‘‘కలీమా (లా ఇలాహ ఇల్లల్లాహ్) చదువు!’’
పక్క గుడారం దగ్గర హోరెత్తిన తుపాకీ మోతలతో తమ గుడారంలోకి వెళ్లి నేలపైన పడుకున్న సంతోష్ జగ్దలే (54)ను పిలిచి ముస్లిం ఉగ్రవాదులు తుపాకీ ఎక్కుపెట్టి అరిచారు. ఇంకా చెప్పాలంటే మతోన్మాదం ఆయుధం గురి పెట్టి ఆదేశించింది. ఆయన హిందువు, చెప్పలేకపోయారు. లిప్తలోనే ఆయన తలపైన, చెవిలో, వీపు మీద తుపాకీలతో కాల్చారు. అక్కడికక్కడే కూలిపోయారాయన. ఇదంతా ఆయన కుటుంబ సభ్యు ఎదుటే. ఏప్రిల్ 22న దక్షిణ కశ్మీర్‌లోని పెహల్గావ్ వద్ద జరిగిన ఊచకోతలో కన్నుమూసిన ఓ పర్యాటకుడి విషాదాంతమిది. అలాంటివి 26 విషాదాంతాలు. ఫలితం- ‘ప్రపంచం నివ్వెరపోయే విధంగా మా ప్రతిచర్య ఉంటుంది’ అని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గర్జించవలసి వచ్చింది. ఇప్పటి దాకా భారత్ వేసిన ప్రతి అడుగు ఆ దిశగానే పడుతున్నది కూడా. ముస్లిం ఛాందసవాదం మీద భారత్ వాదనే నిజం, ఇక ప్రపంచం, కుహనా సెక్యులరిజం నోరు మూస్తే మంచిది అని ఆయన హితవు పలికారు. ప్రతి భారతీయుడి గుండె మండిపోతున్నది. ప్రతి భారతీయుడి రక్తం కాగిపోతున్నది. యుద్ధభేరీ మోగే క్షణం కోసం ఎదురుచూస్తున్నది.
పెహెల్గావ్‌లో ఏం జరిగింది? ఇది ఆధునిక ప్రపంచంలో బతికే వాళ్లు చేయగలిగేదేనా? లేకుంటే మధ్యయుగాల మనస్త్తత్వపు చర్యా? మతమేమిటో నిలదీస్తూ మతోన్మాదం రెచ్చిపోయింది. ఉగ్రవాదానికి మతం లేదు అంటూ ఎప్పటి నుంచో ఓండ్ర పెడుతున్న సెక్యులరిస్టుల, ఉదారవాదుల, మూడో స్వభావపు రాజకీయ పార్టీల ముఖాల మీద ఉమ్మినట్టే మతోన్మాదులు నెత్తురు చిందించారు. ఆ నెత్తురుకు ధర్మం ఉంది. అదే హిందూ ధర్మం. హిందూరక్తాన్ని ఎంచుకుని మరీ రుచి చూశారు. తమ హింస లక్ష్యాన్ని ‘పేంట్స్ విప్పి’ బుజ్జగింపు రాజకీయాల ముఖాల మీదే నిస్సిగ్గుగా ప్రదర్శించారు. అలాంటి ఉగ్రవాదులకు ఊపిరి పోస్తున్న దేశం పాకిస్తాన్. ఇప్పుడు యుద్ధమేఘాల కింద ఉంది. ఆశ్చర్యంగా పరమ నీచమైన చర్యలు చేయించి కూడా భారత్ పట్ల మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. రెచ్చగొట్టే ధోరణిలోనే ఉంది. ఆ రోగ్ నేషన్ దగ్గర అణ్వాయుధాలు కూడా ఉన్నాయట. వాటిని ఇప్పటికే భారత్ వైపు మోహరించిందట.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి ఆయువుపట్టు మతోన్మాదమే. వాళ్లు కలీమా చదవమన్నారు, లేదంటే పేంట్స్ లాగి పరీక్షించారు. కలీమా సందేశం, అర్థం-అల్లా తప్ప వేరొక దైవం లేదు. ఇది చెప్పలేకపోతే ప్రాణాలు తీశారు. ప్రపంచంలోనే అత్యంత హీనమైన నేరమిది. హేయమైన చర్య ఇది. ఆనాడు నేలకొరిగిన పర్యాటకులంతా దాదాపు హిందువులే అని ముందే తెలిసినా ఇలా ప్రశ్నించడం ఎందుకు? తమ మతోన్మాదంలోని కొండగుర్తును ప్రదర్శించడానికి! యావత్ ప్రపంచం కళ్లు తెరిపించడానికి! ముస్లిం మతోన్మాదం కోసం ఇతర మతాల అమాయకులను చంపడానికి వెనుకాడబోమని బెదిరించడానికి! ఇంత దారుణమైన మతోన్మాదానికి నిరంతరం కొమ్ముకాస్తున్న సెక్యులరిజం ఇప్పుడు కూడా నోరు విప్పడం లేదు. ఉగ్రవాదులకు అలసిచ్చే పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తాయని తెలిసినా, ఎందరు ఘంటాపథంగా హెచ్చరించినా.. పీక మీద హక్కుల కత్తి పెట్టి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహింపచేసిన భారత అత్యున్నత న్యాయస్థానానికైనా ఇంక మాట్లాడడానికి ఏమైనా ఉందా అని ఆ 26 అమాయక ప్రాణాలు ఆక్రోశిస్తున్నాయి. మీరు ప్రతిష్ఠించిన ప్రజాప్రభుత్వం నిర్వాకం చూడమని దొంగల పార్టీలను, న్యాయస్థానాలను అవి కన్నీటితో అర్థిస్తున్నాయి. జవాబు ఉంటుందా? సమాధానం వస్తుందా?
భారతీయుల రక్తం సలసల కాగుతోంది. వక్ఫ్ చట్ట సవరణ మీద చిల్లర గోల చేసే ఆ కాస్త అవకాశం ఇలా పోయినందుకు చింతిస్తూనే పాకిస్తాన్ దుశ్చర్యను, ఉగ్రవాదుల ఘాతుకాన్నీ ఒవైసీ వంటి చాలామంది భారత్ వ్యతిరేకులు, ఆ మత గురువులు కూడా ఖండించక తప్పలేదు. అగ్రదేశాలన్నీ ఇప్పుడు నిజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. ఔను, మేం మూడు దశాబ్దాలుగా ఈ రక్తపాతాన్ని ప్రోత్సహిస్తున్నాం, ఇదంతా అమెరికా, బ్రిటన్‌ల కోసమే అంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా చేసిన ప్రకటన ఇప్పుడు ఒక కలకలం. దీనికి ఎలా స్పందించనున్నాయి, అగ్రదేశాలు? అయినా ప్రపంచ మీడియాకు ఇంకా జ్ఞానోదయం కాలేదు. పెహెల్గావ్‌లో దాడి చేసింది ‘మిలిటెంట్లు’ అని రాస్తున్నారు. కాదు, వాళ్లు ‘టెర్రరిస్టులు’. ఇంకా ఎందుకు కపటత్వం? ఎందుకీ ఆత్మ వంచన అంటూ సాక్షాత్తు అమెరికా విదేశాంగ శాఖ ‘న్యూయార్క్ టైమ్స్’ అనే ప్రపంచ ప్రఖ్యాత పక్షపాత బురదగుంటకు బుద్ధి చెప్పవలసి వచ్చింది. గడ్డి పెట్టవలసి వచ్చింది. ఇంకా బీబీసీ ఇదే పంథాలో ఉగ్రవాదులతో నెత్తుటి కరచాలనం చేస్తున్నది. భారత్‌లో కొన్ని పత్రికల ధోరణి కూడా ఇదే. దేశద్రోహం.
యుద్ధం ఎంత వినాశకరమో తెలిసినా శాంతిప్రియులైన భారతీయులు సమరాన్నే కోరుకుంటున్న క్షణమిది. 1948, 1965, 1971, 1999 యుద్ధాలలో నేల కరిచినా, రవంత కూడా గుణపాఠం నేర్వని పాకిస్తాన్‌కు రణంతోనే జ్ఞానోదయం అవుతుందన్నదే ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న జనాభిప్రాయం. అదే నేటి నినాదం. ఆ నాలుగు యుద్ధాల వలె కాదు, అంతకు వందరెట్లు నాశనం కావాలా దేశం అని కోరుకుంటున్నారు. సింధు జలాలు ఆపితే రక్తమే ప్రవహి స్తుందంటాడో పశుప్రాయుడు. తన తల్లిని ఉగ్రవాదమే నడిరోడ్డు మీద కుక్కను చంపినట్టు చంపినా ఈ ఉగ్రవాదికే వంత పాడతాడు భుట్టో వారసుడు.
