‘‘‌మీరు కోరుకున్నది జరిగి తీరుతుంది ’’అంటూ మే 4వ తేదీ ఆదివారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్న మాట యావత్‌ ‌భారతావనికి పెహల్గావ్‌ ఉ‌గ్రదాడికి పాల్పడి 26 మంది ప్రాణాలను బలిగొన్న మతోన్మాద పాకిస్తాన్‌పై సమరానికి భవిష్యవాణిగా వినిపించింది. మంత్రి మాట ఇచ్చి 24 గంటలు గడవకముందే అంటే మే 5వ తేదీ సోమవారం రాత్రి వేళ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ఐదు అంశాలతో కూడిన సమర సంకేతాలను దేశ ప్రజలకు ఇచ్చింది. వాటి సారం పెహల్గావ్‌ ఉ‌గ్రదాడి జరిగిన రెండు వారాల్లోనే యావత్‌ ‌భారతీయులను యుద్ధానికి, యుద్ధ వాతావరణానికి సన్నద్ధం చేయడం. కేంద్ర హోమ్‌ ‌మంత్రిత్వశాఖ ఆసేతు హిమాచలపర్యంతం ప్రజలందరితో మే 7 బుధవారం నుంచి మూడు రోజుల పాటు భద్రత, రక్షణకు సంబంధించిన మాక్‌ ‌డ్రిల్‌ ‌చేయించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ముఖ్యంగా యుద్ధం వచ్చినప్పుడు భారతీయులకు స్వీయ రక్షణ పాఠాలు నేర్పించడం ఈ మాక్‌ ‌డ్రిల్‌ ‌ముఖ్యోద్దేశం. 1971లో ఇదే పాకిస్తాన్‌తో మన దేశం యుద్ధానికి దిగినప్పుడు మాక్‌ ‌డ్రిల్‌ ‌జరిగింది. అప్పట్లో ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎనిమిది నెలలు పడితే.. ఇప్పుడు నిర్ణయం తీసుకోవడమనేది పక్షం రోజుల్లోనే జరిగిపోయింది. అంటే దాదాపు 54 సంవత్సరాల తర్వాత ఈ కథనం రాస్తున్న సమయానికి భారతదేశం మాక్‌ ‌డ్రిల్‌కు సిద్ధమవుతోంది. 1970 తర్వాత పుట్టినవారికి ఇది అనుభవానికి అందని విషయం. నిర్ణయం తీసుకోవడానికి పట్టిన ఈ కాలంలో భారత ప్రభుత్వంపై ఏమిటింకా ఆలస్యం అంటూ వ్యంగ్యంగా మాటలు పారేసుకున్నవారి నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి. వికార చేష్టలు నిలిచిపోయాయి. కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన అజయ్‌ ‌రాయ్‌ అనే మందమతి రాఫెల్‌ ‌యుద్ధ విమానపు ఆటబొమ్మకు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయను కట్టి తన వికృత మనస్తత్వాన్ని ప్రపంచానికి చాటుకున్నాడు. నవ్వుపాలయ్యాడు. కానీ దాడి జరిగినప్పటి నుంచి మాక్‌ ‌డ్రిల్‌కు ఆదేశాలు ఇచ్చేంతవరకూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులతో, మంత్రివర్గ సహచరులతో, సంబంధిత శాఖల కార్యదర్శులతో జరిపిన సమావేశాలకు లెక్కే లేదు. ఈ కొద్దిరోజులూ యావత్‌ ‌భారత సర్కారు మునివేళ్లపై నిలబడింది అంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే దశాబ్దాలుగా దేశానికి పట్టుకున్న పీడను వదిలించుకోవడానికి ఇదే సరైన సమయం కాబట్టి. మాక్‌ ‌డ్రిల్‌కు చెందిన ఐదు అంశాల విషయానికి వస్తే ఈ మూడు రోజులు వైమానిక దాడి జరగడానికి ముందు వినిపించే సైరన్‌ను సంబంధిత అధికారులు మోగిస్తారు. అలాంటి పరిస్థితుల్లో స్వీయరక్షణకు ఏం చేయాలో ప్రజలకు వివరిస్తారు. గగనతలం నుంచి దాడి చేసే శత్రువుకు మనం ఉంటున్న జనావాసాలు తెలియకుండా ఉండటానికి రాత్రి పూట లైట్లు ఆర్పివేయడాన్ని అలవాటు చేస్తారు. మన దేశానికి చెందిన కీలకమైన శాఖల భవనాలు, ప్లాంట్లు, స్థావరాలు శత్రువుల కంటపడకుండా వాటికి ఆకుపచ్చ రంగు వేయడం లేదా పచ్చని ఆకుల కొమ్మలతో కప్పివేయడం లాంటివి సంబంధిత అధికారులు చేస్తారు. అలా చేయడం వల్ల ఆ భవనాలు చుట్టుపక్కల ఉన్న చెట్లలో కలిసిపోయి కనిపించకుండా ఉంటాయి. అలాగే యుద్ధ కాలంలో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు బాధిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పక్రియ కూడా మాక్‌ ‌డ్రిల్‌లో భాగంగా ఉంటుంది. ఇంతటి కీలకమైన మాక్‌ ‌డ్రిల్‌లో పాల్గొనడం మన అందరి బాధ్యత. యుద్ధమంటూ వస్తే భరతమాతకు విజయాన్ని తెచ్చిపెట్టడం భారతీయులందరి కర్తవ్యం. ఇక్కడితో మతోన్మాదం మంటగలిసిపోవాలి. ఉగ్రవాదం ఊపిరి ఆగిపోవాలని ఆశిద్దాం.

