రాష్ట్ర రాజధాని అమరావతిలో రూ. 58 వేల కోట్ల విలువైన 92 ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ నెల 2న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రోడ్లు, రైల్వేలు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి.. రూ.54,028 కోట్లతో 83 ప్రాజెక్టులపనులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.4,050 కోట్లతో చేపట్టిన 9 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. శాసనసభ, హైకోర్టు, సచివాలయం-హెచ్‌వోడీ భవనాల నిర్మాణం, అమరావతి మౌలిక సదుపాయాలు, అమరావతి వరద నివారణ పనులు, అమరావతి భూసమీకరణ- మౌలిక సదుపాయాల కల్పన, గృహ సముదాయాల నిర్మాణం వంటి పనులను ప్రధాని ప్రారంభించారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం, నాగాయలంకలో మిస్సైల్ పరీక్షా కేంద్రం, రైల్వే ప్రాజెక్టుల పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు చేశారు. వీటిలో •కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించే రూ.49 వేల కోట్ల విలువగల 74 ప్రాజెక్టులు ఉన్నాయి.
రాష్ట్ర రాజధాని అమరావతి,పోలవరం ప్రాజెక్టుల పూర్తికి సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అమరావతిని ఒక ‘శక్తి’గా అభివర్ణించారు. ‘అమరావతి… స్వర్ణాంధ్ర విజన్‌కు శక్తినిస్తుంది. స్వర్ణాంధ్ర.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని బలపరుస్తుంది. అమరావతి కేవలం ఒక నగరం కాదు…ఒక శక్తి. ఆంధప్రదేశ్‌ను ఆధునిక ప్రదేశ్‌గా, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తి’ అని ఉద్ఘాటించారు. అమరావతిని మూడేళ్లలో నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ తర్వాత రాష్ట్ర జీడీపీని అమరావతి నగరం ఎక్కడికి తీసుకెళుతుందో తాను ఊహించగలనని ప్రధాని అన్నారు. వెలగపూడి సచివాలయ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ, ఏపీ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్
గుల్లలమోదలో డీఆర్డీడీవో రూ.1,500 కోట్ల అంచనాలతో నిర్మించే క్షిపణి పరీక్ష రేంజ్ పనులను ప్రధాని మోదీ అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేంద్రానికి నాగాయలంక నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్‌గా నామకరణం చేస్తూ ఇది రక్షణ రంగానికి నవశక్తినిచ్చే కేంద్రంగా అభివర్ణించారు. ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితమవుతుంది. అయిదు కిలో మీటర్లకు పైబడిన లక్ష్యాలను ఛేదించే మిస్సైల్‌ను ప్రయోగించేందుకు ఈ కేంద్రాన్ని వేదికగా చేసుకోవచ్చుని డీఆర్డీవో భావిస్తోంది. దీని కోసం అత్యాధునిక ఈవో(ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్) వినియోగించనుంది. ఇక్కడ అత్యాధునిక ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్‌కూడా ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భాగస్వామ్యంతో డీఆర్డీవో ఇండిజెనాస్ రాడార్ సిస్టమ్‌ను వినియో గంలోకి తెచ్చిన ఇంద్ర, అశ్విని, స్వాతి, షోర్డ్‌షిఫ్ వంటి ఆధునిక రాడర్లను నాగాయలంకలోని మిస్సైల్ టెస్టింగ్ రేంజ్‌లో పూర్తిస్థాయిలో ఉపయోగించ నున్నారు. వీటి ద్వారా భూమికి సమీపం నుండి వెళ్లే మిస్సైల్‌లు, హెలిక్టాపర్లను గుర్తించే వెసులుబాటు ఉంటుంది. నవదుర్గా మిస్సైల్ టెస్టింగ్ రేంజ్ ద్వారా దీర్ఘశ్రేణి క్షిపణులను సయితం పరీక్షించే వెసులుబాటు ఉంటుంది. ఇంతకాలం హైదరాబాద్‌లోని డీఆర్డీవో తయారు చేసే క్షిపణులను ఒడిశాలోని బాలసౌర్ నుంచి పరీక్షిస్తుండగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి బాలసౌర్‌కు చేరుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటం, పరీక్ష చేయాల్సిన క్షిపణుల రక్షణకు కూడా ప్రమాదం పొంచి ఉండటంతో దీర్ఘశ్రేణి క్షిపణులను తరలిం చేందుకు డీఆర్డీవో ఇబ్బందులు పడుతూ వచ్చింది. ప్రతిపాదిత పరీక్ష/ప్రయోగ కేంద్రంతో బాలసౌర్‌కు వెళ్లే దూరం సగానికి సగం కంటే తక్కువగా ఉండటం, ఇక్కడకు దీర్ఘ శ్రేణి క్షిపణులను తరలించేందుకు మౌలిక వసతులు ఇప్పటికే దాదాపుగా కలిగి ఉండటంతో కలసి వచ్చే అవకాశం. ఈ కేంద్రం నుంచి 5 వేల కిలోమీటర్లు, అంతకు మించి వెళ్లే క్షిపణులను పరీక్షించే అవకాశం ఉంది.
కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
రాజధాని అమరావతిలో వివిధ భవనాలు, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రధాని శంకుస్థాపన చేసిన కీలక నిర్మాణాలు….
- 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రాష్ట్ర శాసనసభ నిర్మాణం.
- 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు భవనం. 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తులతో నాలుగు హెచ్‌డీ టవర్లు.
- 37 ట్రంక్ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులు,సైకిల్ ట్రాక్‌లు
- 320 కి. మీ. మేర ప్రపంచ స్థాయి రహదారులు.
- అమరావతి వరద నివారణ పనులతోపాటు నగర అవసరాలకు 0.53 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో మూడు జలాశయాలు.
- ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మౌలిక సదుపాయాల్లో భాగంగా 1,281 కి.మీ. రహదారులు, 13 జోన్లలో సమగ్ర పౌర సౌకర్యాల కల్పన.
- న్యాయమూర్తులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహ, భవన నిర్మాణాలు ఉద్దేశించిన 10 ప్రాజెక్టులు.
ఎన్‌హెచ్‌లు, రైల్వే ప్రాజెక్టులు :
- హిందూపురం-గోరంట్ల మధ్య 34 కి.మీ. మేర జాతీయ రహదారిని రూ.809 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణకు శంకుస్థాపన.
- ముద్దనూరు-బి. కొత్తపల్లి మధ్య 57 కి.మీ. జాతీయ రహదారి రూ.1,020 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ.
- నంద్యాల నుంచి కర్నూలు, కడప సరిహద్దు వరకు 62 కి.మీ. మేర జాతీయ రహదారి రూ.692 కోట్లతో రెండు వరుసలుగా, ముదిరెడ్డిపల్లె నుంచి కడప, నెల్లూరు సరిహద్దు వరకు 36 కి.మీ. జాతీయ రహదారిని రూ.279 కోట్లతో విస్తరణ.
- శ్రీకాకళం జిల్లా రణస్థలం పట్టణ పరిధిలో 5 కి.మీ. మేర జాతీయ రహదారి-16ని రూ.252 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరణ.
- సత్యసాయి జిల్లాలోని ఎన్హెచ్-44లో ఎర్రమంచి, గుడిపల్లి గ్రామాల వద్ద 2 కి. మీ. మేర రూ.124 కోట్లతో ఆర్వోబీ.
- గుంతకల్లు వెస్ట్, మల్లప్ప గేట్ స్టేషన్ల మధ్య 10 కి. మీ. మేర రూ.23 కోట్లతో రైల్ ఓవర్ రైల్ వంతెన.
- నాగాయలంక వద్ద రూ.1,459 కోట్లతో చేపడుతున్న క్షిపణి ప్రయోగ కేంద్రం.
- విశాఖపట్నం మధురవాడ వద్ద రూ.172 కోట్లతో పీఎం ఏక్తా మాల్ నిర్మాణం.
జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు
- సీఎస్ పురం-మాలకొండ వరకు 44 కి.మీ. మేర రూ.277 కోట్లతో విస్తరించిన రెండు వరుసల జాతీయ రహదారి.
- మాలకొండ-సింగరాయకొండ మధ్య 46 కి. మీ. మేర రూ.370 కోట్లతో రెండు వరుసలుగా విస్తరించిన జాతీయ రహదారి.
- సీతారామపురం- దుత్తలూరు మధ్య 36 కి. మీ. మేర రూ.364 కోట్లతో రెండు వరుసలుగా అభివృద్ధి చేసిన జాతీయ రహదారి.
- జమ్మలమడుగు-ప్రొద్దుటూరు మధ్య రైల్వే గేట్ వద్ద రూ. 68 కోట్లతో నాలుగు వరుసలుగా నిర్మించిన ఆర్వోబీ.
- పుంగనూరు పట్టణ పరిధిలో 10 కి.మీ. మేర రూ.41 కోట్లతో విస్తరించిన జాతీయ రహదారి.
- రేణిగుంట -నాయుడుపేట మధ్య రూ.2,510 కోట్లతో ఆరు వరుసలుగా విస్తరించిన 57 కి. మీ. జాతీయ రహదారి.
- పోర్టు అనుసంధానంలో భాగంగా విశాఖ పట్నంలో ఈస్ట్ బ్రేక్ వాటర్స్ నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు రూ.50 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించిన నాలుగు కి.మీ.జాతీయ రహదారి.