పాకిస్తాన్-ముస్లిం మతోన్మాదం అవిభక్త కవలలు. పాకిస్తాన్- ఉగ్రవాదం ఒక నాణేనికి రెండు ముఖాలు. పాకిస్తాన్- భారత్ మీద ద్వేషం అవిభాజ్యాలు. కాబట్టి పాకిస్తాన్ అంతు చూడక తప్పదు. ఇది వాస్తవిక దృష్టి కాదు అనడానికి ఇప్పుడు ఎవరూ సాహసించరు. దొడ్డితోవన ఉగ్రవాదులను సమర్ధించేవాళ్లు, అడ్డదారిన ముస్లిం ఉగ్రవాదాన్ని నెత్తికెత్తుకునే వాళ్లు కూడా సాహసించలేరు. ప్రపంచాన్ని, లేదా ఆసియాను ఔరంగజేబ్ కాలానికి, ఇంకా వీలైతే అల్లావుద్దీన్ ఖిల్జీ కాలానికి తీసుకుపోదామనుకునే పాకిస్తాన్ విచ్ఛిన్నం కావడం తక్షణ అవసరం. అందుకు పెహల్గావ్ దాడి అత్యవసర కారణంగా మారినా ఆశ్చర్యపడక్కరలేదు.
ఆర్టికల్ 370 తరువాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదం తోక ముడిచింది. కేంద్రం అభిమతానికి విరుద్ధంగా శాసనసభకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్రపతి పాలనలో దాదాపు ప్రశాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నాయకత్వంలో ‘ప్రజా ప్రభుత్వం’ అధికారంలోకి వచ్చిన తరువాత మరొకసారి ముస్లిం ఉగ్రవాదులకు ద్వారాలు తెరిచినట్టయింది. ఫలితమే పెహల్గావ్ దురంతం. తరువాత పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. మాటలకు అందని ఆ నెత్తుటి కాండ క్రమం ఇది:
ఏప్రిల్ 22- మంగళవారం:
ఉగ్రదాడి.. 26 మంది దుర్మరణం
జమ్మూ కశ్మీర్‌లో అనంత్‌నాగ్ జిల్లా, పెహల్గావ్‌కు ఆరు కి.మీ.ల దూరంలో మినీ స్విట్జ ర్లాండ్‌గా పేరొందిన బైసరన్ లోయలో మధ్యాహ్నం పూట పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. అనేక మంది గాయ పడ్డారు. పర్యాటకులు శిబిరాల్లో సేదతీరుతూ ఆహారం తీసుకుంటున్న సమయంలో అక్కడికి నలుగురు టెర్రరిస్టులు సైనిక దుస్తుల్లో వచ్చారు. పురుషులే లక్ష్యంగా దాడి చేశారు. అత్యంత సమీపం నుంచి తుపాకీ కాల్పులు జరిపారు. అనంతరం లోయకు వెనుకనే ఉన్న పైన్ వృక్షాలతో కూడిన అడవిలోకి టెర్రరిస్టులు కనుమరుగైపోయారు. భద్రతాదళాలు కాల్పుల శబ్దానికి అప్రమత్త మయ్యాయి. వెంటనే బైసరన్‌కు చేరుకున్నాయి. టెర్రరిస్టుల కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టాయి. గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై తరలించారు. సహాయ చర్యల కోసమని హెలికాప్టర్లను రంగంలోకి దించారు.
దాడి చేసింది టీఆర్‌ఎఫ్
దాడికి పాల్పడింది తామేనని పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రమూక ‘లష్కరే తోయిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ – టీఆర్‌ఎఫ్ ప్రకటించింది.
ప్రధాని ఫోన్.. శ్రీనగర్‌కు అమిత్ షా
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. ప్రధాని ఆదేశానుసారం అదే రోజు రాత్రికి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా బలగాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశ మయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.
ఏప్రిల్ 23 – బుధవారం
పాకిస్తాన్‌పై 5 ప్రతీకార చర్యలు
పెహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకొని ఏప్రిల్ 23 బుధవారానికి హుటాహుటిన దేశ రాజధానికి చేరుకున్నారు. రావడం రావడమే విమానాశ్రయంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షిం చారు. అనంతరం అదే రోజు సాయంత్రం ప్రధాని నివాసంలో మోదీ అధ్యక్షతన భద్రతపై కేబినెట్ కమిటీ-సీసీఎస్ సమావేశమైంది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, తదితరులు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం కేంద్ర విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమావేశ వివరాలను వెల్లడించారు. పెహల్గావ్ దాడిని సీసీఎస్ ఖండించింది. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఉగ్రవాదానికి కొమ్ము కాస్తూ, భారత్‌లో ఉగ్రదాడులకు ఉసిగొల్పుతున్న పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పడానికి ఐదు చర్యలు చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. అవి..
- 1960 నాటి సింధూ జలాల ఒప్పందం నిలుపుదల
- సరిహద్దు వద్ద అటారీ చెక్ పోస్టు మూసివేత. అధికారిక పత్రాలతో భారత్‌లోకి ప్రవేశించిన పాకిస్తానీయులు మే 1వ తేదీలోగా స్వదేశానికి తిరిగివెళ్లిపోవాలి.
- సార్క్ వీసా పొడిగింపు పథకం – ఎస్‌వీయీఎస్ కింద పాకిస్తానీయులు భారత్‌లో ఉండరాదు. గతంలో వారికి జారీ చేసిన ఎస్‌వీయీఎస్ వీసాలు వెంటనే రద్దవుతాయి. ఎస్‌వీయీఎస్ వీసాలతో భారత్‌లో ఉన్నవారు 48 గం•ల్లోగా విడిచిపెట్టి వెళ్లిపోవాలి.
- ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ నుంచి సైనిక, నావికాదళం, వాయుసేనకు చెందిన సలహాదారుల ఉపసంహరణ.
- ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్య 30కి కుదింపు.
ఏప్రిల్ 24 – గురువారం
భారతీయ ఆత్మపై దాడి: ప్రధాని మోదీ
ఉగ్రవాదులను, వారికి ఊతమిస్తున్నవారిని ఊహకందని రీతిలో దెబ్బకొడతామని ప్రధాని మోదీ ఏప్రిల్ 24, గురువారం అన్నారు. బిహార్‌లోని మధుబనిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని పెహల్గావ్ దాడిలో అమరులైనవారికి నివాళులర్పించారు. నిమిషం పాటు మౌనం పాటించారు. అనంతరం, ‘దాడిలో అనేకులు ప్రాణాలు కోల్పో యారు. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ఒకరు కుమారుడ్ని కోల్పోతే, మరొకరు సోదరుడ్ని, ఇంకొకరు జీవిత భాగస్వామిని కోల్పోయారు. బాధితుల్లో ఒకరు బెంగాలీ మాట్లాడితే, మరొకరు కన్నడ, ఇంకొకరు మరాఠీ, మరికొందరు ఒడియా, గుజరాతీ, బిహారీ.. ఇలా దేశంలో వేర్వేరు ప్రాంతాలవారు ఉన్నారు. అటు కార్గిల్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు మానవత్వం ఉన్న ప్రతీ భారతీయుడు బాధిత కుటుంబాలకు అండగా ఉన్నారు. క్రూరులైన శత్రువులు చేసిన దాడి అమాయకులైన పర్యాటకుల మీదనే కాక భారతదేశపు ఆత్మపైన చేసిన దాడి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారిని నామరూపాల్లేకుండా చేస్తాం. అందుకు సమయం ఆసన్నమైంది’’ అని ప్రధాని అన్నారు. అప్పటిదాకా హిందీలో మాట్లాడిన మోదీ.. తన మాటలు యావత్ ప్రపంచానికి వినపడాలి అన్నట్టుగా ఇంగ్లీషులో ప్రసంగించడం ప్రారంభించారు. ఆ క్రమంలో ‘‘దాడులతో భారత్ అచేతనంగా మిగిలి పోదు. ప్రతీకార చర్యలు తప్పకుండా ఉంటాయి. ప్రపంచంలో వారు(ఉగ్రవాదులు) ఏ మూల నక్కినా పట్టుకొని తీరుతాం. వారి పీచమణుస్తాం. బాధితులకు న్యాయం జరిగేవరకు మేం విశ్రమించేది లేదు. దాడిని ఖండించి మాకు అండగా నిలిచిన అమెరికా, రష్యా, చైనా, ఐరోపా యూనియన్ దేశాలకు ధన్యవాదాలు’’ అని ప్రధాని అన్నారు.