ఏ‌ప్రిల్‌ 28, ‌సోమవారం:

ప్రధాని మోదీతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌భేటీ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం న్యూఢిల్లీలోని 7, కళ్యాణ్‌ ‌మార్గ్ ‌ప్రధాని అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. 40 నిమిషాలపాటు సాగిన సమావేశంలో పాకిస్తాన్‌పై ప్రతీకారానికి చేస్తున్న సన్నాహాలను మోదీకి సింగ్‌ ‌వివరించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అం‌తకుముందు నార్త్ ‌బ్లాక్‌కు వెళ్లి ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీతో సమావేశ మయ్యారు. కశ్మీర్‌లో ప్రత్యేకించి పెహల్గావ్‌లో పరిస్థితి గురించి రక్షణ మంత్రికి ఆర్మీ చీఫ్‌ ‌వివరించారు. ఉగ్రదాడి తదనంతర పరిణామాలపై పార్లమెంట్‌ ‌ప్రాంగణంలో రక్షణపై జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్‌ ‌కమిటీ సమావేశానికి ఎంపీలు రాహుల్‌ ‌గాంధీ, రాధామోహన్‌ ‌సింగ్‌, ‌విష్ణుపాల్‌ ‌రే, జగన్నాథ్‌ ‌సర్కార్‌, ‌శక్తి సింగ్‌ ‌గోహిల్‌, ‌సంజయ్‌ ‌సింగ్‌ ‌హాజరయ్యారు.

సరైన పరిష్కారానికి అమెరికా విజ్ఞప్తి

పెహల్‌గావ్‌ ఉ‌గ్రదాడితో భారత్‌, ‌పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక బాధ్యతాయుతమైన పరిష్కారాన్ని కనుక్కోవాలని ఇరుదేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది. ఆ దిశగా తాము ఉభయులను ప్రోత్సహిస్తామని, అదే సమయంలో భారత్‌కు అండగా ఉంటామని తెలిపింది.

భారత్‌తో గొడవలొద్దు

ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో భారత్‌తో గొడవలు పెట్టుకోవద్దని పాకిస్తాన్‌ ‌మాజీ ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌ ‌తన సోదరుడు, ప్రస్తుత పాక్‌ ‌ప్రధాని షెహబాజ్‌ ‌షరీఫ్‌కు హితవు చెప్పారు. సోదరులిద్దరూ జతి ఉమ్రాహ్‌లోని తమ కుటుంబ నివాసంలో భేటీ అయ్యారు. భారత్‌ ‌సింధూ జలాల ఒప్పందం రద్దు చేయడంతో జాతీయ భద్రతా కమిటీ తీసుకున్న నిర్ణయాలను నవాజ్‌కు షెహబాజ్‌ ‌వివరించారు. అవసరమైతే స్పందించడానికి సైన్యం సన్నాహాలను, ప్రభుత్వ సంసిద్ధతను కూడా వివరించారు. అంతా సావధానంగా విన్న నవాజ్‌ ‌భారత్‌తో దూకుడుగా కాకుండా దౌత్య మార్గాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని  పాక్‌ ‌ప్రధానికి సూచించారు.