- విజయవాడ రైల్వే స్టేషన్‌కు, న్యూవెస్ట్ బ్లాక్ హాట్ క్యాబిన్‌కు మధ్య 5 కి. మీ. మేర రూ.70 కోట్లతో నిర్మించిన మూడో లైన్ అనుసంధానం.
- గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ పనుల్లో భాగంగా బుగ్గనపల్లె సిమెంట్ నగరం – పాణ్యం స్టేషన్ల మధ్య రూ.184 కోట్లతో 19 కి. మీ. మేర పూర్తయిన డబ్లింగ్ పనులను ప్రధాని జాతికి అంకితం చేశారు.
ఆకట్టుకున్న ‘ప్రజారాజధాని’ వీడియో ప్రదర్శన
అమరావతి ప్రజారాజధాని (పీపుల్స్ క్యాపిటల్) పేరిట ప్రదర్శించిన వీడియో ఆకట్టుకుంది. అమరావతి చరిత్ర, నేపథ్యం, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రుల ఆకాంక్ష మేరకు ప్రజా రాజధానిగా అవతరించడాన్ని చక్కగా ఆవిష్కరించారు. రైతులు ముందుకొచ్చి రాజధాని కోసం 34 వేల ఎకరాలు ఇవ్వడం, 2014-19 మధ్య జరిగిన నిర్మాణాలు, అభివృద్ధి, అందుబాటులోకి వచ్చిన విద్యాసంస్థలు.. తర్వాత అయిదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం సాగించిన విధ్వంసంతో అమరావతి మసకబారడం, దీనిపై అన్నివర్గాల ప్రజలు చేసిన ఉద్యమాలు, 2024లో కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి పునరుజ్జీవం రావడం.. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణానికి సిద్ధమైన తీరుపై వీడియో ప్రదర్శించారు.
తరలివచ్చిన అశేష ప్రజానీకం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభోత్సవ సభకు ప్రజలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం,షెడ్లు జనాలతో నిండిపోయాయి. వివిధ జిల్లాల నుంచి వారు మండుటెండనూ లెక్క చేయకుండా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధాన వేదిక ఎదుట వేసిన 3 షెడ్లు మధ్యాహ్నానికే నిండిపోవడంతో సభకు ఎదురుగా షెడ్లు వేసి భారీ ఎల్ ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. చివరికి పార్కింగ్ ప్రాంతంలో వేసిన షెడ్ల కింద ప్రజలు సేదతీరారు. ప్రధాని మోదీ వచ్చే సమయానికి వాతావరణం చల్లబడడంతో చాలామంది సభ పరిసరాల్లో రోడ్లపై నిలబడి తెరలపై కార్యక్రమాలు తిలకించారు. గ్యాలరీలు నిండాక పోలీసులు జనాన్ని నియంత్రిస్తూ, ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. సాయంత్రం 4. గంటల సమయంలోనూ దూరప్రాంతాల నుంచి జనం రావడం కనిపించింది. సభ ముగిసి నేతలు వెళ్లాక.. ప్రజలను ప్రధాన వేదిక, పైలాన్ వద్దకు అనుమతించారు. దీంతో వేదికపై, అమరావతి పైలాన్ వద్ద ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు.
అమరావతిలో ప్రధానికి జేజేలు:
ప్రధాని మధ్యాహ్నం 3.30 గంటలకు హెలికాప్టర్లో వెలగపూడిలో దిగారు. అక్కడి నుంచి నేరుగా 1.2 కి. మీ. దూరంలోని సభా ప్రాంగణానికి కారులో వెళ్లారు. ప్రజలు దారికిరువైపులా నిలబడి జాతీయ పతాకాలు చేతబూని ‘ ప్రధాని వాహనశ్రేణి వెళ్తుండగా చేతులు ఊపుతూ ఘనస్వాగతం పలికారు. ‘మోదీ…. మోదీ.’, ‘జై అమరావతి.. జైజై అమరావతి’ అనే నినాదాలు చేశారు. వారి అభిమానానికి ముగ్ధులైన ప్రధాని మోదీ.. వాహన శ్రేణి నుంచే వారికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. అందరూ ‘అమరావతి పునఃప్రారంభం’ లోగో ఉన్న తెల్లని టోపీలు ధరించారు. రోడ్ షో రద్దు కావడంతో ప్రజల నుంచి జేజేలు స్వీకరించేందుకు ప్రధాని మోడీ కాన్వాయ్ నెమ్మదిగా సాగింది. మోడీ జయజయధ్వానాలతో అమరావతి మార్మోగింది.
తురగా నాగభూషణం
సీనియర్ జర్నలిస్ట్