పాక్ నోట యుద్ధం మాట.. భారత్‌పై చర్యలు
పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఆ దేశపు జాతీయ భద్రతా కమిటీ ఏప్రిల్ 24, గురువారం సమావేశమైంది. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని యుద్ధానికి ఉసిగొల్పే చర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. భారత్ చేపట్టిన చర్యలను ఏకపక్షమైనవి, అన్యాయమైనవి, రాజకీయ ప్రేరేపితమైనవి, న్యాయబద్ధంగా చెల్లుబాటు కానివని పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌పై ప్రతీకార చర్యలను పాకిస్తాన్ ప్రకటించింది. అవి..
- వెంటనే అమల్లోకి వచ్చేలా వాఘా సరిహద్దు మూసివేత. ఈ మార్గం గుండా భారత్ రాకపోకలు నిలిపివేత. వాఘా సరిహద్దు గుండా సరైన పత్రాలతో పాకిస్తాన్‌లోకి ప్రవేశించిన భారతీయులు ఏప్రిల్ 30 నాటికి స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలి.
- భారత్‌తో సిమ్లా ఒప్పందంతోపాటు అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలు నిలుపుదల.
- సార్క్ వీసా పొడిగింపు పథకం – ఎస్‌వీయీఎస్ కింద సిక్కు యాత్రికులు మినహా భారతీయులకు జారీ చేసిన వీసాలు తక్షణమే రద్దు. ఎస్‌వీయీఎస్ కింద పాకిస్తాన్‌లో ఉంటున్న భారతీయులు 48 గంటల్లోగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోవాలి.
- భారత్‌కు చెందిన లేదా భారత్ నడుపుతున్న అన్ని విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేత.
- భారత్‌తో, భారత్‌కు పరోక్షంగా సహకరిస్తున్న దేశాలతో అన్ని రకాల వాణిజ్యం నిలిపివేత.
- ఇస్లామాబాద్‌లో ఉంటున్న భారత సైనిక, నావికాదళం, వాయుసేనకు చెందిన సలహా దారులు ఏప్రిల్ 30నాటికి పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్లిపోవాలి.
- ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషన్‌లో సిబ్బంది సంఖ్య ఏప్రిల్ 30నాటికి 30కి కుదింపు.
ఏప్రిల్ 25- శుక్రవారం
సింధూలో రక్తాన్ని పారిస్తాం.. పాక్ పిచ్చికూతలు
భారత్ పెహల్గావ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన తరుణంలో పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి భిలావల్ భుట్టో భారత్‌పై పిచ్చికూతలు కూశాడు. సింధూ నదిలో నీరు పారకుంటే రక్తం ఏరులై ప్రవహిస్తుందంటూ రెచ్చగొట్టేలా వాగాడు. సింధూ నది పాకిస్తాన్ సొంతమని అన్నాడు. అసలు సింధూ నాగరికతకు పాకిస్తానీయులే సంరక్షకులని ఉన్నవీ లేనివీ కల్పించి కల్లబొల్లి కబుర్లు చెప్పాడు.
భుట్టో కన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు, పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. సింధూ నదిలో ప్రతి నీటి బొట్టూ పాకిస్తాన్‌దేనని వాగాడు. ఇదే సమయంలో లష్కరే తోయిబా చీఫ్, ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ పిచ్చి ప్రేలాపనలతో కూడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ‘‘కశ్మీర్‌లో ఆనకట్ట కట్టేసి పాకిస్తాన్‌కు నీళ్లు రాకుండా చేస్తామని మీరు(భారత్) అంటున్నారు. పాకిస్తాన్‌ను నాశనం చేయడానికి చూస్తున్నారు. మీరే కనుక నీళ్లు ఆపేస్తే.. నీళ్లు లేని నదుల్లో రక్తం ఏరులై పారుతుంది’’ అని సయీద్ బెదిరించాడు.
ఏప్రిల్ 27- ఆదివారం
పెహల్గావ్ దుర్మార్గులకు గట్టిగా బదులిస్తాం
ప్రధాని నరేంద్ర మోదీ పెహల్గావ్ ఉగ్రదాడికి పాల్పడినవారికి, కుట్రదారులకు గట్టిగా బదులి స్తామని పునరుద్ఘాటించారు. బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కూడా ఇచ్చారు. ఏప్రిల్ 27 ఆదివారంనాడు మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘నేడు ఎంతో ఆవేదన నిండిన హృదయంతో మాట్లాడుతున్నాను. ఏప్రిల్ 22న పెహల్గావ్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడి ప్రతి ఒక్క పౌరుని హృదయాన్ని ముక్కలు చేసింది. ప్రతి ఒక్క భారతీయుడు బాధిత కుటుంబాల పట్ల తీవ్రమైన సానుభూతిని వ్యక్తం చేశారు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఏ భాషను మాట్లాడేవారైనా సరే ఈ దాడిలో ప్రియమైనవారిని కోల్పోయిన బాధితుల బాధను తమదిగా భావించారు. ఉగ్రదాడికి సంబంధించిన ఫోటోలు చూసి ప్రతి ఒక్క భారతీ యుడు రగిలిపోయారనే విషయాన్ని నేను అర్థం చేసుకోగలను. పెహల్గావ్‌లో ఈ దాడి ఉగ్రవాదాన్ని పోషించే వారి నిస్పృహను, వారి పిరికితనాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని మోదీ తెలిపారు. కశ్మీర్ గురించి మాట్లాడుతూ ‘‘కశ్మీర్‌లో శాంతి తిరిగి నెలకొంటున్న సమయంలో, విద్యాసంస్థలు చురుగ్గా పనిచేస్తున్నప్పుడు, భవన నిర్మాణ కార్యకలాపాలు అనూహ్యంగా పుంజుకుంటున్నప్పుడు, ప్రజాస్వామ్యం మరింత పటిష్టమైనప్పుడు, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయికి పెరిగినప్పుడు, ప్రజల ఆదాయం వృద్ధి చెందుతున్నప్పుడు, యువత కోసమని కొత్తగా అవకాశాలు పుట్టుకొస్తున్న వైనాన్ని చూసి జాతి శత్రువులకు, జమ్ము కశ్మీర్ శత్రువులకు కన్ను కుట్టింది. టెర్రరిస్టులు, వారి మాస్టర్లు కశ్మీర్‌ను మరోసారి ధ్వంసం చేయాలనుకుంటున్నారు. అందుకనే ఇంత పెద్ద దాడి చేశారు’’ అని ఆయన అన్నారు. ఉగ్రవాదంపై జరిపే ఈ యుద్ధంలో జాతి ఐక్యత, 140 కోట్ల మంది భారతీయుల సంఘీభావం జాతికి గొప్ప బలమని మోదీ తెలిపారు. జాతి గొప్పద నాన్ని గురించి వివరిస్తూ ‘‘ఈ ఐక్యతే ఉగ్రవాదంపై మనం చేసే తిరుగులేని పోరాటానికి ప్రాతిపదిక అవుతుంది. మన జాతికి వచ్చిన ఈ సవాల్‌ను ఎదుర్కోవడం కోసమని మనం మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఒక జాతిగా మనం గట్టి సంకల్ప బలాన్ని ప్రదర్శించాలి. నేడు యావత్ ప్రపంచం ఈ ఉగ్రదాడి వైపు చూస్తోంది. యావత్ జాతి ఏక కంఠంతో మాట్లాడుతోంది’’ అని చెప్పారు. అంతర్జాతీయ సమాజం నుంచి వెల్లువెత్తిన సంతాప సందేశాలను మననం చేసుకుంటున్నట్టుగా ‘‘యావత్ ప్రపంచం భారతీయుల ఆగ్రహాన్ని తనదిగా భావిం చింది. ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచం నలుమూ లల నుంచి సంతాప సందేశాలు వస్తూనే ఉన్నాయి. ఈ దారుణమైన ఉగ్రదాడిని గట్టిగా ఖండించిన అంతర్జాతీయ నేతల నుంచి నాకు ఫోన్‌కాల్స్, సందేశాలు వచ్చాయి. వారు బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. యావత్ ప్రపంచం ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న 140 కోట్ల మంది భారతీయులకు అండగా నిలిచింది’’ అని ప్రధాని తెలిపారు. బాధితులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందనే భరోసాను నేను వారికి ఇస్తున్నాను. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఈ దాడికి పాల్పడినవారికి, దాడి వెనుక కుట్రదారులకు గట్టిగా బదులిస్తాం’’ అని మోదీ తెలిపారు.