నరహంతకుల దగ్గర చైనా శాటిలైట్‌ ‌ఫోను, యూఎస్‌ ‌తుపాకులు

పెహల్గావ్‌లో దాడికి పాల్పడిన నలుగురు నరహంతకుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఆ నలుగురి లొకేషన్లను నాలుగు సార్లు ట్రాక్‌ ‌చేసినప్పటికీ వారు తృటిలో తప్పించు కున్నట్టు సమాచారం. ఇరు వర్గాల మధ్య ఒకానొక సందర్భంలో పరస్పరం కాల్పులు జరిగాయని తెలిసింది. ఉగ్రవాదుల ఆచూకీని మొదటగా పెహల్గావ్‌ ‌తెహస్లీ వద్ద, రెండవసారి కుల్గావ్‌ అడవుల్లో, మూడవసారి ట్రాల్‌ ‌కొండల్లో, కొకెర్నాగ్‌లో కనిపెట్టినప్పటికీ ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ దట్టమైన అడవుల్లోకి పారిపోయారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాజాగా ఆదివారం రాత్రి ఒక గ్రామంలోని ఓ ఇంట్లో భోజనానికని ముష్కరులు వెళ్లారు. సరిగ్గా అప్పుడే అక్కడికి భద్రతా దళాలు రావడాన్ని గమనించి నరహంతకులు పారిపోయారు. దుండగుల కోసమని సైన్యం, సీఆర్పీఎఫ్‌, ‌జమ్ముకశ్మీర్‌ ‌పోలీసులు పెహల్గావ్‌ ‌దగ్గర్లోని అడవులను జల్లెడ పడుతున్నారు. ఉగ్రవాదుల దగ్గర చైనా యాప్స్, అమెరికా తుపాకులు, సీక్రెట్‌ ఎన్‌‌క్రిప్టెడ్‌ ‌సాధనాలు ఉన్నట్టు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ-ఎన్‌ఐఏ ‌గుర్తించింది. హిందువులపై దాడి చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు చైనాలో తయారైన శాటిలైట్‌ ‌ఫోన్‌ను వినియోగించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి.

ఎల్‌వోసీ వద్ద పాక్‌ ‌కవ్వింపు చర్యలు

జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి పాకిస్తాన్‌ ‌సైన్యం వరుసగా నాలుగో రోజు కూడా కాల్పులకు దిగింది. భారత సైన్యం అంతే దీటుగా శత్రువుకు బదులిచ్చింది. ‘‘ఎల్‌వోసీ వద్ద పాక్‌ ‌వరుసగా నాలుగు రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్నది. ఈ నెల 27, 28 తేదీల్లో కుప్వారా, పూంచ్‌ ‌ప్రాంతాల్లో ఎల్‌వోసీ వద్ద పాక్‌ ‌సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’’ భారత సైన్యం ప్రకటించింది.

బీబీసీ తీరుపై భారత్‌ అభ్యంతరం

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిని వార్తలుగా అందిం చడంలో బ్రిటీష్‌ ‌బ్రాడ్‌కాస్టింగ్‌ ‌కార్పొరేషన్‌- ‌బీబీసీ వ్యవహరించిన తీరు పట్ల భారత్‌ ‌తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేసింది. బీబీసీ దాడి చేసిన ఉగ్రవాదులను గన్‌మెన్లు అని పేర్కొనడాన్ని తప్పుపడుతూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బీబీసీ భారత్‌ ‌విభాగానికి అధిపతి జాకీ మార్టిన్‌కు ఒక లేఖ రాసింది.

గాయని దేశద్రోహం

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిపై సోషల్‌ ‌మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన లక్నోకు చెందిన జానపద గాయని నేహా సింగ్‌పై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. అభయ్‌ ‌ప్రతాప్‌ ‌సింగ్‌ అనే వ్యక్తి లక్నోలో హజ్రత్‌గంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రాతిపదికగా భారతీయ న్యాయసంహిత- బీఎన్‌ఎస్‌లో పలు సెక్షన్ల కింద నేహా సింగ్‌పై కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

