95 కిలోమీటర్ల మేర ఫోర్ లేన్ రోడ్డుతోపాటు ఏడు జాతీయ రహదారులను, పలు అభివృద్ధి పనులు, కొత్త వంతెనల నిర్మాణం, రహదారుల విస్తరణకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరంలో నూతనంగా నిర్మించిన అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించారు.
కేంద్రం తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రహదారులను నిర్మిస్తోంది. ములుగు-కొత్తగూడెం మధ్య హైవే నిర్మాణం జరుగుతోంది. సూర్యాపేట నుంచి దేవరపల్లి వరకు గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం, నాగ్‌పుర్ నుంచి విజయవాడ వరకు కీలకమైన కారిడార్ పనులు త్వరలో మొదలవుతాయని సమాచారం.వీటితో పాటు భద్రాచలం, బాసర, మేడారం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను జాతీయ రహదారులతో అనుసంధానించనుంది. జగిత్యాల-కరీంనగర్ హైవే విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రోడ్డు రవాణా మరింత సులభతరం కానుంది. రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు కేంద్రం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా జోజిలా పాస్ టన్నెల్ వంటి క్లిష్టమైన నిర్మాణాలను కూడా చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం దేశమంతటా నీటి నిల్వలను పెంచడం కోసమని అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కోరింది. అలాగే సముద్రంలో వృధాగా కలిసి నీటిని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా పెన్నా-కావేరి బేసిన్‌లకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులతో ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సముద్రంలో వృధాగా కలిసే నీటిని మళ్లించడానికి కేంద్రం సంకల్పించింది.
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనుసంధనతను పెంచడాన్ని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం 5వేల కి.మీ దాటింది. తెలంగాణలోని 32 జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయి. కేంద్రం తెలంగాణలో రోడ్డు, రైల్వే, విమాన కనెక్టివిటీ పెంచేందుకు కృషి చేస్తోంది. ఎక్స్‌ప్రెస్‌వేలు, అండర్‌పాస్‌ల నిర్మాణంతో రోడ్డురవాణా వ్యవస్థ సులభతరమైంది.. జాతీయ రహదారుల విస్తరణ వల్ల రోడ్డు ప్రమాదాలు, ప్రయాణ సమయం భారీగా తగ్గాయని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
తెలంగాణకు కేంద్రం చేసిన పనులు, ప్రణాళికలు
కేంద్రం ఆదిలాబాద్, జహీరాబాద్‌లలో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 7 టెక్స్‌టైల్ పార్కులు మంజూరు చేస్తే వాటిలో ఒకటి తెలంగాణకు దక్కింది. కాజీపేటలో రూ.800 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను మోదీ సర్కారు మంజూరు చేసింది. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రూ.12,000 కోట్లతో 800 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేసింది. రూ.442 కోట్లతో రామగుండంలో 100 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.6,330 కోట్లతో రామగుండంలో యూరియా ఉత్పత్తి పరిశ్రమను పునరుద్ధరించింది. నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు మంజూరు చేసింది. ఆదిలాబాద్‌లో డిఫెన్స్ ఎయిర్‌పోర్టు ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తోంది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించింది. రూ.31,220 కోట్లతో రైల్వే లైన్లు, డబ్లింగ్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. రూ.1,25,000 కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం, రూ.86,492 కోట్లతో కొత్త రైల్వే ప్రాజెక్టుల కోసమని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. తెలంగాణలో హైవేల నిర్మాణ పనులకు.. రూ.1.25 లక్షల కోట్లు కేటాయించింది.
తాజా పరిణామాలు, జరుగుతున్న అభివృద్ధి గమనిస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పైగా ఇప్పట్లో కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. అయితే, ఎన్నికల స్టంట్‌గా కాకుండా.. నిర్మాణాత్మక అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టినట్లు అర్థమవుతోంది. ఈ స్థాయిలో చేసిన అభివృద్ధిని అవసరాన్ని బట్టి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, కేంద్రం పట్ల ఒక సానుకూలమైన దృక్పథాన్ని ప్రజల్లో ముఖ్యంగా ఓటర్లలో కల్పించేందుకు బీజేపీ శ్రేణులకు పార్టీ పెద్దలు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికపై ఈ అభివృద్ధి కచ్చితంగా ప్రభావం చూపుతుందనే విశ్వాసాన్ని బీజేపీ దళాలు వ్యక్తం చేస్తున్నాయి.
కేంద్ర మంత్రి పర్యటన సాగిందిలా..
ఉదయం కాగజ్‌నగర్‌లో భారీ ఎత్తున ప్రారంభోత్సవాలు చేసిన నితిన్ గడ్కరీ.. మధ్యాహ్నం సంగారెడ్డ్డి జిల్లాలో పర్యటించారు. అనంతరం హైదరాబాద్ శివారులోని ఇక్రిశాట్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో మధ్యాహ్నం చేరుకున్నారు. సాయంత్రం ప్రత్యేక వాహనంలో బీహెచ్‌ఈఎల్ చేరుకొని.. అక్కడ కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అంబర్‌పేట్ చేరుకొని అక్కడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం తర్వాత.. మున్సిపల్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగసభలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు.
నితిన్ గడ్కరీ ప్రారంభించిన కీలక ప్రాజెక్టులు
కాగజ్‌నగర్‌లో…
- నిర్మల్-ఖానాపూర్ మార్గంలో 17.79 కి.మీ.ల మేర రోడ్డు వెడల్పు పనులు
- మంచిర్యాల్-రేపల్లెవాడ మధ్య 42 కి.మీ.ల మేర రూ.2,001 కోట్లతో నాలుగు లేన్ రహదారి.
- రేపల్లె-మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ.ల మేర రూ.1,525 కోట్లతో రహదారి అభివృద్ధి.
- కడ్తాల్ వద్ద రూ. 23.54 కోట్లతో 6 లేన్ అండర్‌పాస్
- నాగ్‌పూర్-హైదరాబాద్ సెక్షన్ లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పు
హైదరాబాద్‌లో…
- అంబర్‌పేట్ ఫ్లైఓవర్
- ఆరాంఘర్-శంషాబాద్ మధ్య 10 కి.మీ.ల మేర 6 లేన్ రహదారి నిర్మాణానికి భూమిపూజ.
- మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్, జాప్తి శివనూర్, గోల్డెన్ ధాబా వై జంక్షన్ వద్ద అండర్‌పాస్‌లు.
- కామారెడ్డి జిల్లా టెక్రియాల్, పొందుర్తి, పద్మాజివాడ జంక్షన్లలో అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు.
- హైదరాబాద్-వరంగల్ రహదారిపై ఆలేరు-జీడికల్ రోడ్స్ వద్ద 6 లేన్ అండర్‌పాస్.
- బీహెచ్‌ఈఎల్ జంక్షన్ వద్ద రూ. 172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం.
- వీటికి తోడు రూ. 657 కోట్ల విలువైన 21 కి.మీ.ల మేర 7 ప్రాజెక్టులకు గడ్కరీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
సుజాత గోపగోని,
సీనియర్ జర్నలిస్ట్, 6302164068