రక్షణ మంత్రితో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ భేటీ
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ – సీడీఎస్ అనిల్ చౌహాన్ ఏప్రిల్ 27 ఆదివారం మంత్రి నివాసంలో భేటీ అయ్యారు. కీలకమైన ఈ భేటీలో పాకిస్తాన్‌పై సైనిక చర్యల విషయాలను చౌహాన్ రక్షణ మంత్రికి వివరించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అంతకుమునుపు రాజ్‌నాథ్ సింగ్‌తో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి, బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌదరీ కూడా సమావేశ మయ్యారు. పెహల్గావ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో భద్రత పరిస్థితి గురించి వారు మంత్రికి వివరించినట్టు తెలుస్తోంది.ఈ సమావేశానికి ఆర్మీ డైరెక్టర్ జనరల్ (మిలటరీ ఆపరేషన్స్) హాజరైనట్టు సమాచారం. పాక్ బలగాలు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న సమయంలో రక్షణ మంత్రితో ఉన్నతాధికారులు భేటీ కావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
భారత్‌కు ఎఫ్‌బీఐ పూర్తి మద్దతు
పెహల్గావ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తామని అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఏప్రిల్ 27, ఆదివారం తెలిపారు. ఉగ్రదాడిని ఆయన ఖండించారు. ఈ దాడి ఉగ్రవాదం నుంచి యావత్ ప్రపంచం నిత్యం ఎదుర్కొంటున్న ముప్పులను గుర్తు చేస్తోందని ఎక్స్ సోషల్ మీడియాల చేసిన పోస్టులో పటేల్ పేర్కొన్నారు. దాడి అనంతరం భారత్ భద్రతాదళాలు స్పందించిన తీరును ఆయన ప్రశంసించారు.
యుద్ధానికి నావికాదళం సన్నాహాలు..
క్షిపణి పరీక్షలు
పాకిస్తాన్‌తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్ అరేబియా మహా సముద్రంలో క్షిపణి పరీక్షలు జరిపింది. ఇదే విషయమై భారత నావికాదళం అధికార ప్రతినిధి ఏప్రిల్ 27 ఆదివారం ఎక్స్‌లో చేసిన ఒక పోస్టులో ‘‘ఇటీవల అరేబియా మహాసముద్రంలో భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్-ఎస్‌ఏఎం క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. దీనికి తోడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధం అని ప్రపంచానికి చాటి చెప్పడానికి యుద్ధ నౌకల నుంచి క్షిపణులను ప్రయోగించడం జరిగింది’’ అని తెలిపారు. ఏప్రిల్ 24 గురువారం నాడు నావికాదళానికి చెందిన ఒక గైడెడ్ విధ్వంసక క్షిపణి ఒక సీ-స్కిమ్మింగ్ లక్ష్యాన్ని ధ్వంసం చేసింది. సముద్ర మట్టానికి చాలా తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లు, తదితరాలను సీ-స్కిమ్మింగ్ లక్ష్యాలు అని అంటారు. ఇవి రాడార్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్లు కనిపెట్టకుండా ఉండటానికని చాలా తక్కువ ఎత్తులో ఎగురుతుంటాయి.
పాక్ మంత్రి పిచ్చి ప్రేలాపనలు
భారత్ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలతో హనీఫ్ అబ్బాసీ అనే ఆ దేశపు మంత్రికి మతిభ్రమించినట్టుంది. భారత్‌పై దాడి చేయడానికని తమ వద్ద 130 అణుబాంబులు, ఘోరీ, షహీన్, ఘజ్నవి లాంటి క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని ఏప్రిల్ 27 ఆదివారం వాగాడు. అంతేకాకుండా అవి ఎక్కడ ఉన్నాయో ఎవ్వరికీ తెలియదని, భారత్ కవ్విస్తే కనుక అణుబాంబులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ మతిమాలిన మంత్రి చెప్పాడు.
ఎన్‌ఐఏకి దర్యాప్తు బాధ్యతలు.. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు
కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ పెహల్గావ్ ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు ఏజెన్సీ- ఎన్‌ఐఏకు ఏప్రిల్ 27 ఆదివారం బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు వివరాలతో ఒక ప్రకటనను ఎన్‌ఐఏ విడుదల చేసింది. ప్రకటన ప్రకారం ఐజీ, డీఐజీ, ఎస్పీ నేతృత్వంలోని ఎన్‌ఐఏ బృందాలు ప్రత్యక్ష సాక్షుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. టెర్రరిస్టులు ఏ విధంగా దాడి చేసిందీ తెలుసుకోవ డానికి ఎన్‌ఐఏ బృందాలు బైసరన్ లోయకు ఆగమన, నిష్క్రమణ ప్రాంతాలను నిశితంగా శోధిస్తున్నాయి. ఆధారాలను సేకరించడానికని ఫోరెన్సిక్, తదితర నిపుణుల సహకారంతో దాడి జరిగిన ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
నలువైపులా కమ్ముకున్న నలుగురు టెర్రరిస్టులు
దాడిలో ముగ్గురు పాక్ టెర్రరిస్టులు, ఒక కశ్మీరీ టెర్రరిస్టును కలుపుకొని మొత్తం నలుగురు టెర్రరిస్టులు పాల్గొన్నారని ఎన్‌ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కశ్మీరీ టెర్రరిస్టును అదిల్ థోకర్‌గా గుర్తించారు. టెర్రరిస్టులు కోకెనగర్ అడవుల నుంచి బైసరన్ పచ్చిక బయలుకు 20 నుంచి 22 గంటలపాటు నడుచుకుంటూ వచ్చి ఏప్రిల్ 22న చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకున్న సమయానికి దాదాపు 1200 మంది పర్యాటకులు వారి వేసవి సెలవులను ఆనందంగా గడుపుతున్నారు. టెర్రరిస్టుల్లో ఇద్దరు దుకాణాల వెనుక దాక్కున్నారు. మిగిలిన ఇద్దరు జిప్‌లైన్ ప్రాంతంలో పొజిషన్ తీసుకున్నారు. పర్యాటకులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతుండగా, దుకాణం వెనుక దాక్కున్న టెర్రరిస్టులు వెలుపలకు వచ్చారు. ఎదురుపడిన పర్యాటకులను కల్మా వల్లించమన్నారు. ఆ పని చేయలేకపోయిన వారిపై ఏకే-47, ఎం4 రైఫిళ్లతో విచక్షణారహితంగా కాల్పులు జరపడం మొదలుపెట్టారు. పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కు తోచని స్థితిలో పరుగులు తీస్తుంటే జిప్‌లైన్ ప్రాంతం దగ్గర ఉన్న మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులు వారిపై దారుణంగా కాల్పులు జరిపారు.
చెట్టు పైకి ఎక్కి వీడియో తీసిన స్థానిక ఫోటోగ్రాఫర్
దాడి జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న స్థానిక ఫోటోగ్రాఫర్ ప్రాణభయంతో చెట్టుపైకి ఎక్కి దాక్కున్నాడు. అతడు చెట్టుపై నుంచి తన మొబైల్ ఫోన్‌తో దాడి మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం ఎన్‌ఐఏ చేతిలో ఉంది. దర్యాప్తునకు అది ఓ కీలకమైన ఆధారంగా పనికొస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
సైన్యాధికారి వాంగ్మూలం కీలకం
పర్యాటకుల్లో జమ్ము కశ్మీర్‌లో పనిచేస్తున్న ఓ సైన్యాధికారి కూడా ఉన్నారు. ఆయన తన కుటుంబంతో సెలవులు గడపడానికని బైసరన్ పచ్చిక బయలుకు వచ్చారు.