పాకిస్తాన్‌ ‌యూట్యూబ్‌ ‌చానెళ్లపై భారత్‌ ‌నిషేధం

భారత్‌ 16 ‌పాకిస్తాన్‌ ‌యూట్యూబ్‌ ‌చానెళ్లను నిషేధించింది. ఈ చానెళ్లన్నీ కూడా భారత్‌ ‌భద్రతా ఏజెన్సీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మతానికి సంబంధించిన విషయాలను, ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రపంచాన్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని  అప్‌లోడ్‌ ‌చేస్తున్నట్టు కేంద్ర హోమ్‌ ‌మంత్రిత్వ శాఖ గుర్తించింది. దీనిపై ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో చానెళ్లపై నిషేధం వేటు పడింది. నిషేధానికి గురైనవాటిలో పాక్‌ ‌మాజీ క్రికెటర్‌  ‌షోయబ్‌ అక్తర్‌కు చెందిన చానెల్‌తో పాటుగా డాన్‌ ‌న్యూస్‌, ‌సమా టీవీ, ఏఆర్‌ ‌వై న్యూస్‌, ఇర్షాద్‌ ‌భట్టి, బోల్‌ ‌న్యూస్‌, ‌రఫ్తార్‌, ‌ది పాకిస్తాన్‌ ‌రిఫరెన్స్, ‌జియో న్యూస్‌, ‌సమా స్పోర్టస్, ‌జీఎన్‌ఎన్‌, ఉజైర్‌ ‌క్రికెట్‌, ఉమర్‌ ‌చీమా ఎక్స్‌క్లూజివ్‌, ఆస్మా షిరాజీ, మునీబ్‌ ‌ఫరూఖ్‌, ‌సునో న్యూస్‌ ‌హెచ్‌డీ, రాజీనామా చానెళ్లు ఉన్నాయి.

దాడికి ముందు రోజు ఉగ్రవాదితో బాంగ్లా నేత భేటీ

పెహల్గావ్‌లో ఉగ్రదాడి జరగడానికి ఒక రోజు ముందు అంటే ఏప్రిల్‌ 21‌వ తేదీన ఉగ్రమూక లష్కరే తోయిబా నేత ఇజార్‌తో బాంగ్లాదేశ్‌ ‌ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్‌ ‌నజ్రుల్‌ ఆ ‌దేశ రాజధాని ఢాకాలో భేటీ అయ్యాడు. ఈ భేటీ విషయాన్ని అక్కడి ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. అయితే ఇస్లామిస్టులపై వేధింపు కేసుల ఉపసంహరణ అంశంపైనే భేటీ జరిగిందని బుకాయించింది. ఇజార్‌కు ఉగ్రదాడులకు పాల్పడిన చరిత్ర ఉంది.

ఏప్రిల్‌ 29, ‌మంగళవారం:

జమ్ముకశ్మీర్‌ అ‌ప్రమత్తం

కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఇళ్ల ధ్వంసానికి ప్రతీకారంగా మరిన్ని దాడులు చేయడానికి ఉగ్రమూకలు సన్నాహాలు చేసుకుంటున్న వైనాన్ని నిఘా వర్గాలు గుర్తించాయి. ఆ దిశగా కశ్మీర్‌ ‌లోయలో స్లీపర్‌ ‌సెల్స్ ‌చురుకైన పాత్ర షోషించడానికి సిద్ధమవు తున్నట్టు కనిపెట్టాయి. ఈ నేపథ్యంలో యాంటీ ఫిదాయీన్‌ ‌స్క్వాడ్లు, జమ్ముకశ్మీర్‌ ‌పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక కార్యకలాపాల బృందం రంగంలోకి దిగాయి. అదే సమయంలో గుల్‌మార్గ్, ‌సోనామార్గ్, ‌దాల్‌ ‌సరస్సు తదితర పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సైన్యం కదలికపై ఐఎస్‌ఐ ‌కూపీ

ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్‌ ‌సైన్యం కదలికలు తెలుసుకోవ డానికి పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ‌మోసపూరితమైన ఎత్తుగడకు పాల్పడుతున్నది. సరిహద్దులోని సైనిక సిబ్బంది,  పౌరులకు సైనిక్‌ ‌స్కూల్‌ ఉద్యోగులమంటూ ఫోన్లు చేసి సమాచారాన్ని రాబట్టడానికి ప్రయత్ని స్తోంది. అయితే తెలియని నంబర్ల నుంచి ఫోన్లు చేసేవారితోటి, ఆగంతకుల తోటి ఎలాంటి సమాచారాన్ని పంచుకోవద్దని పేర్కొంటూ సరిహద్దుల్లో ఉంటున్న ప్రజలను, సైనిక సిబ్బందిని భారత ప్రభుత్వం అప్రమత్తం చేసింది.