దాడి మొదలుకాగానే ఆయన తనకున్న అనుభవంతో, అత్యంత తెలివితేటలతో తన కుటుంబ సభ్యులను కాపాడుకున్నారు. మిగిలిన సాధారణ పర్యాటకులు దాడి షాక్ నుంచి ఇంకా బైటపడలేదు. కనుక వారు ఇచ్చే వాంగ్మూలంలో స్పష్టత ఉండదు. అదే సైన్యాధికారి విషయానికి వచ్చేసరికి ఆయన ఎలాంటి తడబాటు లేకుండా దాడి వివరాలను పూసగుచ్చినట్టుగా తన వాంగూల్మంలో వివరించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిజానికి ఈ దుర్ఘటన వివరాలు ఇప్పటికీ పూర్తిగా దేశం ముందుకు వచ్చాయని అనుకోనక్కర లేదు. ఒక్కొక్కటిగా అవి బయటపడతాయి. అందులో విస్తుపోయే అంశాకే ఎక్కువ చోటు కూడా.
భారత్ మన్నించదు.. మరచిపోదు…
భారత్‌పై జిహాదీలు జరుపుతున్న మతిలేని యుద్ధంలో మరో పర్వం రక్తంతో తడిసి ముద్దయ్యింది. ఏప్రిల్ 22న మధ్యాహ్నం దక్షిణ కశ్మీర్‌లోని పెహల్గావ్‌లో ముస్లిం మతోన్మాద ఉగ్రవాదం మారణ హోమం సాగించింది. ఉగ్రవాదానికి మతంతో ముడిపెట్టవద్దు అని మానవాళికి నీతులు చెప్పే సూడో సెక్యూలరిస్టుల అసలు రంగును బట్టబయలు చేస్తున్నట్టుగా కంటికి కనిపించినవారినల్లా ‘నీ మతమేమిటో చెప్పు’ అని అడిగింది. రద్దీగా ఉండే ఇరుకిరుకు రైలు బోగీల్లోనూ, రోడ్లపైనా ఎక్కడ పడితే అక్కడ తోటివారిని ఇబ్బందులు పెడుతూ చేసే ప్రార్థనలోని పంక్తులను చూడకుండా చెప్పాలని హుకుం జారీ చేసింది.
‘‘శ్రేయాన్ స్వధర్మో విగుణః
పరధర్మాత్ స్వనుష్టితాత్
స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః’’
అన్న గీతాకారుడి మాటను తరతరాలుగా, తు.చ. తప్పకుండా పాటిస్తున్నవారి త్రికరణశుద్ధి తుచ్చులైన ఉగ్రవాదులకు తప్పుగా మారింది. వారి మతోన్మాదం ఏ స్థాయికి చేరుకుందంటే ఎదురుగా భయంతో వణికిపోతున్న మగవాడు ‘‘మనవాడా? పరాయి వాడా?’’ అని తెలుసుకోవడానికి వేసుకున్న ప్యాంటును బలవంతంగా ఊడదీయించారు. ‘‘మనవాడు’’ కాదని ఖాయమైపోయాక అమాయకులైన హిందువులపై మతిభ్రమించిన పాకిస్తాన్ శునకాల చేతుల్లోని తుపాకులు తూటాలు కురిపించాయి. వద్దు.. వద్దు అని వేడుకుంటున్నా.. ప్రాణభయంతో కంచెలను దాడి పారిపోతున్నా కనికరించలేదు ఆ కర్కశ మూక. ఇంకా 16 రోజుల పండుగ మురిపెం తీరని కొత్త జంటను సైతం విడిచిపెట్టలేదు. ‘‘మినీ స్విట్లర్లాండ్’’ మరు భూమిగా మారిపోయింది. అయినవారితో ఆనందంగా గడపాలని ఎక్కడెక్కడి నుంచో వచ్చిన 26 మంది ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. పెళ్లి నాడు పాదాలకు అంటిన పారాణి ఆరకముందే ముష్కరుల చేతిలో కడతేరి పోయిన భర్త పార్థివ దేహం వద్ద అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఆడపడుచును చూసి మానవత్వం మంటకలిసి పోయింది. కారుణ్యం కలికానికి కూడా అందకుండా పోయింది. దయ దరిదాపుల్లో లేకుండా పోయింది. జాలి గాలిలో కలిసిపోయింది. విచక్షణ వీపు చూపించింది.
జరిగింది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, అది ఒక పథకం ప్రకారం ఒక మతాన్ని నామరూపాల్లే కుండా చేసే కార్యక్రమంలో ఓ భాగం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఎంతటి గండరగండులకైనా వెన్నులో వణుకు పుట్టించే పక్కా ప్రణాళికకు, మధ్యయుగంనాటి క్రూరత్వా నికి అంటు కట్టిన హిందూ వ్యతిరేక కార్యక్రమం. సెక్యూలరిస్టులుగా చెప్పుకునే మీడియా ఇది ‘‘పర్యాట కులపై దాడి’’ అని ప్రచారం చేస్తూ మతోన్మాద హింసను కప్పి పుచ్చడానికి శతవిధాలుగా ప్రయత్ని స్తోంది. ఇది హిందువులను లక్ష్యంగా చేసుకొని ఇస్లామ్ టెర్రరిస్టులు జరిపిన దాడి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
పాకిస్తాన్ చేతులకు అంటిన హిందూ రక్తం
దాడిపై జరిపిన ప్రాథమిక దర్యాప్తు, నిఘా వర్గాల ప్రకారం ఘాతుకం వెనుక సూత్రధారులు పాకిస్తాన్‌లో ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ దాడిలో అత్యంత నికృష్టుడైన అంతర్జాతీయ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. తుచ్చుడైన ఈ ముష్కరుడికి భారత్‌లో జరిగిన నరమేధాలకు వెనుకుండి చేయించిన నీచాతినీచమైన చరిత్ర ఉంది.
దాడి ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరిపై, ఎంత క్రూరంగా జరిగిందీ చూసినవారి చూపుడువేలు ఇస్లామ్ ఉగ్రవాదం మన భూభాగంపై మరోసారి పెచ్చరిల్లడానికి ఊతమిచ్చి, మనకు పశ్చిమాన ఒళ్లంతా విషాన్ని, కపటత్వాన్ని నింపుకొన్న పొరుగు దేశం వైపు చూపిస్తుంది.
ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘాతుకం భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ బహురూపాలుగా పన్నుతున్న కుటిలమైన వ్యూహంలో భాగమే.
కశ్మీర్ ఆర్థికాభివృద్ధిని చూసి ఓర్వలేక..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు నుంచి పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన పెట్టుబడులు తెచ్చేంతవరకు జమ్ము కశ్మీర్‌లో శాంతిని పునరుద్ధరించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికని సంవత్సరాల తరబడి అహర్నిశలు శ్రమించింది. ఆ శ్రమ పండించిన శాంతి ఫలాలను కేంద్రపాలిత ప్రాంతం రుచి చూడటం మొదలుపెట్టింది.
పర్యాటకం మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్టుగా విరగకాస్తోంది. హోటళ్లు అతిథులతో కళకళలాడిపోతున్నాయి. స్థానికులకు మునుపెన్నడూ ఎరుగని రీతిలో ఉపాధి దొరుకుతోంది. కశ్మీరీలు నెమ్మది నెమ్మదిగా కల్లబొల్లి వేర్పాటువాద కథనాలను వినడం మానేస్తున్నారు. ఇదంతా పొరుగునే ఉన్న పాకిస్తాన్‌కు మింగుడుపడటంలేదు. వెంటనే తన చంకలో ఉన్న ఉగ్రవాద మూకల్ని ఉస్కో అంది. భువిపై భూతలస్వర్గంలాంటి జమ్ము కశ్మీర్‌ను చూడటానికి వచ్చే హిందువులను భయభ్రాంతులకు గురిచేయమంది. తద్వారా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదుగుతున్న పర్యాటకాన్ని నేలమట్టం చేయాలనేది దాయాది దుష్ట పన్నాగం. పనిలోపనిగా కశ్మీర్‌పై ‘‘భద్రమైంది కాదు’’ అనే ముద్ర మరోసారి పడుతుంది. అదే సమయంలో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా కశ్మీరీలకు, మిగిలిన భారతీయులకు మధ్య ఓ పూడ్చలేని అగాధాన్ని పుట్టించడానికి పొరుగుదేశం పాచిక వేసింది.
కశ్మీర్ అంశాన్ని మళ్లీ తెరపైకి తేవడానికి..