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిపై తగు రీతిన స్పందించ డానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ప్రధాని అధికారిక నివాసంలో మోదీ అధ్యక్షతన జరిగిన కీలకమైన సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌డిఫెన్స్ ‌స్టాఫ్‌ ‌చీఫ్‌- ‌సీడీఎస్‌ అనిల్‌ ‌చౌహాన్‌, ‌జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌ధోవల్‌, ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ‌దినేష్‌ ‌కుమార్‌ ‌త్రిపాఠీ, ఎయిర్‌ ‌చీఫ్‌ ఎస్పీ ధర్‌కర్‌ ‌హాజరయ్యారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఉగ్రదాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు తెలిపారు. సమయం ఎప్పుడనేది సైన్యమే నిర్ణయిస్తుందని, సైన్యంపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. ఇదే సందర్భంగా సాయుధ దళాల సామర్థ్యాన్ని మోదీ ప్రశంసించారు.

దాడి సూత్రధారికి పాక్‌ ‌సైన్యం శిక్షణ

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడి వెనుక ముఖ్య సూత్రధారిగా పాకిస్తాన్‌ ‌జాతీయుడు హషీమ్‌ ‌ముసాను నిఘా ఏజెన్సీలు గుర్తించాయి. ఇతడికి పాక్‌ ‌సైన్యం పారా కమాండో శిక్షణను ఇచ్చింది. ఇందులో భాగంగా అసాధారణ యుద్ధరీతులు, మనుగడ వ్యూహాలు, పర్వతాలు, అటవీ ప్రాంతాల్లో పోరాటంపై ముసా మంచి పట్టు సాధించాడు. అతడు పాకిస్తాన్‌ ‌నుంచి భారత్‌కు కథువా-సాంబా సెక్టార్ల గుండా అక్రమంగా వచ్చినట్టు నిఘా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. అలా వచ్చిన ముసా రాజౌరి-పూంచ్‌లోని డేరాకిగలి ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నాడు. స్థానిక పోలీసులతో పాటుగా భద్రతా బలగాలకు దొరక్కుండా తప్పించు కొని తిరుగుతున్నాడు.

పాకిస్తాన్‌కు భారత్‌ ‌గగనతలం మూసివేత

ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరిగి పోతున్న తరుణంలో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌ ‌విమానాలను భారత్‌ ‌గగనతలంలోకి అనుమతించరాదని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాక్‌ ‌విమానయాన సంస్థలకు చెందిన విమానాలు సర్వసాధారణంగా కౌలాలంపూర్‌తో పాటుగా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్‌, ‌థాయ్‌లాండ్‌ ‌లాంటి చోట్లకు వెళ్లాలంటే భారత్‌ ‌గగనతలం గుండా వెళ్తుంటాయి. భారత్‌ ‌తీసుకున్న నిర్ణయంతో పాక్‌ ‌విమానాలు దక్షిణాసియా ప్రాంతాలకు చేరడానికి చైనా, శ్రీలంక గుండా వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌ ‌పౌర విమానయాన సంస్థలు మరింత నష్టాల్లోకి కూరుకు పోయే అవకాశం ఉంది.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు అమరులయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌  ‌ప్రకటించారు. ఈమేరకు రాష్ట్ర కేబినెట్‌ ‌సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

భారత్‌ అం‌టే పాకిస్తాన్‌ ‌బెంబేలు

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ ఏ ‌క్షణమైనా తమపై విరుచుకుపడే అవకాశం ఉందనే భయంతో పాకిస్తాన్‌ ‌భీతిల్లుతోంది. త్రివిధ దళాధిపతు లతో మోదీ సర్కారు వరుస భేటీలు, సాయుధ దళాల సమర సన్నాహాలు, నావికాదళం క్షిపణి పరీక్షలతో పాకిస్తాన్‌ అ‌ప్రమత్తమవుతోంది. దీనికి నిదర్శనం అన్నట్టుగా నియంత్రణ రేఖ-ఎల్‌వోసీ వెంబడి ఉగ్రవాదుల స్థావరాలను, లాంచ్‌ ‌ప్యాడ్‌లను ఖాళీ చేయించింది. టెర్రరిస్టులను సైనిక స్థావరాలు, బంకర్లకు తరలిస్తోంది. అంతర్జాతీయ సరిహద్దుకు దాదాపు 60 కి.మీ.ల దూరంలోని ఖోర్‌ ‌కంటోన్మెంట్‌ ‌వద్ద ఏర్పాటు చేసిన టీపీఎస్‌-77 ‌రాడార్‌ ‌సైట్‌ను మరోచోటికి తరలిస్తోంది. ఇది బహుముఖ రాడార్‌ ‌వ్యవస్థ. విమానాల రాకపోకల పర్యవేక్షణకు దీనిని వినియోగిస్తుంటారు.

సగానికి పైగా పర్యాటక ప్రాంతాలు మూసివేత

ఉగ్రదాడితో జమ్ముకశ్మీర్‌లో 87 పర్యాటక ప్రాంతాలకుగాను 48 ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు చేసిన హెచ్చరికతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌ ‌లోయలో ఉగ్రమూకలకు చెందిన నిద్రాణంగా ఉన్న స్లీపర్‌ ‌సెల్స్ ‌రంగంలోకి దిగాయి. అవి ఉత్తర, మధ్య, దక్షిణ కశ్మీర్‌ ‌ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో గుల్‌మార్గ్, ‌సోన్‌ ‌మార్గ్, ‌దాల్‌ ‌సరస్సు లాంటి పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మే 1, గురువారం:

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం

26 మంది అమాయకులను బలిగొన్న పెహల్గావ్‌ ఉ‌గ్రదాడికి పాల్పడిన వారిని, పథకరచన చేసిన వారిని పక్కాగా కనిపెట్టి మరీ మట్టుపెడతామని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా ఢిలీల్లో అన్నారు. దాడికి బాధ్యులైనవారు తామేదో విజయం సాధించామని అనుకుంటే పొరపాటని, వారు అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి హెచ్చరిం చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఉగ్రవాదులు ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారికి గట్టిగా బదులిస్తుందని అన్నారు. ప్రభుత్వ సంకల్పం దేశంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేయడ మేనని తెలిపారు. ఆ సంకల్పాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధిస్తామని అమిత్‌ ‌షా చెప్పారు. యావత్‌ ‌ప్రపంచం ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు అండగా నిలుస్తోందని తెలిపారు.

భారత్‌తో యుద్ధమా.. వద్దు బాబోయ్‌..!

‌పాకిస్తాన్‌కు భారత్‌ అం‌టే ఇప్పుడే కాదు మూడు దశాబ్దాల క్రితం కూడా భయమే. ఇదెవరో దారినపోయే దానయ్య చెప్పిన మాట కాదు. సాక్షాత్తూ అమెరికా నిఘా ఏజెన్సీ-సీఐఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 1993లో సీఐఏ బహిర్గతం చేసిన నేషనల్‌ ఇం‌టెలిజెన్స్ ఎస్టిమేట్‌ (ఎన్‌ఐయీ) పత్రం ఇందుకు నిదర్శనంగా నిలిచింది. సీఐఏ అధికారి బ్రూస్‌ ‌రెయిడెల్‌ 1992‌లో బాబ్రీ మసీదు ఘటన జరిగిన కొద్ది కాలానికి భారత్‌, ‌పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ప్రధానంగా ఈ పత్రాన్ని తీసుకొచ్చారు. ఆ పత్రం ప్రకారం అప్పట్లో పాక్‌ అస్థిరత్వంలో కొట్టు మిట్టాడుతోంది. ఇరు దేశాల దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయన్న మాటేగాని వాటిని ప్రయోగించేంత పరిస్థితి అయితే రాలేదు. అయితే ఉభయుల మధ్య యుద్ధం రావడానికి అవకాశం 20 శాతమే ఉంది. రెండు దేశాలూ సమరాన్ని కోరుకోవడంలేదు. అయితే ఆర్థికంగా, సైనిక పాటవం పరంగా, దౌత్యపరంగా అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్న భారత్‌ను చూసి పాకిస్తాన్‌ ఓర్వలేకపోయింది. అప్పుడే ఆ దేశం సైనిక పాలన, రాజకీయ సంక్షోభాలు, ఆర్థిక ఇబ్బందు లతో ఇక్కట్ల పాలవుతోంది. పాకిస్తాన్‌ ‌భారత్‌ అం‌టే అమితమైన భయంతో కశ్మీర్‌ అం‌శాన్ని తెరమీదకు తీసుకొనివచ్చి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. పాకిస్తాన్‌ ఎం‌తగా కశ్మీర్‌ అం‌శాన్ని ప్రపంచానికి భూతద్దంలో పెట్టి చూపించినప్పటికీ భారత్‌తో యుద్ధమంటూ వచ్చిన పక్షంలో నాలుగు అడుగులు వెనక్కి వేస్తుందే తప్ప ఒక్క ముందడుగు కూడా వెయ్యదని సీఐఏ పత్రం తేల్చి చెప్పింది.