ఈ మారణహోమం సరిగ్గా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్‌లో, భారత ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నప్పుడు జరిగింది. దాని వెనుక లక్ష్యం ఊహించిందే.. అదేమిటంటే ‘‘కశ్మీర్‌లో హింస’’ అంటూ గగ్గోలు పెట్టే పతాక శీర్షికలను అంతర్జాతీయ మీడియాలో వచ్చేలా చేయడం. కశ్మీర్‌కు అయిన గాయాలను నయం చేసి, సమైక్యతా భావనను నెలకొల్పేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను దెబ్బ తీయడం. అంతర్జాతీయ దౌత్యపరమైన రాడార్ దృష్టిలో కశ్మీర్ నిత్యం తగులబడుతున్నట్టుగా కనపడటం.
పాకిస్తాన్ డీప్ స్టేట్ కోరుకుంటున్నది శాంతిని కాదు ఎడతెగని అశాంతిని, అల్లకల్లోలాన్ని. అది ఎంతటి వెర్రిమాలోకం అంటే నరమేధాన్ని సృషించడం ద్వారా అంతర్జాతీయంగా సానుభూతిని సంపాదించు కోవచ్చునని కలలు కంటోంది.
అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి..
పాకిస్తాన్ సర్కారు నానారకాల సమస్యతో అగచాట్లు పడుతోంది. బలోచిస్తాన్‌లో తిరుగుబాటు పతాక స్థాయికి చేరుకుంది. ఖైబర్ పక్తున్‌క్వా పాకిస్తాన్ చేజారిపోతోంది. జనరల్ ఆసిమ్ మునీర్ నేతృత్వంలో సైన్యం వైఫల్యాలు కోకొల్లలు. ఇలాంటి పరిస్థితుల్లో వాటి నుంచి దేశ ప్రజల దృష్టిని, అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించడానికి పాకిస్తాన్ అలమటించిపోతోంది. అలా దృష్టి మళ్లించడంలో భాగంగానే దాయాది దేశం పెహల్గావ్‌లో నరమేధానికి తెరతీసింది. పెహల్గావ్‌లో పేల్చిన ఒకొక్క తూటా హిందువులను మాత్రమే కాకుండా పాక్ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడాన్ని కూడా లక్ష్యంగా చేసుకుంది.
రక్తపాతంతో కొత్త జిహాదీలకు ఎర
పాకిస్తాన్‌లో ఉగ్రవాదులకు పురుడుపోసే ప్రసూతి కేంద్రాలుగా మదర్సాలు, అతివాద మసీదులు, లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద మూకలు ఉన్నాయి. ఈ ఉగ్రవాద ప్రసూతి కేంద్రాలకు ఏదైనా రక్తపాతాన్ని కళ్లచూస్తేనే కాని కొత్తగా జిహాదీలను నియమించు కోవడం కుదరదు.
ఉగ్రవాద శిబిరాలను, సంస్థలనుపెంచి పోషించే ధూర్తులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా సాగించే మారణహోమాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. ఆ ప్రచారంతో అమాయక యువతకు వల వేస్తారు. ఇస్లాం ఉగ్రవాదం అనే సాలెపురుగు గూటిలోకి చేరుస్తారు. అలా మతోన్మాద మాయలో పడిన యువతను ఆత్మాహుతి దళంలో సభ్యులుగానో, భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే మూకగానో తయారు చేస్తారు.
నమ్మకమనే వారధిపైనా దాడి
ఉగ్రవాదుల చేతుల్లో 26 మంది దుర్మరణం వారి కుటుంబాలకు పెను విషాదాన్ని మిగిల్చింది. అది కశ్మీర్‌లో సాధారణ స్థితి తీసుకొని వచ్చే దిశగా జరుగుతున్న సున్నితమైన పక్రియను దెబ్బ తీసింది. ఆర్థిక పునరుజ్జీవనానికి అతి పెద్ద ఆశాకిరణమైన పర్యాటకం ఇప్పట్లో పుంజుకోవడం కష్టమే.
తల్లిదండ్రులెవరూ కూడా వారి పిల్లల్ని గుల్‌మార్గ్ లేదా పెహల్గావ్‌కు ధైర్యం చేసి పంపించరు. ఏ ఒక్క కుటుంబమూ కూడా శ్రీనగర్‌లో నిర్భయంగా హౌస్ బోట్‌ను బుక్ చేసుకోదు. సరిగ్గా ఇదే భారత్ శత్రువులు కోరుకుంటున్నది. తాజా దాడి ఒక్క హిందువుల మీదనే కాదు కశ్మీర్, మిగిలిన భారత్ మధ్య నిర్మించుకున్న నమ్మకమనే సున్నితమైన వారధి మీద కూడా జరిగింది.
దెబ్బకు దెబ్బ తీయాలి
- నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)ను అంటిపెట్టుకొని భారత్‌పై ఎప్పుడెప్పుడు దాడి చేద్దామా అని గోతికాడ నక్కల్లా టెర్రరిస్టులు దాక్కున్న కలుగులను ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా నామరూపాల్లేకుండా చేయాలి.
- అందివచ్చిన ప్రతీ అంతర్జాతీయ వేదికను వాడుకుంటూ పాకిస్తాన్‌ను దౌత్యపరంగా, ఆర్థికంగా ఏకాకిని చేయాలి.
- భారతదేశంలోనే ఉంటూ, ఇక్కడి హిందువు దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతూ ‘మానవ హక్కులు’ లేదా ‘స్వరాజ్యోద్యమం’ పేరుతో అలాంటి ఇస్లాం ఉగ్రవాదాన్ని సమర్థించేవారిని నిర్ధాక్షిణ్యంగా ఏరిపారేయాలి.
- ఉగ్రదాడులకు తలొగ్గకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ధార్మిక, పూర్వ సంస్కృతి పర్యాటకానికి ఊతమివ్వాలి.
శత్రువులకు గట్టి బుద్ధి చెప్పాలి
అమాయక హిందువులను చంపడంతో భారత్ సత్తువ కోల్పోతుందని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి భ్రమగానే మిగిలిపోతుంది. అమరుడైన ఒక్కొక్క హిందువు కోసమని వేలాదిగా హిందువులు ధర్మం పట్ల, దేశం పట్ల అచంచలమైన భక్తితో ముందుకు వస్తారు. ధర్మం, దేశం రెండూ కూడా శతాబ్దాలుగా చొరబాట్లు, జిహాద్‌లు, సామూహిక హత్యాకాండ, వలసవాద దోపిడీని తట్టుకొని నిలబడ్డాయి.
నిన్నటి చొరబాటుదారులకు పట్టిన గతే నేటి ఉగ్రమూకలకు, వారిని వెన్నంటి నిలిచే పొరుగు దేశానికి పడుతుంది. భారత్ ఒక్కనాటికీ మరచిపోదు.. మన్నించదు. పెహల్గావ్ నరమేధానికి ప్రతిగా శత్రువుల ఊహకందని రీతిలో ప్రతీకారం తీర్చుకుంటుంది. పెహల్గావ్ మృతుల ఆత్మలకు సద్గతులు కలగాలని భగవంతుని ప్రార్థిద్దాం.
దాడి చేసింది రాక్షసులు
‘‘నిజమైన హిందువు ఎవరినీ కూడా మీరు ఏ మతస్తులు అని ఒక్కనాటికీ అడగడు.. చంపడు. ఇది మన ఆచార, విచారాలకు విరుద్ధమైనది. పెహల్గావ్‌లో జరిగింది మతమౌఢ్యంలో వేళ్లూనుకున్న ఓ రాక్షస చర్య. ఆ పనిచేసినవారు ధర్మాన్ని అనుసరించేవారు కాదు… రాక్షసులు. రావణుడు బాగా చదువుకున్న వాడు. శివభక్తుడు. కానీ ఇంత తెలివితేటలు ఉండి కూడా అతడు అధర్మం బాట పట్టాడు. మారడానికని అవకాశాలు ఇచ్చినప్పటికీ అతడు నిరాకరించాడు. దాంతో శ్రీరామచంద్రుడు గత్యంతరం లేక అతడ్ని చంపాల్సివచ్చింది. అదే విధంగా, నేడు ఎవరైతే ద్వేషం, ఉగ్రవాదం బాట పట్టారో అలాంటివారిని ధర్మ రక్షణ కోసమని తప్పనిసరిగా మట్టుపెట్టాలి. నేడు ఈ నవీనకాలపు రావణుడ్ని నామరూపాల్లేకుండా చేయడానికి మనకు 18 చేతులు ఉన్న దుర్గామాత శక్తి కావాలి. ఆ శక్తి మన నిర్మాణంలో, ఐకమత్యంలో, స్పష్టమైన నైతికతలో ఉంది.’’
– ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
పెహల్గావ్ అమరులు
- మధుసూదన్‌రావు సోమిశెట్టి, బెంగళూరు, కర్ణాటక (స్వస్థలం, కావలి ఏపీ)
- జేఎస్ చంద్రమౌళి, విశాఖపట్నం, ఆంధప్రదేశ్.
- దిలీప్ దెసాలే, ముంబాయి, మహారాష్ట్ర
- హేమంత్ జోషి సుహాస్, ముంబయి, మహారాష్ట్ర
- అతుల్ శ్రీకాంత్ మోని, థానె, మహారాష్ట్ర
- సంజయ్ లక్ష్మణ్ లెలె, థానె, మహారాష్ట్ర
- సంతోష్ జగ్దాలే, పుణె, మహారాష్ట్ర
- కస్టోబే గనోవోటే, పుణె, మహారాష్ట్ర
- బిటైన్ అధికారి, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
- సమీర్ గుహ, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్,
- మనీశ్ రంజన్, బిహార్
- భరత్ భూషణ్, బెంగళూరు, కర్ణాటక
- మంజునాథరావు, శివమొగ్గ, కర్ణాటక
- యతీశ్ పర్మార్, భావ్‌నగర్, గుజరాత్
- సుమిత్ పర్మార్, భావ్‌నగర్, గుజరాత్
- శైలేష్ భాయ్ కలథియా, సూరత్, గుజరాత్
- వినయ్ నర్వాల్, కర్నాల్, హరియాణా
- ఎన్. రామచంద్రన్, కొచ్చిన్, కేరళ
- దినేష్ అగర్వాల్, చండీగఢ్
- సయ్యద్ ఆదిల్ హుసేన్ షా, పెహల్గావ్, జమ్మూకశ్మీర్
- నీరజ్ ఉద్వానీ, యూఏఈ (స్వస్థలం రాజస్థాన్)
- సుశీల్ నాథ్యాల్, ఇండోర్, మధ్యప్రదేశ్
- ప్రశాంత్ శత్పతి, బాలేశ్వర్, ఒడిశా
- టేజ్ హాల్వింగ్, జిరో, అరుణాచల్ ప్రదేశ్
- శుభమ్ ద్వివేదీ, కాన్పూర్, ఉత్తరప్రదేశ్
- సుదీప్ సోయిపాని, రూపందేహి, నేపాల్
మన జాతి ఐక్యత, నైతిక నిష్ఠపై దాడి
‘‘జమ్ము కశ్మీర్‌లోని పెహల్గావ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి గర్హనీయమైనది, హృదయవిదారకమైనది. మృతులకు మా నివాళి అర్పిస్తున్నాం. ఈ దాడిలో గాయపడినవారు త్వరగా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఇది మన జాతి ఐక్యత, నైతిక నిష్ఠపై జరిగిన దాడి. అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు విభేదాలను విస్మరించి ఈ ఉగ్రవాద చర్యను ఖండించాలి. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలి. ఈ దాడికి బాధ్యులైనవారిని తగినవిధంగా శిక్షించాలి’’.
– ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలె
దశాబ్దాల నరమేధం
ఆగస్టు 15, 1993: ఉగ్రవాదుల మెరుపు దాడిలో 8 మంది అమర్‌నాథ్ యాత్రికుల దుర్మరణం.
జులై 4, 1995: పెహల్గావ్ సమీపంలోని లిద్దర్‌వాట్‌లో ఇంగ్లండ్, అమెరికా, జర్మనీ, నార్వే దేశాలకు చెందిన ఆరుగుర్ని అపహరించుకుపోయిన ఉగ్రవాదులు. నార్వే దేశీయుడు దుర్మరణం. మిగిలిన వారు కనిపించకుండాపోయారు.
జులై 28, 1998: శేష్‌నాగ్ క్యాంప్‌సైట్ వద్ద ఉగ్రవాదుల మెరుపుదాడిలో 20 మంది అమర్‌నాథ్ యాత్రికుల దుర్మరణం.
మార్చి 21, 2000: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటన నేపథ్యంలో, రాత్రి వేళ అనంత్‌నాగ్ జిల్లాలోని చిట్టిసింగ్‌పొరా గ్రామంలో సిక్కు మతస్తులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 36 మంది మృతి.
ఆగస్టు 2, 2000: అమర్‌నాథ్ యాత్ర చరిత్రలోనే అతిపెద్ద దాడి అన్నట్టుగా నున్‌వాన్ బేస్ క్యాంప్ పైన జరిగిన దాడిలో 21 మంది యాత్రికులు, ఏడుగురు స్థానిక దుకాణందారులు, ఇతరులను కలుపుకొని మొత్తం 32 మంది దుర్మరణం. మరో 60 మందికి గాయాలు.
జులై 20, 2001: శేష్‌నాగ్ సరస్సు సమీపంలో ఒక క్యాంప్‌పై గ్రెనేడ్ దాడిలో యాత్రికులు, సహాయక సిబ్బంది, ఇద్దరు పోలీసు అధికారులతో పాటుగా 15 మంది మృతి. మరో 15 మందికి గాయాలు.
అక్టోబరు 1, 2001: శ్రీనగర్‌లోని జమ్మూకాశ్మీర్ శాసనసభ భవన సముదాయంపై దాడిలో 36 మంది దుర్మరణం.
మార్చి 30, 2002: జమ్మూలో రఘునాథ్ దేవస్థానంపై జంట దాడుల్లో ముగ్గురు భద్రతా సిబ్బందితో పాటుగా ఏడుగురు మృతి. మరో 20 మందికి గాయాలు.
ఆగస్టు 6, 2002: పెహల్గావ్ సమీపంలోని నున్‌వాన్ బేస్ క్యాంప్ పైన జరిగిన దాడిలో ఆరుగురు అమర్‌నాథ్ యాత్రికులతో పాటుగా తొమ్మిది మంది దుర్మరణం.
నవంబరు 23, 2002: దక్షిణ కశ్మీర్‌లోని లోయర్ ముండా వద్ద జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై సంభవించిన పేలుడులో ఇద్దరు పిల్లలు, ముగ్గురు మహిళలు, తొమ్మిది మంది భద్రతా సిబ్బందితో పాటుగా 19 మంది మృతి.
నవంబరు 24, 2002: జమ్మూలో రఘునాథ్, పంజ్‌బఖ్తర్ దేవస్థానాలపై ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 13 మంది దుర్మరణం. మరో 45 మందికి గాయాలు.
మార్చి 23, 2003: పుల్వామా జిల్లాలోని నాడిమార్గ్ గ్రామంలో ఇద్దరు పిల్లలు, 11 మంది మహిళతో పాటుగా 24 మంది కశ్మీరీ పండిట్‌ల ఊచకోత.
జులై 22, 2003: కట్రాకు రెండు కి.మీ.ల దూరంలోని బన్‌గంగ వద్ద జంట పేలుళ్లలో ఒక చిన్నారితో పాటుగా ఆరుగురు వైష్ణోదేవి భక్తుల మృతి.
జూన్ 13, 2005: పుల్వామాలో కారు బాంబు పేలుడులో ఇద్దరు స్కూలు పిల్లలు, ముగ్గురు సీఆర్‌పీఎఫ్ అధికారులతో పాటుగా 13 మంది దుర్మరణం.
మే 25, 2006: శ్రీనగర్ శివార్లలో బాటాపోరా ప్రాంతంలో జరిగిన గ్రెనేడ్ దాడిలో ఇద్దరు పిల్లలతో పాటుగా నలుగురు గుజరాతీ పర్యాటకులు మృతి. మరో ఆరుగురికి గాయాలు. అంతకు కొద్ది గంటల ముందే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ శ్రీనగర్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ముగించారు.
జూన్ 12, 2006: కుల్‌గావ్‌లో ఉగ్రదాడిలో తొమ్మిది మంది నేపాలీ, బీహారీ కూలీలు దుర్మరణం.
జులై 21, 2006: గండేర్‌బల్ జిల్లాలోని బేహమా వద్ద అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై దాడిలో ఐదుగురు మృతి.
జులై 10, 2017: అనంత్‌నాగ్ వద్ద అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై మెరుపు దాడిలో ఏడుగురు దుర్మరణం. మరో 21 మందికి గాయాలు. బాధితుల్లో అత్యధికులు గుజరాతీలు.
మే 13, 2022: రాయిసి వద్ద వైష్ణోదేవి భక్తులను తీసుకువెళుతున్న బస్సుకు ఉగ్రవాదులు నిప్పు పెట్టడంతో నలుగురు మృతి, 24 మందికి గాయాలు.
జూన్ 9, 2024: రాయిసి వద్ద వైష్ణోదేవి భక్తులను తీసుకువెళుతున్న బస్సు పైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో లోయలో పడిన బస్సు. 10 మంది దుర్మరణం, 33 మందికి గాయాలు.
బాధితుల కన్నీటి గాథలు
వెళ్లి మోదీకి చెప్పుకో అన్నారు
‘‘నేను, నా భర్త మంజునాథ్, మా అబ్బాయి ముగ్గురం కర్ణాటకలో శివమొగ్గ నుంచి పెహల్గావ్‌కు వచ్చాం. అప్పుడు టైమ్ మధ్యాహ్నం రెండున్నర అయ్యిందనుకుంటా. అప్పుడే అక్కడకు వచ్చిన కొందరు కాల్పులు జరపడం మొదలు పెట్టారు. హిందువులను కనిపెట్టి మరీ కాల్చి చంపుతున్నారు. ఆ కాల్పుల్లో నా భర్త అక్కడికక్కడే మరణించాడు. నాకైతే మతిపోయింది. నా భర్తను చంపారు కదా.. నన్ను కూడా చంపెయ్యండి అన్ని వాళ్లను చూస్తూ గట్టిగా అరిచాను. వాళ్లలో ఒకడు నా వైపు చూసి.. ‘నిన్ను చంపను కానీ.. వెళ్లి మోదీకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో పో..’ అని అన్నాడు. అప్పుడే స్థానికుల్లో కొందరు నన్ను, నా కొడుకును కాపాడారు. నాకు అదంతా ఒక పీడకలగా అనిపిస్తోంది.’’
– పల్లవి, శివమొగ్గ
నా కళ్లముందే నా తండ్రిని కాల్చి చంపేశారు
‘‘నా తల్లిదండ్రులతోపాటు మా కుటుంబమంతా బైసరన్ వెళ్లాం. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతుంటే మేమంతా భయంతో పక్కనే ఉన్న టెంటులోకి వెళ్లి నేలపైన పడుకున్నాం. అప్పటికే అక్కడ మరో ఏడుగురు ఉన్నారు. టెర్రరిస్టులు మాకు పక్కనే ఉన్న టెంటులో కాల్పులు జరిపి మా టెంటు దగ్గరకు వచ్చారు. మా నాన్నను (సంతోష్ జగ్దలే (54) చూసి ‘చౌదరీ.. బైటకు రా’ అని గట్టిగా అరిచారు. ప్రధాని మోదీని దూషించారు. మా నాన్న బైటకు వెళ్లగానే కల్మా చెప్పమన్నారు. మా నాన్న చెప్పకపోయేసరికి ఆయన తలపైన, చెవిలో, వీపు మీద తుపాకీతో కాల్పులు జరిపారు. మా నాన్న కుప్పకూలిపోయారు. ఆ తర్వాత వాళ్లు నా పక్కనే ఉన్న మా అంకుల్‌ను కాల్చి చంపారు. నన్ను, మా అమ్మను, మా చుట్టమైన మహిళను వాళ్లు ఏమీ చేయకుండా వదిలేశారు. అప్పుడు మమ్మల్ని పోనీల్లో (చిన్న గుర్రం) తీసుకువచ్చిన వారే మాకు సాయం చేశారు. దాదాపు అరగంట తర్వాత పోలీసులు వచ్చారు’’
– అసావరీ జగ్దలే, పుణె
ప్రాణాల మీదకు తెచ్చిన ఐడీ కార్డు
హైదరాబాద్, కోఠిలో ఎస్‌ఐబీలో స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బిహార్‌కు చెందిన మనీష్ రంజన్ రేకు ఆయన దగ్గర ఉన్న ఐడీ కార్డు ప్రాణాల మీదకు తెచ్చింది. ఇటీవల ఆయన తన భార్య, పిల్లలతో కలిసి జమ్మూ కశ్మీర్‌కు వెళ్లారు. అందరూ పెహెల్గావ్ చేరుకున్నారు. మనీష్ అక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా సైనిక దుస్తుల్లో ఉన్న టెర్రరిస్టులు ఆయన్ను చుట్టుముట్టారు. వచ్చింది నిజమైన సైనికులనుకొన్న తెలంగాణ ఐబీ ఆఫీసర్ వారికి తన ఐడీ కార్డును చూపించారు. ఆయన భార్య, పిల్లలు చూస్తుండగానే టెర్రరిస్టులు మనీష్‌పై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే కన్నుమూశారు. ఘాతుకానికి ఒడిగట్టిన టెర్రరిస్టులు అమరుడి భార్య, పిల్లలను హెచ్చరించి వదిలేశారు.
పాదాలకు అంటిన పారాణి ఆరకుండానే నవ వధువు నుదుటి బొట్టును ఉగ్రవాదం చెరిపేసింది. అమరుడైన నావికాదళం అధికారి వినయ్ నర్వల్ పార్ధివ దేహానికి ఆయన సతీమణి హిమాన్షి నర్వల్ కన్నీటి వీడ్కోలు.
న్యూయార్క్ టైమ్స్ వక్రీకరణ
ప్రపంచ మీడియాలో చాలా వికారాలు ఉంటాయి. ఉదారవాదం పేరుతో, సెక్యులరిజం పేరుతో, మెజారిటేరియనిజానికి వ్యతిరేకత పేరుతో ఆ మీడియా ఆ వికారాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. పెహల్గావ్ ఉగ్రవాద దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెంటనే ఖండించారు. మృతుల కుటుంబాలకు వెంటనే సానుభూతి తెలియచేశారు. కానీ కరుడ గట్టిన భారత వ్యతిరేకతను ప్రదర్శించే న్యూయార్క్ టైమ్స్ పత్రిక వ్యాఖ్యాన్ని ఇదే సందర్భంలో అమెరికా సరి చేసింది. పెహల్గావ్‌లో ‘‘మిలిటెంట్లు’’ కాల్పులు జరిపి 24 మందిని చంపారని ఆ పత్రిక రాసింది (వాస్తవానికి మృతులు 26). దీనితో అమెరికా విదేశ వ్యవహారాల శాఖ రంగంలోకి దిగి, వాళ్లు మిలిటెంట్లు కాదు, టెర్రరిస్టులు అని సరిదిద్దింది.
మిలిటెంట్లు అంటే ఎవరు? ఒకదానిని ప్రగాఢంగా విశ్వసిస్తూ, ఆ సూత్రం పునాదిగా రాజకీయ, సామాజిక మార్పును తేవడానికి తీవ్రంగా పనిచేసేవాడు మిలిటెంట్. ఇది కచ్చితంగా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అలాగే ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉండదు.
టెర్రిస్టులు అంటే ఎవరు? తమ రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు చట్ట విరుద్ధమైన హింసతో ప్రధానంగా పౌరులను భయకంపితులను చేసేవాడు టెర్రరిస్టు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ దృష్టిలో కశ్మీర్ ఉగ్రవాదులు సామాజిక రాజకీయ మార్పును తేవడానికి తీవ్ర పంథాలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే.
నిజానికి 26 మంది మృతులలో 25 మంది హిందువులే. ఒకరు ముస్లిం.
సింధు జలాల ఒప్పందం సిగ్గు చేటు
సింధు నదీజలాల ఒప్పందం విషయంలో ప్రథమ ప్రధాని జవాహర్‌లాల్ నెహ్రూ ఘోర తప్పిదం చేశారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. సింధు నదిజలాల ఒప్పందం మీద నెహ్రూ 1960లో సంతకం చేసి అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారని శర్మ వివరించారు. భారత్ నదులకు ఎగువ భాగాన ఉన్నప్పటికీ అమెరికా, ప్రపంచ బ్యాంకుల ఒత్తిడుల మేరకు 80 శాతం సింధు నది బేసిన్ జలాలను పాకిస్తాన్‌కు ఇవ్వడానికి అంగీకరించారని, సింధు, జీలం, చీనాబ్ నదులపై హక్కును అప్పగించారని శర్మ ఆరోపించారు. దీనితో రావి, బియాస్, సట్లేజ్ వంటి చిన్న నదులే మనకు మిగిలాయని వివరించారు.
– జాగృతి డెస్క్