మే 2, శుక్రవారం:

యూపీలో ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేపై జెట్‌ ‌విమానాల విన్యాసాలు

పాకిస్తాన్‌తో యుద్ధం అనివార్యమైన పక్షంలో భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల టేకాఫ్‌, ‌ల్యాండింగ్‌కు అనుకూలంగా ఉండేలా ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేను తీర్చిదిద్దారు. ఈ హైవే పాకిస్తాన్‌కు 1,000 కి.మీ.ల దూరంలో ఉండటం గమనార్హం. ఇదే హైవేపై విమానాల రాకపోకల కోసమని 3.5 కి.మీ.ల మేర ఎయిర్‌ ‌స్ట్రిప్‌ను నిర్మించారు. దీనిపై ఫైటర్‌ ‌జెట్‌ ‌విమానాలు శుక్రవారం నుంచి విన్యాసాలు చేయసాగాయి. ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నిర్మించిన ఎయిర్‌ ‌స్ట్రిప్‌పైన జెట్‌ ‌విమానాలు పగటిపూట మాత్రమే కాకుండా సాయంత్రం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు విన్యాసాలు చేస్తున్నాయి. తద్వారా ఎయిర్‌ ‌స్ట్రిప్‌ ‌సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అదే సమయంలో భద్రతా చర్యల్లో భాగంగా హైవేపై నిర్మించిన ఎయిర్‌ ‌స్ట్రిప్‌కు ఇరువైపులా 250 సీసీటీవీ కెమెరాలను నెలకొల్పినట్టు చెప్పారు.

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మోహరింపు

భారత నావికా దళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకలను మోహరించింది. యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌ ‌నుంచి చాలా దూరంలో ఉన్న శత్రువుల నౌకలను పనిపట్టే క్షిపణులను విజయవంతంగా పరీక్షించింది. అలాగే అత్యాధునిక రాడార్‌ ఊతంగా గగనతలంలో 70 కి.మీ.ల దూరంలో ఉన్న శత్రువుల విమానాలను సునాయాసంగా కూల్చివేసే భూమి ఉపరితలం నుంచి గగనానికి క్షిపణి వ్యవస్థను కూడా విజయవంతంగా ప్రయోగించింది. అదే సమయంలో భారత్‌ ‌తీర ప్రాంత గస్తీ దళం గుజరాత్‌ను ఆనుకొని ఉన్న సముద్రంలో నౌకలను మోహరించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

మే 3, శనివారం:

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడి వెనుక పాకిస్తాన్‌

‌మానవాళికి ప్రాణాంతకమైన ముప్పుగా ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పెహల్గావ్‌ ఉ‌గ్రదాడి వెనుక పాకిస్తాన్‌ ‌ప్రమేయం ఉన్నట్టు తేటతెల్లమైందని తెలిపారు. దాడికి పాల్పడింది పాకిస్తానీయులేనని చెప్పారు. వాళ్లలో ఒకడు పాక్‌ ‌సైన్యంలో పారా కమాండోగా పనిచేశాడు. అమాయక పర్యాటకులను బలిగొన్న ఏ ఒక్క ఉగ్రవాదినీ, వాళ్ల మద్దతుదారులను విడిచిపెట్టేది లేదని ప్రధాని అన్నారు.

పాకిస్తాన్‌ను వెలి వేసిన భారత్‌

‌పెహల్గావ్‌ ఉ‌గ్రదాడికి ప్రతిగా తీసుకున్న మూడు చర్యలతో భారత్‌ ‌పాకిస్తాన్‌ను దాదాపు వెలి వేసినంత పని చేసింది. చర్యల్లో మొదటిదిగా పాకిస్తాన్‌ ‌నుంచి నేరుగా కానీ, పాకిస్తాన్‌ ‌పేరిట ఇతర దేశాల నుంచి కానీ అన్ని రకాల సరుకుల దిగుమతిపై పూర్తిగా నిషేధం విధించింది. ఇరు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల విషయానికి వస్తే.. భారత్‌ ‌పాకిస్తాన్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 513.82 మిలియన్‌ ‌డాలర్ల విలువైన సరుకులను, 2022-23లో 627.1 మిలియన్‌ ‌డాలర్ల విలువైన సరుకులను ఎగుమతి చేసింది. భారత్‌ అదే ఆర్థిక సంవత్సరాల్లో పాకిస్తాన్‌ ‌నుంచి వరుసగా 2.54 మిలియన్‌ ‌డాలర్లు, 20.11 మిలియన్‌ ‌డాలర్ల విలువైన సరుకులను దిగుమతి చేసుకుంది. ఇది మొత్తం వాణిజ్యంలో చాలా స్వల్పం. అయితే గతేడాది ఏప్రిల్‌ ‌నుంచి ఈ ఏడాది జనవరి దాకా భారత్‌ ఎగుమతుల విలువ 447.65 మిలియన్‌ ‌డాలర్లు కాగా దిగుమతుల విలువ 0.42 మిలియన్‌ ‌డాలర్లుగా మాత్రమే ఉంది. భారత్‌ ‌పాక్‌ ‌దిగుమతులపై నిషేధం విధించిన కొద్ది గంటల్లోనే రెండవ చర్యగా దేశంలోని అన్ని ఓడ రేవుల్లోనూ పాక్‌ ‌పతాకం ఉన్న నౌకల ప్రవేశాన్ని నిషేధించింది. ఇక శనివారంనాటి చివరిదైన మూడవ చర్యగా పాక్‌ ‌నుంచి భారత్‌కు అన్ని మార్గాల్లో అన్ని కేటగిరిల్లో మెయిల్స్, ‌పార్శిళ్ల బట్వాడాను నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

మే 4, ఆదివారం:

మీరు(భారతీయులు) కోరుకున్నట్టుగా జరుగుతుంది

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడిపై యావత్‌ ‌భారతీయులు ఆగ్రహంతో రగిలిపోతున్న వేళ ప్రభుత్వం దేశ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ అన్నారు. దేశరాజధానిలో జరిగిన సంస్కృతి జాగరణ్‌ ‌మహోత్సవ్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తూ భారత్‌పై దాడులకు పాల్పడేవారికి తప్పకుండా గుణపాఠం చెప్పితీరుతామని హెచ్చరించారు. రక్షణ మంత్రిగా దేశ సరిహద్దులతో పాటు సైనికులను కాపాడుకోవడం తన బాధ్యత అని ఆయన అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ ప్రజలు కోరుకున్నది (పెహల్గావ్‌ ఉ‌గ్రదాడికి ప్రతీకారంగా) తప్పకుండా జరిగి తీరుతుందని తెలిపారు.

భారత్‌ ‌చేతికి రష్యా క్షిపణులు

పెహల్గావ్‌ ఉ‌గ్రదాడితో పాక్‌తో సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో రూ.250 కోట్లకుపైగా విలువైన రష్యాకు చెందిన ఇగ్లా-ఎస్‌ ‌క్షిపణులు భారత్‌ అమ్ములపొదిలోకి చేరాయి. శత్రు విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లపై దాడి చేయడానికి ఉద్దేశించిన ఈ క్షిపణులను భారత సైన్యం పాకిస్తాన్‌కు పశ్చిమంగా మోహరిస్తుంది.

పాకిస్తాన్‌కు ఆయుధాలు నిండుకున్నాయి

భారత్‌ను అది చేస్తాం ఇది చేస్తాం అంటూ గొప్పలకు పోయే పాకిస్తాన్‌ ‌దగ్గర ఆయుధాలు నిండుకున్నాయి. పెహల్గావ్‌ ఉ‌గ్రదాడి అనంతరం భారత్‌తో పంచుకునే సరిహద్దుల వద్ద యుద్ధ సామాగ్రి డిపోలను కట్టుకున్న దాయాది దేశానికి యుద్ధమంటూ ముంచుకొస్తే దాని చేతిలో ఉన్న యుద్ధ సామాగ్రి ముఖ్యంగా మందుగుండు సామాగ్రి నాలుగు రోజులకే ఖాళీ అయిపోతుంది. అదెలా జరిగిందంటే.. ఇటీవల ఉక్రెయిన్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌ ‌తన దగ్గరున్న 155ఎంఎం శతఘ్ని గుండ్లను ఆ దేశానికి ఇచ్చేసింది. దీంతో భారత్‌ ‌సైనిక చర్యను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రయోగించే ఎం109 హోవిట్జర్లకు లేదా 122 ఎంఎం రాకెట్లకు గుండ్లు లేకుండా పోయాయి. గతంలో ఇదే విషయమై పాకిస్తాన్‌ ‌మాజీ ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌ఖమర్‌ ‌జావెద్‌ ‌బజ్వా మాట్లాడుతూ భారత్‌తో ఏదైనా ఘర్షణ చోటుచేసుకున్న పక్షంలో దాన్ని ఎదుర్కోవడానికి సరిపడినంత యుద్ధ సామాగ్రి, ఆర్థిక స్తోమత తమ దేశానికి లేదని అన్నారు.

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE